- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యూపీలో తెలంగాణ పాలిటిక్స్
తమ పార్టీ అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ తరఫున ప్రచారం చేస్తుందని మంత్రి కేటీఆర్ ఆ మధ్య ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో అక్కడ ఎస్పీయే గెలుస్తుందని ట్వీటారు కూడా. మంత్రులు శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ తదితరులు టీం కేటీఆర్ పేరిట అక్కడకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తారని తెలంగాణ భవన్ వర్గాల భోగట్టా. ఇటీవలే బీహార్ యువనేత, ఆర్జేడీ అధ్యక్షుడు అయిన తేజస్వి యాదవ్ హైదరాబాద్ వచ్చి సీఎం కేసీఆర్‌ను కలిసి మంతనాలు జరిపిన విషయం అందరికీ తెలిసిందే. ములాయం కుటుంబానికి అతిదగ్గరి బంధువు అయిన తేజస్వి అఖిలేశ్ తరఫున మాట్లాడడానికే ఇక్కడికి వచ్చారని మీడియా కోడై కూసింది.
యూపీలో ఎంఐఎం పోటీపై బీజేపీ వ్యతిరేక క్యాంపులో, సెక్యులర్‌వాదుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న వంద స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తే ఆ వర్గం ఓట్లు చీలి చివరికి బీజేపీకే లాభం కలుగుతుందని వారు విమర్శిస్తున్నారు. ఇప్పటివరకూ ఆ రాష్ట్ర మైనారిటీలు అయితే ఎస్పీకి, లేదంటే బీఎస్పీకే ఓటేస్తూ వస్తున్నారు. ఇప్పుడు వారిలో కొందరు ఎంఐఎంకు వేసిన పక్షంలో ఆ పార్టీల అభ్యర్థులకు నష్టం కలగడం ఖాయమంటున్నారు. బీజేపీ తమ ప్రధాన శత్రువని ప్రకటించే అసద్.. ఎస్పీ, బీఎస్పీలతో పొత్తుకు ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇందులో కమలనాథులకు పరోక్ష ప్రయోజనం కలిగించే కుట్ర దాగివుందని ఆరోపిస్తున్నారు.
ఈ ద్వంద్వ వైఖరి నిజంగానే కేసీఆర్‌కు లాభిస్తుందా? 2024 లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ఆయనే చక్రం తిప్పనున్నారా? తనయుడు కేటీఆర్‌కు ఇక్కడ సీఎం కుర్చీ అప్పగించి తను అయితే థర్డ్ ఫ్రంట్ లేదంటే ఎన్డీయేతో అవగాహనకు వచ్చి ఢిల్లీ రాజకీయాల్లో బిజీ కానున్నారా? రాష్ట్ర స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటిస్తూ అసెంబ్లీ ఎన్నికల అనంతరం టీఆర్ఎస్‌కు మెజారిటీ రానిపక్షంలో ఏదో ఒక పార్టీ తనకు మద్దతు ఇచ్చే పరిస్థితి తెచ్చుకుంటున్నట్లే.. కేంద్ర స్థాయిలో కూడా అలాగే చేయనున్నారా? మోడీ, రాహుల్, మమత లేదా మరొకరు.. ఎవరు ప్రభుత్వం ఏర్పరచినా అందులో టీఆర్ఎస్‌కు భాగస్వామ్యం ఉండనుందా?
ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇటీవలే విడుదల చేసింది. దేశంలోనే అత్యధికంగా 80 లోక్‌సభ, 403 శాసనసభ స్థానాలను కలిగిన యూపీ పోలింగ్ ఫిబ్రవరి 10న ప్రారంభమై ఏడు దశలలో కొనసాగి మార్చ్ 7న ముగియనుంది. ఫలితాలు అదే నెల 10న వెలువడనున్నాయి. ఈ రాష్ట్ర ఫలితాల సరళే ఆ తర్వాత వచ్చే సాధారణ ఎన్నికలలో కేంద్రంలో ఎవరు అధికారం చేపడతారన్న విషయాన్ని నిర్ణయిస్తుందని గత చరిత్రను విశ్లేషిస్తే మనకు అర్థమవుతుంది. అనగా 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్‌డీఏ) తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ పీపుల్స్ అలయెన్స్ (యూపీఏ)ది పైచేయి అవుతుందా? లేదంటే మధ్యలో థర్డ్ ఫ్రంట్ ఏర్పడి ఏ మమతనో, అఖిలేశో ప్రధానమంత్రి అవుతారా? అన్నది మాత్రం ఈ యూపీ ఎన్నికల ఫలితాలే డిసైడ్ చేస్తాయి. అందుకే ఇప్పుడు దేశం దృష్టి అంతా ఈ రాష్ట్రంపైనే ఉంది.
