ఆయుధాలే కాదు... ఆహారధాన్యాలూ దిగుమతేనా..?

by Ravi |   ( Updated:2024-02-02 01:00:30.0  )
ఆయుధాలే కాదు... ఆహారధాన్యాలూ దిగుమతేనా..?
X

ఆయుధాలే కాదు ఆహార ధాన్యాలకు కూడా విదేశాలపైనే ఆధార పడాల్సిన పరిస్థితులను నేడు దేశం ఎదుర్కొంటున్నది. అధికార మార్పిడి జరిగిన దగ్గర నుండి పాలక ప్రభుత్వాలన్నీ వ్యవసాయ రంగంలో స్వతంత్ర విధానాలు అమలు జరిపి దేశ ప్రజల ఆహార అవసరాలను తీర్చే విధంగా కాకుండా సామ్రాజ్యవాదుల ప్రయోజనాలకు అనుకూలమైన వ్యవసాయ విధానాలు అమలు జరపడం వల్లే పప్పు, నూనె గింజల్లో స్వయం సమృద్ధి సాధ్యపడటం లేదు.

భారతదేశం 1970 దాకా పెద్ద ఎత్తున బియ్యాన్ని దిగుమతి చేసుకుంటే నేడు పప్పులు, నూనెలు అదే తరహాలో దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పప్పులు, నూనెల కొరత, దిగుమతుల వలన వాటి ధరలు నిరంతరం పెరుగుతూ సామాన్య కుటుంబాలను ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నాయి. పెరిగిన కంది పప్పు ధర దేశంలోని ప్రతి కుటుంబం తప్పని సరిగా ఆహారంలో వినియోగిస్తుంది. ఇది పేదలకు, సామాన్యులకు లభించే పోషకాహారం. క్రమంగా ఇది వారికి అందుబాటులో లేని విధంగా ఉంది. ధర పెరుగుతూ సంపన్న వర్గాలకే పరిమితమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. నాలుగైదు సంవత్సరాల క్రితం 60 లేక 70 రూపాయలకు లభించిన కందిపప్పు నేడు కిలో 180 రూపాయలకు చేరింది.2023 ఫిబ్రవరి సీజన్ లో 90 నుండి 100 రూపాయల ధర ఉన్న కంది పప్పు జూన్ లో రూ.135 పెరిగి నేడు రూ.185 రూపాయలకు ధర ఎగబాకింది. మారుమూల ప్రాంతాల్లో రూ. 200 రూపాయలు దాకా పలుకుతున్నది. దీంతో పాటు పెసరపప్పు కిలో ధర రూ. 100 నుండి రూ. 120 వరకు, మినపప్పు రూ. 80 నుండి రూ. 120 వరకు ,మేలు రకం రూ. 160 దాకా పలుకుతున్నది. ఇక సెనగపప్పు సైతం రూ. 70 నుండి రూ.100కి చేరింది.

సాగు తగ్గుదలకు కారణం..

ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు దేశంలో కంది సాగు 40.20 లక్షల ఎకరాలుగా ఉంటే, అందులో 11% కంటే ఎక్కువగా సాగు విస్తీర్ణత తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లో 12 లక్షల, తెలంగాణలో 6లక్షల ఎకరాల్లో మాత్రమే కంది సాగుతున్నది. ఇది గత విస్తీర్ణత కన్నా తక్కువ. అయితే, ఇంత పెద్ద ఎత్తున విస్తీర్ణం తగ్గడానికి ఆ పంటపై రైతాంగానికి న్యాయమైన ధర లభించక పోవటమే కారణం. 2018లో దేశంలో మొత్తం కందిపప్పు ఉత్పత్తి 43 లక్షల టన్నులు ఉండగా 2023లో 34 లక్షల టన్నులకు పడిపోయింది. 2022-23 పంట సీజన్లో కందిపప్పు ఉత్పత్తి లక్ష్యం 45.50 లక్షల టన్నులుగా ఉండగా ఉత్పత్తి మాత్రం 34.30 లక్షలుగా ఉంది. ఫలితంగా భారత వార్షిక పప్పు ధాన్యాల వినియోగంలో 15% దిగుమతి చేసుకుంటుండగా, 2020-21లో 24.66 లక్షల టన్నుల పప్పులను దిగుమతి చేసుకుంటే, 2021-22 లో 26.99 లక్షల టన్నుల పప్పులను దిగుమతి చేసుకున్నాం.

