ఆధునిక భారత నిర్మాత నెహ్రూ

by srinivas |   ( Updated:2024-11-14 02:49:50.0  )
ఆధునిక భారత నిర్మాత నెహ్రూ
X

ప్రముఖ న్యాయవాది, జాతీయవాది, భారత జాతీయ కాంగ్రెసులో ముఖ్య నేత అయిన మోతీలాల్ నెహ్రూ, అయన భార్య స్వరూప్ రాణి నెహ్రులకు 1889 నవంబర్ 14న జవహర్లాల్ నెహ్రూ జన్మించారు. ఇంగ్లాండ్‌లో హారో స్కూల్, ట్రినిటీ కాలేజ్, కెంబ్రిడ్జ్‌లో విద్యాభ్యాసం చేశారు. తరువాత బారిస్టర్ పూర్తిచేసుకొని న్యాయవాదిగా పని చేయడానికి 1912లో భారత్ తిరిగి వచ్చారు. తదనంతరం 1916లో మొదటిసారి గాంధీ గారిని కలసిన తరువాత స్వాతంత్ర్యోద్యమానికి ఆకర్షితులై భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. అనతి కాలంలో ఆయన పార్టీలో కీలకంగా మారారు, 1923, 1927 లలో రెండేసి సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. భారతదేశ ఆధునిక శాస్త్ర-సాంకేతిక విద్యా వ్యవస్థ ఆవిష్కర్త, బాలల స్నేహితుడిగా చరిత్రలో నిలిచిపోయారు.

తదనంతరం గాంధీ నుండి రాజకీయ వారసత్వం పొందిన నెహ్రూ, 1929లో లాహోర్ సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యి భారత దేశ పూర్తి స్వాతంత్ర్యం కొరకు పిలుపునిచ్చారు. ఆయన గాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం, సహాయనిరాకరణ, క్విట్‌ ఇండియా ఉద్యమం వంటి అనేక స్వాతంత్ర్య పోరాటాలలో కీలకంగా వ్యవహరించారు. బ్రిటిషు వారి పైన చేసిన తిరుగుబాటు కారణంగా ఆయన 9 సంవత్సరాలకు పైగానే జైలు జీవితం గడపవలసి వొచ్చింది. 1937లో మరియు 1946లో ప్రావిన్షియల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ఎనలేని కృషిచేశారు. 1946లో భారత తాత్కాలిక ప్రభుత్వానికి నెహ్రూ, ప్రధానిగా నియమితులయ్యారు. ఆ తరువాత 15 ఆగస్టు 1947లో స్వాతంత్ర్య భారతానికి తొలి ప్రధానమంత్రిగా, 1950లో జనవరి 26న భారత గణతంత్రానికి తోలి ప్రధానిగా వ్యవహరించారు. 1952లో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించి నెహ్రు గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.

మతం కంటే విజ్ఞానం గొప్పది

జవహర్లాల్ నెహ్రు గణనీయమైన దేశభక్తితో సమాజాభివృద్ధి పట్ల అపార శ్రద్ధతో భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను సమర్థవంతంగా నిర్మించారు. సమాజంలో శాంతి, నిష్పాక్షికతకు పునాదులు వేశారు. నెహ్రూ సిద్ధాంతాలు రేషనలిజం అనగా తర్కశాస్త్రం, అనుభవవాదం, సాక్ష్యవాదం మీద ఆధారపడేది. ఆయన మతం కంటే విజ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేవారు. అనుభవం, మేధస్సుతోనే సమస్యలపట్ల పరిజ్ఞానం, దృక్పథం ఏర్పడతాయని నమ్మేవారు. ఆయన శాస్త్రీయంగా సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి కృషి చేసే వారు.

