చట్టాలకు కొందరు చుట్టాలు!

by D.Markandeya |   ( Updated:2022-09-27 10:05:23.0  )
చట్టాలకు కొందరు చుట్టాలు!
X

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ బాలికపై జరిగిన సామూహిక లైంగికదాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులందరూ పలుకుబడి కలిగినవర్గాలకు చెందినవారు కావడం, ఘటనపై స్పందించి, చర్యలు చేపట్టడంలో పోలీసులు అనుమానాస్పదంగా వ్యవహరించడం, ఉన్నతాధికారులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం, ఘటనకు ఓ రాజకీయపార్టీ మతం రంగు పులమడానికి ప్రయత్నించడం ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. గత నెల 28న ఆమ్నీషియా పబ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు వెళ్లిన బాధిత బాలికను ఐదుగురు నిందితులు ట్రాప్ చేసి ఇన్నోవా, బెంజ్ కార్లలో ఓ బేకరీకి తీసుకెళ్లారు. ఆ తర్వాత పెద్దమ్మ గుడి వెనకాల కారులోనే ఆ ఐదుగురు ఒకరి తర్వాత ఒకరు లైంగికదాడి చేశారు. ఘటనతో షాక్‌కు గురైన ఆ బాలిక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.

ఆమె మానసిక స్థితిలో మార్పును గమనించిన తండ్రి చివరకు విషయం తెలుసుకుని 31న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదే రోజు పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. మరునాడు సామూహిక లైంగికదాడి సెక్షన్లను చేర్చారు. కాగా, జూన్ రెండున కేసు వివరాలు బయటకు వచ్చాయి. నిందితులలో ఓ మంత్రి మనవడు, మరో ఎమ్మెల్యే కుమారుడు ఉన్నారని, మిగతావాళ్లు కూడా ప్రముఖుల పుత్రులేనని వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించకుండా ఏదో దాచడానికి యత్నిస్తున్న తీరులో వ్యవహరించారు. ప్రజలు, పార్టీల నుంచి ఒత్తిడి పెరగడంతో చివరకు పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేసి ఐదుగురు నిందితులనూ అరెస్టు చేశారు. వక్ఫ్ బోర్డు చైర్మన్, ఓ ఎమ్మెల్యే, మరో కార్పొరేటర్ పుత్రరత్నాలు ఈ నేరంలో ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.

నేరాలు-ఘోరాలు ఎన్నెన్నో

రాజధానిలో, రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. అనునిత్యం పసికందుల నుంచి మొదలుకొని వృద్ధ మహిళల వరకు ఎందరో అభాగ్యులపై అత్యాచారాలు, కొన్ని సందర్భాలలో హత్యలు జరుగుతున్నాయి. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం ఒక్క 2020లోనే తెలంగాణలో మహిళలపై జరిగిన మొత్తం నేరాలు 17,791 కాగా, వీటిలో 765 రేప్‌లు, 35 రేప్ యత్నాలు, 14 రేప్ అండ్ మర్డర్లు ఉన్నాయి. మహిళలపై అసభ్య ప్రవర్తన, వారి గౌరవానికి భంగం కలిగించిన ఘటనలు 5,629 జరిగాయి.

ఇక ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా వేదికగా వేధింపులు కూడా అనేకం నమోదయ్యాయి. 2020లో ఎక్కువకాలం కరోనా మూలంగా లాక్‌డౌన్ ఉంది కనుక నేరాలు పాక్షికంగా తగ్గాయని నివేదికలో పేర్కొనడం గమనార్హం. అంతకుముందు రెండు మూడేళ్ల రిపోర్టులు పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. 2021లో సైతం మహిళలపై నేరాలు బాగా పెరిగాయని మీడియాలో వచ్చిన వార్తలను గమనిస్తే అర్థమవుతుంది. ఈ గణాంకాలన్నీ పోలీసుస్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా తీసుకున్నవి కనుక పోలీసుల దృష్టికి రాకుండా మరెన్నో నేరాలు-ఘోరాలు జరిగివుంటాయనడంలో సందేహం లేదు.

