- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మరోకోణం: వారి త్యాగాలను గౌరవిద్దాం!
'విప్లవ మేధావి, మావోయిస్టు నేత ఎల్ఎస్ఎన్ మూర్తి క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ గత బుధవారం నిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. యాభై సంవత్సరాలకు పైగా పూర్తికాలం కార్యకర్తగా పనిచేసిన ఆయనకు సొంత కుటుంబం కానీ, ఆస్తి కానీ లేవు. కొంతమంది దాతల సాయంతో నగర శివారులోని సీఆర్ ఫౌండేషన్‌లో కొన్నేళ్లుగా ఆశ్రయం పొందారు.'
'సుదీర్ఘకాలం ఉద్యమంలో పనిచేసిన యాభై ఐదేళ్ల ఆలూరి ఉష క్యాన్సర్‌తో బాధపడుతూ ఇటీవలే తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. ముప్పై ఏళ్ల తర్వాత జనజీవన స్రవంతిలోకి వచ్చిన ఆమెకు ఇప్పుడు ఎక్కడ, ఎలా బతకాలో తెలియదు. ట్రీట్‌మెంటుకు డబ్బులు కావాలి. ఉండడానికి నివాసం కావాలి. చూసుకోవడానికి కేర్‌టేకర్ కావాలి.'
'మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ 2021 ప్రారంభంలో కరోనా వైరస్ సోకి సమయానికి చికిత్స లభించక నడివయస్సులోనే ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది విప్లవ కార్యకర్తలు, నేతలు మహమ్మారి సోకి మరణించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.'
'అనారోగ్య సమస్యల మూలంగా మావోయిస్టు మాజీ దళపతి గణపతి పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి వైదొలిగారు. తొలితరం అగ్రనేతలు మరెందరో కూడా రకరకాల వ్యాధులతో బాధపడుతూ చికిత్స కోసం ఎదురుచూస్తున్నారని సమాచారం.'
ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. 1960, 70లలో బద్దలైన నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాలతో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది మేధావులు, విద్యాధికులు, ఉద్యోగులు, యువకులు, రైతులు ప్రేరేపితులై పూర్తికాలం కార్యకర్తలుగా నక్సలైటు ఉద్యమంలోకి వెళ్లారు. నమ్మిన సిద్ధాంతం కోసం యేళ్ల తరబడి పనిచేశారు. ఈ క్రమంలో పలువురు ప్రాణాలను కోల్పోగా, మిగతావాళ్లంతా ఇప్పుడు తమ 60లు, 70లు దాటారు. వయస్సు తెచ్చిన సమస్యలతో పాటు దీర్ఘకాలం అడవులలో కఠిన పరిస్థితులలో జీవించడం మూలంగా తీవ్ర అనారోగ్యాలను ఎదుర్కొంటున్నారు. వాళ్లను నడిపిస్తున్న పార్టీకున్న పరిమితుల రీత్యా సరైన చికిత్స లభించక దినదిన గండంగా బతుకుతున్నారు. అడవిలో వైద్యం అందదు. పట్టణాలకు వచ్చి బతకలేరు అన్నట్టుగా ఉంది ప్రస్తుతం వాళ్ల పరిస్థితి.
అందరూ దేశభక్తులన్నవారే
ఈ వ్యవస్థపై తిరగబడి, పాలిస్తున్న ప్రభుత్వాలపై తుపాకులను ఎక్కుపెట్టిన వాళ్లు ఏమైతే మనకేంటి? అన్న ప్రశ్న ఇక్కడ రావచ్చు. కానీ, నక్సల్ సమస్య కేవలం శాంతి భద్రతల సమస్య కాదని, సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతల మూలంగానే పుట్టుకు వచ్చిందని మనందరికీ తెలుసు. నక్సల్బరీ(naxalisam) నుంచి ఛత్తీస్‌గఢ్ వరకు హింసాయుత పోరాటాలను అధ్యయనం చేసిన పోలీసు ఉన్నతాధికారులు, సర్కారు నియమించిన కమిటీలు, కమిషన్లు ఇదే విషయాన్ని తేల్చిచెప్పాయి.
1980లలో ఎన్టీఆర్(ntr), 90లలో చెన్నారెడ్డి(marri chenna reddy), 2000లలో వైఎస్(ys rajashekar reddy) నక్సలైట్లు దేశభక్తులేనని ప్రకటించారు.ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వారితో చర్చలు జరిపారు. అనధికారిక కాల్పుల విరమణను పాటించారు. చట్టపరమైన కార్యకలాపాలకు అనుమతించారు. 2004లో నక్సల్ అగ్రనేతలు హైదరాబాద్‌కు వచ్చి ప్రభుత్వ ప్రతినిధులతో సుదీర్ఘ సంభాషణలు కొనసాగించారు. ఇప్పటికీ, నక్సలైట్ల వల్ల సమాజానికి మేలే జరిగిందని ఒప్పుకునేవాళ్లు కోకొల్లలు. వాళ్లు మళ్లీ రావాలని కొందరు నేతలు ఇటీవల బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుత సీఎం కేసీఆర్ సైతం గతంలో నక్సలైట్ల ఎజెండాయే తమ ఎజెండా అని ప్రకటించిన విషయం మర్చిపోకూడదు.