ఓటు కోసం నానా తంటాలు
యూపీలో మరోసారి గెలవడానికి బీజేపీ తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నది. ప్రధాని మోడీ అక్కడ విస్తృతంగా పర్యటిస్తుంటే వ్యూహకర్త అమిత్ షా చాణక్యపాత్ర నిర్వహిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ సీఎంగా గత ఐదేళ్ల పాలన మీద ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడం గమనించి ఆయనను మార్చడానికి మధ్యలో ప్రయత్నాలు జరిగినా, చివరకు భవ్య రామమందిర నిర్మాణం సెంటిమెంటు ప్రధానంగా ప్రచారం నిర్వహించనున్న నేపథ్యంలో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. పలు ఎక్స్‌ప్రెస్ వేలు సహా అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. డబుల్ ఇంజన్ డెవలప్‌మెంట్ పేరిట ఓటర్లను ఆకర్షించడానికి యోగి సర్కారు నానా తంటాలు పడుతోంది. హామీల వర్షం కురిపిస్తోంది. ఇక, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ కూడా ఈసారి పకడ్బందీ వ్యూహంతో రంగంలో దిగుతోంది. జాట్ సామాజికవర్గంలో ప్రాబల్యమున్న రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్‌డీ)తో పొత్తు కుదుర్చుకుంది. ముస్లిం, బీసీ కార్డు ప్లే చేయబోతున్నది. యోగి పాలనపై ఉన్న ప్రజావ్యతిరేకత, దిగజారిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) ప్రతిష్ట చివరకు తమను గద్దెనెక్కిస్తుందనే నమ్మకంతో ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఉన్నారు. పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ వ్యతిరేకవర్గాల, పార్టీల ఓట్లన్నీ చివరకు తమ వైపునకే పోలరైజ్ కాకతప్పదనే అంచనా వేస్తున్నారు.
ఒంటరిగా బరిలోకి
ఒంటరిగానే అన్ని స్థానాలలో పోటీ చేస్తామని ప్రకటించిన మాయావతి నేతృత్వంలోని బీఎస్‌పీ ఊపు ఈసారి అంతగా కనిపించడంలేదు. ఆ పార్టీకి చెందిన పలువురు ముస్లిం నేతలు ఎస్‌పీలో చేరడమే కాకుండా, దళితుల ఓట్లలో కూడా ఈసారి భారీ చీలిక తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో క్రమంగా క్షీణించిపోతున్నది. గత ఎన్నికలలో 114 స్థానాలలో పోటీ చేసినా కేవలం ఏడింటిలోనే గెలిచింది. పలు స్థానాలలో డిపాజిట్లు కూడా దక్కలేదు. అయితే, ఈసారి తాము ఒంటరిగానే 403 సీట్లలోనూ పోటీ చేస్తామని ఆ పార్టీ నేత ప్రియాంకగాంధీ ప్రకటించారు. పై ఐదు పార్టీలు కాకుండా మిగిలిన చిన్నాచితక పార్టీలు ఏవీ గత ఎన్నికలలో తమ అస్తిత్వాన్ని నిరూపించుకోలేకపోయాయి.
మంతనాలు అందుకేనా?