భారత దేశ స్వాతంత్ర్యోద్యమంలో విజయం సాధించే నాటికి 1943లో జరిగిన బంగాళా కరువు విలయ తాండవం చేదు జ్ఞాపకాలు ఇంకా కళ్ల ముందు కదులుతూనే ఉన్నాయి. ఆ అతిపెద్ద విపత్తు కారణంగా ముప్పై లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు స్వాతంత్య్రం వచ్చేనాటికి, బ్రిటిషు దోపిడీ కారణంగా ప్రపంచ జనాభాలో 13% పైగా వాటా కలిగి ఉన్న భారత దేశం GDPలో మాత్రం కేవలం 3% శాతానికే పరిమితమైపోయింది. దీని వలన మన భారత దేశం ప్రపంచంలోనే అత్యంత పేద దేశాలలో ఒక్కటిగా నిలిచింది. ఆకలి, పేదరికం, నిరక్షరాస్యత వంటి సామాజిక ఆర్ధిక సమస్యల వలయంలో చిక్కుకున్న భారతావనికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రు బాధ్యతలను స్వీకరించారు.

పంచవర్ష ప్రణాళికలు ఆజ్యం

ఇటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి నెహ్రు పంచవర్ష ప్రణాళికలకు ఆజ్యం పోశారు. 1950వ సంవత్సరంలోని మొదటి ఐదు సంవత్సరాల ప్రణాళిక అనేక ముఖ్యమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని రూపకల్పన చేయబడింది. ముఖ్యంగా, ఆహార భద్రత మరియు సాగు నీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ఈ ప్రణాళికలో అత్యంత ప్రధానమైన అంశాలు మూడు భారీ నీటిపారుదల డ్యాముల నిర్మాణం. భక్త్రా నాగల్ డ్యామ్, హిరాకుడం డ్యామ్, మరియు నాగర్జున సాగర్ డ్యామ్ ఈ ప్రణాళికలో భాగంగా నిర్మించబడ్డాయి. ఇవి రైతులకు సాగు నీటిని అందించటంలో మహత్తరమైన పాత్ర పోషించాయి, అలాగే వీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి కూడా చేయడం ప్రారంభించారు. ఆర్థికాభివృద్ధి కోసం రెండో పంచవర్ష ప్రణాళికలో మెహలనోబిస్ వ్యూహాన్ని అవలంబించ సంకల్పించారు నెహ్రు. ఇందులో భాగంగా స్వయం సమృద్ధే లక్ష్యంగా అనేక భారీ పరిశ్రమలను స్థాపించారు. ఇవి నేటి మహారత్న, నవరత్న మినీరత్నలు గా పిలవబడుతున్న కంపెనీలకు పునాదులుగా నిలిచాయి. తద్వారా వేగవంతమైన పారిశ్రామికీకరణకు ఆజ్యం పూశారు. కుటీర పరిశ్రమల స్థాపనకు అనేక కేటాయింపులు చేసి స్వదేశీ వినియోగ ఉత్పత్తులు తయారీకి చేయూతనిచ్చారు.

దేశ నిర్మాణానికి సైన్స్

నెహ్రూ దృష్టిలో పశ్చిమ దేశాల శాంతి, సమృద్ధి, పురోగతికి భారతదేశంలో నెలకొన్న దారిద్ర్య పరిస్థితులకు గల వ్యత్యాసం కేవలం శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానమే అని బలంగా విశ్వసించేవారు. అందుకుగానూ ఈ రంగాలలో శాస్త్రవేత్తలు మరియు నిపుణులకు ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రభుత్వ పెట్టుబడులు అత్యవసరమైనవి అని నెహ్రూ అర్థం చేసుకున్నారు. దేశంలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని వారికి ప్రేరణ ఇచ్చారు. ఈ దిశగా హోమి భాబా (భాబా అణు పరిశోధన కేంద్రం), విక్రమ్ సారభాయ్ (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ), సి.వి.రామన్ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్సు) వంటి ప్రముఖ శాస్త్రవేత్తలను దేశ నిర్మాణంలో భాగం చేయడంలో నెహ్రూ గొప్ప విజయం సాధించారు.

