జీవిత సత్యం

by Ravi |   ( Updated:2023-03-21 18:30:35.0  )
జీవిత సత్యం
X

రెమ్మలు తొడిగిన కొమ్మలు..

లే చివుళ్ళు మేసిన మత్త కోకిలలు..

పిందెలు మోసే మామిడి మానులు..

లే ఎరుపులో మెరుపులీనే రావి పత్రాలు..

తారకల్లా తళుకులీనే వే(ప) తరువులు..

అరవిరిసిన అందాల పూబాలలు..

గింగిరాలు కొడుతూ తిరుగాడే గండు తుమ్మెదలు.

గొంతు సవరించుకొన్న మత్త కోకిల

సరికొత్త కూని రాగం అందుకుంది.

వసంతాగమన శుభవేళ

వర్తమాన స్పృహతో

భవిష్యత్తును భవ్యంగా మలచుకోమంటోంది

మావి చిగురులూ..

వేప పూతలూ..

చెరుకు గడలూ..

వెన్న మీగడలు..

చక్కెర పొంగలి..

పులిహోర.. బొబ్బట్లూ.. పాయసం..

గారెలు..బూరెలు.

షడ్రుచులూ మేళవించిన ఉగాది పచ్చడి

గొప్ప జీవన సత్యం.

తీపీ.. చేదూ.. పులుపూ.. వగరూ.. వగైరాలన్నీ

జీవితంలోని కష్టసుఖాలూ..మెట్టపల్లాల రుచులు.

జీవిత సత్యాన్ని విస్మరించిన ఓ మనిషీ!

జీవన తత్వాన్ని తెలుసుకో !!

'శుభకృత్' పంచిన మంచీ చెడులను సమీక్షించుకుంటూ,

నిండు మనస్సుతో 'శోభకృత్'ను ఆహ్వానించు.

శుభాలనే కాంక్షించు

ప్రేమను పెంచు, కరుణను పంచు

అసహనాన్ని తుంచు

అసమానతల అంతమొందించు

మతోన్మాదం మెడలు వంచు

మానవతను ఆదరించు

అన్ని చెడులనూ విసర్జించు

మంచిని మాత్రమే స్వీకరించు

విలువలను ఆచరించు

వెలుగు వైపుకు మానవాళిని నడిపించు

పుడమిపై శాంతి స్థాపనకు ప్రయత్నించు

నిత్య చైతన్య స్ఫూర్తితో

జీవనయానం సాగించు

జయం నీదే.. విజయం నీదే..!!

యండి. ఉస్మాన్ ఖాన్,

99125 80645

Advertisement

Next Story

Most Viewed