రావమ్మా !ఉగాది రా!!

by Ravi |   ( Updated:2023-03-21 18:30:35.0  )
రావమ్మా !ఉగాది  రా!!
X

రైతు నిరు, చిరు ఉద్యోగి

తల కడిగితే వడగండ్ల వాన

తీర తీర ఎన్నెల్లా పూసిన పత్తి పంట

ముసురు వర్షం మిత్తి పాలయింది

చేతికి వచ్చిన మిర్చి పంట

కల కల నేలలో కలిసిపోయింది

నోటి కొచ్చిన వరి పంట

రాళ్ల వాన దెబ్బలకు తల్లడిల్లిపోయింది

వద్దంటే నువ్వు ఊకుంటావా ఉగాదీ

ఆగమాగం అయిన మా బతుకుల్ని చూడడానికైనా

రావమ్మా యుగయుగాల ఉగాది రా

గట్టి పిండం చింత చెట్టు బరిగె బరువైన మనసు

ఎలా బతకాలని చింతతో చెంచరిల్లిపోతుఃది

తెలియని పురుగు తేప తేపకు తగిలి

పువ్వంతా రాల్చుకొని వేప

ఒడ్డుకు పడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంటుంది

కాసిన్ని కాసిన కాయల్లాటి బిడ్డలను కోల్పోయి

మామిడి చెట్టు ఒంటరిగా

నెత్తి నోరు కొట్టుకొని ఏడుస్తుంది

మేము వద్దంటే ఊకుంటవా ఏంది నువ్వు

చెల్లాచెదరైన మమ్ముల్ని ఊరడించడానికైనా

రావమ్మా ఉగాదీ రా

తరతరాల ఆది ఉగాది రావమ్మా రా

అనేటోడు లేడు గిదేందని అడిగేటోడు రాడు

కోన్ హై దాతు లేదు ఫిర్యాదు లేదు

పంటను రోడ్లమీద పొరపోసుకొని

కడుపుమంట చల్లార్చుకుంటున్న ఎవుసందారులు

టైంకు జీతాలు వజీఫా రాకున్నా కుక్కిన పేనులా

పడి ఉండే మౌన మునులు ఉద్యోగులు

ఎంత మంటను ఎడదోసినా ఉడుకు పట్టని

నకముకాల నానుమాల సమాజం

చచ్చిన దానికి వచ్చిందే కట్నం రాజకీయాలు

ఎంతైనా తల్లివేరువు కదా

నిన్ను వద్దంటే తొంగి చూడకుండా ఉంటావా

ఉగాది రావమ్మా రా

రావమ్మా ఉగాదీ రా

పొద్దు పొద్దున్నే సెల్ ఫోన్ లో

సైబర్ మావి చిగుళ్ళను తిని కోకిల కూసింది

ఆదాయాలు వ్యయాలు

అవమానాలు రాజ పూజ్యాలు

ఎన్ని తూముల వానలు గాలులు

గోచార ఫలాలు చూసి

మా తలరాతల ఎలా ఉన్నాయో

నోరు విప్పి చెప్పడానికైనా రావమ్మా

మేము ఎంత కాదు కూడదన్నా

తడుక చాటు పెట్టినట్టే కదా

అయ్యగార్లు ముహూర్తం పెట్టిన తర్వాత

అడుగు పెట్టద్దంటే ఆగుతావా ఏంది

యుగయుగాల ఉగాది రావమ్మా రా

జూకంటి జగన్నాథం

94410 78095

Advertisement

Next Story

Most Viewed