పోలీసుల తీరు ప్రశ్నార్థకం

మహిళలపై నేరాలకు సంబంధించి నమోదైన కేసుల విషయంలో పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తున్నది. ముఖ్యంగా డబ్బు, హోదా, పలుకుబడి కలిగినవర్గాలు నిందితులుగా ఉన్న సందర్భాలలో పోలీసులపై ఒత్తిడులు రావడంతో కేసును నీరుగార్చడానికి ప్రయత్నించడం, శిక్ష నుంచి తప్పించడం చాలాసార్లు జరుగుతున్నది. నిందితులు ఏ పలుకుబడీ లేని పేదవాళ్లైనప్పుడు మాత్రమే దర్యాప్తు సక్రమంగా కొనసాగుతున్నది. వెటర్నరీ డాక్టర్ దిశను అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి సత్వర న్యాయం అందించినప్పుడు మొదట ప్రజలు చాలా సంతోషపడ్డారు.సహజన్యాయం జరిగిందని భావించారు. ఆ తర్వాత చాలా రకాల చర్చలు నడిచాయి.

నిందితులందరూ ఏ దిక్కూ లేనివాళ్లని, కటిక దరిద్రులని తెల్సిన తర్వాత ఆలోచనలో పడ్డారు. ఒకవేళ వాళ్లలో ఏ మంత్రి మనుమడో, ఎమ్మెల్యే తమ్ముడో, కోటీశ్వరుడి కొడుకో ఉండి వుంటే ఎన్‌కౌంటర్ జరిగి వుండేదా? అని చాలా మంది ప్రశ్నించారు. బెయిల్ తీసుకుని బయట బలాదూర్ తిరిగేవారని, ఎక్కువలో ఎక్కువ ఏళ్ల తరబడి కోర్టులో విచారణ జరిగి, చివరకు రెండేళ్లో మూడేళ్లో జైలుశిక్ష పడితే ఎక్కువని చాలా మంది బల్లగుద్ది వాదించారు. పలుకుబడి కలిగినవర్గాలను తరచూ కేసుల నుంచి బయట పడేయడానికి చేసిన పాపాల నుంచి విముక్తులు కావడానికే పోలీసులు అప్పుడప్పుడు 'దిశ' లాంటి ఘటనలకు పూనుకుంటారని, ప్రజలలో తమపై విశ్వాసం పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తారని సర్వత్రా వినిపించింది.

పలుకుబడి ఉంటే చాలు

మన దేశంలో చాలాసార్లు చట్టాలు పలుకుబడి కలిగినవర్గాలకు చుట్టాలుగానే ఉంటాయి. ఢిల్లీ కానివ్వండి, యూపీ కానివ్వండి, బిహార్ కానివ్వండి, మన తెలంగాణ కానివ్వండి. ఎక్కడకు వెళ్లినా మనకు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఉదాహరణకు అధికార పార్టీకి చెందిన ఓ గ్రామ సర్పంచ్ కుమారుడు ఓ నిరుపేద బాలికపై అత్యాచారమో, అత్యాచారయత్నమో లేదంటే అసభ్యంగా ప్రవర్తించడమో చేస్తాడు. ఈ మేరకు ఠాణాలో ఫిర్యాదు అందుతుంది. లెక్క ప్రకారం స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్ఓ) వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. కానీ, అలా జరగదు.

ఆ సర్పంచుకు ఫోన్ వెళుతుంది. ఏం చేయాలో చర్చిస్తారు. అవసరమైతే స్థానిక ఎమ్మెల్యేనో, మంత్రో జోక్యం చేసుకుంటారు. అప్పుడే తదుపరి చర్యను చేపడతారు. నిందితులను తప్పించడానికి లేదంటే కనీసం కేసు తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నిస్తారు. సర్పంచ్ స్థానంలో కార్పొరేటరో, ఎమ్మెల్యేనో, మంత్రో లేదంటే ఐఏఎస్సో, ఐపీఎస్సో ఉన్నారనుకోండి. పని ఇంకా సులువవుతుంది. డబ్బులున్నవారి విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. వారికి తప్పనిసరిగా పదవులు, పలుకుబడి ఉన్నవాళ్లతో పరిచయం ఉంటుంది. సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఒకవేళ లేకున్నా ఘటన జరిగిన వెంటనే పైసలు వెదజల్లి అయినా పని చేయించుకుంటారు. ఆ ఎస్‌హెచ్ఓనే నేరుగా లొంగదీసుకునే అవకాశం ఉంటుంది.

