- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదివాసీల అపురూప వేడుక నాగోబా దర్బార్
ఆదివాసీల సంస్కృతి పెనవేసుకున్న అపూర్వమైన వేడుక నాగోబా జాతర. ఆదివాసీలు తమ ఆరాధ్య దైవమైన నాగోబాను అర్చిస్తూ ఎంతో ఘనంగా జరిపే ఈ జాతర ఎంతో ప్రాచీనమైనది. ఎన్నో విశిష్టతలు కలిగినది. ప్రతియేటా పుష్యమాసంలో తెలంగాణాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఈ జాతర జరుగుతుంది. అప్పటి వరకు నిర్మానుష్యమైన అటవీ ప్రాంతం జాతర నిర్వహించే సమయంలో జనసంద్రమైపోతుంది. ఈ జాతరను ఆదిమ గిరిజనులైన గోండు తెగకు చెందిన మేస్రం వంశస్తులు నాగోబాకు పూజలు నిర్వహిస్తున్నారు. వందల ఏండ్ల నుంచి ఈ సంప్రదాయం మార్పు లేకుండా కొనసాగుతుండటం విశేషం.
ఎనభై మైళ్ళు నడుస్తూ..
తాతల సంప్రదాయం ప్రకారం నాగోబాను పూజిస్తే పంటలు సమృద్ధిగా పండుతాయని, శాంతి నెలకొంటుందని, రోగాలు మాయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. మేస్రం వంశీయులు ఈ జాతర ముందురోజు నాటికి ఎక్కడ ఉన్నా అందరూ కెస్లాపూర్‌లోని ఆలయం పక్కన విడిది చేస్తారు. తరువాత పారదన, కటోడాలు ఎడ్ల బళ్లమీద ఊరూరు తిరిగి జాతరకు ఆహ్వానిస్తారు. తిరికొండకు వెళ్ళి కమ్మరి వాళ్ళ దగ్గర పూజల కుండలు సిద్ధం చేస్తారు. తిరుగు ప్రయాణంలో పౌర్ణమి రోజున కేస్లాపూర్లో పూజలు నిర్వహించి మాడవి వంశం ఇంట్లో బస చేస్తారు. తదుపరి మేస్రం వంశస్తులు పవిత్ర గోదావరి జలాలను తీసుకురావడానికి కాలినడకన ఎనభై మైళ్లు సుమారు ఎనిమిది గ్రామాలలో బస చేసుకుంటూ నడిచి వెళ్తారు. తరువాత గోదావరి నదిలో పూజ నిర్వహిస్తారు. కాటోడ ఇంట్లో పూజలు నిర్వహించి కుండల్లో, పాత్రల్లో గోదావరి జలాలను తీసుకొని తిరిగి కేస్లాపూర్ ప్రయాణమవుతారు. మధ్యలో ఇంద్రవెల్లిలోని ఇంద్రాయి గ్రామం చేరుకొని ఇంద్రాయి దేవతను పూజిస్తారు. అదే రోజు కేస్లాపూర్ ఆలయ ప్రాంగణం లోని మర్రిచెట్టు దగ్గరకు చేరుకొని 'తుమ్'ను తలచుకుంటారు.(తుమ్ అంటే చనిపోయిన పెద్దలను స్మరించుకుంటూ విడిది చేయడం) మర్రిచెట్టు నుంచి గుడి దగ్గరకు వెళ్లి కోనేరు నీటిలో ఆడపడుచులు ఆలయాన్ని శుద్ధి చేస్తారు. సాయంత్రం గోదావరి జలంతో శుద్ధిచేసి మహా పూజ పుష్య అమావాస్య రోజున నిర్వహిస్తారు. ఈ పూజ చేసిన మరుసటి రోజు నుండి ప్రధాన జాతర ప్రారంభం అవుతుంది. ఈ జాతరకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ చెందిన ఆదివాసులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు.
దర్బార్ ఏర్పాటు చేసి..
ఈ జాతర సమయంలో మేస్రం కుటుంబాల్లోకి వచ్చిన కొత్త కోడల్లు తప్పనిసరిగా నాగోబా దర్శనానికి రావాల్సి ఉంటుంది. ఇది ఒక సంప్రదాయం. దీనిని బెటింగ్(కొత్త కోడళ్ళ పరిచయం) అంటారు. అలాగే పరిచయం కావలసిన వధువులను 'ఖిటి కొరియాడ్' అని అంటారు. ఈ పరిచయం తర్వాతే వారిని పూజలకు అనుమతిస్తారు. కొమరం భీం పోరాటం తరువాత ఆదివాసీల జీవనంపై అధ్యయనం చేయడానికి వచ్చిన మానవ పరిణామ శాస్త్రవేత్త హైమన్ డార్ఫ్‌కి వచ్చిన ఆలోచనే గిరిజన దర్బార్ లేదా నాగోబా దర్బార్. హైమన్ డార్ఫ్ తన భార్య ఎలిజిబెత్‌తో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మర్లవాయి గ్రామానికి వచ్చారు. ఆ సమయంలో వివిధ రాష్ట్రాల ఆదివాసీలు వారి కష్టసుఖాలు పంచుకోవడానికి 'దర్బార్'ను ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ అనుమతితో 1946 నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. ఈ వేదిక 72 సంవత్సరాలుగా అనేక ఆదివాసీల సమస్యలను చర్చిస్తున్నది. ఈ దర్బార్‌కు హైమన్ డార్ఫ్ శిష్యులు కూడా వస్తారు. ప్రతి ఏటా జైనుర్లోని మర్లవాయిలో హైమన్ డార్ఫ్ వర్థంతిని జరుపుతుంటారు. ఆదివాసీ సంస్కృతికి అద్ధంపట్టే ఈ నాగోబా జాతర వారికి అపురూప వేడుక.
(నేడు నాగోబా జాతర ముగింపు)
పెనుక ప్రభాకర్
94942 83038
Also Read...