ఆన్‌లైన్ పేపర్లను గుర్తించండి

by D.Markandeya |   ( Updated:2022-09-27 10:06:32.0  )
ఆన్‌లైన్ పేపర్లను గుర్తించండి
X

దేళ్ల కిందట మీరు బస్సులో ప్రయాణించినపుడు సీటుకో పేపర్ కనిపించేది. ఒకరు ఈనాడు, ఒకరు ఆంధ్రజ్యోతి. మరొకరు సాక్షి. ఇంకొకరు నమస్తే తెలంగాణ చదువుతూ కనిపించేవాళ్లు. ఒక పేపర్ చదవడం పూర్తయినవాళ్లు పక్క సీట్లో వారిని ఇంకో పేపర్ అడుక్కుని చదవడం కూడా చూసే వుంటారు. బస్సేమిటి, బస్టాండ్లలో, రైళ్లలో, రైల్వే స్టేషన్లలో, విమానాలలో, విమానాశ్రయాలలో, రోడ్ సైడ్ హోటళ్లలో, బార్బర్‌ షాపుల్లో, ఆఫీసుల్లో ఇలా ఎక్కడ చూసినా పేపర్లు చదివే జనం తటస్థపడేవారు.

వీధి వీధినా ఉండే పాన్‌షాపుల్లో పేపర్ల వరస వేలాడుతూ ఉండేది. వేకువజామునే కూడళ్లలో పేపర్ల బండిల్స్ విప్పుతూ సర్క్యులేషన్ సిబ్బంది, సైకిళ్ల గంట మోగిస్తూ ఇంటింటికీ తిరిగే పేపర్‌బాయ్‌లు, ఇలా పొద్దెక్కే వరకూ హడావుడి ఉండేది. కొందరైతే తమ ఇళ్లకు రెండు మూడు పేపర్లను కూడా వేయించుకునేవాళ్లు. ఆ జమానాలో చాలా మందికి పేపర్ చదువుతూ, టీ తాగితేనే కడుపు ఖాళీ అయ్యేదంటే అతిశయోక్తి కాదు. ఇంటి పెద్ద న్యూస్ పేజీలు చదివితే, పిల్లలు స్పోర్ట్స్, సినిమా పేజీలు, మహిళలు ఫీచర్స్ చదివేవాళ్లు. సన్‌డే బుక్‌లెట్లను వారమంతా తిరగేసేవాళ్లు.

కాలం మారింది

మరి ఇప్పుడో? బస్సులో, బస్టాండులో, రైలులో, రైల్వేస్టేషన్‌లో, షాపులో, హోటల్‌లో, ఆఫీసులో అదే జనం చేతుల్లో స్మార్ట్ ఫోన్లు కనిపిస్తాయి. అందరూ తలలు వంచి తమ మొబైల్ స్క్రీన్ పై ఏదో ఒకటి చూస్తుంటారు. కొందరు ఈ-పేపర్లు, కొందరు వెబ్‌సైట్లు, ఇంకొందరు సోషల్ మీడియా, మరికొందరు యూట్యూబ్ వీడియోలు చూస్తుంటారు. ఎక్కువమంది వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా పోస్టులు, ఫోటోలు, రీల్స్ వీక్షిస్తుంటారు. లింకులు క్లిక్ చేసి కంటెంట్ చదవడమో, చూడడమో చేస్తుంటారు. ఎక్కడా ఒక్కటంటే ఒక్క పేపర్ కనిపించదు.

