జయశంకర్ సార్.. స్ఫూర్తిని వదులుకున్నామా!?

by Ravi |   ( Updated:2023-06-21 00:45:54.0  )
జయశంకర్ సార్.. స్ఫూర్తిని వదులుకున్నామా!?
X

తెలంగాణ తన చారిత్రక లక్ష్యాలను చేరుకునేందుకు గొప్ప వ్యక్తులను ఆయా సందర్భాలలో సృష్టించుకుంది. అట్లాంటి వారిలో మన కాలంలో నడిచిన మహనీయులు ఆచార్య జయశంకర్. తన ప్రతిష్టను తెలంగాణ నినాదానికి రంగరించి దానిని ప్రజా ఉద్యమంగా మలిచిన మహోన్నతమైన మనిషి. తెలంగాణలో ఏర్పడ్డ సకల సంక్షోభాలకు సాక్షిగా మాత్రమే ఉండకుండా తన అక్షరాలను ఉద్యమ కొలిమిలో పదును పెట్టి ఆయుధంగా మలిచిన వారు. సుదీర్ఘకాలం తెలంగాణ నేలలో అధికమైన ప్రభావాన్ని చూపించిన వారిలో జయశంకర్ తప్ప మరొకరు లేరు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం ప్రపంచ స్థాయికి చేరుకోవడంలో ఒక చోదక శక్తిగా తనకి తాను సమర్పించుకున్న వాడు జయశంకర్. 1952 ముల్కీ ఉద్యమం మొదలు తాను మరణించేంతవరకు తెలంగాణ ఆకాంక్షనే తన శ్వాసగా నిలబెట్టుకున్నారు.

ఉద్యమమే ఊపిరిగా..

తెలంగాణ తొలి దశ ఉద్యమం నుంచి ఎందరో బిడ్డలని కోల్పోయిన తెలంగాణ తల్లి యుద్ధభూమిలో నిలబడి రోదిస్తున్న సమయంలో ఆ దోపిడీ శక్తులను నిలదీసి నిగ్గు తేల్చిన అతిపెద్ద తెలంగాణ ప్రజా సమూహానికి రాజకీయ చైతన్యాన్ని అందించి విజయ తీరాలకు తీసుకొచ్చిన వారు జయశంకర్. తన త్యాగశీలత నిబద్దతతో అనేక సంస్థలు, సంఘాల కంటే పై ఎత్తున నిలబడిన వారు. అనాదిగా వ్యక్తిగతం అంటూ లేకుండా తెలంగాణ కోసమే సర్వస్వం ధారపోసి వ్యక్తి. ఆయన తెలంగాణ సమాజాన్ని పలు విధాలుగా పరిశీలించి లోతైన అవగాహన చేసుకొని చారిత్రక అనుభవాల దృష్ట్యా తెలంగాణ సాధనకు మార్గనిర్దేశనం చేసినారు.

తెలంగాణ ఉద్యమాన్ని పదేపదే తెరపైకి తీసుకురావడంలో క్రియాశీలక విధానాన్ని అనుసరించారు. ఫజల్ అలీ కమిషన్ మొదలుకొని శ్రీకృష్ణ కమిషన్ దాకా తెలంగాణకు జరిగిన అన్యాయాలను సాక్ష్యాధారాలతో రుజువుపరిచి తెలంగాణ వాదం వైపు ఉన్న నైతిక శక్తిని చాటి చెప్పినారు.1969 ఉద్యమంలో తెలంగాణ వాదానికి ఉన్న ప్రాతిపదికలో పార్లమెంటులో చర్చించే విధంగా నాటి ప్రధాని ఇందిరాగాంధీ దృష్టి పెట్టే విధంగా పరిశోధనాత్మక డాక్యుమెంట్‌ను అందించాడు. రాజకీయ దళారులు ఉద్యమాన్ని స్వప్రయోజనాల కోసం వినియోగించుకొని అనంతరం తెప్ప దాటేస్తే, తెలంగాణ నినాదాన్ని ఆరిపోకుండా కొనసాగించడానికి విశ్వ ప్రయత్నం చేసిన వ్యక్తి. 1986లో మొదలైన మలిదశ ఉద్యమానికి ప్రాణవాయువు అయి, తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితిని స్థాపించి.. ఆ ఉద్యమానికి తోడుగా కరువు బాధితుల కోసం గంజి కేంద్రాలు, ఆదివాసుల అసహజ మరణాలకు వైద్య బృందాలను తరలించిన వ్యక్తి. అలాగే ఎన్నో విధ్వంసాలను, ఎన్‌కౌంటర్లను తెలంగాణ ఉద్యమ వేదికల ద్వారా, పౌరస్పందన ద్వారా చాటిచెప్పారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యంలోని వేదికను ఉద్యమ ఆశ్రమంగా చేసుకొని మలిదశ ఉద్యమానికి తారస్థాయికి తీసుకెళ్లినారు. ఇందులో భాగంగానే పి.జనార్దన్ రెడ్డి నాయకత్వాన్ని మొదట కోరుకున్నప్పటికీ ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఈనాటి వర్తమాన సమాజ రాజకీయాలకు సరిగ్గా అతికిపోయే కేసీఆర్‌ను ఎంపిక చేశారు.

