- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోకోణం: ఫోన్ ట్యాపింగులు.. హ్యాకింగులు..
తన ఫోన్‌ను హ్యాక్ చేసే ప్రయత్నాలు జరిగాయంటూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్(rs praveen kumar) గతవారం చేసిన ట్వీట్ సంచలనం సృష్టించింది. మీ ఐఫోన్‌లో చొరబడడానికి, రిమోట్‌లో కంట్రోలులో తీసుకోవడానికి ప్రభుత్వవర్గాలకు చెందిన హ్యాకర్లు పదే పదే ట్రై చేస్తున్నారని ఆపిల్ కంపెనీ ఆయనను అలర్ట్ చేసింది. ''వ్యక్తిగతంగా మీరెవరో, ఏం చేస్తున్నారో తెలిసిన తర్వాతే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. మీ ఫోన్‌లోని సెన్సిటివ్ డాటా, కమ్యూనికేషన్స్, కెమెరా, మైక్రోఫోన్, స్టోరేజీ వగైరా వాళ్లు ఆపరేట్ చేసే అవకాశమున్నది. దీన్ని ఫాల్స్ అలారంగా భావించద్దు. సీరియస్‌గా తీసుకోండి.'' అని హెచ్చరించింది. అంతకు కొద్దిరోజుల క్రితమే బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్(bandi sanjay) తన పార్టీ నేతలతో మాట్లాడుతూ అందరూ ఐపోన్లు(i phone) వాడాలని సూచించారు. మామూలు ఆండ్రాయిడ్ మొబైల్స్ హ్యాక్ అవుతున్నాయని, కేసీఆర్ సర్కారు మనందరినీ టార్గెట్ చేసిందని ఆరోపించారు. గత నవంబర్‌లో సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ తమిళిసై(ttamilisai Soundararajan) సైతం తన ఫోన్ ట్యాప్(phone tapping) అవుతున్నదని మీడియాకు చెప్పారు.
ట్యాపింగ్ కొత్తది కాదు..
మన దేశ రాజకీయ చరిత్రలో ఫోన్ ట్యాపింగ్ అంశం కొత్తదేం కాదు. ఇందిరాగాంధీ పాలనలో ప్రతిపక్ష నేతల ఫోన్ సంభాషణలు ఇంటెలిజెన్స్ వర్గాలు ట్యాప్ చేశాయనే ఆరోపణలున్నాయి. 1988లో కర్ణాటకలోని రామకృష్ణ హెగ్డే జనతా పార్టీ ప్రభుత్వం ఈ అంశం కారణంగానే పతనమైంది. పార్టీలోని అసంతృప్తుల, ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేయడానికి అనుమతిస్తూ ఆయన సంతకాలు చేసిన ఆదేశ పత్రాలను కేంద్రం చట్టసభల ముందుంచింది. ప్రధాని రాజీవ్(rajiv gandi) సూచనల మేరకు రాష్ట్రపతి భవన్‌లోని పలు గదులను బగ్గింగ్ చేశారని 1986లో అప్పటి రాష్ట్రపతి జైల్‌సింగ్(jail singh) ఆరోపించారు. రెండు దఫాల యూపీఏ పాలనలో ప్రతిపక్ష నేతలవే కాకుండా, మిత్రపక్షాల నేతల ఫోన్లను సైతం కాంగ్రెస్ సర్కారు ట్యాప్ చేసిందని అనేక సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి. శరద్‌పవార్, మమతాబెనర్జీ, యశ్వంత్‌సిన్హా, ప్రకాశ్‌కారత్, నితీష్‌కుమార్ వంటి ప్రత్యర్థుల పైనే కాకుండా దిగ్విజయ్‌సింగ్, ప్రణబ్‌ముఖర్జీ, ఏ కే ఆంటోని వంటి స్వపక్ష మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని వివాదం చెలరేగింది. నెలకు 9వేల ఫోన్లు, 500 ఈ-మెయిళ్ల చొప్పున యూపీఏ ప్రభుత్వం ట్యాప్ చేసిందని 2018లో ఒక ఆర్టీఐ(RTI) సమాచారం వెల్లడించింది.
ల్యాండ్‌ఫోన్లను వినడం కష్టం..
