గెలిచేవి పార్టీలే... ఓడేది మాత్రం ప్రజలు

by Ravi |   ( Updated:2023-11-24 00:30:41.0  )
గెలిచేవి పార్టీలే... ఓడేది మాత్రం ప్రజలు
X

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఒక ప్రహసనంగా జరుగుతున్నాయి. ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలకు ఏమాత్రం చోటు లేకుండా ఉచితాలు అనే బ్రహ్మ పదార్థాన్ని ప్రజలపై ప్రయోగిస్తున్నారు. ఒకప్పుడు రాష్ట్రంలోని ప్రధానమైన సమస్యలు ఎన్నికల నాటికి ఎజెండా అంశంగా ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు కూడా మౌలికమైన అంశాలు ప్రభావితం అయ్యే, విద్య, వైద్యం,వ్యవసాయం,ఉపాధి,పరిశ్రమలు ఎన్నికల అంశంగా పార్టీల మేనిఫెస్టో చోటు దక్కేది. కానీ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేవలం ఉచిత పథకాల మోజులో ప్రజల జీవన ప్రమాణం పూర్తి వైకల్యానికి లోనవుతోంది.

ప్రజల ఆకాంక్షలే నాటి ఎజెండా

సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు, సంస్థలు, బలమైన పౌరసమాజం పటిష్టంగా ఉన్నన్ని రోజులు ప్రజల ఆకాంక్షలను ఎజెండా చేయడంలో కీలక సూత్రధారులుగా పాత్ర పోషించారు. కాళోజీ నారాయణరావు, డా. బాలగోపాల్, ఎస్ ఆర్ శంకరన్, కన్నాభిరన్, కేశవరావు జాదవ్, కోదండరాం, జీవన్ కుమార్ లాంటి మేధావుల అభిప్రాయాలకు గౌరవం ఉండేది. రోజుల తరబడి అధ్యయనం, ప్రజల్లో నిరంతరం సభలు, సమావేశాలు... ప్రభుత్వాల అప్రజాస్వామిక నిర్ణయాలపై కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రచారం జరిగేది. ప్రతిపక్ష పార్టీలకు కావలసినంత కంటెంట్, విషయ పరిజ్ఞానం లభించేది.

పౌర సమాజం నుండి వచ్చిన డిమాండ్లే ప్రతిపక్ష పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోగా ఉండేవి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అంతా తారుమారు అయిన పరిస్థితి నెలకొంది. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలతో రెండు దశాబ్దాల కాలంగా మైండ్ గేమ్ ఆడుతూ తెలంగాణ రాజకీయాల సాఫ్ట్‌వేర్‌ని తనకు అనుకూలంగా కోడింగ్ చేసుకున్నాడు. విప్లవోద్యమ కాలంలో మేధావులుగా ఉనికిలో ఉన్న కొంత మందిని తన వందిమాగధులుగా ఏర్పాటు చేసుకొని తృప్తి పొందుతున్నారు. నిర్మాణంలో, నాణ్యత లోపంతో కాళేశ్వరం పిల్లర్లు కుంగితే ఆ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు భూకంపం అంటూ పచ్చి అబద్దాలు చలామణిలోకి తెచ్చే భావదారిద్య్రంలోకి తెలంగాణ మేధావి వర్గం పయనించడం విడ్డూరం.

సీఎంలను గద్దెదింపిన నాటి తెగువేది?

ఎన్నికల సమయంలో అధికార బిఆర్ఎస్‌‌పై విమర్శలు చేయడం తప్ప ప్రతిపక్ష పార్టీలు చెప్పుకొదగ్గ ఉద్యమాలు చేసి అధికార పార్టీని ఇరుకున పెట్టిన దాఖలాలు లేవు. 9 ఏండ్ల బీఆర్ఎస్ (గతంలో టిఆర్ఎస్) కాలంలో ఒక్క రాష్ట్ర బంద్‌కి కూడా ప్రతిపక్షాలు పిలువు ఇవ్వలేదు అంటే మనకు అర్థం అవుతుంది ప్రతిపక్ష పార్టీల యుద్ధ నీతి పాటిదో? కాళేశ్వరం అవినీతి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ, లిక్కర్ కుంభకోణం, ఎన్జీవోలు, టీచర్లు, నిరుద్యోగ సమస్యపై ఉద్యమించాల్సిన సమయాన ఉద్యమిస్తే నేడు మరింత అనుకూలంగా పరిస్థితులు మారేవి. మెడికల్ ఇంజనీరింగ్ కళాశాల కుంభకోణంలో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి సీటును మార్చిన విద్యార్థి శక్తిని చూసాం. ఎన్టీఆర్‌కు నాదెళ్ల భాస్కర్ రావు వెన్ను పోటు పొడిస్తే ప్రజాస్వామిక ఉద్యమాల బలం తెలుగు సమాజానికి తెలుసు. చంద్రబాబు కాలంలో విద్యుత్ ఉద్యమం బాబు తిరుగులేని పాలనకు చరమగీతం పాడింది. ఉద్యమ ఉగ్గుపాలతో పెరిగిన తెలంగాణ ప్రజానీకాన్ని చైతన్య హీనంగా మార్చిన ఘనత తెలంగాణ ప్రతిపక్ష పార్టీలకు దక్కుతుంది.

