‘గద్దె’రింపులతోనే తెల్లార్తాంది!

by Harish |   ( Updated:2023-04-10 18:46:23.0  )
‘గద్దె’రింపులతోనే తెల్లార్తాంది!
X

దేశ్‌ముఖ్ అయినా నిజాం నెత్తిల నిప్పులు బోసి, సబ్బండకులాల ఎన్క నిట్టాడోల్గె ఉన్న అనబేరి ప్రభాకర్ రావు తొవ్వల జనం ముండ్లేరుతండ్రు. కలికూరాడు ఎసరు పొయ్యిమీద అట్కెల బుసగొట్టినట్టు.. నిప్పుల మనిషిని మళ్లా యాదిజేసుకుంటండ్రు. ఉచ్చగత్తుల రజాకార్ల రగడంత జూసి తుపాకీ ఎక్కుపెట్టి కొట్టిన తెలంగాణ మొదటి రవుతం అనబేరీ, ఆయన సాయితగాళ్ల బాటల గిప్పుడు సుతం కాళ్లకింద మట్టి కారమైంది. కండ్లల్ల బడ్డది. జెట్టగోరుమీద రోకటిపోటు బడ్డది. బొడ్రాయి కాంచి మెర్సుకుంట తెలంగాణ కండ్లనీళ్లు తెర్పిదప్పి బోతాంటె అనబేరి సింగిరెడ్డి అమరులను అల్ముకున్న మాందాపురం బూసనగట్టు, బండలగట్టు, కొమ్ముగుట్టలు నజరుబెట్టి లేపజూత్తన్నయ్. మాసంద్రంగండి నీళ్లు సలసల కాగుతూ వొగ దురుజెట్టకాలాన్ని యాదిజేత్తన్నయ్. సర్వాయి పాపన్న కోటల రాళ్లు భల్లున కూలుతున్నయ్. తెలంగాణోళ్లు ఇగన్న లేత్తరో అన్న ఉగతోటి ఇమ్మపురం బయ్యన్నగుట్ట సాదుకున్న ఎనిమిది భుజాల భైరవుడు బెదురుగుడ్లతో గద్దరిస్తూ జూత్తనే ఉంటండు.