454 మంది పార్లమెంట్ సభ్యులని ఒప్పించి..

ఒక ఫ్యూడల్ సమాజానికి నాయకుడిగా ఉన్న కేసీఆర్, జయశంకర్ సార్ నైతికతను, త్యాగశీలతను తనతో చేర్చుకోవడం ద్వారా తెలంగాణ ఉద్యమ నాయకుడిగా చలామణి అయ్యారు. ఈ సమయంలోనే ఉద్యమానికి అవసరమైన సైద్దాంతిక భూమికను అందించినారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ తప్పటడుగులతో ఉద్యమాన్ని వెనక్కి నెట్టినప్పుడల్లా, పౌర సమాజం కృషితో జయశంకర్ సార్ తిరిగి పట్టాలెక్కించారు. కేసీఆర్ ఉద్యమాన్ని అలిగి వదిలినప్పుడల్లా తిరిగి రప్పించగలిగారు జయశంకర్. సోనియా, మన్మోహన్ సింగ్‌లకు తెలంగాణ పాఠం చెప్పి కాంగ్రెస్‌ను తెలంగాణకు అనుకూలం చేశారు. ఆ క్రమంలోనే ఏర్పడ్డ యూపీఏ ప్రభుత్వం కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేపట్టేటట్లుగా సమాయత్తం చేశాడు. అనంతరం రాజశేఖర్ రెడ్డి కుట్రలతో తెలంగాణ నినాదం మస్కబారుతున్నప్పుడు పార్లమెంటు సభ్యులందరినీ మెప్పించి తెలంగాణకు అనుకూలంగా 454 మంది మద్దతును సాధించగలిగిన వ్యక్తి జయశంకర్ సార్. కేసీఆర్ నిరాహార దీక్ష క్రమంలో వచ్చిన డిసెంబర్ 9 ప్రకటనను స్వయంగా రూపొందించి ఆనాటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం చేత ప్రకటింప చేయగలిగినారు. ఈ దశలో తెలంగాణ మొత్తం ప్రజానీకాన్ని ఉద్యమంలోకి రప్పించేందుకు రాజకీయ పార్టీల ఆధీనంలో ఉన్న తెలంగాణ ఉద్యమ నాయకత్వం తెలంగాణ పౌర సమాజం చేతులలోకి మార్చి నేటి తెలంగాణ సాధనకు కారకమైన మిలియన్ మార్చ్, సాగరహారం మొదలగు కార్యక్రమాలు చేపట్టి జేఏసీని నిర్మించి మార్గ నిర్దేశం చేసినారు. ఆత్మహత్యలతో తెలంగాణ సమాజం తల్లడిల్లుతున్నప్పుడు వాటిని ఆపేందుకు తమలాంటి వృద్ధులు చనిపోవాలి తప్ప తెలంగాణ యువకులు ఆత్మబలిదానం చేసుకోవద్దని సందేశం ఇచ్చినారు. ఇలా స్వరాష్ట్రం కోసం ఎంతో చేసిన సార్.. రాష్ట్రాన్ని చూడకుండానే నిష్క్రమించారు.

