- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Revanth Reddy: ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్! రేవంత్ పరిస్థితేంటి?
తెలంగాణ రాజకీయాలలో రేవంత్ రెడ్డికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కేసీఆర్‌కు దీటుగా కౌంటర్లు ఇచ్చే నాయకుడిగా గుర్తింపు ఉన్న మాట కాదనలేని వాస్తవం. మెజారిటీ కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానించే నాయకుడిగా, ప్రశ్నించే, ఎదిరించే గొంతుగా పేరున్న మాటా నిజమే. టి- కాంగ్రెస్‌ను దారిలో పెట్టే శక్తి, ధైర్యము, ఆర్థిక స్థోమత రేవంత్ రెడ్డిలో ఉన్నాయనీ, తెలంగాణ ప్రజలు, యువతలో మంచి క్రేజీ ఉందనే విషయాన్ని గ్రహించే ఆయనకు టీపీసీసీ పదవి కట్టబెట్టిందనీ విమర్శకులు సైతం ఒప్పుకుంటారు.
రేవంత్ నియామకం తర్వాతనే కార్యకర్తలలో జోష్ వచ్చిందనేదీ నిజం. సీనియర్‌ల వలననే కాంగ్రెస్ పార్టీ సర్వనాశనమవుతోందని చాలామంది పార్టీ అభిమానులు, కార్యకర్తలు నమ్ముతున్నారు. రేవంత్ వర్సెస్ సీనియర్స్ అన్నట్లుగా కాంగ్రెస్ రాజకీయ వార్ కొనసాగుతోంది. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ, ఓ వైపు రాజకీయ అపర చాణక్యుడు కేసీఆర్ లాంటి ఉద్యమ నాయకుడు, మరోవైపు కమ్ముకొస్తున్న బీజేపీతో పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డికి సీనియర్‌ల తిరుగుబాటు కొత్త సమస్యగా మారింది. మరి ఈ పద్మవ్యూహంలో చిక్కుకున్న రేవంత్ రెడ్డి పార్టీకీ బలమా? లేదా బలహీనతా? అనేది కాలమే నిర్ణయించాలి.
ఏఐసీసీ(AICC) ఇటీవల ప్రకటించిన కొత్త కమిటీలు టి-కాంగ్రెస్‌లో(T-congress) కలకలం సృష్టిస్తున్నాయి. తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు సీనియర్‌లు అసమ్మతి భేటీలు మొదలుపెట్టారు. మరి కొందరు రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చినవారు రాజీనామాలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. పార్టీలోని ఇంకొందరు తామే ఒరిజినల్ లీడర్లమంటూ కామెంట్స్ చేయటం, పరోక్షంగా పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మరోసారి టార్గెట్ చేసినట్లు అయ్యింది. తాజా పరిణామాల నేపథ్యంలో భట్టి విక్రమార్క(bhatti vikramarka) నివాసంలో భేటీ అయిన నాయకులు రేవంత్‌పై తిరుగుబాటు యుద్ధాన్ని బహిరంగంగానే ప్రారంభించారు. పరోక్షంగా విమర్శలు కురిపించారు. కొత్త కమిటీలలో 108 మంది ఉంటే, అందులో 50 మంది వలస వచ్చినవారే అని మండిపడ్డారు. టీడీపీ నుంచి వచ్చినవారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనీ, తమ మీద కోవర్టులుగా(coverts) ముద్ర వేస్తున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు, వలస వచ్చినవారికి మధ్య పోరాటం జరుగుతున్నదని అన్నారు. వలస వచ్చినవారి నుంచి కాంగ్రెస్‌ను సేవ్ చేయాలనే ఉద్దేశంతోనే బయటికీ వచ్చామనీ చెప్పారు.
