మాదిగల చుట్టూతా రాజకీయం

by Ravi |   ( Updated:2024-03-29 01:00:13.0  )
మాదిగల చుట్టూతా రాజకీయం
X

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అన్ని ప్రధాన పార్టీలకు మాదిగ నినాదం బలాన్ని ఇస్తూ... ఊపిరి పోసేలా ఉంది. అందుకోసం రాజకీయ పార్టీలన్నీ మాదిగ నాయకత్వాన్ని దగ్గర చేర్చుకొని మాదిగల ఓటు బ్యాంకును రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. బలమైన మాదిగ నాయకత్వం కలిగిన నేతలను తమ వైపు తిప్పుకొని ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. అందుకే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలలో మాదిగల నినాదం అన్ని పార్టీలు ఎన్నికల సమయంలో అందుకుంటున్నాయి.

ఎన్నో ఏళ్లుగా మాదిగలకు సముచిత గౌరవం ఇస్తామని హామీ ఇస్తూ రాజకీయ పార్టీలు మరిచిపోవడం పరిపాటే.. అయినా మాదిగ నాయకత్వం చెక్కు చెదరకుండా సామాజిక సమానత్వం కోసం ఎస్సీ వర్గీకరణ ఏ,బి,సి,డి కోసం గట్టిగానే కృషి చేస్తున్నాయి. అనేక సార్లు మాదిగల డిమాండ్‌ను ఒప్పుకున్నట్లే ఒప్పుకున్నా చివరకు ఆ డిమాండ్ పరిష్కారానికి నోచుకోవడం లేదు. దాదాపుగా మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. మాదిగ ఉద్యమం పరిచయం అయిన తరువాతే తెలుగు రాష్ట్రాల్లో వివిధ సామాజిక సంఘాలు పురుడు పోసుకున్నాయి అంటే మాదిగల నాయకత్వం సమాజంలో అంతా చైతన్యాన్ని తీసుకువచ్చేలా చేసింది.

మాదిగలందరినీ సమీకరించాలని..

తెలంగాణ రాష్ట్రంలో బలమైన మాదిగ నాయకత్వం అంతా సంఘాలుగా విడిపోయి.. వివిధ ఉద్యమాలు ఉధృతం చేస్తున్నాయి. ఆయా సంఘాలుగా ఉన్న మాదిగల బలమైన నాయకుల నాయకత్వాన్ని వివిధ పార్టీలు తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రయత్నంలో ఆయా పార్టీలు విజయవంతమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జనాభాలో అతిపెద్ద సామాజిక వర్గంగా మాదిగ వర్గం ఉంది. దాదాపు 80 లక్షల జనాభా కలిగి రాష్ట్ర రాజకీయాలను మార్చే సత్తా కలిగే శక్తి మాదిగలకు ఉన్నా మాదిగ నాయకత్వంలోని భిన్నాభిప్రాయాల వల్ల మాదిగల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఫలితంగా ఇదే అదునుగా భావించి ఇతర పార్టీలు బలమైన సామాజిక ఉద్యమ నేపథ్యం కలిగిన మాదిగ నాయకులను దగ్గర చేసుకొని ఎన్నికలలో లబ్ది పొందాలని చూస్తున్నాయి. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలలో మాదిగ నాయకత్వం పని చేస్తున్నది. అయితే తెలంగాణలో ఏ పార్టీలోనూ మాదిగలకు ఇప్పటికీ సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదనే భావన అసంతృప్తి ఈ సామాజిక వర్గంలో స్పష్టంగా కనిపిస్తుంది. అటువంటి తరుణంలో మాదిగలందరినీ సమీకరించాల్సిన నాయకత్వ శక్తి కలిగిన నాయకులను ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రధానంగా ముందు వరుసలో నిలబెడుతున్నాయి.

ప్రాతినిథ్యంలో నిర్లక్ష్యం వహిస్తూ..

తెలంగాణ ఉద్యమంలో బలమైన శక్తిగా పనిచేసిన మాదిగ నాయకత్వానికి కూడా ప్రాధాన్యత దక్కలేదనే బలమైన అభిప్రాయం ఏర్పడింది. తరతరాలుగా సామాజిక సమానత్వానికి, అటు రాజకీయ ప్రాతినిధ్యానికి దూరంగా ఉంటున్న మాదిగ సామాజిక వర్గం. ప్రధాన నాయకులు తలో దిక్కు ఉండడం లాంటి చర్యలతో ఎంతో బలమైన సామాజిక శక్తి కలిగిన మాదిగలకు రాజకీయ దిశ కనిపించకుండా పోతుంది. మాదిగల్లో ఉన్న నిబద్దతను, పోరాట పటిమను గుర్తించి దగ్గరకు తీసుకుంటున్న వివిధ రాజకీయ పార్టీలు రాజకీయ ప్రాతినిధ్యంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఏది ఏమైన ఈ సారి తెలంగాణ రాష్ట్రంలో, పార్లమెంటు ఎన్నికల్లో మాదిగల శక్తి నినాదాన్ని ఎత్తుకున్న రాజకీయ పార్టీల ఎత్తులకు మాదిగలు సరైన తీర్పును ఇవ్వాల్సిన అవసరం ఉంది.

సంపత్ గడ్డం

మాదిగ విద్యార్థి నాయకుడు

78933 03516

Advertisement

Next Story

Most Viewed