- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మరోకోణం: ప్రభుత్వ వ్యతిరేకత దారిమళ్లుతోందా!
ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతను దారి మళ్లించడానికే సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పేరిట కొత్త జాతీయపార్టీ స్థాపించారని వాదించేవాళ్లు కోకొల్లలు. మొదటిసారి తెలంగాణ తెచ్చిన సెంటిమెంటుతో, రెండోసారి సంక్షేమ పథకాల వలతో గెలిచిన ఆయన అమ్ములపొదిలో ఈసారి విజయాన్ని గ్యారంటీ చేసే అస్త్రాలేమీ లేవని, అబ్బురపరిచే కొత్త స్కీంలు తెద్దామన్నా ఖజానా ఖాళీగా ఉందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేకతను దారి మళ్లించే వ్యూహాన్ని ఆయన ఎంచుకున్నారని చెబుతున్నారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు పైకి తిప్పడంలో భాగంగానే కేసీఆర్, మోడీ విధానాలపై సమరశంఖం పూరించారని వాదిస్తున్నారు. వీధివీధిన, గ్రామ గ్రామాన కేంద్ర విధానాలపై విమర్శలు గుప్పించడం ద్వారా ప్రజల దృష్టి టీఆర్ఎస్ పైనుంచి బీజేపీ వైపునకు మళ్లుతుందని భావిస్తున్నారని అంటున్నారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి బద్నాం అయిన మోడీని ఇక్కడి ప్రజల దృష్టిలో విలన్ చేయడమే ఆయన మెయిన్ టార్గెట్ అంటున్నారు. తద్వారా తెలంగాణలో మరోమారు అధికారంలోకి రావచ్చునని ఆశిస్తున్నారని, ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ నినాదం వెనక ఈ కారణమే దాగివుందని చెబుతున్నారు.
ఈ దారి మళ్లింపు వ్యూహాన్ని కేసీఆర్ హుజూరాబాద్ ఉపఎన్నిక నుంచే అమలు చేస్తున్నారు. వడ్ల కొనుగోలు అంశాన్ని మొదట తెరపైకి తెచ్చారు. వరసగా మీడియా సమావేశాలు నిర్వహించి మోడీని అసమర్థుడని, అబద్ధాల కోరని, దేశాన్ని అదానీకి తాకట్టు పెడుతున్నారని నిందించారు. కాంగ్రెస్, బీజేపీలు రెండూ చేసిందేమీ లేదని, 75 ఏళ్ల పాలనలో ప్రజలకు చిప్పే మిగిలిందని విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చి అయినా సరే.. భారత్‌ను అభివృద్ధి పథంలోకి తెస్తానన్నారు. అందుకోసం రంగంలోకి దిగడానికి సిద్ధమని ప్రకటించారు. ఈ విమర్శల పర్వానికి క్లైమాక్స్‌గా గత అక్టోబర్ 5న కొత్తపార్టీని స్థాపించారు.
నమస్తే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర...!
అప్పటినుంచి బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్ లక్ష్యం, విధులు-విధానాలు, నినాదాలు.. అన్నీ మారిపోయాయి. బంగారు తెలంగాణ కాస్తా బంగారు భారత్ అయింది. తెలంగాణ జాతిపిత.. దేశ్ కీ నేత అయ్యారు. ప్రసంగాల్లో జై తెలంగాణ పక్కన జైహింద్ చేరింది. ఢిల్లీకి, రాష్ట్రాల రాజధానులకు పర్యటనలు పెరిగాయి. మోడీ వ్యతిరేక రాజకీయాలకు హైదరాబాద్ కేంద్రమైంది. తెలంగాణ ప్రభుత్వ విజయాలను, కేసీఆర్‌ను కీర్తిస్తూ దేశం నలుమూలలా ఫ్లెక్సీలు వెలిశాయి. తీరొక్క భాషల పేపర్లలో ప్రకటనలు వచ్చాయి. చివరకు, నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో నమస్తే ఆంధ్రప్రదేశ్, నమస్తే కర్ణాటక, నమస్తే మహారాష్ట్ర వంటి దినపత్రికలను రిజిస్టర్ చేసేవరకూ పరిస్థితులు వెళ్లాయి.