వలస పక్షులు కాంగ్రెస్‌ను హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతోందనీ, క్యారెక్టర్ లేనివాళ్లు కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారని ఆరోపణలు చేశారు. తాము నాలుగు పార్టీలు మారి రాలేదనీ, అసలు కాంగ్రెస్ నాయకులం తామేననీ, ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌తో తేల్చుకుంటామని ప్రకటించారు. 'సేవ్ కాంగ్రెస్'(save congress) నినాదంతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నామంటూనే, కుట్రపూరితంగా పార్టీని నాశనం చేసే చర్యలను అడ్డుకొని తీరుతామని హెచ్చరించడం కూడా మనం చూశాం. భట్టి విక్రమార్క నివాసంలో భేటీ అయిన నాయకులలో టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి(uttam kumar reddy), మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా(damodar rajanarshimha), ప్రేమ్‌సాగర్ రావు, జగ్గారెడ్డి(jaggareddy), మధుయాష్కీ, కోదండరెడ్డి, మహేశ్వర్ రెడ్డి మొదలైన నేతలుండడంతో పార్టీలో అసలేం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. సంక్షోభ నివారణ కోసం ఏఐసీసీ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్‌ను అధిష్టానం రంగంలోకి దించడం కొసమెరుపు.
దిగజారుతున్న పార్టీ గ్రాఫ్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దినదినం దిగజారుతున్నది. బలపడుతున్నట్లు ఏ మాత్రం కనిపించడం లేదన్నది నగ్న సత్యం. ఇప్పటికే వరుసగా రెండు సార్లు ఓడిపోయి అధికారానికి దూరమైంది. ఇలాంటి క్లిష్టతర సమయంలో మరింత కష్టపడి మూడోసారైనా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నేతలు కష్టపడాలి. కానీ, అలా చేయకపోగా, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ 'మీది తప్పు అంటే మీది తప్పు' అని పబ్లిక్ గా మాట్లాడుకుంటూ పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నారు. కాంగ్రెస్(congress) నేతలు చాలామంది టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయినా సరే, ఇప్పటికీ పార్టీ ఉనికి కోల్పోకుండా ఉండటానికి కారణం దానికి అత్యంత బలమైన కార్యకర్తలు ఉండటమే సుమా! పార్టీ వీడుతున్న నేతలంతా రేవంత్ రెడ్డిపై(tpcc chief) నెపం మోపుతూ వెళుతున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(komati reddy rajagopal reddy), దాసోజు శ్రవణ్(dasoju sravan), మర్రి శశిధర్ రెడ్డి(marri shashidhar reddy) వంటి నేతలంతా కూడా రేవంత్( కారణంగానే పార్టీని వీడుతున్నట్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ చాలా బలహీనపడిందని చెప్పక తప్పదు. దీనికి బెస్ట్ ఉదాహరణ మునుగోడు ఉపఎన్నికే. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నచోట డిపాజిట్ కూడా దక్కించుకోలేక చతికిలపడింది. పెరిగిపోతున్న అసమ్మతి సెగలు ప్రజల ఆదరణకు దూరం చేస్తున్నాయి.
ఓట్ల శాతం పెరిగేదెలా?
2014లో 34.15 శాతం ఓట్లతో టీఆర్‌ఎస్(trs) అధికారంలో రాగా, 2018లో టీఆర్‌ఎస్ ఓట్ల శాతం 12.75 శాతం పెరిగి 46.9 శాతానికి చేరింది. టీడీపీకి(tdp) 2014లో 14.7 శాతం ఓట్లు పడగా, 2018లో 3.5 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్‌కు 2018లో 2014 ఎన్నికల కంటే 4.2 శాతం ఓట్లు పెరిగినా సీట్లు మాత్రం పెరగలేదు. 2014తో పోల్చితే రెండు సీట్లు తగ్గిన చేదు నిజాన్ని గుర్తుంచుకోవాలి. నేటికీ ఈ ఓట్ల శాతం కాంగ్రెస్ పార్టీకి పెరిగే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు.
గతంలో జరిగిన ఉపఎన్నికలలో నాగార్జునసాగర్ మినహా మూడుచోట్ల కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవటం పార్టీ పరిస్థితిని తేటతెల్లం చేస్తున్నది. అలాంటప్పుడు నేతలు ఇంకా దూకుడుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలి. కానీ, అలా చేయడం లేదు. ఎవరికి వారు తమకు ప్రాధాన్యం లేదని, రేవంత్ రెడ్డి(t congress chief) వల్లనే పార్టీ నాశనం అవుతోందని బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు.
