ప్రభుత్వాన్నే అమ్మేయండి!

by D.Markandeya |   ( Updated:2022-09-27 10:15:28.0  )
ప్రభుత్వాన్నే అమ్మేయండి!
X

హైదరాబాద్‌ సహా పలు నగరాలు, పట్టణాలలోని ప్రధాన కూడళ్లకు దగ్గరగా ఉన్న ఆర్టీసీ ఆస్తులు, జాగాలపై కొంతమంది అధికార పార్టీ పెద్దలు, పోషకులు కన్నేశారని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. అంతటా కలిపి ఇలా 1,404 ఎకరాల రియల్ ప్రాపర్టీని అమ్మడానికి, లీజుకు ఇవ్వడానికి పథకం సిద్ధమైందంటున్నారు. మియాపూర్ డిపో స్థలం ఎవరికో, ఆర్టీసీ కల్యాణమండపం ఎవరికో, ముషీరాబాద్ డిపోల జాగా ఎవరికో, కూకట్‌పల్లి బస్టాండు ఎవరికో, కరీంనగర్ జోనల్ వర్క్‌షాపు ఎవరికో డిసైడ్ కూడా అయిపోయిందనే టాక్ నడుస్తోంది.

అధికారుల నివేదిక ప్రకారం తెలంగాణలో ప్రభుత్వరంగ సంస్థలకు సుమారు రూ. 4 లక్షల 15వేల కోట్ల ఆస్తులున్నట్లు లెక్కతేలింది. అత్యధికంగా ఆర్టీసీకి రూ.70వేల కోట్ల విలువైన ఆస్తులుండగా, టూరిజం శాఖకు రూ. 50 వేల కోట్లు, గృహనిర్మాణసంస్థకు రూ. 35 వేల కోట్ల ఆస్తులున్నాయట. వ్యవసాయ, మత్స్య, ఉద్యానవన, డెయిరీ, బీసీ, ఎస్సీ కార్పొరేషన్స్, ఎఫ్‌సీఐ, చేనేత, మార్క్‌ ఫెడ్ తదితర శాఖల ఆధ్వర్యంలో కూడా భారీగా ఆస్తులు, భూములున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి విక్రయాధికారం కనుక కల్పించగలిగితే దేవాదాయ శాఖ పరిధిలో కూడా విలువైన భూములున్నట్లు ఈ నివేదికలో అధికారులు పేర్కొన్నారని తెలిసింది.

ప్రజల ఆస్తులను ప్రజల మేలు కోసమే అమ్ముతున్నామని చెప్పడం సరైందేనా అన్నది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. వృద్ధిలో, లాభాలబాటలో ఉన్న ఒక సంస్థను సరిగ్గా నడపలేక ప్రైవేటుకు అమ్మజూపడం ప్రభుత్వాల, అధికారుల అసమర్థత కాదా? ఆడంబరాలు, అనవసర ఖర్చుల కోసం అప్పులు చేయడం పాలకుల లోపాయికారీతనం కిందికి రాదా? కమీషన్ల కోసం అభివృద్ధి ప్రాజెక్టులను, ఓట్లు.. సీట్లు.. అధికారం కోసం సంక్షేమ పథకాలను ప్రకటించడం ప్రజల ఆస్తులను దుర్వినియోగం చేయడం కాదా? ప్రజల సొమ్మును విచ్ఛలవిడిగా ఖర్చు చేస్తూ చివరకు సర్కారును అడుక్కుతినే భిక్షగాళ్లుగా ప్రజలను తయారుచేయడం నేరంగా పరిగణించరా? ఇవన్నీ అంతుచిక్కని ప్రశ్నలే.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆస్తులను అమ్మాలని, లీజుకు ఇవ్వాలని ఇటీవలే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇలా సమకూరిన ఆదాయాన్ని ఇప్పటికే పేరుకుపోయిన అప్పులు తీర్చడానికి ఉపయోగించాలని, భవిష్యత్తులో నష్టాల నివారణకు తక్షణం బస్సు చార్జీలు పెంచాలని కూడా ఆర్టీసీ అధికారులు ఆ నివేదికలో పేర్కొన్నారు. సీఎం సమక్షంలో జరిగిన సమీక్షలో కూడా ఈ అంశాలు చర్చకు వచ్చాయని కొత్తగా చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు. మూడు నాలుగు నెలలలో సంస్థను ఎట్టి పరిస్థితులలోనూ లాభాల బాట పట్టించాలని, లేదంటే ప్రైవేటుకు అప్పగిస్తామని కూడా కేసీఆర్ హెచ్చరించినట్లు తెలిపారు. ఇప్పటికే సంక్షేమ పథకాలకు ప్రత్యేకించి దళితబంధుకు డబ్బులు సమకూర్చడానికి రాష్ట్రమంతా విస్తరించిన ప్రభుత్వ భూములను అమ్మాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో, ఆర్టీసీని అమ్మకానికి పెడతామనడం చర్చనీయాంశం అయింది. హైదరాబాద్‌ సహా పలు నగరాలు, పట్టణాలలోని ప్రధాన కూడళ్లకు దగ్గరగా ఉన్న ఆర్టీసీ ఆస్తులు, జాగాలపై కొంతమంది అధికార పార్టీ పెద్దలు, పోషకులు కన్నేశారని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. అంతటా కలిపి ఇలా 1,404 ఎకరాల రియల్ ప్రాపర్టీని అమ్మడానికి లేదంటే లీజుకు ఇవ్వడానికి పథకం సిద్ధమైందంటున్నారు. మియాపూర్ డిపో స్థలం ఎవరికో, ఆర్టీసీ కల్యాణమండపం ఎవరికో, ముషీరాబాద్ డిపోల జాగా ఎవరికో, కూకట్‌పల్లి బస్టాండు ఎవరికో, కరీంనగర్ జోనల్ వర్క్‌షాపు ఎవరికో డిసైడ్ కూడా అయిపోయిందనే టాక్ నడుస్తోంది.