ఆయా పరిణామాలకు కారణం?
కొన్ని వర్గాల అవగాహన ప్రకారం నక్సలైట్లు హింసావాదులు. తమ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. డ్యూటీలో భాగంగా దాడి చేస్తున్న పోలీసుల ప్రాణాలు బలి తీసుకుంటారు. కానీ, ఏ నక్సలైటైనా తన వ్యక్తిగత స్వార్థం కోసమో, కుటుంబ మేలు కోసమో, ఆస్తులు పెంచుకోవడానికో ఈ పని చేస్తారా? లేక పార్టీ ఆదేశాలను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అమలు జరుపుతారా? చర్చించాల్సిన అంశం. పరిశీలించే దృక్కోణం వేర్వేరుగా ఉండవచ్చు. వారు అనుసరిస్తున్న హింసామార్గాన్ని చాలామంది వ్యతిరేకిస్తుండవచ్చు. సారాంశం మాత్రం ఒక్కటే.
సమాజానికి ఉపయోగపడాల్సిన ఒక తరం ఈ వ్యవస్థలోని లోటుపాట్ల మూలంగా దారి తప్పడమో, ప్రత్యామ్నాయ దారి వెతుక్కోవడమో జరిగిన ఫలితమే కదా ఈ పరిణామం? ఆ లోపభూయిష్ట వ్యవస్థను చక్కదిద్దడం ఎవరి బాధ్యత? నేడు అధికారంలో, ప్రతిపక్షంలో ఉన్న అన్ని పార్టీలూ ఏం చెబుతాయి? సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను రూపుమాపుతామనే కదా! అందుకోసమే కదా ఎన్నికలు, ఎన్నికల మ్యానిఫెస్టోలు? రిజర్వేషన్లు, వెల్‌ఫేర్ స్కీంలు, అభివృద్ధి పథకాలు?
మానవ విలువలు మృగ్యం
ఓ వైపు మనం స్వార్థమే పరమావధిగా భావిస్తున్న సమాజంలో బతుకుతున్నాం. 'నేను.. నేను మాత్రమే బాగుంటే చాలుననే' తరాన్ని చూస్తున్నాం. 'నేను' తర్వాతనే భార్యాపిల్లలూ, తల్లిదండ్రులూ, బంధువులూ, స్నేహితులూ, ఇరుగు పొరుగు వాళ్లూనూ. కష్టపడకుండా, రిస్క్ లేకుండా తక్కువ కాలంలో ఎక్కువ మొత్తంలో డబ్బులు, ఆస్తులు కూడబెట్టడమే వీరి ఫైనల్ టార్గెట్. కట్టుకునేవాళ్లు తెచ్చే కట్నాలకు అర్రులు చాస్తారు. కన్నవాళ్లు భారమై వదిలేస్తారు. పక్కోడు ఆపదలో ఉంటే పట్టించుకోరు.
ప్రమాదం జరిగితే వీడియోలు తీస్తారు. జీతమెక్కువంటే ఆర్నెల్లకో జాబ్ మార్చేస్తారు. పదవుల కోసం భజనలు చేస్తారు. పోస్టింగుల కోసం వంత పాడుతారు. లాభమొస్తుందంటే అవయవాల, శరీరాల బిజినెస్‌కూ వెనకాడరు. లంచం ఇస్తారు. తీసుకుంటారు. సిస్టమ్ చెడిపోయిందని వాపోతారు.. నోట్లిస్తేనే ఓట్లు వేస్తామని భీష్మించుకుంటారు. రాజకీయాలు వ్యాపారమవుతాయి. మానవ విలువలు మృగ్యమైపోతాయి.
వారికి ఏ అండా లేదు
సొంత ఆస్తినీ, కుటుంబాన్నీ వదిలి ప్రజాసేవ చేస్తున్నవాళ్లు ఒక్క నక్సలైట్లలోనే ఉన్నారనడం లేదు. అన్ని రాజకీయపార్టీలలో, ప్రజాసంఘాలలో, ట్రేడ్ యూనియన్లలో, స్వచ్ఛంద సంస్థలలో సైతం ఉన్నారు. కుటుంబాన్నీ, ఆస్తినీ సంపూర్ణంగా త్యజించకున్నా సొంత ప్రయోజనాలను వదిలి, ప్రజా ప్రజాప్రయోజనాల కోసం పనిచేసే వాళ్లు చాలామందే కనిపిస్తారు. సర్పంచులుగా ఉంటూ సైకిళ్లపై తిరిగిన వాళ్లను, ఎమ్మెల్యేగా ఉంటూ వ్యవసాయ పనులు చేసినవాళ్లను, ఎంపీలుగా ఉంటూ పెంకుటింట్లో నివసించిన వాళ్లను చూశాం.
మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉండీ సొంతానికి సంపాదించని నేతలనూ చూశాం. యేళ్లుగా రాజకీయాలలో ఉండి కూడా సాధారణ జీవితం గడుపుతున్నవాళ్లనూ, పెళ్లి చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మచారులుగా ఉన్నవాళ్లనూ చూస్తున్నాం. అయితే, వీరందరినీ ఆపదలో ఆదుకోవడానికి కుటుంబమో, బంధుగణమో, ప్రభుత్వమో, పౌర సమాజమో ఉంది. నక్సలైటు ఉద్యమంలో పనిచేసిన వాళ్లకు ఏ అండా లభించడం లేదు.
అమలు కాని నియమాలు
పురాతన కాలంలో రాజులు కొన్ని నియమాలకు లోబడి యుద్ధం చేసేవాళ్లు. ఆయుధం లేనివారిని చంపడం నేరంగా పరిగణించేవాళ్లు. లొంగిపోయిన వారికి ప్రాణభిక్ష పెట్టేవాళ్లు. గాయపడ్డవారికి చికిత్స అందించేవాళ్లు. నేటికీ అలాంటి యుద్ధ నియమాలే అమలులో ఉన్నాయి. 1949లో రూపొందిన జెనీవా కన్వెన్షన్ ఇలాంటి పలు నియమాలను ప్రస్తావించింది.
ఈ నియమాలు దేశాల మధ్య యుద్ధాలకే కాకుండా అంతర్యుద్ధాలకు, అంతర్గత సాయుధ ఘర్షణలకూ వర్తిస్తాయని ఆ ఒప్పందంలోని ఆర్టికల్ 3 చెబుతుంది. గాయపడిన, అనారోగ్యానికి, ప్రమాదాలకు గురైన శత్రు సైనికులు పట్టుబడినప్పుడు గౌరవంగా చూడాలని, చికిత్స అందించాలని, చిత్రహింసలు పెట్టరాదని, చంపరాదని ఇందులో స్పష్టంగా రాసి ఉంది.
వారిని గౌరవించాలి
ఇప్పటికైనా పౌరసమాజం, ప్రభుత్వాలు స్పందించాలి. నక్సలైటు భావజాలంతో వివిధ పార్టీలుగా, గ్రూపులుగా ఏర్పడి సాయుధ పోరాటం చేస్తున్న వాళ్లతో మాట్లాడాలి. హింస లేకుండానే సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో మార్పులకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. ఆ ఉద్యమాలను కేవలం శాంతిభద్రతల సమస్యగానే చూడకుండా పరిష్కారాలు ఆలోచించాలి. స్వార్థంతో నిండిపోయిన ప్రస్తుత సమాజంలో నిస్వార్థ భవిష్యత్ తరాన్ని పెంచడానికి, నిర్మించడానికి చొరవ తీసుకోవాలి.
మొదటి మెట్టుగా నక్సలైటు ఉద్యమం నుంచి అనారోగ్యంతోనో, వృద్ధాప్య సమస్యలతోనో, అలసిపోయో, గాయపడో బయటికి వచ్చేవాళ్లను సహృదయంతో ఆహ్వానించాలి. వాళ్లను సరెండరైనట్లుగా ట్రీట్ చేయకుండా రాజకీయ కార్యకర్తలన్న గౌరవంతో చికిత్స అందించాలి. బతకడానికి తోడ్పడాలి.
వారు కూడా గమనించాలి
నక్సలైట్ నాయకత్వం కూడా రోజురోజుకూ మారుతున్న సమాజాన్ని గమనించాలి. ఉద్యమం మారుమూల ప్రాంతాలకే పరిమితమవుతోందని, ప్రధాన జనజీవన స్రవంతికి దూరమవుతోందనే వాస్తవాన్ని గుర్తించాలి. మెజారిటీ ప్రజానీకంలో పని చేసేందుకు అవసరమైన వ్యూహం-ఎత్తుగడలు అనుసరించాలి.
వృద్ధాప్య, అనారోగ్య సమస్యలున్న కార్యకర్తలకూ, నేతలకూ ప్రత్యామ్నాయం చూపాలి. బయటకు వెళ్లడమంటే శత్రువుకు సరెండర్ కావడమని భావించడం మానుకోవాలి.
డి మార్కండేయ
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672
Also Read..