- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మరోకోణం: చంద్రబాబు, షర్మిల కలిసి లాభం చేకూర్చేది కేసీఆర్ కేనా..?
తెలంగాణలో ఇప్పుడు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల వార్తలలోని వ్యక్తిగా నిలిచారు. తన ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా ఇప్పటికే మూడు వేల కిలోమీటర్ల మైలురాయి దాటిన ఆమె ఉమ్మడి వరంగల్ జిల్లాలో నడుస్తూ వివాదానికి కారణమయ్యారు. నర్సంపేట నియోజకవర్గంలో ఆమె యాత్రపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై, కేసీఆర్ కుటుంబంపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ప్రతీకారానికి పాల్పడ్డారు.
ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగగా, పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అరెస్టు చేసి హైదరాబాదుకు తరలించారు. తనపై జరిగిన దాడిని నిరసిస్తూ మరునాడు షర్మిల సీఎం అధికారిక నివాసం ప్రగతిభవన్ వైపు దూసుకెళ్లారు. ముందే అలర్టయిన ఖాకీలు ఆమెను అడ్డుకుని అదుపులోకి తీసుకోబోయారు. వాహనం దిగడానికి ససేమిరా అనడంతో క్రెయిన్ సాయంతో అమాంతం వాహనాన్నే ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కూతురుకు జరిగిన అన్యాయంపై వైఎస్ సతీమణి విజయమ్మ స్పందించి, ఠాణాకు బయలుదేరగా ఆమెను కూడా గృహ నిర్బంధం చేశారు. వరుసగా జరిగిన ఈ ఘటనలు రాష్ట్రంలో షర్మిల పైన, వైఎస్సార్‌టీపీ భవిష్యత్తు పైన చర్చకు దారితీశాయి.
అందుకోసమే అన్నకు దూరం?
ఏపీలో జగనన్న బాణంగా పేరొందిన షర్మిల అధికారం చేపట్టాక అన్నకు క్రమంగా దూరం అవుతూ వచ్చారు. ఆస్తుల విషయంలో, పదవుల విషయంలో విభేదాలు తలెత్తడంతోనే ఆమె ఆ రాష్ట్రాన్ని వదిలేసి, తెలంగాణకు వచ్చేసిందనే వాదన విశ్లేషకులలో ఉంది. తర్వాతి కాలంలో విజయమ్మ సైతం హైదరాబాదుకు తరలిరావడం ఈ వాదనకు బలం చేకూర్చింది. 2021 జూలై 8న వైఎస్సార్ టీపీని ప్రకటించినప్పటి నుంచీ షర్మిల రాజకీయంగా హైపర్ యాక్టివ్‌గా ఉన్నారు.
మొదట మీడియా సమావేశాలలో వాడివేడి ప్రసంగాలు చేశారు. అదే సంవత్సరం అక్టోబర్ 20న వికారాబాద్ జిల్లా చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థాన యాత్రను ప్రారంభించారు. 2003 ఏప్రిల్ 9న ఇదే చేవెళ్ల నుంచి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రను ప్రారంభించి 69 రోజులు దిగ్విజయంగా కొనసాగించి తెలంగాణ, ఆంధ్ర ప్రజల అభిమానాన్ని చూరగొన్న విషయం ఇక్కడ ప్రస్తావించాలి. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో ఆయన ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించి అధికారం చేపట్టింది. ప్రస్తుతం షర్మిల సైతం తండ్రి బాటలోనే నడవడానికి ప్రయత్నిస్తున్నారు.
అసలు ఉద్దేశం అదేనా?
తన ప్రసంగాలలో కేసీఆర్ పాలనను చీల్చి చెండాడుతున్న షర్మిల.. ఇంతకూ ఎవరు వదిలిన బాణమన్న అంశంపై తెలంగాణ సమాజంలో ఆసక్తికరమైన చర్చ ఉంది. కేవలం టీఆర్ఎస్ పాలన పైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు కనుక తను తప్పకుండా బీజేపీ బాణమే అయుంటుందన్నది సాధారణ అభిప్రాయం. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు అనేకమంది బహిరంగంగానే ఈ విషయాన్ని చాలాసార్లు ఆరోపించారు. మేధావులు, విశ్లేషకులలో చాలామంది కూడా ఇదే ఫీలవుతున్నారు.
షర్మిల కేవలం టీఆర్ఎస్ పార్టీ పైనే తన దాడిని ఎక్కుపెట్టడం, బీజేపీని పల్లెత్తు మాట అనకపోవడం, జగన్-మోడీ మధ్య సత్సంబంధాలుండడం ఇందుకు కారణం. ప్రజలలో ఆమె రగిల్చే ప్రభుత్వ వ్యతిరేకత అంతా రేపటి ఎన్నికలలో కమలానికే ఉపయోగపడుతుందని వీరి భావన. తన ప్రతి స్పీచ్‌లో కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ నేతల అవినీతిని లెక్కలతో సహా బయట పెడుతుండడం, బీజేపీ ప్రధాన అస్త్రం కూడా ఈ అంశమే కావడం సహజంగానే అనుమానాలకు తావిస్తున్నది.
Also read: రాజకీయాలు మామూలుగా లేవు... పక్కా బిజినెస్!!
ఇంతకీ ఆమెకు ప్రయోజనం ఎంత?
