- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
హిందీ సినిమాల్లో నూతన ఒరవడి.. హృషికేష్ ముఖర్జీ
అటు ఫక్తు వ్యాపార సినిమాలకు, ఇటు సమాంతరంగా ఆవిష్కృతమైన ఆర్ట్ సినిమాలకు నడుమ ఆహ్లాదకరమైన ఫీల్ గుడ్ సినిమాలతో అలరించిన దర్శకుల్లో హృషికేష్ ముఖర్జీ ముఖ్యుడు. ‘జిందగీ బడీ హోనీ చాహియే లంబీ నాహీ’( జీవితం ఉన్నతమయింది కావాలి, దీర్ఘమయింది కాదు) అంటూ జీవిత సత్యాన్ని ఆవిష్కరించిన ‘ఆనంద్’ లాంటి సినిమాలని రూపొందించిన గొప్ప వాడాయన. ఆయన మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు, పెరిగింది కూడా మధ్యతరగతి కుటుంబాలూ, స్నేహితుల మధ్యే అందుకే ఆయన రూపొందించిన సినిమాల్లో మధ్య తరగతి మండహాసాలూ, కోపాలూ, సున్నిత అనుబంధాలూ వెల్లివిరుస్తాయి. సున్నితమయిన హాస్యంతో సరళమైన చిత్రీకరణలతో ఆయన సినిమాలు ఒక తరాన్ని అలరించాయి. అత్యంత సాధారణమయిన సినిమాలుగా కనిపించే ఆయన సినిమాలలో ఆయన మానవ సంబంధాల్ని హృద్యంగానూ ఆవిష్కరించారు. 1957 నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు హిందీ సినిమాల్లో తనదైన ప్రత్యేక ముద్రను చాటిన హృదయ దర్శకుడు హృషికేష్ ముఖర్జీ, అతి తక్కువ నిర్మాణ వ్యయంతో కుటుంబ జీవనం మనుషుల మనస్తత్వాలు వారి నడుమ నెలకొనే సంబంధాల ఆధారంగా ఆయన సినిమాలు రూపొందాయి. అవి ఒక కల్ట్ సినిమాలుగా నిలిచిపోయాయి.
ఆయన ప్రతిభను గుర్తించి..
ఒకవైపు వ్యాపార సినిమాలు, మరోవైపు కళాత్మక ఆర్ట్ సిన్మాలు వస్తున్న కాలంలో హృషికేష్ ముఖర్జీ మధ్యేవాద సినిమాలుగా అర్థవంతమైన సినిమాల్ని నిర్మించి ఒక ఒరవడిని ఏర్పరిచారు. సినిమా రంగంలో అందరిచేతా ‘హృ సీదా’ గా ఆప్యాయంగా పిలువబడ్డ ఆయన ఎక్కడా సినిమాకు సంబంధించిన శిక్షణ పొందలేదు. అసలు సినిమాలకు రావాలనే కోరికా ఉన్నవాడు కాదు. తను మొదట గణితం, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడిగా తన జీవితం ఆరంభించారు. కానీ మనసులో ఎక్కడో కేమోరామన్ కావాలనే కోరిక వుండేది. అందుకే మొదట ల్యాబ్‌లో సహాయకుడిగా పనిచేయమంటే చేరిపోయాడు. అయితే పువ్వు ఎక్కడున్నా పరిమలిస్తుందన్నట్టు హృషికేష్ ముఖర్జీ సినిమా ఎడిటింగ్‌లో ఆసక్తి కనబరుస్తూ ఎడిటర్‌కి సహకరించడం మొదలుపెట్టాడు. ఆయన చూపే ఉత్సాహం, ఇచ్చే సలహాలు చూసిన సుప్రసిద్ధ దర్శకుడు నీకు చేయగలననే విశ్వాసం వుంటే తన సినిమాను ఎడిట్ చేయమన్నాడు. న్యూధిఏటర్స్ బి.ఎన్.సర్కార్ వద్ద అనుమతి తీసుకొని హృషికేష్ ముఖర్జీ తన ఎడిటర్ కెరీర్‌ను ఆరంభించాడు. అట్లా ఆయన మొదటి సినిమా ‘తథాపి’ ఆర్థికంగా విజయవంతమయింది. కానీ ఆయన చదువు కొనసాగించడానికి తిరిగి వెళ్ళాడు. కానీ బిమల్ రాయ్ బాంబే వెళ్తూ ఉండడంతో బిమల్ దా వెంట హృషికేష్ ముఖర్జీ కూడా బాంబే తరలి వెళ్ళాడు.