సమాజానికి భారం కావద్దు

దేశ సమస్యలను పరిష్కరించడానికి సామాజిక మరియు రాజకీయ మార్పులు మాత్రమే సరిపోవని, దేశ ప్రజల మానసికాభివృద్ధి కూడా సమాన ప్రాధాన్యం కలిగి ఉండాలని నెహ్రూ విశ్వసించారు. విశ్వవిద్యాలయాలు మనసు విస్తరించే సత్యాన్వేషణలకు ప్రేరణగా ఉండాలని, సమాజంలో సహనాన్ని మరియు మానవత్వాన్ని పెంపొందించాలని నెహ్రూ అభిలాషించారు. విద్య వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాకుండా సామాజిక సంక్షేమానికి కూడా ఉపయోగపడాలని నెహ్రూ భావించేవారు. అంతే కాక విద్య ద్వారా ఆర్థిక లక్ష్యాలు, సామాజిక కట్టుబాట్లు, మూఢ నమ్మకాల పట్ల కూడా మార్పులు తీసుకురావాలని ఆయన నమ్మేవారు. మీరు తినేంత తినగలుగుతూ అంత కంటే ఎక్కువ ఉత్పత్తి చేయకపోతే, మీరు సమాజానికి భారంగా ఉంటారు అనే ఆయన ప్రసిద్ధ మాటలు విద్యార్థులకు జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని నేటికీ కలిగిస్థాయి.

నెహ్రూ ఐఐటీలు మార్గదర్శకాలు

నెహ్రూ 1949లో అమెరికాలోని మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని సందర్శించిన తరువాత దేశం కోసం ఐఐటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఖరగ్‌పూర్ ఐఐటీ 1950లో ప్రారంభం, తరువాత బొంబాయి (1958), చెన్నై (1959), కాంపూర్ (1959), ఢిల్లీ (1961) ఐఐటీలను కుడా వెనువెంటనే స్థాపించారు. ఈ విద్యాసంస్థలు పూర్తిగా ప్రజా ధనంతో నిర్మించబడ్డాయి, ఎందుకంటే భారతదేశంలో విద్యాభ్యాసంలో అందరికి సమాన అవకాశాలతో పాటు వనరుల లోపం కలగకుండా ఉండాలని ఆయన బలంగా విశ్వసించేవారు. ఆ తరువాత ప్రముఖ శాస్త్రవేత్తల సహకారంతో భారతదేశంలో శాస్త్ర-సాంకేతిక క్షేత్రాల్లో అనేక విశ్వవిద్యాలయాలు, పరిశోధన కేంద్రాలు స్థాపించబడ్డాయి. భారతదేశ సాంకేతిక అభివృద్ధి కోసం ప్రేరణగా నిలిచిన ఈ సంస్థలు, భవిష్యత్ భారతానికి మార్గదర్శకంగా నిలిచాయి.

ఆరోగ్యానికి అమిత ప్రాధాన్యం

ప్రజారోగ్య రంగంపైన కూడా నెహ్రు దృష్టి సారించారు. అందులో భాగంగా అఖిల భారత వైద్య శాస్త్ర సంస్థ (AIIMS) 1956లో స్థాపించబడింది, మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ 1958లో, గోవింద్ బల్లభ్ పంత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 1961లో, అలాగే ఇతర పబ్లిక్ హెల్త్ సంస్థలు కూడా స్థాపించబడ్డాయి. ఈ సంస్థలు నేటికీ ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఆసుపత్రుల సంఖ్య పెరిగిన కొద్దీ, ఎక్కువ మంది వైద్య నిపుణులను ఆరోగ్య రంగంలోకి తీసుకురావడం అనివార్యం అయ్యింది. తదనుగుణంగా 1946లో మెడికల్ కాలేజీల సంఖ్య 15 నుండి 1965 నాటికి 81కి పెంచి, విద్యార్థుల సంఖ్యను 1200 నుండి 1965 నాటికి 10,000కి పెంచ గలిగారు.