మొబైల్ ఫోన్లు రాకముందు ల్యాండ్‌లైన్లను ట్యాప్ చేయడం చాలా కష్టంగా ఉండేది. సంబంధిత అధికారుల రాతపూర్వక ఆదేశాల మేరకే టెలికాం విభాగం ఎంపిక చేసిన వ్యక్తుల పోన్లను ట్యాప్ చేసేది. ఆ విషయం రికార్డుల్లో ఉండేది కనుక ఏదో ఒకరోజు బహిర్గతమై ఆరోపణల దుమారం చెలరేగేది. 2015లో జియో సేవలు అందుబాటులోకి వచ్చి టెక్నాలజీ విప్లవం బద్దలయ్యాక దేశంలో కుప్పలు తెప్పలుగా స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. కేవలం మాట్లాడుకోవడానికే కాకుండా డైలీలైఫ్‌లో తాము నిర్వహించే అన్ని రకాల కార్యకలాపాల కోసం అందరూ మొబైల్‌నే యూజ్ చేస్తున్నారు. తమ వ్యక్తిగత సమాచారాన్ని, ఫొటోలను, ఇతర కీలక విషయాలను ఫోన్ మెమొరీలో ఉంచుతున్నారు. ఎలాంటి టాపిక్ అయినా ఫోన్‌లోనే మాట్లాడుతున్నారు. మరోవైపు, ట్యాపింగ్, హ్యాకింగ్, కాల్ రికార్డింగ్ అనేది సర్వసాధారణమైంది. ఇందుకు ఎవరి అనుమతీ అక్కర్లేదు కూడా. ప్రభుత్వాలకు చెందిన పోలీసు, ఇంటెలిజెన్స్ విభాగాలే కాకుండా ప్రైవేటు ఏజెన్సీలు కూడా ఈ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. కాస్తో కూస్తో కమ్యూనికేషన్ సాఫ్ట్ వేర్‌పై అవగాహన ఉన్న ఎవరైనా.. ఎవరి మొబైల్‌లోకైనా చొరబడవచ్చు. అలాంటి యాప్స్, టెక్నిక్స్ మార్కెట్‌లో బోలెడు అందుబాటులో ఉన్నాయి.
పర్మిషన్స్ అసలే వద్దు..
ప్రభుత్వ డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న ఒక మిత్రుడు 2017లో నాకు ఓ సమాచారం చెప్పారు. ఒక వ్యక్తి పూర్తి పేరు, వాడుతున్న ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీల్లో ఏదో ఒకటి లేదా రెండు తెలిస్తే చాలు.. ఆ వ్యక్తి కార్యకలాపాల గురించిన కనీసం పది పేజీల సమాచారాన్ని ప్రింట్ తీసి ఇవ్వవచ్చట. ఆరేళ్ల తర్వాత ఇప్పుడు ఆ సౌలభ్యం మరింతగా పెరిగిపోయింది. ఏ ఆండ్రాయిడ్ మొబైల్ అయినా జీ-మెయిల్ ఆధారంగానే పనిచేస్తుంది. ఐఫోన్‌లో కూడా మనం ఏవో కొన్ని గూగుల్ యాప్స్ తప్పనిసరి డౌన్‌లోడ్ చేస్తాం. ఆ యాప్స్ కు కెమెరా, కాంటాక్ట్స్, లొకేషన్ వంటి పర్మిషన్స్ కూడా ఇస్తాం. వీటి ఆధారంగా ఏ హ్యాకర్ అయినా మన మొబైల్‌లోకి ప్రవేశించవచ్చు. అందులోని కీలక సమాచారాన్ని దొంగిలించవచ్చు. శత్రువులకు అందించవచ్చు. కంపెనీలకు అమ్ముకోవచ్చు. మనల్ని బ్లాక్‌మెయిల్ చేయవచ్చు. సెక్యూరిటీ ఫీచర్స్ కు పేరుగాంచిన ఆపిల్ కంపెనీయే స్వయంగా తమ డివైస్‌లు కూడా హ్యాక్ అవుతున్నాయని హెచ్చరిస్తున్నదంటే పరిస్థితి ఎంత చేయి దాటిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
ఐఫోన్లు కూడా హ్యాక్..
ఇప్పటిదాకా ప్రజల్లో ఒక నమ్మకం ఉండేది. ఐఫోన్లతో పాటు వాట్సాప్, టెలిగ్రాం, ఫేస్‌టైమ్, సిగ్నల్ వంటి యాప్స్ ఉపయోగిస్తే ఎవరూ ట్యాప్ చేయలేరని భావించేవాళ్లు. అయితే, యాపిల్ కంపెనీ హెచ్చరికలతో అవి కూడా సేఫ్ కాదని తేలిపోయింది. ఈ యాప్స్ ను ఉపయోగించి కాల్స్ మాట్లాడుతున్న, మెసేజ్ చేస్తున్న సమయంలో ఇవి ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ కనుక ఎవరూ వినడం, చూడడం జరగకపోవచ్చు. కానీ, ఆ వెంటనే వివిధ చోట్ల నిక్షిప్తమై ఉన్న ఆ డాటాను సంగ్రహించవచ్చు. మన ఫోన్ మెమొరీలో, అవతలి వారి ఫోన్ మెమొరీలో, సర్వీస్ ప్రొవైడర్ల (ఆపిల్, వాట్సాప్, టెలిగ్రాం వగైరా) సర్వర్లలో, చివరగా సెట్టింగ్స్ లో బ్యాకప్‌కు అనుమతిస్తే క్లౌడ్ (గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్)లో ఈ డాటా సేవ్ అయివుంటుంది. పైగా, ఎన్‌క్రిప్టెడ్ రూపంలో ఉండదు. ఎవరైనా నేరుగానే చదవచ్చు.. వినచ్చు..
