Ratan Tata:ఉపాధిని సృష్టించిన ఉద్యోగి

by Ravi |
Ratan Tata:ఉపాధిని సృష్టించిన ఉద్యోగి
X

తరాలకు స్ఫూర్తినిచ్చిన పారిశ్రామికవేత్త రతన్ టాటా, ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. ఉప్పు నుండి ఉక్కు వరకు.. టీ నుండి ట్రక్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా పేరు వినబడుతుంది. 23 లక్షల కోట్ల రూపాయల విలువతో, సుమారుగా 8 లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీని విజయవంతంగా నడిపించిన వ్యక్తి రతన్ టాటా. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండే నైజంతో, వేల కోట్ల సంపద ఉన్నా కూడా సాధారణ జీవితం గడిపే అసామాన్యుడు రతన్ టాటా. టాటా అంటే నమ్మకం, టాటా అంటే నిజాయితీ. టాటా అంటే నిలువెత్తు భారతం.

టాటా కంపెనీ మొదట ఒక టెక్సటైల్ మిల్‌గా ప్రారంభమైయింది. జంషెట్జి టాటా అనే ఆయన దీనిని స్థాపించారు. అలా 1868లో మొదలైన ఈ కంపెనీ తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది.

ఎక్కడ అవమానం పొందాడో అక్కడే...

రతన్ టాటా, ప్రయాణంలో ఎన్నో అవరోధాలను అవమానాలు ఎదుర్కొన్నాడు. దానికి ఒక ఉదాహరణగా చూస్తే. 1998లో రతన్ టాటా .. టాటా ఇండికా కార్లను ప్రవేశపెట్టారు. ఆ కార్లు మొదటి సంవత్సరం ఫెయిల్ అయ్యాయి. దాంతో అందరూ టాటా ఇండికాను అమ్మేయాలని సలహా ఇచ్చారు. దానికి టాటా కూడా ఒప్పుకుని .. ఇండికా కార్ల వ్యాపారాన్ని అమ్మకం కోసం అమెరికాలోని ఫోర్డ్ కంపెనీకి టాటా, ఆయన టీం వెళ్లారు. అయితే ఆ మీటింగ్‌లో ఫోర్డ్ కంపెనీ చైర్మన్, రతన్ టాటాతో మీకు కార్లు ఎలా తయారు చెయ్యాలో తెలియనప్పుడు కార్ల బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు అని టాటాను, టీంను అవమానపరిచారు. దాంతో టాటా ఆ ఒప్పందం గురించి చర్చించకుండానే తిరిగి ముంబైకి వచ్చేసారు. కొన్ని సంవత్సరాల తరువాత టాటా ఇండికా నష్టాల నుండి లాభాల బాట పట్టింది. అదే సమయంలో ఫోర్డ్ కంపెనీకి చెందిన లగ్జరీ కార్లు జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీలు భారీగా నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఆ సమయంలో రతన్ టాటా ఫోర్డ్ కంపెనీకి, జాగ్వార్ ల్యాండ్ రోవర్ రెండు కంపెనీలను తాను కొంటానని ఆఫర్ చేశారు. ఈసారి ఫోర్డ్ కంపెనీకి చెందిన టీం అమెరికా నుండి ముంబైకి చేరుకొని టాటాను కలుసుకుంది. అలా నష్టాల్లో ఉన్న జాగ్వర్ లాండ్ రోవర్‌లను 9,300 కోట్ల రూపాయలకు స్వాధీనం చేసుకుని ఆ రెండింటినీ మళ్లీ లాభాల బాట పట్టించారు. ఈ విధంగా ఎవరైతే తనను అవమానించి తక్కువగా చూసారో వాళ్లనే తన దగ్గరికి వచ్చేలా చేసుకున్నారు రతన్ టాటా.

ప్రపంచ సంపన్నుడు కాదు కానీ...

మరి ఇంత పెద్ద కంపెనీని నడుపుతున్నప్పటికీ రతన్ టాటా భారతదేశంలో గానీ ప్రపంచ ధనవంతుల జాబితాలో గానీ ఏనాడూ కనిపించలేదు. ఎందుకంటే టాటా కంపెనీకి వచ్చే లాభాలలో 66% శాతం టాటా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకే వెళ్లి పోతుంది. ఒకవేళ ఈ ఆస్తి అంతా సేవా సంస్థలకి కాకుండా రతన్ టాటాకి చెందినట్లయితే ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి ముగ్గురిలో రతన్ టాటా తప్పకుండా ఉండేవారు, సాధారణంగా వ్యాపారం అంటే లాభాలు, విస్తరణ, వారసత్వం ఇలా ఉంటుంది. కానీ టాటా అలా కాదు. టాటా గ్రూప్ ఎప్పుడు కూడా తన కుటుంబం కోసమో, వ్యక్తిగత ఆస్తులను కూడపెట్టడం కోసమో వ్యాపారం చెయ్యలేదు. కంపెనీకి వచ్చిన లాభాలలో 66% సమాజ సేవ కోసం ఖర్చు చేసే ఏకైక కంపెనీ ప్రపంచం మొత్తంలో టాటా గ్రూప్ ఒక్కటే.

యువ శక్తిపై నమ్మకముంచి...

రతన్ టాటాకు యువత మీద, వాళ్ల శక్తి మీద మంచి నమ్మకం ఉంది. అందుకే స్నాప్‌డీల్, పేటీయం కార్డెకో, బ్లూస్టోన్, ఓలా, షియోమి, ఇలా 39కి పైగా స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించారు. అలాగే టాటా ట్రస్ట్, దేశంలోని మారుమూల ప్రాంతాలలోని పేద ప్రజలకు విద్య, ఉద్యోగం, ఆరోగ్యాన్ని అందించే దిశగా కృషి చేస్తుంది. ఇప్పటికి మన దేశంతో పాటుగా విదేశాలలో చదువుకుంటున్న ఎన్నో వేల మంది భారతీయ విద్యార్థులకు టాటా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్‌లు అందుతున్నాయి. అలాగే తాజ్ హోటల్‌లో ఉగ్రవాదుల దాడిలో గాయపడిన చనిపోయిన కుటుంబాలకు రతన్ టాటా ప్రత్యేకంగా సేవలందించారు. బిజినెస్ టైకూన్‌గా పేరు తెచ్చుకున్న రతన్ టాటాను.. 2000లోనే పద్మ భూషణ్ వరించింది. 2008లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్‌తో అప్పటి కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఒహియో స్టేట్ యూనివర్శిటీ, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ ఐఐటి ఖరగ్‌పూర్‌తో సహా పలు ప్రతిష్టాత్మక సంస్థల నుంచి గౌరవ డాక్టరేట్‌లను కూడా రతన్ టాటా అందుకున్నారు. బుధవారం రాత్రి భారతదేశపు మెరిసే నక్షత్రం వెలిసిపోయింది. రతన్ టాటా ఆస్తులకు వారసులు ఎవరో తెలియదు కానీ ఆయన ఆశయాలకు వారసులుగా ఉండడానికి సిద్ధమవుదాం.

జాజుల దినేష్

96662 38266

Advertisement

Next Story