ఎగిసిపడుతున్న కాంగ్రెస్ గ్రాఫ్

కాంగ్రెస్ పార్టీ ఏనాడూ ఒక్క బలమైన కార్యక్రమం ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై తీసుకున్న దాఖలాలు లేవు. గాంధీ భవన్ మీడియా పాయింట్‌కే పరిమితమైన పార్టీ తాజాగా ముఖ్యమంత్రి జాబితాతో ముందుకు వస్తోంది. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో ఉనికిలోకి వచ్చిన పార్టీ, దానికి కొనసాగింపుగా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కాస్త ఊపుతెచ్చి తెలంగాణ కాంగ్రెస్‌కు జీవగంజి పోసింది. రేవంత్ రెడ్డి మినహా ఇతర ఏ నేతలు కాంగ్రెస్‌ను నిలబెట్టింది లేదు. బీజేపీ కొంత మేర ధాన్యం కొనుగోలు, ఇతర విషయాలపై ఉద్యమాలు చేసి ఉప ఎన్నికల్లో విజయాలు సాధించి పార్టీకి ఊపు వచ్చిన తదనంతర పరిణామాలతో పూర్తిగా చతికిలపడింది. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై కేంద్రం విచారణ జరిపి దోషులను శిక్షిస్తుందని ఆశించిన ప్రజలు నిరాశకు గురయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ మిలాఖత్ అయ్యాయి అన్న ప్రచారం బీజేపీ బలహీనపడటానికి కారణం అయ్యింది. లిక్కర్ కుంభకోణంలో కవితపై ఉదాసీన వైఖరి చూపడంతో బీజేపీ విమర్శల పాలు అయ్యింది.

రెడ్ పార్టీలకు రెడ్ సిగ్నల్..

నిరంతరం ఎర్రజెండాలతో పోరాటాలు చేసే కమ్యూనిస్టు పార్టీలు కేసీఆర్ ప్రభుత్వంపై మాత్రం తమ పోరాటాలకు రెడ్ సిగ్నల్ వేసుకున్నారు. సీట్ల కక్కుర్తిలో తమ ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చుకున్నారు. ప్రశ్నించాల్సిన, ఎదిగివచ్చిన పౌర సమాజ నేతలు అధికార పీఠానికి దాసోహం అంటున్నారు. ప్రజల వైపు నిలబడాల్సిన ఆటపాటలు దొరల గడీలో కవితా గానం చేస్తున్నాయి. గన్నుల సాగిన పెన్నులు తమకు తాము మన్ను కప్పుకుంటున్నాయి. కల్లబొల్లి మాటలు ఊక దంపుడు ఉపన్యాసాలు, ఆచరణ సాధ్యం కాని మేనిఫెస్టోలతో అంకెల గారడీతో మైమర్పిస్తున్నారు. ప్రజాస్వామ్యం అనే నెంబర్ గేమ్‌లో మ్యాజిక్ ఫిగర్ కోసం రాజకీయ ఇంద్రజాలం ప్రదర్శిస్తున్నారు. ప్రజలారా పారహుషార్... జాగ్రత్తగా లేకపోతే షరా మామూలుగానే పార్టీలు గెలుస్తాయి నిజమే! కానీ ప్రజలు మాత్రం మరో ఐదేండ్లు ఓడిపోవడం నిజం.

- దొమ్మాట వెంకటేష్

సామాజిక రాజకీయ విశ్లేషకులు

98480 57274

Advertisement

Next Story