పాతరోజుల్లాగా పేపర్ బాయ్‌లూ లేరు. పేపర్ల కట్టలూ లేవు. పేపర్లు అమ్మే దుకాణాలూ లేవు. ఏజెంట్లూ తగ్గారు. చిన్న, మధ్యతరహా దినపత్రికల్లో కొన్ని మొత్తంగానే ప్రింటింగ్‌ ఎత్తివేసి కేవలం ఆన్‌లైన్ ఎడిషన్లనే కొనసాగిస్తుండగా, మరికొన్ని నామమాత్రపు ప్రతులను ప్రింట్ చేస్తున్నాయి. ఇక, ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి వంటి పెద్ద పత్రికలు సైతం తమ సర్క్యులేషన్ ఇండెంట్‌ను భారీగా తగ్గించాయి. అంతర్జాతీయంగా కూడా పలు ప్రముఖ పత్రికలు ప్రింట్‌ను ఎత్తేసాయి. ఖర్చులు పెరగడం, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం, కొవిడ్ ప్రభావం.. పైకి కనిపించే కారణాలు కావచ్చు కాని, అసలు కారణం మాత్రం ఫిజికల్ పేపర్‌ను కొని చదివే పాఠకులు రోజురోజుకు తగ్గుతుండడమేనని అందరికీ తెలుసు.

మాయా లెక్కలు కనుమరుగు

'ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్' (ఏబీసీ) అని మన దేశంలో ఒక సంస్థ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలన్నీ ఈ సంస్థలో సభ్యత్వం కలిగివున్నాయి. వివిధ భాషల్లో వెలువడుతున్న దిన, వార, పక్ష, మాస పత్రికల సర్క్యులేషన్‌ను ఈ సంస్థ అధికారికంగా ఆడిట్ చేసి లెక్కిస్తుంది. చివరకు, అర్ధవార్షిక నివేదికలను విడుదల చేస్తుంది. చాలా ఏళ్లుగా తెలుగునాట ఈనాడు, సాక్షి మొదటి రెండు స్థానాలను ఆక్రమిస్తే ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ.. ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ప్రభుత్వ సమాచార శాఖ, ప్రైవేటు యాడ్ ఏజెన్సీలు ఈ ఫిగర్స్ ఆధారంగానే పత్రికలకు ప్రకటనలు విడుదల చేస్తుంటాయి.

అయితే, కొవిడ్ మహమ్మారి కారణంగా 2020 జనవరి నుంచి ఏబీసీ తన కార్యకలాపాలను సస్పెండ్ చేసింది. అంతకుముందు ఇచ్చిన సర్టిఫికెట్లే 2022 ఆగస్టు 31 వరకూ చెల్లుతాయని ప్రకటించింది. 2022 జనవరి నుంచి కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలని సంస్థ నిర్ణయించింది. అయితే, ఫిజికల్ సర్క్యులేషన్ భారీగా పడిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత మంది ప్రచురణకర్తలు సభ్యత్వం పునరుద్ధరించుకుంటారో అనుమానంగానే ఉంది. వచ్చే ఆగస్టు 31 తర్వాత ఈ లెక్కల బాగోతం బయటకు వస్తుంది.

డిజిటల్ మీడియా విస్తరణ

ఫిజికల్ పేపర్ చదవడం ఎంత వేగంగా తగ్గుతున్నదో, అంతే వేగంగా డిజిటల్ మీడియా విస్తరిస్తున్నది. 2020 మార్చ్‌లో లాక్‌డౌన్ పెట్టిన తర్వాత దాదాపు దేశమంతటా ఇళ్లల్లో పేపర్ వేయడం ఆగిపోయింది. లాక్‌డౌన్ ఎత్తివేసి, ఆ తర్వాత మామూలు పరిస్థితులు నెలకొన్న తర్వాత కూడా జనం తిరిగి ఇళ్లల్లో పేపర్ వేయించుకోడానికి, బజారులో కొని చదవడానికి ఇష్టపడలేదు. కొవిడ్ వస్తుందనే భయం ఒకవైపు ఉన్నా, ఇంటిల్లిపాదికీ స్మార్ట్ ఫోన్, నెట్ అందుబాటులో ఉండడం, అందులోనే పేపర్ లేదా వెబ్‌సైట్‌లో న్యూస్ చదవడం అలవాటయింది.