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. యూపీ ఎన్నికలలో తెలంగాణకు చెందిన రెండు పార్టీలు కీలకపాత్ర పోషించబోతున్నాయి. తమ పార్టీ అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ తరఫున ప్రచారం చేస్తుందని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆ మధ్య ప్రకటించారు. రాబోయే ఎన్నికలలో అక్కడ ఎస్పీయే గెలుస్తుందని ట్వీటారు కూడా. మంత్రులు శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ తదితరులు టీం కేటీఆర్ పేరిట అక్కడకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తారని తెలంగాణభవన్ వర్గాల భోగట్టా. ఇటీవలే బీహార్ యువనేత, ఆర్జేడీ అధ్యక్షుడు అయిన తేజస్వి యాదవ్ హైదరాబాద్ వచ్చి సీఎం కేసీఆర్‌ను కలిసి మంతనాలు జరిపిన విషయం అందరికీ తెలిసిందే. ములాయం కుటుంబానికి అతిదగ్గరి బంధువు అయిన తేజస్వి అఖిలేశ్ తరఫున మాట్లాడడానికే ఇక్కడికి వచ్చారని మీడియా కోడై కూసింది. యూపీ ఎన్నికలలో ఎస్‌పీకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఆయన కోరారని, గులాబీ బాస్ అందుకు సమ్మతించారని కూడా వార్తలు వెలువడ్డాయి.
ఎంఐఎం కల నెరవేరేనా?
ఇక తెలంగాణకు చెందిన మరో ప్రధానపార్టీ, అధికార పార్టీకి మిత్రపక్షం అయిన ఎంఐఎం తాము యూపీలో వంద సీట్లలో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ముస్లిం మైనారిటీలకు ప్రాతినిధ్యం వహించే ఏకైక జాతీయ పార్టీగా ఎదగాలనే లక్ష్యంతో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని ఏడు అసెంబ్లీ స్థానాలు కాకుండా మహారాష్ట్రలో ఒక ఎంపీ, రెండు ఎమ్మెల్యే సీట్లను, బీహార్‌లో ఐదు ఎమ్మెల్యే సీట్లను ఆ పార్టీ గెలుచుకుంది. జనాభాలో 19 శాతంగా ఉన్న ముస్లిం ఓటర్లను ఆకర్షించడం ద్వారా యూపీలోనూ రెండంకెల సంఖ్యలో స్థానాలను సాధించి కింగ్ మేకర్‌గా నిలవాలని అసదుద్దీన్ ఎత్తులు వేస్తున్నారని దారుసలేంవర్గాల సమాచారం. గత రెండు సవత్సరాల నుంచీ ఆయన యూపీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముస్లిం మతపెద్దలను కలుస్తున్నారు. భారీ బహిరంగసభలను సైతం నిర్వహిస్తున్నారు. గత ఎన్నికలలో 38 సీట్లలో పోటీ చేసి ఒక్క స్థానాన్ని కూడా గెలువలేకపోయినా ఈసారి భారీ ఆశలతో బరిలో దిగుతున్నది.
నిజంగా అది కుట్రేనా?
అయితే, యూపీలో ఎంఐఎం పోటీపై బీజేపీ వ్యతిరేక క్యాంపులో, సెక్యులర్‌వాదులలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న వంద స్థానాలలో ఎంఐఎం పోటీ చేస్తే ఆ వర్గం ఓట్లు చీలి చివరికి బీజేపీకే లాభం కలుగుతుందని వారు విమర్శిస్తున్నారు. ఇప్పటివరకూ ఆ రాష్ట్ర మైనారిటీలు అయితే ఎస్పీకి, లేదంటే బీఎస్పీకే ఓటేస్తూ వస్తున్నారు. ఇప్పుడు వారిలో కొందరు ఎంఐఎంకు వేసిన పక్షంలో ఆ పార్టీల అభ్యర్థులకు నష్టం కలగడం ఖాయమంటున్నారు. బీజేపీ తమ ప్రధాన శత్రువని ప్రకటించే అసద్ ఎస్పీ, బీఎస్పీలతో పొత్తుకు ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇందులో కమలనాథులకు పరోక్ష ప్రయోజనం కలిగించే కుట్ర దాగివుందని ఆరోపిస్తున్నారు. నిజానికి ఈ ఎన్నికలలో ఎంఐఎం బీజేపీకి 'బి' టీంగా వ్యవహరించబోతోందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ ప్రశ్నలకు బదులేదీ?