1953 లో ‘దోభి గా జామీన్’. 1955లో దేవదాస్ సినిమాకు బిమల్ రాయ్ సినిమాలకు సహాయ దర్శకుడిగా, ఎడిటర్‌గా పని చేసాడు. అట్లా బిమల్ రాయ్ సినిమాలకు మధుమతి దాకా పనిచేసాడు. మధుమతిలో హీరోగా పనిచేసిన దిలీప్ కుమార్ హృషికేష్ ముఖర్జీలోని ప్రతిభను గమనించి స్వంతంగా సినిమా డైరెక్ట్ చేయమని సూచించాడు. ఒప్పించాడు కూడా. మనిషి పుట్టుక, పెళ్లి, మరణంలను సబ్జెక్ట్‌గా తీసుకొని సినిమా తీయాలని దిలీప్ కుమార్ ప్రతిపాదించడంతో అది నడవదని మొదట హృషికేష్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. నువ్వు స్క్రిప్ట్ రాసి దర్శకత్వం వహిస్తే నేను హీరోగా చేస్తానని అనడంతో ‘ ముసాఫిర్’ సినిమా రూపొందింది. మూడు కథల సమాహారంగా రూపొందిన ముసాఫిర్ జాతీయ అవార్డును అందుకుంది. అలా దిలీప్ కుమార్‌తో మొదలయిన హృషికేష్ ముఖర్జీ దర్శకత్వ కెరీర్‌లో ఆనాటి స్టార్లు అనేకమందితో అలవోకగా సినిమాలు తీసాడు. రాజ్ కపూర్, దిలీప్ కుమార్, బలరాజ్ సహానీ, సునీల్ దత్, రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, అమోల్ పాలేకర్ లాంటి వాళ్ళతో ఆయన సినిమాలు రూపొందాయి. సెట్ మీద హృషికేష్ ముఖర్జీ చాలా కఠినంగా ఉండేవాడు. నటులకు సెట్స్ మీదికి వచ్చేంతవరకు సీన్ ఏమిటో చెప్పేవాడు కాదు. కథా, కథనాలు ముందే తెలిస్తే నటుల్లో స్పాంటేనిటీ పోతుందని ఆయన అభిప్రాయపడేవారు. తన ఆలోచనల్లో ఒక పాత్ర రూపొందిన తర్వాత నటులను వాటికి అనుగుణంగా మలుచుకోవడం నా పద్ధతి అనేవారాయన. అంతేకాదు తన పద్ధతితో అప్పటికి హిందీ సినిమాల్లో హీరో అంటే ఇట్లా ఉండాలన్న సూత్రాల్ని మార్చి తిరగ రాసాడు .సరికొత్త లక్షణాలతో హిందీ హీరోను రూపొందించిన దర్శకుడు హృషికేష్ ముఖర్జీ.
ఆయన తీసిన గొప్ప సినిమాలు..
30 సెప్టెంబర్ 1922 న కలకత్తాలో జన్మించిన హృషికేష్ ముఖర్జీ తన సినీ కెరీర్ మొత్తం మీద నవ్య సినిమా ఉద్యమానికి గొప్ప సానుకూలతను ప్రకటించారు. సంఘీభావంతో వున్నారు. సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్ సిన్మాలంటే అమితంగా ఇష్టపడ్డ హృషికేష్ ముఖర్జీకి పూనా ఫిలిం ఇన్స్టిట్యుట్‌తో మంచి సంబంధాలుండేవి. బసు చటర్జీ, మని కౌల్ లాంటి దర్శకులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారాయన. మధుమతి లాంటి సినిమాల్లో రిత్విక్ ఘటక్ తో కలిసి పని చేయడంతో పాటు ఘటక్ రూపొందించిన ‘ జుక్తీ తక్కో అవుర్ తప్పో’, మని కౌల్ తీసిన ‘ సతాసే ఉడతా ఆద్మీ’, సాయీద్ మీర్జా తెసిన ‘ అరవింద్ దేశాయ్ కి అజీబ్ దాస్తాన్’ లాంటి సినిమాలకు ఆర్థిక సహాయం అందించడంలో హృషికేష్ ముఖర్జీ పాత్ర గొప్పది. ముఖర్జీ జాతీయ ఫిలిం సెన్సార్ బోర్డ్ చైర్మన్ గానూ, ఫిలిం డెవెలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్‌గా కూడా పనిచేసారు. ముసాఫిర్ (1957) మొదలు (1998) దాకా ఆయన 7 జాతీయ అవార్డులు, 1999 దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. 