బాంధవ్యాలకు ఉగాదే పునాది

by Ravi |   ( Updated:2023-03-21 18:30:05.0  )
బాంధవ్యాలకు ఉగాదే పునాది
X

ఆరు ఋతువులు ఆహార్యంతో

ప్రకృతి సౌందర్య ఆకృతిని సంతరించుకునేది

కాలం చైత్రరథమెక్కి కొత్త సంవత్సరం వైపు సాగేది

వసంత కాలపు నవోదయాన

శుక పిక ముఖ ప్రియ రవళి

సుప్రభాత గీతమై ధ్వనించేది

తెలుగు లోగిళ్ళలో ఆబాలగోపాలానికి

సంబురాన్ని పంచె ఉగాది పండగై విచ్చేసేది

మృణ్మయ పాత్రలో ఆరు రుచుల సంగమం

ఉగాది ప్రసాదంగా మారేది

పంచాంగ శ్రవణం గంగా స్నాన

ఫలితాన్ని ప్రాప్తింప జేసేది

కవన కదనాలతో పద్య తోరణాలతో

సాగే ఆ కవిసమ్మేళనం ఇప్పుడేది

ఉగాది ప్రాభవం మసకబారుతోంది

తెలుగు సంస్కృతి సాంప్రదాయం వగపిస్తోంది

ఇంట్లో మార్జాలం పోయ్యి లోంచి

లేచినా లేవకపోయినా అంతర్జాలం మాత్రం

అరచేతిలో ఇమిడిపోయింది.

కాంక్రీట్ వనంలో కాలం గడుపుతుంటే

గూగుల్ మన బాగోగులు చూసేస్తోంది

దర్జీ దగ్గరకు వెళ్ళకుండా దర్జాగా

కొత్తబట్టలు ఇంటికి తెచ్చే అమెజాన్ వుంది

స్విగ్గీ బగ్గీలో ఉగాది పచ్చడి ఇంటికి వచ్చేస్తోంది

జొమాటో బండి పిండివంటలు ఇంటికి జారేస్తోంది

కాస్మోటిక్ షోకిలలా నవ్వులు చిందిస్తూ

వాట్సాప్ అంటూ ఎమోజీలతో

ఏదోవిధంగా ట్విట్టర్ పిట్టతో సందేశం పంపిస్తూ

శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి తరం

నెట్టింట్లో ఉగాది పండగను జరిపేస్తోంది

ఆనందం ఆప్యాయత అనురాగం ఆవిరైపోతోంది

మానవ సంబంధం మరిచీకగా మారింది

ప్రకృతితో మమేకమైతేనే జీవజాతి మనగలిగేది

ఈ సత్యం ఎన్నటికి కాదనలేనిది

మానవీయ బాంధవ్యాలకు కావాలి ఈ ఉగాదే పునాది

శ్రీధర్ వాడవల్లి

9989855445

Advertisement

Next Story

Most Viewed