కలం నడ్సిన జాడల్ని కాలం కొర్కేసుకుంటబోయింది. ముడిబడ్డ చేతుల పొట్ట తిప్పలు. తెలంగాణ పార్టోళ్లు తోటోళ్లనుకుంటే తుంగల పొట్టుపొట్టు తొక్కిండ్రు. ఖుల్లంఖుల్లం పాలెగాళ్లనుకుంటే అడిగే ప్రశ్నను తవ్వి బొందల పాతుతండ్రు. తెలంగాణ పల్లె జనం మెలికలు పాకిన తాకులు దిన్నరు. సిట్ట సిమాంట ఇసపు సోపతి ఇగ వద్దని బాస జేత్తండ్రు. ఎడ్డితనమో, గుడ్డి తనమో గాయి గాయైనమని మొత్తుకుంటాండ్రు. గిప్పటిదన్క మల్కల గత్కులు గనపల్లేదు. దొమ్మరిగడ్డలేసిండ్రు. ధోకాబాజి సెనార్తుల ముచ్చట్ల మునిగిండ్రు. నౌసినంక జూసిండ్రు నాసుబెట్టిన పిల్లిని. సూత్తాలికేమున్నది. బొక్కల సున్నం గుడ రాలి రంపాన బడ్డది. ఆయింత కడుపు గొట్టిండ్రు. ముక్కు మూసినా సత్తె బోని కష్షం కంపుల పండవెట్టిండ్రు. నోరు మూలవడ్డది. కంటి పాపళ్ల కంప గొట్టిండ్రు. కట్టెజర్సుక పోయిన కాళ్ల సుట్టూత కొచ్చెటి సువ్వల దడిబెట్టిండ్రు. తెలంగాణ పల్లె మునుపటిలెక్కనే దొరగడీల్ల బంధీ అయింది. గులాప్పువ్వురంగు కండువా ఏమంట జబ్బలమీదికచ్చిందో దొరెవ్వలో దెల్తలేదు. దోపిడేన్నుంచైతందో దెల్తలేదు. నల్ల గుట్టలు, రంగు గుట్టల గ్రానైట్ రాళ్ల గుట్టలు మింగుతాండ్రు. భూములు గుంజుతాండ్రు. అడవులు మేత్తాండ్రు. కంపినీలను గుప్పిట్లవట్టిండ్రు. గ్రూప్స్ నౌకర్లు కిందికులపోళ్లకు రాకుంట వాళ్ల పెద్దోళ్లకు ప్రశ్నపేపర్లు అమ్ముకుంటాండ్రు. బొగ్గుబాయి నౌకర్లనూ అమ్ముకుంటండ్రు. అక్కరకొచ్చే సదువు చెప్పక, సదివిన సదువును అక్కరకు రాకుండా జేత్తండ్రు. బడులు, కాలేజీలు పైకి వాపు గనబడుతున్నా లోపల సరుకు లేక బోలు ఎక్కువైతాంది. కేజీ టు పీజీ సదువేడ అంటే పాతోళ్లు తొవ్వజేసిన గురుకులాస్టళ్లను జూపుతండ్రు. కాపలాకుక్క, దళిత సీఎం ఒప్పందం దింపుడుగల్లమైంది. మూడెకురాల బాస పీనుగ్గాలింది. ఇంటికో నౌకరి, నిరుద్యోగ భృతి, ఇంట్ల నల్లా తిప్పితే మంచినీళ్లు అన్న ముచ్చట్లు గోదాట్లె గల్సినై. జిల్లాకొక నిమ్స్ అసొంటి దవాఖాన కడుతమన్న మాట దబాయింపు సూపుల కింద పెకులకుంటవడ్డది.

పబ్బతివడుతూ పగదీసుకుంటండు..

కడుపు గట్టుకొని ఆపతికొచ్చినోడు గొడ్డై గడ్డాంమీద బడ్డడు. సంపతిమీద బడ్డడు. మాడుకుంటొచ్చినోడు కూడబెట్టుకున్నాడు. పబ్బతి బట్నోడె పగబట్టిండు. పుగర్మత్ పులేశంగట్టి గండాలకు గడితలుపు దీసిండు. తాటిమట్ట ముదురి తాసుపామయింది. మల్ల భూముల్లవడ్డది. పల్లె వాళ్ల ముల్లె అయింది. గప్పుడు గడుల్ల దొరలు. గిప్పుడు ఏడజూసినా దొరలె. నిజాం కొంటెతనం గడ్డమీద ఎన్ని గన్నెలు బడ్డై. ఎంత గత్తరలేసింది. అవ్వల్ని జూల్లె. గువ్వల్ని జూల్లె. దోసెడు నీళ్లకేడ్సి ఒల్సెంత రవుతం ఒడ్సిన పేక్కు పేక్కు పేరు మాసింది. ఊరు మాసింది. తిప్పల్ల సొల్గి కట్టం కందకాలు దొవ్విన బత్కు బొందలవడ్డది. పచ్చి బాలింత పాలుబిండి భూమిల జల్లిన కావురం మళ్లొక తీర్గ బుసలుగొడ్తంది. పజీత పజీతైన గానీ పేదోళ్లు పాశిపోయిన పత్తులోల్గె పగలబడి నవ్వుతాండ్రు. పాయిద లేకున్నా పుటపుట దెగుతున్న తూర్పాలు మాటల మజ్య సెవులు గడలు బడ ఇర్గ ముచ్చటబెడ్తాండ్రు. కని వాళ్ల మదిల పధ్నాలుగువందల తల్కాయల మాలను మెడ గొల్సుగా ఏసుకొని రాజిర్కంజేత్తన్న దొరోళ్లతెలంగాణే తేటగ్గనవడ్తాంది.

