- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాలకుల వాదన.. పోలీసుల వేదన
ప్రజలచే ఎన్నుకొనబడిన రాజకీయ పాలకులు తమ ఉనికిని నిలుపుకోవడానికై పోలీసు శాఖను పావుగా వాడుకుంటున్నారు. వారి అవసరాలను తీర్చుకొనడానికి, చట్టం సూచించిన పరిధులనతిక్రమించి ప్రవర్తించడానికి, పోలీసు స్టేషను అధికారిపై అప్రకటితంగా ఒత్తిడి చేయడం వలన ప్రజలు అకారణంగా ఇబ్బందులకు, హింసకు గురి చేయబడుతున్నారనేది అనుభవజ్ఞుల వాదన. అట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తన విధానాలను మార్చుకోని పక్షంలో వారి ఆధీనంలో పనిచేసే పరమాణువులాంటి పోలీసు స్టేషను అధికారి పరిపాలనా శైలి మారేదెట్లా? అనేది విమర్శ.
ప్రజాస్వామ్య పాలనలో భావ ప్రకటన స్వేచ్ఛ ఎంతో ప్రధానమైనది. అది పౌరులకు రాజ్యాంగపరంగా చేకూర్చబడిన హక్కు. ప్రభుత్వం అనుసరిస్తున్న పరిపాలన విధాన లోటుపాట్లపై ప్రజలు తగు విధంగా స్పందిస్తూ, సలహాలు, సూచనలు ఇవ్వడం సాంప్రదాయకమైన ప్రక్రియగా ఎంచబడుతుంది. పోలీసు శాఖ ప్రభుత్వ దర్శనీయ ప్రతినిధిగా ఎంచబడుతుంది. కావున అదే మూసలో తనదైనందిన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంటుంది. అందువలన ఆ శాఖ పనితీరు కూడా పౌర స్పందనకు, విమర్శలకు, ప్రతి విమర్శలకు అతీతంగా ఉండలేదు.
వలస అవశేషాలు తొలగిపోలేదు..
భారతదేశం స్వతంత్రతను సాధించుకోవడానికి పూర్వం బ్రిటిష్ వారి పాలనలో పోలీసు శాఖ ద్వారా ప్రజలను భౌతికంగా హింసించి, మానసికంగా వంచించి, సేవకుల స్థానానికి కుదించి, తమ పాలనను నిరాఘాటంగా కొనసాగించుకోవడానికి వాడుకొనే వారు. నేడు మనమెంచుకున్న ప్రజా స్వామ్య పాలనకది సరిపడే అంశం కాదు. ప్రజలే పాలకులైనందున వారికి ఉచ్ఛమైన స్థానం కల్పించబడింది. కానీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వతంత్ర భారతంలో, పోలీసు పాలనా పరంగా చూస్తే బ్రిటిషు వారు రూపొందించుకున్న దౌర్జన్య కర విన్యాసాల పాలన వాసనలు ఇంకా సొంతంగా సమసిపోలేదనిపిస్తున్నది. పౌరులకు రక్షణ, వారి హక్కుల పరిరక్షణ, వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను పరిరక్షించు శాఖగా పోలీసు విభాగం రూపాంతరం చెందిందని నేటికీ ధృవీకరించుకొనలేకున్నాం. పెత్తందారీ పోకడలు, అవినీతి, చట్ట వ్యతిరేక ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. పాలకులను మార్చుకున్నాం గాని పరిపాలనా విధానాలను మార్చుకొనలేకున్నాం. దేశంగా కలిసున్నా గానీ, సంస్కృతి సంప్రదాయాల పరంగా, రాజకీయపరంగా చూసినట్లయితే ప్రజలు కొన్ని తెగలుగా, ప్రాంతాలుగా విడిపోయి జీవిస్తున్నారనే చెప్పుకొనవలసి వస్తున్నది. ఈనాటి సమాజంలో నెలకొని ఉన్న వివాదాలకు, ఉద్రిక్తతలకు మూలాలు అందులోనే లభిస్తాయి. అందువలన సామాజిక పరిస్థితుల జ్ఞాన సముపార్జన పోలీసు విధుల్లో చాలా కీలకమైన అంశంగా పరిగణించాలి.