అతిపెద్ద దిగుమతిదారు

వంట నూనెల ఉత్పత్తిలో భారతదేశం చాలా వెనుకబడి ఉంది. అవసరమైన వినియోగంలో 56% పైగా నూనెలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుతం నూనెల పెద్ద దిగుమతి దేశం భారత్, ఇవి కాక ప్రపంచంలోనే ప్రముఖ కూరగాయల కొనుగోలుదారుగా కూడా భారత్ ఉంది. మన దేశం ఎక్కువగా దిగమతులపై ఆధారపడటం వలన అంతర్జాతీయ మార్కెట్‌పై ధరలు ఆధారపడి ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ఏమో..తమ ప్రయోజనాలకు అనుకూలంగా మార్కెట్ ధరలను నిర్ణయిస్తున్నాయి. కేవలం వాటి ప్రయోజనాల కోసమే అప్పుడప్పుడు ధరలు తగ్గించినట్లు ప్రచారం చేస్తున్నాయి. అందులో భాగమే భారత్‌లో నేడు నూనె ధరల తగ్గింపు ప్రచారం. కొద్ది రోజుల్లోనే అంతర్జాతీయ మార్కెట్ల్లో ధరలు పెరిగాయనే పేరుతో దేశంలో వంట నూనె ధరలు తిరిగి పెరుగుతాయనటంలో సందేహానికే ఆస్కారం లేదు.

ఈ పంటలు కనుమరుగు

1970 దాకా గ్రామీణ రైతు కుటుంబాలు నూనెలు, పప్పుల, బియ్యం విషయంలో స్వయం సమృద్ధి కలిగి ఉన్నారు. ధాన్యంతో పాటు కంది, మినుము, పెసర, నువ్వులు, ఆవాల పంటలు పండించేవారు. ధాన్యంతో పాటు, కందులు, మినుములు సంవత్సరానికి సరిపోను ఇంట్లో నిల్వ చేసుకునే వారు. బయట మార్కెట్లో చాలా తక్కువ మంది మాత్రమే కొనుగోలు చేసేవారు. రాయలసీమ, ఇతర గరువు నేలల ప్రాంతాల్లో వేరుశనగ పండించే వారు. నూతన ఆర్థిక విధాల ప్రవేశంతో పంటల సమతుల్యత స్థానే ఎగుమతికి అవసరమైన వాణిజ్య పంటల ప్రవేశంతో చిరుధాన్యాల పంటలు కనుమరుగైనాయి. ఫలితంగా వాటిని దిగుమతి చేసుకోవటంతో ధరలు పెరుగుతున్నాయి. నూనె గింజల సేద్యం విస్తీర్ణత, ఉత్పత్తి పెరగకపోవడం వలన దేశంలో వంట నూనెల కొరత ఏర్పడి దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని ఫలితమే నూనె ధరల పెరుగుదల. దేశంలో అన్ని రకాల సాధారణ బియ్యం ఎగుమతులపై నిషేధం విధించి, మేలు రకాల బియ్యం ఎగుమతికి అనుమతించటంమే దేశంలో దాని ధర పెరుగుదలకు కారణమైంది.

దేశ ప్రయోజనాలకు అనుకూలమైన సొంత వ్యవసాయ విధానాలు అమలు జరిపి, ఆహార పంటల్లో సమతుల్యత పాటించి, మేలు రకమైన విత్తనాలతో కందులు, మినుములు, వేరుశనగ, సన్ ప్లవర్ ఆయిల్, నువ్వుల పంటల విస్తీర్ణత పెంచి, వాటి దిగుబడులు పెరిగేలా చేసి స్వయం సమృద్ధిని సాధించినప్పుడే పప్పుల, నూనెల ధరలు తగ్గుతాయి. అందుకోసం పాలక ప్రభుత్వాలపై ప్రజలు ఉద్యమించాలి.

బొల్లిముంత సాంబశివరావు

రైతు కూలీ సంఘం (ఏపీ)

98859 83526

Advertisement

Next Story