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సీనియర్ ఓవైసీ వ్యక్తిగతంగా కేసీఆర్‌కు ఆప్తుడు. చిరకాల మిత్రుడు. ఆ విషయాన్ని ఇద్దరు నేతలూ పలు సందర్భాలలో మీడియాతో పంచుకున్న మాట వాస్తవం. తెలంగాణ వచ్చినప్పటి నుంచీ టీఆర్ఎస్, ఎంఐఎం మిత్రపక్షాలుగానే కొనసాగుతున్నాయి. అప్పుడప్పుడు జూనియర్ ఓవైసీ అసెంబ్లీలో అధికార పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం మినహా రెండు పార్టీల మధ్య ఏ సందర్భంలోనూ ఘర్షణ వాతావరణం ఏర్పడలేదు. అలాంటప్పుడు కేంద్రంపై, బీజేపీపై ఇక యుద్ధమేనని బహిరంగంగా ప్రకటించిన కేసీఆర్, తన మిత్రుడు అసద్‌ను ఎస్‌పీకి అనుకూల వైఖరి తీసుకునేలా ఎందుకు ఒప్పించడం లేదు? ఆ రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు కుదర్చడానికి ఎందుకు చొరవ చేయడం లేదు? అలా చేస్తే తాను భావిస్తున్నట్లుగా బీజేపీపై పగ సాధించడమే కాకుండా వచ్చే సాధారణ ఎన్నికలలో కేంద్రంలో థర్డ్ ఫ్రంట్‌ను అధికారంలోకి తేవడం ఈజీ అవుతుంది కదా! ఈ వ్యూహాన్ని టీఆర్ఎస్ అధినేత ఎందుకు అనుసరించడం లేదు? ఇవన్నీ విశ్లేషకులకు అంతుబట్టని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి.
సురక్షిత ప్రయాణం
నిజానికి కేసీఆర్ రెండు పడవలలో రెండు కాళ్లు పెట్టి ప్రయాణించే వైఖరిని అనుసరిస్తున్నారన్న వాదన ఒకటి ఉంది. ఓ వైపు ఎస్‌పీకి సహకరించడం ద్వారా థర్డ్ ఫ్రంట్‌లో భాగస్వామ్యం కావడానికి ప్రయత్నిస్తూనే, మరోవైపు అవసరమైన పక్షంలో బీజేపీతో సైతం చేతులు కలుపడానికి ముందస్తు బాటలు వేసుకుంటున్నారు. రేపటి ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసే వంద స్థానాల్లో ముస్లిం ఓట్ల చీలిక మూలంగా ఎస్‌పీ లేదా బీఎస్‌పీ అభ్యర్థులు ఓడిపోయి కమలనాథులు అక్కడ అధికారం చేపడితే ఆ క్రెడిట్ తనదేనని చెప్పుకునే పరిస్థితిని కల్పించుకుంటున్నారు. ఆ వంద స్థానాలలో ఎంఐఎం గట్టి పోటీ ఇవ్వడానికి అవసరమైన ఆర్థిక సహకారం టీఆర్ఎస్ అధినేత అందజేస్తారన్న టాక్ ఢిల్లీ వర్గాలలో వినపడుతోంది కూడా.
చివరకు ఏం జరుగుతుంది?
ఈ ద్వంద్వ వైఖరి నిజంగానే కేసీఆర్‌కు లాభిస్తుందా? 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో ఆయనే చక్రం తిప్పనున్నారా? తనయుడు కేటీఆర్‌కు ఇక్కడ ముఖ్యమంత్రి కుర్చీ అప్పగించి తను అయితే థర్డ్ ఫ్రంట్ లేదంటే ఎన్‌డీఏతో అవగాహనకు వచ్చి ఢిల్లీ రాజకీయాలలో బిజీ కానున్నారా? రాష్ట్ర స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్‌కు సమదూరం పాటిస్తూ అసెంబ్లీ ఎన్నికల అనంతరం తమకు మెజారిటీ రానిపక్షంలో ఏదో ఒక పార్టీ తనకు మద్దతు ఇచ్చే పరిస్థితి తెచ్చుకుంటున్నట్లే, కేంద్ర స్థాయిలో కూడా అలాగే చేయనున్నారా? మోడీ, రాహుల్, మమత లేదా మరొకరు, ఎవరు ప్రభుత్వం ఏర్పరచినా అందులో టీఆర్ఎస్‌కు భాగస్వామ్యం ఉండనుందా? ఎట్టకేలకు కేటీఆర్‌కు సీఎం యోగం పట్టనుందా? ఏం జరగనుంది?
-డి మార్కండేయ
- Tags
- Marokonam