సార్.. త్యాగానికి పొంతన లేని పాలన

ఆచార్య జయశంకర్, కాళోజీ, బియ్యాల జనార్దన్ రావు, బెల్లి లలిత, మారోజు వీరన్న లాంటి ఎందరో అమరత్వంతో సాధించుకున్న తెలంగాణా పరిడవిల్లుతుందని ప్రజలు భావించారు. జయశంకర్ సార్ మరణించే నాటికి తన వ్యక్తిగత అకౌంట్లో కేవలం 5000 రూపాయలు ఉన్నాయి. ఎన్నికల సందర్భం మినహా ఏనాడు టీఆర్ఎస్ వాహనాలు కానీ, వారి ఆర్థిక సహకారాన్ని గాని తీసుకోలేదు. ఇలాంటి త్యాగమైన జీవితంతో ఉద్యమ న్యాయకత్వాన్ని చేపట్టిన జయశంకర్ ఆకాంక్షలను నేటి స్వరాష్ట్రంలోని పాలకులు పట్టించుకోలేదు. నిర్బంధాల మధ్య ఇనుప బూట్ల కవాతు మధ్య ఫ్యూడల్ రాజ్యాన్ని కేసీఆర్ స్థాపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందుకు అడ్డు వచ్చిన వారిపై ఎంతటి నిర్బంధమైన ప్రయోగించడానికి వెనుకాడడం లేదు. జయశంకర్ సిద్ధాంతీకరించిన నీళ్లను పూర్తిగా పరాయికరించేందుకు నేటి ప్రభుత్వం ఊవ్విళూరుతుంది. కృష్ణానదిని రాయలసీమకు గోదావరిని ఆంధ్రాకు అప్పజెప్పే పని ఓవైపు చేస్తూ.. మరోవైపు కాళేశ్వరం లాంటి ఎత్తిపోతల ప్రాజెక్టుల పేరు మీద లక్షలాది కోట్ల రూపాయలను సీమాంధ్ర కార్పొరేట్ల ద్వారా అక్రమార్జన పొందేందుకు కాంట్రాక్టులను కట్టబెడుతున్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి కరువు ప్రాంతాల విముక్తి జయశంకర్ సార్ ఆశయం కానీ విముక్తి చేయడానికి ప్రభుత్వం కృషి చేయడం లేదు. దాదాపు 15 లక్షల కోట్ల బడ్జెట్‌ని 9 ఏండ్ల కాలంలో దుర్వినియోగపరిచి, 6 లక్షల కోట్ల అప్పులు చేశారు. తెలంగాణ భూములను సీమాంధ్ర పాలకుల కంటే ఎక్కువగా అన్యాక్రాంతం చేశారు.

నియామకాలను గాలికొదిలి...

అలాగే ఏ యువత కోసం అయితే తెలంగాణ నియామకాల ప్రాతిపదిక మీద ఉద్యమాలు చేపట్టిందో.. ఆ నియామకాలు అమలుకు నోచుకోవడం లేదు. బిశ్వాల్ కమిటీ లక్ష 91 వేల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేసే పరిస్థితిలో లేదు. ఉద్యోగ ఖాళీలు కండ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ పాలకులకు నిమ్మకు నీరెత్తినట్లుగా కూడా లేదు. పైగా టీఎస్‌పీఎస్సీని ఈ ప్రభుత్వం హోల్ సేల్ వ్యవస్థగా మార్చివేసి దీనస్థితికి దిగజార్చింది. దేశంలో 32% నిరుద్యోగితో తెలంగాణ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం తల్లడిల్లుతుంది. 7000 మందికి పైగా రైతులు, 180మంది నిరుద్యోగులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి దారుణస్థితిని జయశంకర్ సార్ కాదు కదా తెలంగాణ సమాజంలో ఉన్న పౌరులు ఎవరు కూడా ఊహించలేకపోయారు. రాష్ట్రం ఇలా ఉంటే దశాబ్ది ఉత్సవాల పేరుతో రంగుల కలను ఎన్నికల కోణంలో బీఆర్ఎస్ పాలన ప్రదర్శిస్తోంది. ఈ పాలనలో జయశంకర్ సార్ స్ఫూర్తి కాదు కదా? ఉద్యమ ఆకాంక్షలకు కనీసం చోటు దక్కిందా?

జయశంకర్ సార్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సహజమైన దోపిడీ నియంతృత్వాలకు పాలకులు పాల్పడుతుంటారు కాబట్టి వచ్చే తెలంగాణలో వీటిని ఎదుర్కొనేందుకు ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు ప్రజలు ఇంతకంటే ఎక్కువగా అప్రమత్తతతో ఉండి సామూహికంగా ఉద్యమాలు చేస్తూ ఉండాల్సిందేనని నొక్కి చెప్పారు. ఇప్పుడు ఇదే మార్గం మన అందరి ముందు ఉంది. ఈ ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలదీయకపోతే మనం కూడా జయశంకర్ స్ఫూర్తిని వదులుకున్నట్లే.

(నేడు ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి)

పందుల సైదులు

తెలంగాణ విద్యావంతుల వేదిక

94416 61192

Advertisement

Next Story