జేబులోనే వార్తా ప్రపంచం అందుబాటులో ఉండగా, మళ్లీ డబ్బులు పెట్టి పేపర్ కొనడం ఎందుకు దండగ అని అంతా భావించారు. పైగా, ప్రస్తుత హైటెక్ యుగంలో ఎవరికీ కూర్చుని పేపర్ చదివే, టీవీ చూసే ఓపికలు లేవు. జర్నీలో ఉన్నవాళ్లకు, ఆఫీసుల్లో పనిచేస్తున్నవాళ్లకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవాళ్లకు.. ఇలా ఎవరికైనా, ఎక్కడైనా మొబైలో, టాబో, లాప్‌టాపో, డెస్క్ టాపో అందుబాటులో ఉంటున్నాయి. అందుకే, పత్రికలకు చందా కట్టడం, స్టాళ్లకు వెళ్లి కొనడం, టీవీలో న్యూస్ ఛానెళ్లు చూడడం బాగా తగ్గిపోయింది.

'దిశ'కు అనూహ్య స్పందన

ఈ రెండేళ్లలో ఎన్నెన్నో ఆన్‌లైన్ పేపర్లు, మరెన్నో న్యూస్ వెబ్‌సైట్లు కొత్తగా వచ్చాయి. వీటిలో అనేకం లోకల్‌కే పరిమితమై తక్కువ వ్యూయర్షిప్ కలిగినా, దిశ, తొలివెలుగు, ఆదాబ్ హైదరాబాద్, విశాఖ టుడే వంటివి తెలుగు ప్రజల్లో విస్తృత ప్రజాదరణ పొందాయి. లక్షల్లోనే రోజువారీ వీక్షణలను పొందుతున్నాయి. 'దిశ'నే ఉదాహరణగా తీసుకుంటే ప్రారంభించిన రెండేళ్లలోనే 2 కోట్ల 70 లక్షలకు పైగా యూనిక్ యూజర్ బేస్‌ (ఇప్పటివరకు 'దిశ' మీడియాను దర్శించిన డివైస్‌ల సంఖ్య) సాధించింది. ఈ-పేపర్‌కు, వెబ్‌సైట్‌కు కలిపి అనునిత్యం పన్నెండు లక్షలకు మించిన వీక్షణలు వస్తున్నాయి.

నిజానికి, ప్రింట్ సర్క్యులేషన్ ఉన్న ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు వంటి అన్ని పత్రికలను కూడా ఫిజికల్ కాపీల కంటే ఆన్‌లైన్ ఎడిషన్లనే ఎక్కువ మంది పాఠకులు చదువుతున్నారన్నది ఎవరూ కాదనలేని అక్షరసత్యం. ఒక అంచనా ప్రకారం.. మీడియాలో వార్తలు, విశ్లేషణలు చదివే పాఠకుల్లో 65 శాతం మందికి పైగా డిజిటల్(న్యూస్ వెబ్‌సైట్లు), సోషల్ మీడియా (వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వగైరా)ల ద్వారా, 15-20 శాతం మంది టీవీ చానెళ్లు, యూట్యూబ్ ద్వారా, 10-15 శాతం మంది ఆన్‌లైన్ పేపర్ల ద్వారా వార్తలు తెలుసుకుంటున్నారు. వంద మందిలో కేవలం ఐదారుగురు మాత్రమే ఫిజికల్ పేపర్లను చదువుతున్నారు. ఈ సంఖ్య కూడా రోజురోజుకూ క్షీణిస్తున్నది.