భయపడి ఊడిగం చేస్తున్నారు

ఫిర్యాదు స్వీకరించడం, ఎఫ్ఐఆర్‌ నమోదు చేయడం, సంబంధిత సెక్షన్లను చేర్చడం, సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డు చేయడం, నిందితులను అరెస్టు చేయడం, విచారించడం, చార్జిషీట్ ఫైల్ చేయడం ఇలా ఒక కేసును ముందుకు నడిపించడంలో ఎస్‌హెచ్ఓ పాత్ర చాలా కీలకం. ఎస్‌హెచ్ఓ తలచుకుంటే ఒక కేసును బలోపేతం చేయవచ్చు. లేదంటే నీరుగార్చవచ్చు. శిక్ష పడేలా చేయవచ్చు. లేదంటే శిక్ష నుంచి తప్పించవచ్చు. అలాంటి ఎస్‌హెచ్ఓ సాధారణంగా నిష్పక్షపాతంగా, నిజాయితీగా, న్యాయబద్దంగా ఉండాలి. అప్పుడే సాధారణ పౌరులకు న్యాయం జరుగుతుంది. కానీ వృత్తిపరమైన వత్తిడులు వీరి విధి నిర్వహణపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి.

ముఖ్యంగా రాజకీయపార్టీల, నాయకుల, ప్రజాప్రతినిధుల జోక్యం ఇటీవలికాలంలో బాగా ఎక్కువైంది. పై అధికారుల నుంచి, బాధ్యతాయుతమైన పదవులలో ఉన్నవాళ్ల నుంచి వచ్చే ఆదేశాలను ధిక్కరించే సాహసం ఏ ఎస్‌హెచ్ఓ చేయడం లేదు. అలా ధిక్కరించిన అధికారులకు వేధింపులూ తప్పడం లేదు. పోస్టింగులలో, బదిలీలలో, ప్రమోషన్‌లలో, పతకాలకు సిఫార్సులు చేయడంలో అన్యాయం జరుగుతుందన్న భయంతో కిందిస్థాయి అధికారులు చాలా సందర్భాలలో లొంగిపోతున్నారు. పలుకుబడి కలిగిన వర్గాలకు ఊడిగం చేస్తున్నారు. సర్కారును ఎదిరిస్తే చివరకు డీజీపీ సహా ఐపీఎస్‌ల పరిస్థితి కూడా ఎలా ఉంటుందో మనం చూస్తూనేవున్నాం.

వారి జోక్యం ఉండరాదు

పౌరులందరికీ సమన్యాయం జరగాలంటే, చట్టాలు కొన్ని వర్గాలకు చుట్టాలుగా మారకూడదంటే న్యాయ వ్యవస్థలాగే పోలీసు వ్యవస్థ కూడా స్వతంత్రంగా పనిచేయగలగాలి. డీజీపీ నుంచి ఎస్‌హెచ్ఓ స్థాయి అధికారి వరకూ ఎంపికలో, పోస్టింగులలో, ప్రమోషన్‌లలో, బదిలీలలో అధికారపార్టీ జోక్యం చేసుకునే పరిస్థితి ఉండకూడదు. నిందితులు ఎంతటి పలుకుబడి కలిగినవర్గాలకు చెందినవారైనా సరే చట్ట ప్రకారం శిక్షలు పడాలి. ఇందుకోసం రాష్ట్రస్థాయిలో, జిల్లాస్థాయిలో స్వతంత్ర యంత్రాగాన్ని ఏర్పరిచే విధంగా కొత్త చట్టాలను ప్రభుత్వాలు రూపొందించాలి. ప్రజలు చైతన్యవంతులై ఉద్యమిస్తే కానీ ఇది సాధ్యం కాదు.

-డి. మార్కండేయ

[email protected]

Advertisement

Next Story