ఇంతకూ షర్మిల పార్టీ వచ్చే ఎన్నికలలో పోటీ చేయడం వలన ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అన్న విషయాన్ని తర్కబద్దంగా పరిశీలిద్దాం. యేడాదిన్నర వయస్సు కూడా లేని ఆ పార్టీకి రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ కేడర్ లేదు. స్థానిక నాయకత్వం లేదు. తగిన అభ్యర్థులు సైతం దొరకడం కష్టం.ఒక్క షర్మిల పాదయాత్ర తెచ్చిన సానుభూతితోనే ఓట్లు పడతాయని భావించలేం.
వైఎస్సార్ సెంటిమెంటు పనిచేసిన చోట, రాయలసీమ సెటిలర్స్ ఉన్నచోట ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాలలో ఆ పార్టీ కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. అక్కడ కూడా సీట్లు గెలవడం కష్టమే. ఎక్కువలో ఎక్కువ మిగతా పార్టీలకు పడే ఓట్లను చీల్చి, అభ్యర్థుల విజయావకాశాలను మెరుగుపరచడమో, దెబ్బ తీయడమో చేయగలదు.
లాభం అధికార పార్టీకే
ఓట్ల చీలికకు వస్తే, షర్మిల పార్టీ పోటీ చేసిన స్థానాలలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం మొదటి అంశం. ఆ లెక్కన చూస్తే, కాంగ్రెస్, బీజేపీకి పడే ఓట్లలో కొన్నింటిని ఆ పార్టీ తన ఖాతాలో వేసుకుంటుంది. బీజేపీతో పోల్చితే కాంగ్రెస్‌కే ఎక్కువ నష్టం జరిగే అవకాశముంది. షర్మిల వైఎస్సార్ పేరును వాడుకుంటున్నారు కనుక సాంప్రదాయికంగా కాంగ్రెస్‌కు ఓటు వేసే వర్గాలే అటువైపు మళ్లే అవకాశం ఉంది. 2014 ఎన్నికలలో వైసీపీ గెలిచిన రెండు స్థానాలూ ఖమ్మం జిల్లాలో ఉన్న విషయాన్నీ, ప్రస్తుతం షర్మిల పార్టీ కూడా అక్కడే కేంద్రీకరించడాన్నీ ఇక్కడ ప్రస్తావించాలి. అంతిమంగా ఈ ప్రాంతాలలో అధికార టీఆర్ఎస్‌కే లాభం జరుగుతుంది.
Also read: కేసీఆర్ గెలుపు వ్యూహాలు
ఇక్కడ కాస్త భిన్నం
రాయలసీమ, ఆంధ్ర సెటిలర్స్ ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉన్న గ్రేటర్, రంగారెడ్డి ప్రాంతాలలో ఎవరికి నష్టమన్నది రెండో అంశం. మామూలుగా అయితే, ఈ ప్రాంతాలలో గులాబీ ప్రభావం ఎక్కువ. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గాలలో ఆ పార్టే గెలిచింది. ఈసారి ఇక్కడ వైఎస్సార్ టీపీ పోటీ చేస్తే నష్టం ఆ పార్టీకే జరుగుతుంది. ఆ మేరకు కమలనాథులకు లాభిస్తుంది. కాంగ్రెస్‌కు నష్టం, లాభం రెండూ జరిగే చాన్స్ లేదు.
వారికి కొంత లాభమే
మూడో అంశం ఏమిటంటే తన పాదయాత్రతో షర్మిల రాష్ట్రమంతటా కేసీఆర్ కుటుంబ వ్యతిరేక, టీఆర్ఎస్ వ్యతిరేక భావనలను పెంచుతున్నారు. అది ఓటర్లలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలను సృష్టించేందుకు కారణం కావచ్చు. ముఖ్యంగా ఊరూరా ఆమె చేసిన ప్రసంగాలలో కాళేశ్వరం తదితర ప్రాజెక్టులలో కేసీఆర్ కుటుంబం అవినీతిని, కోట్లకు పడగలెత్తిన స్థానిక ఎమ్మెల్యేల ఆస్తుల లెక్కలను బయటపెడుతుండడం ప్రభావం చూపవచ్చు. వైఎస్సార్ టీపీ పోటీ చేయని చోట కూడా ఈ అంశం అధికార పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ప్రత్యామ్నాయ పార్టీగా భావిస్తున్న బీజేపీకి లాభం చేకూరుస్తుంది.
కొసమెరుపు
చివరిదీ, కీలకమైనదీ మరో అంశం ఉంది. రాయలసీమకు చెందిన షర్మిల తెలంగాణలో తిరగడం, కేసీఆర్‌ను, ఉద్యమనేతలను అదే పనిగా దూషించడం ఒక సెంటిమెంటుకు కారణం కావచ్చు. తెలంగాణ వ్యతిరేకి వైఎస్సార్‌కు పుత్రిక, 2010లో మానుకోట కాల్పుల ఘటనకు కారణమైన జగన్‌కు సోదరి కావడం ఇందుకు తోడుకావచ్చు.
2018 ఎన్నికల సందర్భంగా హైదరాబాద్, ఖమ్మంలలో పర్యటించిన చంద్రబాబు కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు క్రియేట్ చేసిన సెంటిమెంటును మనం మరిచిపోరాదు.ఆ సెంటిమెంటును అస్త్రంగా వాడుకున్న కేసీఆర్ రెండవ దఫా భారీ మెజారిటీ సాధించారు. వచ్చే ఎన్నికల్లో ఇటు షర్మిల, అటు టీటీడీపీకి తిరిగి ప్రాణం పోస్తున్న చంద్రబాబు కలిసి మరో ఆంధ్ర వ్యతిరేక, తెలంగాణ అనుకూల సెంటిమెంటుకు కారణమవుతారేమో.. ఎవరికి తెలుసు?
డి. మార్కండేయ