స్పందించిన కేంద్రం

ఈ వాస్తవాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2021లో డిజిటల్ మీడియాను గుర్తించేందుకు అవసరమైన చర్యలను చేపట్టింది. కేవలం డిజిటల్ ప్లాట్‌ఫాంపై న్యూస్ (ఈ-పేపర్, సైట్) పబ్లిష్ చేస్తున్న వెబ్‌సైట్లతో పాటు ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్, ప్రింట్ సర్క్యులేషన్ ఉండీ డిజిటల్ ప్లాట్‌ఫాంపై వెలువడుతున్న సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. మన పొరుగు రాష్ట్రం ఏపీ సైతం డిజిటల్ మీడియా కార్పొరేషన్‌ (ఏపీడీసీఎల్)ను ఏర్పరచి వెబ్‌సైట్లకు గుర్తింపునిచ్చే ప్రక్రియను ప్రారంభించింది. తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ మొదలుపెట్టలేదు. ఇప్పటికీ ఫిజికల్ సర్క్యులేషన్ ఉన్న పేపర్లకే, అదీ పాలకులకు భజన చేసే కొన్ని పత్రికలకే ప్రాధాన్యం ఇచ్చి ప్రకటనలు జారీ చేస్తున్నారు. జర్నలిస్టులకు ఇచ్చే అక్రెడిటేషన్‌లో కూడా ఇదే ప్రాతిపదికను అనుసరిస్తున్నారు. అత్యంత ప్రజాదరణ ఉన్న డిజిటల్ మీడియాను పట్టించుకోవడం లేదు.

అన్నింటా ఆన్‌లైన్

బ్యాంకు లావాదేవీలు ఆన్‌లైన్‌లో, విద్యార్థుల అడ్మిషన్లు-పరీక్షలు ఆన్‌లైన్‌లో, ఉద్యోగాలకు దరఖాస్తులు-ఇంటర్వ్యూలు ఆన్‌లైన్‌లో, సర్టిఫికేట్ల జారీ ఆన్‌లైన్‌లో, ప్రభుత్వ పథకాల అమలు ఆన్‌లైన్‌లో, చివరకు యేటా ప్రవేశపెట్టే బడ్జెట్లు కూడా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఈ కార్యకలాపాలన్నింటినీ ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి. ఆమోదిస్తున్నాయి. అయినప్పుడు ఆన్‌లైన్‌లో వెలువడే పేపర్లను, న్యూస్ వెబ్‌సైట్లను గుర్తించడంలో, ఆమోదించడంలో ఏ నియమాలు అడ్డు వస్తున్నాయో అర్థం కాదు.

ప్రభుత్వాలు కళ్లు తెరవాలి

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవాలి. డిజిటల్ మీడియాను గుర్తించడానికి వీలుగా తూతూ మంత్రంగా కాకుండా ఆర్ఎన్ఐ, ఏబీసీ లాంటి సాధికార సంస్థలను ఏర్పాటుచేయాలి. దేశంలోని పేపర్ల, వెబ్‌సైట్ల ఆన్‌లైన్ వ్యూయర్షిప్ ఎంతున్నదో వివరాలు సేకరించాలి. ఆ డాటా ఆధారంగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలి. డిజిటల్ మీడియా సంస్థల్లో జవాబుదారీతనం పెంచడానికి చర్యలు చేపట్టాలి. మన తెలంగాణ ప్రభుత్వం సైతం డిజిటల్ మీడియాను గుర్తించే బాధ్యతను తక్షణం యుద్ధప్రాతిపదికన ఐఅండ్‌పీఆర్ విభాగానికి అప్పగించాలి.

అన్ని పేపర్ల ఫిజికల్ సర్క్యులేషన్‌తో పాటుగా ఆన్‌లైన్ సర్క్యులేషన్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆ ప్రాతిపదికన కేటగిరీలుగా విభజించి ప్రభుత్వ ప్రకటనలను జారీ చేయాలి. ప్రస్తుతం కొనసాగుతున్న జర్నలిస్టుల అక్రెడిటేషన్ ప్రక్రియను మరో మూడు నెలలు వాయిదా వేసి కొత్త మార్గదర్శకాలు రూపొందిన అనంతరమే చేపట్టాలి. ఈ మేరకు తెలంగాణ మీడియా అకాడమీ చొరవ తీసుకోవాలి.

-డి మార్కండేయ

[email protected]

Advertisement

Next Story