ఖాకీల సాయితగట్టి..

సబ్బండ కులాల సావుల్నెత్తుకొని తెలంగాణ కాష్టాల గడ్డ ఊరేగుతాంది. పల్లెకు ఊపిరైన కింది కులపోళ్లను నొప్పి దెలువకుంట బొండిగెవిస్కుతాండ్రు. ఈ నెత్తుటి తడిని ఎన్నటికీ అంటుకోని ఈగలు ఎన్నికలచ్చేటాల్లకు ఇట్టంగా ముసుర్కుంటన్నయ్. అంతరాల రూపాంతరాలు అంతట కూసమిడ్తాన్నై. నిద్దర్ల గొంతులు పేదోళ్లతోని పేమను పాడ్తన్నై. తడారని గొంతుల్ల ఆకుపచ్చ కతలు జెప్పవట్టిరి. ఎడారోల్గె దెర్సుకున్న కండ్లకు కలల గంతలు కడుతండ్రు. ఊడ్సి పెట్టిన ఆత్రం ప్రేమలు బొక్కలోల్గె మెడలేసుకొని తీరువాటంగా వొసపిట్ట మాటలు గుమ్మీలకొద్దీ వొల్కబోత్తాండ్రు. నొసలు బొచ్చె గొట్టుకుంటండ్రు. కడ్పుల తల బెట్టి కండ్లనీళ్లుగక్కుతండ్రనుకుంటే కత్తులు గుచ్చుతాండ్రు. వీళ్లొక అత్కని పొత్కని అబద్దం దప్ప, గీ మట్టితోటి సత్తెం బల్కలేరు. కట్టపు కడుపుకింత దొర్కాలని సబ్బండకులాల సాయితగట్టి బత్కు సంఘంబెట్టి దొరతనాన్ని పొతంబెట్టి దొర్లిన త్యాగాల బోణి అనబేరి ప్రభాకర్ రావు మొదలుజేసిన ఆయింత భూంపోరు బూడ్డి గమ్మంగనె దెంకపోయిన దొర, ఇప్పడు దేవుని ఔతారమెత్తిండు. ఖద్దరు టోపిబెట్టి ఖాకీల సాయిత గట్టుకున్నడు. తుపాకులు భూములు దున్నిపెట్టనియ్యవని తెల్సుకున్న దొరలు అప్పుడు గడీలను పడావు బెట్టుకొని, ఇప్పుడు రాజ్యాన్ని చేతిలబట్టుకున్నరు. టోటల్ మొత్తం జుములాగ తెలంగాణనంతా మింగుతూ మెల్లమెల్లగా ప్రజల బతుకులను పడావు బెడ్తాండ్రు. మెదళ్లను పడావుబెట్టాల్నని ఎందుకక్కరకురాని పథకాలుబెట్టి తెగ ఉబలాట బడ్తాండ్రు. అక్కెరకొచ్చే సదువు సెప్పక పుచ్చుకున్న పట్టాలు పడావు బడ్తాండె. నిర్బంధాన్ని బెంచి పోరాటాన్ని పడావు బెడ్తాండ్రు. ప్రజల బాధలు జెప్పాల్సిన పత్రికలను కరపత్రాలనుజేసుకున్నరు. కని నిజాలను రాసే కలాలను పడావు బెట్టుడు వాళ్లు నమ్మిన, వాళ్లను బలిపిస్తున్న నాజీల విధానాల తరం గాదు. తిర్గబడ్డ పిడికిళ్లను పడావు బెట్టిచ్చుడు వాళ్ల నెత్తిమీద ఉన్న పడావు బడ్డ విధానాలవల్లా అయ్యే పనిగాదు. వాళ్లు పడావు బెట్టజూస్తున్న కింది సమాజాన్ని బాగుజేసుకునేందుకు జనం ఎన్నటికైనా ఒక్కటైతరు.