కొత్త పాలసీ కాదు

సర్కారు భూముల అమ్మకం అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న పాలసీ ఏమీ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజధాని హైదరాబాద్‌తో‌పాటు ప్రధాన నగరాలలోని వేలాది ఎకరాల భూములను బహిరంగవేలంలో ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు అమ్మేశారు. వచ్చిన ఆదాయాన్ని తను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జలయజ్ఞానికి, సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో కూడా ఈ విధానమే కొనసాగింది. 2004-2014 మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో 88,500 ఎకరాల భూములను అమ్మినట్లు, ఒక్క హైదరాబాద్‌ చుట్టూతా జరిగిన అమ్మకాలలోనే వేలాది కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకున్నట్లు ఇటీవల మంత్రి హరీశ్‌రావు కూడా ఆరోపించారు. తమ చర్యను వ్యతిరేకిస్తున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నష్టాలలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను, ఆస్తులను ప్రైవేటుకు అమ్మివేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. లాభాలలో లేని సర్కారు సంస్థలను అమ్మివేయాలంటూ స్వయానా ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాష్ట్రాలకు లేఖ రాశారని, త్వరలోనే తాము ఆ లేఖను బయటపెడతామని హెచ్చరించారు.

నడుస్తున్న ట్రెండు ఇదే

హరీశ్‌రావు ఆరోపణలన్నీ పచ్చి నిజాలు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుకు అమ్మేయడం అనేది ప్రస్తుతం నడుస్తున్న ట్రెండు. 1947లో స్వాతంత్ర్యానంతరం దేశాన్ని పాలించిన నెహ్రూ, శాస్త్రి, ఇందిరాగాంధీ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించడానికి, అప్పటికే ఉనికిలో ఉన్నవాటిని బలోపేతం చేయడానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. వార్షిక బడ్జెట్లలో ఇందుకోసం భారీగా నిధులు కేటాయించారు. ప్రారంభకాలంలో ఈ సంస్థలు భారీ వృద్ధిరేటును, లాభార్జనను నమోదు చేసుకున్నాయి కూడా. అయితే ప్రభుత్వంలో, పాలక నేతలలో, బ్యురాక్రసీలో పేరుకుపోయిన అవినీతి, అసమర్థత, స్వార్థం, ఆశ్రితపక్షపాతం, బాధ్యతారాహిత్యం క్రమంగా ఈ సంస్థల పనితీరును నీరుగార్చాయి. నలభై యేళ్ల కాలంలో లాభాల బాటలో ఉన్నవి కాస్తా నష్టాల దారిపట్టాయి. చివరకు, సర్కారు ఖజానాకే భారంగా పరిణమించాయి. ఇలాంటి పరిస్థితులలో 1991లో పగ్గాలు చేపట్టిన పీవీ నరసింహారావు ప్రభుత్వం నూతన ఆర్థిక విధానం పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అప్పగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచి నిర్విరామంగా ఈ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతూనేవుంది. పాలించేది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, నేషనల్ ఫ్రంట్ అయినా, చివరకు బెంగాల్‌లాంటి చోట కమ్యూనిస్టులు అయినా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించే విధానాలు కొనసాగుతూనే వున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రైవేటీకరణ విధానాలపై నెత్తీ నోరు బాదుకోవడం, అధికారంలోకి రాగానే అవే విధానాలకు సై అనడం, అమ్మకాల ప్రక్రియలో అందినంత దండుకోవడం ఆనవాయితీగా జరుగుతున్నది. 1991-92 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ప్రభుత్వరంగ సంస్థలను, వాటి పరిధిలో ఉన్న భూములను అమ్మడం ద్వారా రూ. 4లక్షల 47వేల 393 కోట్ల ఆదాయం సమకూరిందంటే పెట్టుబడుల ఉపసంహరణ అనేది ఏ స్థాయిలో, ఎంత వేగంగా జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు.

