- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఏజెన్సీ ఎర్ర జెండా ఈసం బాటన్న
భూమి భుక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం. నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం పోరుబాటను ఎంచుకున్నవాడు బాటన్న. గోదావరి లోయ ప్రతిఘటన పోరాట యోధుడిగా, ఆదర్శ కమ్యూనిస్టు బాటసారిగా బాటన్నఎదిగాడు. మణ్యం మణి దీపం, అలుపెరగని పోరాట యోధుడిగా, అజ్ఞాతంలో అడవిలో అన్నగా, జనారణ్యంలో జననేతగా, దండకారణ్యంలో దళనేతగా ప్రసిద్ధి చెందినవాడు. నైతిక విలువలతో అత్యంత ఉన్నంతగా జీవించి ఆస్తిలో నిరుపేదగా ఉన్న అసలు సిసలైన ఆదివాసీ బిడ్డ బాటన్న.
ఆదివాసీలలో చైతన్యం పెంపొందించి..
బాటన్న అసలు పేరు ఈసం రామయ్య. గుండాల మండలం కొడవటంచ గ్రామంలో 1926 డిసెంబర్ 5న జన్మించిన బాటన్న చిన్నప్పటి నుండే సామాజిక స్పృహ, నాయకత్వ లక్షణాలతో ప్రజల్లో తిరిగారు. ఆయన సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీలో సీనియర్ నాయకులు. ఆయన ఆదర్శ కమ్యూనిస్టు, ప్రజాసేవలో నిరంతరం తపించిన తపస్వి, గుండాల మండలంతో తన జీవితమంతా పెనవేసుకున్నా, ఇల్లందు, పాకాల కొత్తగూడెం, నర్సంపేట, ములుగు, మణుగూరు దగ్గర నుంచి పాపికొండల సానువులు ఇరువైపుల తీరాలకు తెలిసిన పేరు. ఉద్యమ దివిటీ గా వెలిగిన పేరు. ఆదివాసీలతో పేగు బంధమే కాదు, ఉద్యమ బంధంతో, విప్లవ పంథా సాగించిన విప్లవ ధీరుడు. నగ్జల్బరీ, గోదావరి లోయ ఉద్యమంలో ఎదిగి వచ్చిన తొలితరం కమ్యూనిస్టు. ఖమ్మం జిల్లాలో ఆయుధం భుజానికి వేసి పాతికేండ్లు అవిశ్రాంతంగా ప్రజల కోసం పోరాడి, పార్టీ నిర్ణయం మేరకు బయటకు వచ్చి, 3 సార్లు జెడ్‌పీటీసీ అయినా, నిఖార్సయిన విప్లవకారుడిగా మచ్చ లేకుండా మెలిగినవాడు. నడిచినవాడు. అటు రహస్య విప్లవ జీవితాన్ని, ఇటు ప్రజా ఉద్యమ జీవితాన్ని, మరోవైపు ప్రజా ప్రతినిధి జీవితాన్ని ఆదర్శవంతంగా మలచుకున్న ఆదర్శ కమ్యూనిస్టు నేత బాటన్న.
ప్రజాస్వామిక విప్లవంలో నూతన ఒరవడిని ఆకళింపు చేసుకోవాలనే పట్టుదలతో సిపిఐ(ఎంఎల్) పార్టీలో చేరాకే చదవడం, రాయడం నేర్చుకున్నాడు. పార్టీకి సంబంధించిన పత్రికలైన ప్రజా పంధా, విమోచన, ప్రజాపంధా వంటివి రెగ్యులర్‌గా చదువుతూ స్ఫూర్తిని పొందాడు బాటన్న. అనేక ప్రజా సమస్యలు, అటవీ భూములపై ఆదివాసీలకున్న హక్కుల కొరకు పోరాటానికి పూనుకొని, 1970లో సాయుధ ‘దళ కమాండర్’ స్థాయికి ఎదిగి, గిరిజన ప్రాంతాలలో వారసత్వ పోడు భూముల ఆక్రమణను అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులపై, ఏజెన్సీలో నిర్బంధం పేంచే పోలీసులపైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా పోరాడే చైతన్యం ప్రజలలో కలిగించడానికి సహకరించాడు. గుండాల మండలంలోని చెట్టుపల్లి, కొమురారం గ్రామాల మధ్యగల పెద్దగుట్ట మీదుగా రోడ్డు మార్గం వేయడానికి గ్రామ ప్రజలను కదిలించి రోడ్డు నిర్మించి ప్రజలకు బాట వేశాడు. అందుకే ఆయనకు ‘బాటన్న’గా ఆ పేరు వచ్చింది.