మహిళావిద్యతోటే మంచి పౌరుల సృష్టి

నెహ్రూ తన పంచవర్ష ప్రణాళికల్లో ప్రాథమిక విద్యను ఉచితంగా అందించాలన్న లక్ష్యం పైన దృష్టి సారించారు. బాలల విద్యకు ప్రాధాన్యం ఇస్తూ గ్రామాల్లో పాఠశాలలను నిర్మించి, బడులు పిల్లలకు విద్యను చేరువ చేస్తూ, వారి పోషకాహార సమస్యల్ని కూడా పరిష్కరించేందుకు పాలు, భోజన పథకాలను ప్రారంభించారు. పండిట్ నెహ్రూ విద్యాకర్తగా ప్రాథమిక విద్య అవసరాన్ని కూడా చక్కగా అర్థం చేసుకున్నారు. అంతేగాక మహిళా విద్యకు కూడా ప్రాముఖ్యతనిచ్చారు. భారతదేశ మహిళలు చదువుకుంటే వారు స్వతంత్రంగా జీవించగలరు మరియు సమాజానికి మంచి పౌరులుగా మారతారని ఆయన నమ్మెవారు.

ప్రాతీయ భాషలపై మక్కువ

దానితోపాటు నెహ్రూ సాంస్కృతిక విలువలను వికసిత సమాజానికి పునాదిగా భావించారు. నృత్యకళా అకాడమీ (లలిత్ కలా అకాడమీ) మరియు సాహిత్య అకాడమీ వంటి సంస్థలను స్థాపించడంలో నెహ్రూ కీలక పాత్ర పోషించారు. ప్రాచీన భారతీయ చరిత్ర మరియు సంస్కృతి పట్ల యువతను ప్రోత్సహించడంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. విద్యలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని నెహ్రు నమ్మారు, తద్వారా పాఠ్యాంశాలను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోగలరని, విద్యను విజయవంతంగా అమలు చేయవచ్చని విశ్వసించారు. అదే సమయంలో, ప్రపంచ దేశాలతో పోటీపడడానికి ఇంగ్లీష్‌ను ఉన్నత విద్యా మాధ్యమంగా మరియు పరిపాలన భాషగా కొనసాగించాలని సమర్థించారు.

శాశ్వతంగా వెలిగే దీపం

నెహ్రూ భారతదేశం కోసం ఎంతగానో శ్రమించిన నేత మాత్రమే కాదు, యువత మరియు బాలల సర్వతోముఖాభివృద్ధిని కోరుకునే నేత కూడా. అందుకే ఆయన జయంతిని బాలల దినోత్సవంగా ప్రతియేడు జరుపుకుంటాం. నెహ్రూ, దేశానికి ఒక ప్రగతిశీల విద్యా వ్యవస్థను నిర్మించడంలో తన అంకితభావంతో ప్రముఖమైన కృషి చేశారు. శాస్త్రీయ దృక్పథం, విజ్ఞానం మరియు మానవతావాదం మీద ఆధారపడి, విద్య సమాజాన్ని మారుస్తుందని ఆయన నమ్మారు. పండిట్ నెహ్రూ మన దేశానికి శాశ్వతంగా వెలిగే దీపం. ఆయన ఆలోచనలు భారత విద్యా వ్యవస్థను కొత్త గమ్యానికి తీసుకెళ్లాయి. పిల్లలు ప్రతి చిన్న అంశాన్ని సందేహించగలగాలి, పరిశోధన పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలి, నూతన విజ్ఞానాన్ని ఆస్వాదించాలి. భారతదేశ యువతను నూతన శక్తితో అభివృద్ధి బాటలో నడిపించేందుకు నెహ్రూ చూపిన ప్రేరణ, నేటి వరకు మనం అనుసరిస్తున్న సమగ్ర విద్యకు ఒక మార్గదర్శకంగా నిలిచింది.

(నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం)

సంగోజి ధీరజ్

పీహెచ్‌డి స్కాలర్,

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్

జాతీయ సమన్వయకర్త

పరిశోధనా విభాగం, ఎన్ఎస్‌యుఐ

97011 55950.

Advertisement

Next Story

Most Viewed