2001 పద్మ విభూషణ్, ఎన్‌టిఆర్ జాతీయ అవార్డును అందుకున్నారు. ఆయన తీసిన అనురాధ బెర్లిన్ అంతర్జాతీయ చిత్రోత్సవానికి నామినేట్ అయింది. అంతే కాదు హం హిందుస్తానీ, తలాష్, దూప్ చావున్, రిష్తే , ఉజాలాకి ఓర, అగర ఐసా హోతే లాంటి టీవీ సీరియల్స్ కూడా రూపొందించారు. ఆయన ఆగస్ట్ 27, 2006 లో తీవ్రమయిన అనారోగ్యంతో ముంబై లీలావతి హాస్పిటల్‌లో మరణించారు. కలకత్తా నుంచి బాంబే వచ్చి తనదైన ఒక ఒరవడిని ఏర్పరచి పెద్ద వ్యాపార హీరోలతో సున్నితమయిన సాధారణమయిన పాత్రలను ధరింప చేసి హిందీ హీరో లక్షణాలను తిరగరాసిన మంచి దర్శకుడు హృషికేష్ ముఖర్జీ.
ఆయన తీసిన కొన్ని గొప్ప సినిమాల్లో ఆనంద్ ఒకటి ఇందులో ఆర్నెల్లలో చనిపోయే వ్యక్తికి జీవితాన్ని ఆనందంగా జీవించడమే ముఖ్యం అంతే కాదు తన చుట్టూ వున్న వాతావరణాన్ని సంతోషంగా ఉండడమే అసలైన జీవితం అన్న అంశాన్ని గొప్ప్పగా ఆవిష్కరించిన సినిమా ఆనంద్. డాక్టర్ పేషెంట్ మధ్య సాగే కథ ఈ సినిమా! అలాగే, సత్యాకాం ఈ సినిమా దేశ విభజన తర్వాత కాలం నాటి కథ. నిజాయితీపరుడైన సత్యప్రియ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలూ, తక్కువ కులం అమ్మాయిని పెళ్ళాడినందుకు ఎవరూ అంగీకరించని స్థితి, అతని అకాల మరణం ఇలా మొత్తం సినిమా స్వాతంత్రానంతర భారత్‌ను అద్దంలో చూపించి జాతీయ అవార్డును అందుకుంది. ‘అనారి’ ఇది చిత్రమైన పరిస్థితుల్లో ఇరుక్కుపోయిన ఒక అమాయకుడి కథ. ప్రధాన పాత్రధారి రాజ్ కపూర్‌లో కనిపించే అమాయకత్వంతో పాటు ఆయనకీ నూతన్ కూ నడుమ కుదిరిన కెమిస్ట్రీ గొప్పగా ఉంటుంది. అలాగే ‘అనురాధ’ గాయకురాలు కావాలని కలలు గానే ఒక అందమయిన అమ్మాయి సేవా తత్పరుదయినా ఒక డాక్టర్‌ను పెళ్ళాడి ఆయనతో పాటు సేవలో నిమగ్నమవుతుంది. కానీ తాను తన భవిష్యత్తును నిర్ణయించుకునే స్థితి మరోసారి వస్తుంది. ఆ సంక్షోభమే ఈ సినిమా. బలరాజ్ సహానీ, లీలా నాయుడుల గొప్ప నటనతో అనురాధ అజరమరమయింది. ‘ఖూబ్ సూరత్’ అందమయిన రేఖ అభినయం, గుల్జార్ అందమయిన సంభాషణలు మంచి హాస్యంతో కూడిన ఖూబ్సూరత్ లో సున్నిత హాస్యం గొప్పగా పండి ఆద్యంతం అలరిస్తుంది. ఇలాగే అభిమాన్, గోల్‌మాల్, చుప్కే చుప్కే, మిలి, గుడ్డీ, నమక్ హరం, అనుపమ లాంటి సినిమాలు తీసిన ఆయన చలన చిత్ర ప్రతిభకు నిదర్శనంగా నిలిచిపోతాయి.
-వారాల ఆనంద్
94405 01281
Also Read: ‘సినిమా’ పరిణామ కథ!