ప్రజలకు అందుబాటులో ఉంటూ..
ఒక గిరిజన కుటుంబం నుండి, సామాజికంగా వెనుకబడిన తెగ నుండి పార్టీలోకి వచ్చి, తన జీవితాన్ని చివరి వరకు పార్టీ కోసం, ప్రజల కోసం అంకితం చేశారు. కమ్యూనిస్టుగా కొంతకాలం పనిచేయడం, కొంతమేరకు పని చేయడం సాధారణమైనది. కానీ, జీవితాంతం కమ్యూనిస్టుగా, ఆ సిద్ధాంతం కోసం జీవించడం, పనిచేయడం అత్యంత విలువైనది. బాటన్న జీవితం అలాంటిది. దళకమాండర్‌గా, ప్రజానాయకుడిగా, ప్రజాప్రతినిధిగా చనిపోయే వరకు నిర్విరామంగా ప్రజాసేవ చేశారు. 1994 లో పార్టీనుండి బయటకు వచ్చి బహిరంగ ప్రజానాయకుడిగా వ్యవహరించి మూడుసార్లు జెడ్‌పీటీసీగా ఎన్నికై ప్రజల సమస్యల మీద నిర్విరామంగా పోరాడారు. రహస్య జీవితంలో వున్నా, బహిరంగ ప్రజా జీవితంలో వున్నా, ఏలాంటి గర్వమూ, అధికార దర్పం అంటనివ్వని అసాధారణ వ్యక్తిత్వం బాటన్నది.
ఆయన ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గుండాల మండలంలోని 80 శాతం ఆదివాసీ ప్రజానీకానికి నిమ్మ వాగు చెరువును కొట్లాడి సాధించాడు, ఆదివాసీ ప్రాంతాల్లో తార్ రోడ్డు, కుంటలు, అనేక బ్రిడ్జిల మంజూరులో, విద్యుత్ సౌకర్యం కల్పించడంలో బాటన్న పాత్ర ఎంతో ఉంది. అంతేకాదు మండలంలోని అనేక గ్రామాల్లో పాఠశాలలు, హాస్టల్, ఆసుపత్రి మంజూరుకు కృషి చేశాడు. ఆ ప్రాంతాల్లోని వారు ఎక్కడో చెట్టుకొకరు, పుట్టకొకరు నివసించేవారికి ఒక దగ్గరకు చేర్చి వారికి పెంకుటిళ్లతో కాలనీలు ఏర్పాటు చేసి అనేక గ్రామాలు నిర్మాణం చేశాడు. మండల సమస్యలపై ఆయనకు కొట్టిన పిండి. ఆ సమస్యలపై తనదైన వాణిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, ఆ సమస్య పరిష్కారమయ్యేంత వరకు పట్టువదలని విక్రమార్కుడిలా వెంటపడేవాడు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలచే ఆందోళనలు చేయించేవాడు. నిస్వార్థంగా, నిజాయితీగా, పని చేస్తూ నిరంతరం ప్రజల కందుబాటులో వుండేవాడు. పార్టీ నాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా అహర్నిశలూ, అవిశ్రాంతంగా పనిచేసాడు. ఒక ప్రజా ప్రతినిధి ప్రజలకు జవాబుదారీగా ఎలా ఉండాలనేది ఆచరించి చూపాడు. పార్టీ ప్రతిష్టను మరింత సమున్నతంగా నిలబెట్టిన బాటన్న మనకు మార్గదర్శకం. ఉద్యమంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, వృద్ధాప్యం మీద పడ్డా ఉక్కు మనిషిలా, నవయువకుడిలా పరుగులు తీస్తూ ప్రజల కోసం పరితపించినవాడు. ఉద్యమాలు నడిపినవాడు. పీడిత ప్రజల విముక్తి కోసం, నూతన ప్రజాస్వామిక విప్లవమే ధ్యేయంగా పోరాడిన ఆదివాసీ ముద్దుబిడ్డ, అడవి పుత్రుడూ, అలుపెరుగని యోధుడు బాటన్నకు నివాళులర్పిద్దాం.
(నేడు బాటన్న వర్ధంతి )
వూకె రామకృష్ణ దొర
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
98660 73866
- Tags
- esam batanna