వానాకాలం.. జబ్బులతో జాగ్రత్త..!?

by Ravi |   ( Updated:2024-06-30 00:31:20.0  )
వానాకాలం.. జబ్బులతో జాగ్రత్త..!?
X

వర్షాకాలంలో డెంగ్యూ, న్యుమోనియా, మలేరియా, వాంతులు, విరోచనాలు, కామెర్లు వంటి ఎన్నో జబ్బులు విజృంభిస్తుంటాయి. చాలా వరకు ఇవి మామూలుగా తగ్గిపోయే సీజనల్ వ్యాధులే. అయినా కొందరికి ప్రమాదకరంగానూ మారొచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బులతో బాధపడే వారికి, వృద్ధులకు, పిల్లలకు, గర్భిణులకు కొన్నిసార్లు ప్రాణాంతకంగానూ పరిణమించవచ్చు. కాబట్టి వానాకాలంలో దోమలు విజృంభణ, బెడద నుంచి బయట పడటానికి వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత చాలా అవసరం. కనీస జాగ్రత్తలు తప్పనిసరి అవసరం. ఈ కాలంలో వాతావరణం మారడమే కాదు కలుషితమయ్యే నీరు, ముసురుకొచ్చే దోమల దండుతో వచ్చే జబ్బులు చాలా ఎక్కువ. పైగా, అప్పటికే ఉన్న కొన్ని జబ్బులు తీవ్రం కావచ్చు. ఈ కాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యం చేస్తే, సరైన చికిత్స తీసుకోకపోతే తీవ్రమయ్యే ప్రమాదం ఉందని గమనించాలి.

రోజుల తరబడి విరామం లేకుండా వర్షాలు కురుస్తుండడంతో వరద నీటి ద్వారా నీటి వనరులు కలుషితమవుతాయి. డ్రైనేజీ వ్యవస్థ స్తంభించడంతో మురుగు నీటిలో దోమలు పెరుగుతాయి. తాగునీరు కలుషితమవుతుంది. వర్షాకాలం ప్రవేశిస్తున్న తరుణంలో ఇలాంటి పరిణామాలు పరిపాటే?. ఈ కాలంలో ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖలను అప్రమత్తపర్చాల్సి ఉంది. ఎందుకంటే ఆ కలుషితమైన నీరు తాగడం, దోమల విజృంభించిన వాతావరణ పరిస్థితుల మూలంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక్కొక్కసారి గూడాలకు గూడాలే డెంగ్యూ ఫీవర్, గ్రామాలకు గ్రామాలే వ్యాధులతో మంచం పట్టిన రోజులు చాలా ఉన్నాయి. ఇవి జిల్లా కేంద్రాలకు దూరంగా ఉండటంతో నాణ్యమైన వైద్య సేవలు సత్వరమే అందించడం కష్టం. ముందస్తు జాగ్రత్త చర్యలే తక్షణ రక్షణ.

హైపర్ స్పేక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీ

భారత్‌కు చెందిన ఒక అంకుర సంస్థ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. నీటిలో దాగున్న దోమల లార్వాలను పసిగట్టేందుకు అధునాతన గూఢచర్య, నిఘా ఉపగ్రహ పరిజ్ఞానాన్ని ఉపయోగించింది. తక్కువ ఖర్చుతో దోమలను లార్వా దశలోనే గుర్తించి మట్టు పెట్టడానికి ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. దోమలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఈ కీటక నాశనాలను ప్రయోగిస్తే లార్వా దశలోనే దోమల వ్యాప్తి అరికట్టవచ్చు. దోమల లార్వాలు నిర్దిష్టంగా ఎక్కువగా ఉన్న ప్రదేశాలను గుర్తించి వాటి విస్తరణకు విరుగుడు చేయవచ్చు. తద్వారా మలేరియా, డెంగ్యూ మరణాలను తగ్గించుకోవచ్చు. ప్రభుత్వాలు అధునాతనంగా కనిపెట్టిన ఈ పరిశోధనా విధానాలను సద్వినియోగపరచుకొని దోమలను వేటాడుతూ లార్వా దశలోనే మట్టు పెట్టగలిగితే మనం అనేక జబ్బులకు కారణమైన దోమలను నిర్మూలించుకొని సీజనల్ జబ్బులు మరియు తీవ్రమైన జబ్బులకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకోగలం. ఇది ఈ రాత్రికి రాత్రే జరిగే పని కాకపోయినప్పటికీ మురుగు నీరు నిల్వలేని, దోమల జాడే లేని సమాజాన్ని ఏర్పర్చడానికి చిత్త శుద్ధితో వ్యవహరించాల్సి ఉంది.

మేకిరి దామోదర్,

9573666650.

Advertisement

Next Story

Most Viewed