ప్రగతి భవన్‌లో ఇప్పుడంతా బీఆర్ఎస్ జాతీయ హడావుడే. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలు, రైతు సంఘాల ప్రతినిధులతో కిటకిటలాడిపోతోంది. సీఎం కేసీఆర్ సిటీలో ఉన్నా, ఫాంహౌజ్‌లో ఉన్నా 24 గంటలూ బీఆర్ఎస్ వ్యవహారాల్లోనే నిమగ్నమై ఉంటున్నారు. ప్రభుత్వ పాలన వ్యవహారాలు పూర్తిగా అటకెక్కాయి. సెక్రెటేరియట్‌లో ఏ ఫైలూ కదలడం లేదు. విధానపరమైన నిర్ణయాలు జరగడం లేదు. ఐఏఎస్, ఐపీఎస్‌లకు అపాయింట్మెంట్లు దొరకడం లేదు. వివిధ వర్గాలను కలిసేందుకు ఉద్దేశించిన జనహిత దర్బార్ హాలు తెరిచింది లేదు. కింది నుంచి పైదాకా అభివృద్ధి పనుల బిల్లులన్నీ పెండింగులో ఉన్నాయి. ఖజానా ఖాళీ అయింది. కొత్త అప్పులు పుట్టడం లేదు. కాంట్రాక్టు కార్మికులు, నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారు. ధరణిపై ఫిర్యాదుల వెల్లువ రెవెన్యూను ముంచెత్తుతోంది. పట్టించుకోవాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు బీజేపీని తిట్టడంలో, దేశం కోసం బయలెల్లిన కేసీఆర్‌ను పొగడడంలో మునిగి తేలుతున్నారు.
ఈ పరిస్థితుల్లో కేసీఆర్ దృష్టి మళ్లింపు వ్యూహం సక్సెస్ అయినట్టా ఫెయిల్ అయినట్టా అన్న చర్చలు ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. ఆ పార్టీలో సీనియర్, మేధావి అని పేరున్న ఓ నేత ఈ వ్యూహం బాగా పనిచేస్తోందని అభిప్రాయపడ్డారు. అవినీతి, కుటుంబపాలన, ఉద్యోగాలు.. వంటి ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలన్నీ ఇప్పుడు మరుగున పడ్డాయని, ఎక్కడ చూసినా బీఆర్ఎస్ గురించిన చర్చే జరుగుతోందన్నారు. ఇంతకాలం ప్రజలు బీజేపీని ప్రతిపక్షంగా చూశారని, ఇప్పుడు పాలక పార్టీగా భావిస్తున్నారని, ధరలు పెరగడానికి, సమస్యలు రావడానికి మోడీ కారణమని గుర్తిస్తున్నారని ఆయన వివరించారు. ఈ నేతలా ఆలోచించేవాళ్లు ఆ పార్టీలో ఇంకా చాలామందే ఉన్నారు.