ప్రవర్తనా నియమావళి..
పోలీసులు ఎల్లప్పుడు వ్యక్తిగత ప్రయోజనాల ముందు విధి నిర్వహణను ప్రాథమిక బాధ్యతగా ఎంచి పని చేయాలి. శాంత స్వభావంతో, సామరస్య ధోరణితో పనిచేయాలి. ఇతరులకు రక్షణ కల్పించవలసిన పరిస్థితుల్లో ప్రాణ త్యాగానికైనా సిద్ధపడే పనిచేయాలి. ఎవరితోనూ అతిగా స్నేహం పెంచుకొనకుండా, పౌరులకు నమ్మకమైన వ్యక్తిగా, విశ్వసనీయత తొణికిసలాడే పోలీసు అధికారిగా వ్యవహరించాలి. తాము తీసుకొనే ప్రతీ చర్యలో ఉన్నత ప్రమాణాలు గల నీతి నిజాయితీలను ప్రదర్శించాలి. అటువంటి ఆదర్శనీయతను చాటేందుకు పోలీసులు వారి వ్యక్తిగత, ఉద్యోగ జీవితంలో స్వీయ నియంత్రకులుగా, వివాద రహితులుగా, ప్రతి ఆలోచనలోనూ, పనిలోనూ సత్యవాదులుగా, నిజాయితీపరులుగా వ్యవహరిస్తూ ప్రజలకు విశ్వాస పాత్రులుగా మారిపోవాలి. కుల, ప్రాంత, మత భేదాల కతీతులుగా నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా సేవలందించాలి. అందుకు తగినట్లుగా వృత్తినిపుణతను పెంపొందించునట్లుగా ప్రతి పోలీసు అధికారికి శిక్షణనందించి దక్షునిగా తీర్చిదిద్దగలిగినప్పుడే పై గుణగణాలన్నీ సాకారమవుతాయి.
ప్రజల విశ్వాసం చూరగొనాలి..
క్షేత్ర స్థాయిలో ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలంటే ప్రజలు బాధలకు లోనైనప్పుడు తానొక సానుభూతిపరుడిగా వ్యవహరించాలి. అలాగని అత్యుత్సాహాన్ని ప్రదర్శించి కోర్టు వారి అధికారాలను తన చేతిలోనికి తీసుకొనగూడదు. అనుమానాస్పద వ్యక్తుల నిర్వా కంపై సొంత తీర్పులను వెలువరించకూడదు. పరిశోధనలో విజయుడవ్వాలని, బాధితునికి సత్వర న్యాయమందించాలని అసహాయుడైన బందీపై అనుచితంగా ప్రవర్తించి అక్రమంగా నిర్బంధించడం, ఇంటరాగేషన్‌లో భౌతిక, మానసిక హింసలకు గురిచేయబూనడం ద్వారా నేరాన్ని పరిశోధించే క్రమం లో తానింకొక నేరానికి పాల్పడకూడదు. అలా ప్రవర్తించిన పోలీసు అధికారులు జైలు పాలైన సందర్భాలు కొన్నే అయినా అవి సంచలనాన్ని రేపాయి. పోలీసు శాఖకొక మాయని మచ్చగా నిలిచిపోయాయి. పర్యవసానంగా ప్రజల విశ్వాసానికి పోలీసులు దూరమైపోయే వాతావరణాన్ని కల్పించుకున్న వారయ్యారు.
