భారతావనిలో చెరిగిపోని సంతకం..

by Ravi |   ( Updated:2023-11-14 00:00:40.0  )
భారతావనిలో చెరిగిపోని సంతకం..
X

నమ్మిన లక్ష్యం కోసం ప్రాణార్పణ చేయడానికి సిద్ధపడగల వ్యక్తులందరికీ ఓటమన్నది చేరదు. ఆ కోవలోకి చెందిన భారతావని ఆణిముత్యం జవహర్ లాల్ నెహ్రూ. స్వాతంత్య్ర సమరయోధుడిగా, భారతావని తొలి ప్రధానిగా తొలి 20 ఏళ్ల సంక్షోభ ప్రయాణంలో దేశాన్ని కలిసికట్టుగా ఉంచి సమర్థంగా నడిపించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన తిరుగులేని నాయకుడు నవనిర్మాణ జాతికి మార్గదర్శి మన చాచాజీ. భారత ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించి, వ్యవసాయ రంగాన్ని భారతదేశ అభివృద్ధి చిహ్నంగా మార్చి, దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థకు నూతన జనసత్వాలు అందించి దేశం కోసం సమస్తశక్తిని ధారపోశారు.

క్లిష్ట సమయంలో దీటైన సారథి...

దేశ తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి వరుస కరువు కాటకాలతో తిండి గింజలకు కటకట, పాకిస్తాన్ నుండి తరలివచ్చిన 60 లక్షల మంది శరణార్థులకు పునరావాసం, ముక్కలు ముక్కలుగా ఉన్న రాజ సంస్థానాలను విలీనం చేయడం, పాకిస్తాన్ కవ్వింపు చర్యలు. ఇలాంటి సంక్షోభ భారతావనిని చేయి పట్టుకొని నడిపించి పదహారేళ్ల వరకు కాపాడిన నవ భారత నిర్మాత సంస్థానాల విలీన బాధ్యతను సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు అప్పగించి రాజ్యాంగ రచన బాధ్యతను అంబేద్కర్‌కి ఇచ్చి వారి సమర్థ సేవలను వినియోగించుకున్న తీరు అపూర్వం. స్వాతంత్రం ముందు కేవలం విద్యావంతుల చేతుల్లో ఉండే ఓటు హక్కుని దేశంలోని ప్రజలందరికీ కల్పించాడు. భారతదేశం తర్వాత స్వతంత్రం పొందిన ప్రతి దేశం మన బాటలో ప్రయాణం చేసి ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించాయి. ప్రజాస్వామ్య ప్రయోగంలో చాలా దేశాలు విజయం సాధించాయి. అభివృద్ధి పథంలో ప్రయాణించాయి.

అలాగే దేశంలోని ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ, సహకార సంఘం, పాఠశాలలు నెలకొల్పారు. చీకటి నుండి జ్ఞానమనే వెలుగులోకి చదివే నడిపిస్తుందని బలంగా నమ్మిన నెహ్రూ దేశంలో పాఠశాలలు, కళాశాలలు మొదలుకొని ఐఐటీలు, ఐఐఎంలను నెలకొల్పారు. అవి ఇప్పటికీ ఉన్నత ప్రమాణాలకు దీటుగా నిలుస్తున్నాయి.

ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసిన నవరత్న కంపెనీలు దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాయి. ఆయన హయాంలో నిర్మించిన బాక్రానంగల్, నాగార్జునసాగర్ వంటి భారీ ప్రాజెక్టులు దేశంలో వ్యవసాయ వృద్ధికి దీటుగా నిలిచాయి. దేశాభివృద్ధికి అవసరమైన నిధుల కేటాయింపు, దేశ అభివృద్ధి పురోగమనంలో ప్రయాణించడానికి ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసి పంచవర్ష ప్రణాళికల సంస్కృతికి తెర లేపారు. సమాజంలో బలంగా పాతుకుపోయిన కుల వివక్షను అంతం చేయడానికి నెహ్రూ దీక్ష బూనారు.

వైజ్ఞానిక దార్శనికుడు..

విజ్ఞాన శాస్త్రానికి నిబద్ధమై ఉంటే నవభారత నిర్మాణ మార్గం సుగమం అవుతుందని అది ప్రజల స్ఫూర్తిని రగిలించి అగ్నికణం అవుతుందని భావించిన నెహ్రూ దేశ అభివృద్ధికి సైన్సే సంజీవనిలా పనిచేస్తుందని బలంగా విశ్వసించి, ఉన్నత పరిశోధనలు కొనసాగించడంలో అణు శక్తిని వినియోగించుకోవాలని లక్ష్యంతో హోమిబాబా, మేఘనాథ్ సాహా లాంటి వారికి అణు పరిశోధన బాధ్యతలు అప్పగించారు. 1954లో అణుశక్తి సంస్థను ఏర్పాటు చేశారు. అలాగే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థను ముంబైకి మార్చారు. నెహ్రూ ప్రోత్సాహంతో శాంతి స్వరూప్ భట్నాగర్ 1948-58 మధ్య కాలంలో అనేక జాతీయ ప్రయోగాలు ఏర్పాటు చేశారు. 'రాజకీయాలు నన్ను ఆర్థిక శాస్త్రం వైపు నడిపించాయి ఇది అనివార్యంగా నన్ను విజ్ఞాన శాస్త్రం వైపు నెట్టింది' అని నెహ్రూ ఎప్పుడూ అంటుండేవారు. స్వాతంత్ర భారతావనికి అన్ని రంగాల్లో బలమైన పునాదులు వేసి బహుముఖ పరిణతి కనబరిచిన పండిత్ నెహ్రూ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చెరిగిపోని సంతకం.

(నేడు జవహర్ లాల్ నెహ్రూ జయంతి)

అంకం నరేష్

63016 50324

Advertisement

Next Story

Most Viewed