కారు గుర్తు మాయం.. నేతల్లో వణుకు
అలా అని బీఆర్ఎస్ వల్ల నష్టపోయే అవకాశమే ఎక్కువుందని వాదించే నేతలకూ కొదవ లేదు. వీరికి కేసీఆర్ జాతీయపార్టీ పెట్టడం అసలే ఇష్టం లేదు. కారు గుర్తు అలాగే ఉన్నా పేరులో తెలంగాణ లేకుండా పార్టీని జనంలోకి తీసుకెళ్లడమెలాగో వీరికి అర్థం కావడంలేదు. సెంటిమెంటు లేకపోతే ఓట్లు పడవేమోనని భయపడుతున్నారు. బీఆర్ఎస్ పెట్టకముందు నిర్వహించిన సర్వేల ఫలితాలే, పెట్టిన తర్వాతి సర్వేల్లోనూ వచ్చాయని, అయినప్పుడు ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. పైగా పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోకి విస్తరిస్తే ఇక్కడ చాలా సమస్యలు ఎదురవుతాయంటున్నారు. ఉదాహరణకు పోలవరం, కృష్ణా జలాలు, ఇతర విభజన సమస్యల్లో అక్కడొక వైఖరి.. ఇక్కడొక వైఖరి తీసుకుంటే ఎక్కడా కాకుండా పోతామని హెచ్చరిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రల విషయంలోనూ ఇదే సమస్య రిపీట్ కావచ్చునంటున్నారు. శ్రీరాంసాగర్ జలాలను ఎత్తిపోసుకోవచ్చునంటూ నాందెడ్ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్య వివాదాస్పదమవడాన్ని గుర్తు చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడింది. రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగులతో దూసుకుపోతోంది. వీధుల్లో జరిగే ఈ మినీ సభలకు భారీగా జనం హాజరవుతున్నారు. ఏడాదిగా కొనసాగిన ఐదు విడతల ప్రజాసంగ్రామ యాత్రకు స్పందన కూడా బాగా వచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేశపూరిత ప్రసంగాలు, కేసీఆర్ పాలనపై వేస్తున్న పంచ్‌లు బాగా పేలుతున్నాయి. మరోవైపు, తీవ్ర అంతర్గత పోరుతో సతమతమవుతున్న కాంగ్రెస్ కూడా ఇటీవల కదనరంగంలోకి అడుగుపెట్టింది. హాథ్ సే హాథ్ యాత్ర చేపట్టింది. సీనియర్లు సహకరించకున్నా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఒంటరిగానే వీరోచితంగా పోరాడుతున్నారు. ఆయన సభలకు కూడా స్పందన బాగుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని ఆరోపిస్తున్న కమలనాథులకు దీటుగా బదులిస్తున్నారు. బీజేపీతో కేసీఆర్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని, వాటి మధ్య యుద్ధం ఒక నాటకమని ప్రకటిస్తున్నారు.
నాయకుడు గెలిపిస్తాడులే... నిజమా?
జాతీయపార్టీని బలోపేతం చేసే, విస్తరించే పనిలో ఉన్న కేసీఆర్ ఇంకా ఎన్నికల ప్రజాక్షేత్రంపై దృష్టి పెట్టలేదు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పైన స్పందించడం లేదు. 2023-24 బడ్జెట్‌ను సైతం మమ అనిపించారు. ఎన్నికల వరాలకు చోటు కల్పించలేదు. కేటీఆర్ మాత్రమే జిల్లాల పర్యటనలు చేస్తూ ప్రజల్లో ఉంటున్నారు. హరీశ్‌రావు సిద్ధిపేటకు పరిమితం కాగా, లిక్కర్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత జాతీయ పరిణామాల పైన మాత్రమే స్పందిస్తున్నారు. అయితే, కేసీఆర్ వ్యూహ చాతుర్యం, రాజకీయ చాణక్యం, అపార ఆర్థిక వనరులు చివరకు తమను గెలిపించి తీరుతాయనే ధీమాతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.
ఎన్నికలకు మరో ఎనిమిది నెలలు మిగిలివుంది కనుక ఈలోపు ఏ పార్టీలో ఏం జరుగుతుంది, ఏ ఏ పార్టీల మధ్య పొత్తు కుదురుతుంది, చిన్న పార్టీలు ఎవరి ఓట్లను చీల్చుతాయి, ప్రజల ఆదరాభిమానాలను ఎవరు చూరగొంటారు, చివరకు ఎవరు గెలుస్తారు... ఆసక్తిగా ఎదురుచూడాల్సిందే.
డి. మార్కండేయ
editor@dishadaily.com
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672