అంత కసి ఎందుకు?
రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా వచ్చిన తరువాత పార్టీలో కలకలం మొదలైంది. బయటి నుంచి వచ్చిన నేత అధ్యక్ష పదవి అధిష్టించడం ఏంటని సీనియర్‌లు వ్యక్తపరిచిన అసంతృప్తి అంతా ఇంతా కాదు. రేవంత్ రెడ్డి ఏ పార్టీ నుంచి వచ్చారనే విషయం పక్కన పెడితే, టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసిన పార్టీ నాయకురాలు సోనియా గాంధీ(sonia gandhi) నిర్ణయాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు సబబు? అసలు రేవంత్ రెడ్డికి ఆ స్థాయి, సమర్థత ఉందా? లేదా అనేది చూసుకోవాలి తప్ప, టీడీపీ నుంచి రావడమే నేరంగా, ఘోరంగా చూడటం మంచి పద్ధతి కాదు కదా! కాంగ్రెస్ పార్టీని టీడీపీ మాదిరిగా మార్చేస్తున్నారని విమర్శలు చేయడం వలన ఉపయోగం లేదు.
రేవంత్ వలన కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో చెప్పలేం గానీ, అసంతృప్తి పేరుతో బహిరంగంగా సొంత పార్టీపై విమర్శలు చేస్తున్న నేతల వలన మాత్రం నష్టం భారీగా జరుగుతోంది. పార్టీలో ఉంటూనే పార్టీకి నష్టం చేకూరేలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి తీరు ఉందని విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ సైతం రివర్స్ లో మాట్లాడటం మొదలుపెట్టారు. దీంతో కార్యకర్తలలో అసంతృప్తి, నిరుత్సాహం పేరుకుపోతోంది. అంతర్గత కుమ్ములాటలలో సర్ది చెప్పాల్సిన సీనియర్ నాయకులే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం, ఫిర్యాదులు చేసుకోవడం ఏంటని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాలలో రేవంత్ రెడ్డికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కేసీఆర్‌కు(kcr) దీటుగా కౌంటర్లు ఇచ్చే నాయకుడిగా గుర్తింపు ఉన్న మాట కాదనలేని వాస్తవం. మెజారిటీ కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానించే నాయకుడిగా, ప్రశ్నించే, ఎదిరించే గొంతుగా పేరున్న మాటా నిజమే. టి- కాంగ్రెస్‌ను దారిలో పెట్టే శక్తి, ధైర్యము, ఆర్థిక స్థోమత రేవంత్ రెడ్డిలో ఉన్నాయనీ, తెలంగాణ ప్రజలు, యువతలో మంచి క్రేజీ ఉందనే విషయాన్ని గ్రహించే ఆయనకు టీపీసీసీ పదవి కట్టబెట్టిందనీ విమర్శకులు సైతం ఒప్పుకుంటారు. రేవంత్ నియామకం తర్వాతనే కార్యకర్తలలో జోష్ వచ్చిందనేదీ నిజం. సీనియర్‌ల వలననే కాంగ్రెస్ పార్టీ సర్వనాశనమవుతోందని చాలామంది పార్టీ అభిమానులు, కార్యకర్తలు నమ్ముతున్నారు. రేవంత్ వర్సెస్ సీనియర్స్ అన్నట్లుగా కాంగ్రెస్ రాజకీయ వార్ కొనసాగుతోంది. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ, ఓ వైపు రాజకీయ అపర చాణక్యుడు కేసీసిఆర్ లాంటి ఉద్యమ నాయకుడు, మరోవైపు కమ్ముకొస్తున్న బీజేపీతో(bjp) పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డికి సీనియర్‌ల తిరుగుబాటు కొత్త సమస్యగా మారింది. మరి ఈ పద్మవ్యూహంలో చిక్కుకున్న రేవంత్ రెడ్డి పార్టీకీ బలమా? లేదా బలహీనతా? అనేది కాలమే నిర్ణయించాలి.
డా బి. కేశవులు, ఎండీ
చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం
85010 61659
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672.
Also Read... .
Collegium: కొలీజియం అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థ ఘర్షణకు కారణాలేంటి?