ఇగనన్న లేత్తరా..

ఏందో.. ఇయ్యాల పత్యాకం తెలంగాణ పల్లె మీదనే ఆలి కాకులర్తన్నై. ఏందని తొవ్వజూత్తే.. అగ్గో. కరువుల కప్పం గట్టకుంటే కడుపు జూడకుంట కత్తికి కుత్తిక రాసిచ్చిన కాకతీయులపై రఢం జేసిన వీరుల జూడ. అక్క సమ్మక్క, తల్లి సారక్కల సాచ్చిగా లొల్లి మల్లయితాంది. రజాకార్ల రగడపై అచ్చరాల రాళ్లేసి కొట్టిన షోయబుల్లాఖాన్ రవుతం పాట మళ్లా ఇనిపిత్తాంది. కొట్లాటల కొంగు సాకలి ఐలమ్మ తొవ్వల పల్లె ఆడోళ్లు కదులుతున్నరు. దొర తనం పొతం బెట్టిన దొడ్డి కొమురయ్య బాట సాఫయితంది. ఇగ ఓరుగంటి కోట కోయిల తెలంగానం మల్లందుకున్నది. కొత్త పాఠాలు జెప్పిన కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీలు మణి బోయిన మట్టికి మల్ల ఆయుషు బోత్తన్నయ్. ఊళ్లను ఆంబుక్కబెడితే నిప్పురాజేసి, మెడల మొద్దై, నిజాంను కుదేసి, గుట్టల్ని బత్కుగొట్లాడే జెండల్ని జేసిన అన్న అనబేరి నెత్తురు చిందిన నేలల మల్ల లడాయి షురువైతంది. పట పట పుట పుట పండ్లు గొర్కుతాంది. కడ్పుల రాయిలెక్క బడ్డ దొరోళ్ల దోపకాన్ని పోలిమేరదాట పొగబెట్టాలంటంది. దేశ్ ముఖ్ అయినా నిజాంనెత్తిల నిప్పులుబోసి, సబ్బండకులాల ఎన్క నిట్టాడోల్గె ఉన్న అనబేరి ప్రభాకర్ రావు తొవ్వల జనం ముండ్లేరుతండ్రు. కలికూరాడు ఎసరు పొయ్యిమీద అట్కెల బుసగొట్టినట్టు.. నిప్పుల మనిషిని మళ్లా యాదిజేసుకుంటండ్రు. ఉచ్చగత్తుల రజాకార్ల రగడంత జూసి తుపాకీ ఎక్కుపెట్టి కొట్టిన తెలంగాణ మొదటి రవుతం అనబేరీ, ఆయన సాయితగాళ్ల బాటల గిప్పుడు సుతం కాళ్లకింద మట్టి కారమైంది. కండ్లల్ల బడ్డది. జెట్టగోరుమీద రోకటిపోటు బడ్డది. బొడ్రాయి కాంచి మెర్సుకుంట తెలంగాణ కండ్లనీళ్లు తెర్పిదప్పి బోతాంటె అనబేరి సింగిరెడ్డి అమరులను అల్ముకున్న మాందాపురం బూసనగట్టు, బండలగట్టు, కొమ్ముగుట్టలు నజరుబెట్టి లేపజూత్తన్నయ్. మాసంద్రంగండినీళ్లు సలసల కాగుతూ వొగ దురుజెట్టకాలాన్ని యాదిజేత్తన్నయ్. సర్వాయి పాపన్న కోటల రాళ్లు భల్లున పల్గుతున్నయ్. తెలంగాణోళ్లు ఇగన్న లేత్తరో అన్న ఉగతోటి ఇమ్మపురం బయ్యన్నగుట్ట సాదుకున్న ఎనిమిది భుజాల భైరవుడు గుడ్లురుముతూ గద్దరిస్తూ జూత్తనే ఉంటండు.

- మేకల ఎల్లయ్య,

9912178129.




Advertisement

Next Story

Most Viewed