మార్పుల ఆవశ్యకత
బ్రిటిష్ వారు వదిలివెళ్లిన పోలీసు దుష్కృత్యాల శకలాలను వదలి ప్రజాస్వామ్య విధానాలను ప్రతిబింబించే నూతన పోలీసు పరిపాలనను సత్వరమే ప్రవేశ పెట్టవలసిన రాజకీయ పాలకులు.. వారికి చేకూరిన పదవులతోనే చంకలు గుద్దుకుంటున్నారు తప్ప ప్రజల అవసరాలు తీర్చు విధంగా ఆలోచన చేయడం లేదు. దీంతో పోలీసు శాఖ ప్రజల ముందు తన విశ్వసనీయతతో నిలబడలేకున్నది. పాలకుల అడుగులకు మడుగులొత్తే అసాంఘిక జీవి నేటి పోలీసనీ, భయానికి హేతువనీ, తీవ్ర పదజాలంతో పోలీసులను విమర్శలకు గురి చేస్తున్నారు. అవన్నీ అసత్యా లా? సత్యాలా? అట్టి విమర్శల్లో ప్రజల నిజాయితీ ఎంత? ఒకవేళ ఎంతో కొంత ఉందని నమ్మితే దాన్ని రూపుమాపి అవసరమైన మేరకు మార్పులు చేసు కొనే దిశలో అటు పాలకులు, ఇటు ప్రభుత్వాధికారులు నడుం కట్టలేకున్నారు. దాని వలన క్షేత్రస్థాయి అధికారులు వారి పరిశోధనలను కొనసాగించడంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ప్రవర్తన తీరు చర్చనీయాంశమే!
పాలన తీరు రాచరికమైనా, ప్రజాస్వామ్యమైనా, అనాదిగా ప్రపంచ దేశాలన్నింటా పోలీసుల ప్రవర్త నా శైలి చర్చనీయాంశంగానే కొనసాగుతూ వస్తున్నది. ప్రజలను పీడించి, తమ పాలనపై ధిక్కార స్వరం వినిపించకుండా ఉండటానికి వలస పాలకు లు పోలీసు శాఖను వాడుకున్నారే గాని వారి యోగక్షేమాలనసలే పట్టించుకోలేదు. ఈ క్రమంలో కొన్ని సందర్భాలలో ప్రజలతో అమర్యాదగా ప్రవర్తించారనే అభియోగాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలు కట్టే పన్ను లతో జీత, భత్యాలు పొందుతూ, ప్రజల రక్షణకై నియమితులైన పోలీసులు ప్రజలను అమర్యాద పరచి, హింసకు గురిచేయడానికి గల కారణాలేమిటి? దాని మూలాలెక్కడున్నాయి? అనే విషయాలపై నిష్ణాతులు తమ నివేదికలలో తెలియపరిచారు.
విషవలయాన్ని చేధించడానికి..
సామాజిక సంప్రదాయాల, విషయంలో, చట్టాన్ని గౌరవించి జీవించడం విషయంలో ప్రజల మధ్య ఐక్యత లేదు. అందువల్ల పోలీసులు తమకు తోచిన విధంగా, చట్టం సూచించిన నిబంధనలతో పని లేకుండా ప్రజలను శాసిస్తున్నారు. హింసకు గురి చేస్తున్నారనేది మరికొందరి వాదన. ప్రజలచే ఎన్నుకొనబడిన రాజకీయ పాలకులు తమ ఉనికిని నిలుపుకోవడానికై పోలీసుశాఖను పావుగా వాడుకుంటున్నారు. వారి అవసరాలను తీర్చుకొనడానికి చట్టం సూచించిన పరిధులనతిక్రమించి ప్రవర్తించడానికి, పోలీసు స్టేషను అధికారిపై అప్రకటితంగా ఒత్తిడి చేయడం వలన ప్రజలు అకారణంగా ఇబ్బందులకు, హింసకు గురి చేయబడుతున్నారనేది క్షేత్రస్థాయి అనుభవజ్ఞుల వాదన. అట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తన విధానాలను మార్చుకోని పక్షంలో వారి ఆధీనంలో పనిచేసే పరమాణువులాంటి పోలీసు స్టేషను అధికారి పరిపాలనా శైలి మారేదెట్లా? అని విశ్లేషకులు వాదిస్తున్నారు. పోలీసులను వదిలేస్తే తాము ఎన్నికల్లో గెలిచేదెట్లా అనేది పాలకుల వాదన. చివరకు అదొక విషవలయంగా తయారై కూర్చుందనేది నగ్నసత్యం! ఆ విషవలయ ఛేదన మూలాలు తమ ఓటు హక్కు వినియోగంలోనే ఉన్నాయని పౌరులు, ఆలస్యంగానైనా, గుర్తించాల్సిన అవసరమెంతైనా ఉందనేది కఠోర సత్యం!!
పెద్దిరెడ్డి తిరుపతిరెడ్డి
రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ
94400 11170