పెగాసస్ మోస్ట్ డేంజర్..
మన ఫోన్‌ను, అవతలివారి ఫోన్‌ను ఎవరైనా భౌతికంగా కాని, హ్యాక్ చేసి కాని డాటా చౌర్యం చేయవచ్చు. ఇందుకోసం ఎన్నోరకాల స్పైవేర్ యాప్స్ హ్యాకర్లకు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి, ఇజ్రాయిలీ పెగాసస్(pegasus)ను ఉపయోగించి ఏ మొబైల్‌లోని మొత్తం డాటాను అయినా సరే... వాట్సాప్ అకౌంట్స్ సహా సులభంగా హ్యాక్ చేయవచ్చు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలన్నీ ఈ స్పైవేర్‌నే వాడుతున్నాయి. ఒక్క వాట్సాప్ మిస్డ్ కాల్‌తో ఏ మొబైల్‌నైనా హ్యాక్ చేయవచ్చునని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. మనం వాడిన, అవతలివారు వాడిన మొబైల్ నుంచి డిలీట్ చేసిన డాటాను ఎన్నేళ్ల తర్వాత అయినా బయటకు తీయవచ్చునంటున్నారు. ఆ ఫోన్‌ను ధ్వంసం చేయడమొక్కటే నివారణ మార్గంగా స్పష్టం చేస్తున్నారు. సర్వీస్ ప్రొవైడర్ల(మొబైల్ నెట్వర్క్స్) వద్ద ఉన్న డాటాకు కూడా భద్రత లేదు. అవి ఆయా ప్రభుత్వాల ఆదేశాలకు, ఒత్తిళ్లకు లోబడి పనిచేస్తాయన్నది స్పష్టమే. ఇక గూగుల్ డ్రైవ్‌లో ఉన్న కాల్స్, మెసేజెస్, వాట్సాప్ బ్యాకప్‌ను బయటకు తీయడానికి నిపుణులే అవసరం లేదు. టెక్నాలజీపై అవగాహన ఉన్నవాళ్లెవరైనా ఈ పని చేయవచ్చు. ఐఫోన్, ఐక్లౌడ్‌లో కూడా భద్రతకు గ్యారంటీ లేదని ఆ సంస్థే స్వయంగా చెప్పేసింది.
ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి
1. కీలకమైన కాల్స్ కోసం ఫీచర్(నెంబర్) ఫోన్లు, ల్యాండ్‌ఫోన్లు వాడాలి. కనీసం జీ-మెయిల్‌తో లాగిన్ అవసరం లేని మొబైల్స్ వాడాలి.
2. ఫోన్‌లాక్ కోసం ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడీ, ప్యాటర్న్ కాకుండా పిన్ నెంబర్ వాడాలి.
3. ఏవంటే ఆ యాప్స్ ను డౌన్‌లోడ్ చేయవద్దు. చేసినా అఫీషియల్ యాప్ స్టోర్స్ నుంచే చేయాలి. పని అయిపోయిన వెంటనే తొలగించాలి.
4. యాప్స్ కు, గూగుల్ అకౌంట్లకు లొకేషన్, కెమెరా, ఫొటోస్, కాంటాక్ట్స్, వాయిస్ సెర్చ్ పర్మిషన్స్ ఇవ్వద్దు.
5. గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్‌లకు బ్యాకప్ ఆప్షన్ రిమూవ్ చేయాలి. లోకల్ బ్యాకప్ కూడా ఆఫ్ చేయాలి.
6. ఫోన్ డాటాలో కీలక సమాచారం ఉంచుకోవద్దు. ఎప్పటికప్పుడు పెన్‌డ్రైవ్, ఎక్స్‌టర్నల్ డ్రైవ్‌లలో స్టోర్ చేసుకోవాలి.
7. అపరిచితుల నుంచి వాట్సాప్‌లో, ఎస్సెమ్మెస్‌లో వచ్చే లింకులేవీ క్లిక్ చేయద్దు. వారితో చాట్ చేయద్దు.
8. సెక్యూరిటీలాక్ లేని వెబ్‌సైట్లను ఓపెన్ చేయద్దు.
9. ఆండ్రాయిడ్ అయినా, ఐఫోన్ అయినా Phone Reset, Erase Iphone తరచూ చేస్తుండాలి. తిరిగి ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు మనకు అవసరమైన వాటినే ఉంచుకోవాలి.
డి మార్కండేయ
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672