అది తప్పెలా అవుతుందని

మనం మళ్లీ మంత్రి హరీశ్‌రావు మాటలకే వద్దాం. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను, భూములను అమ్మితే తప్పు కానప్పుడు రైతుబంధు, దళితబంధు, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్ల వంటి ప్రజోపయోగ సంక్షేమ పథకాలకు తాము ఆ పనే చేస్తే తప్పు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. బహుశా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ విషయంలో హరీశ్ కంటే ఇంకా ఎక్కువ స్పష్టత ఉండివుంటుంది. అందుకే ఆయన చాలా ధైర్యంగా, మొండిగా భూముల అమ్మకం ప్రక్రియను ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికి, ప్రజల మంచికి ఇలా చేయడంలో తప్పులేదని నమ్ముతున్నారు. ఇటీవలే ఆయన రాష్ట్రంలోని ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల వివరాలను సేకరించాలని ఆదేశాలిచ్చినట్టు తెలుసింది. సమగ్ర సర్వే తర్వాత అధికారులు ఆయనకు అందించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వరంగ సంస్థలకు సుమారు రూ. 4లక్షల 15వేల కోట్ల ఆస్తులున్నట్లు లెక్కతేలింది. అత్యధికంగా ఆర్టీసీకి రూ. 70వేల కోట్ల విలువైన ఆస్తులుండగా, టూరిజం శాఖకు రూ. 50వేల కోట్లు, గృహనిర్మాణసంస్థకు రూ. 35వేల కోట్ల ఆస్తులున్నాయట. వ్యవసాయ, మత్స్య, ఉద్యానవన, డెయిరీ, బీసీ, ఎస్సీ కార్పొరేషన్స్, ఎఫ్‌సీఐ, చేనేత, మార్క్‌ ఫెడ్ తదితర శాఖల ఆధ్వర్యంలో కూడా భారీగా ఆస్తులు, భూములున్నట్లు సమాచారం. వీటితో పాటుగా ప్రభుత్వానికి విక్రయాధికారం కనుక కల్పించగలిగితే దేవాదాయ శాఖ పరిధిలో కూడా విలువైన భూములున్నట్లు ఈ నివేదికలో అధికారులు పేర్కొన్నారని తెలిసింది.

దేశాభివృద్ధికేనట

పెట్టుబడుల ఉపసంహరణ విధానంలో భాగంగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుకు అప్పగించడం దేశాభివృద్ధి కోసమేనని కేంద్రం వాదిస్తుండగా, తెలంగాణ సర్కారు కూడా ప్రభుత్వభూముల అమ్మకం, లీజుకివ్వడం, ఆర్టీసీ తదితర సంస్థల ప్రైవేటీకరణ ప్రజాసంక్షేమం కోసమేనని చెబుతున్నది. ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు, భూములంటే నిజానికి వాటిని ప్రజల ఆస్తులుగానే భావించాలి. అయినప్పుడు ప్రజల ఆస్తులను ప్రజల మేలు కోసమే అమ్ముతున్నామని చెప్పడం సరైందేనా అన్నది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. వృద్ధిలో, లాభాలబాటలో ఉన్న ఒక సంస్థను సరిగ్గా నడపలేక ప్రైవేటుకు అమ్మజూపడం ప్రభుత్వాల, అధికారుల అసమర్థత కాదా? ఆడంబరాలు, అనవసర ఖర్చుల కోసం అప్పులు చేయడం పాలకుల లోపాయికారీతనం కిందికి రాదా? కమీషన్ల కోసం అభివృద్ధి ప్రాజెక్టులను, ఓట్లు.. సీట్లు..అధికారం కోసం సంక్షేమ పథకాలను ప్రకటించడం ప్రజల ఆస్తులను దుర్వినియోగం చేయడం కాదా? ప్రజల సొమ్మును విచ్ఛలవిడిగా ఖర్చు చేస్తూ చివరకు సర్కారును అడుక్కుతినే భిక్షగాళ్లుగా ఆ ప్రజలను తయారుచేయడం నేరంగా పరిగణించరా? ఇవన్నీ అంతుచిక్కని ప్రశ్నలే.

జవాబు లేని ప్రశ్నలు

ఈ ప్రశ్నలకు సరైన జవాబును ప్రజలు ఎప్పుడు వెదుక్కుంటారు? అసమర్థ పాలనతో దేశాన్ని లేదా రాష్ట్రాన్ని దివాళా తీయించే ప్రభుత్వాలు తమను పాలించడాన్ని ఒప్పుకుంటారా? లేదంటే ప్రభుత్వాలను సైతం అమ్మేసి వచ్చిన డబ్బులను పౌరులందరికీ సమంగా పంచమని, ఆ డబ్బులతో ప్రైవేటుగా తామే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటామని డిమాండు చేస్తారా? కాలమే పరిష్కారం చూపాలి.

డి మార్కండేయ

Advertisement

Next Story

Most Viewed