- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సుఖజీవులు నశించాలి
మనుగడ కోసం పోరాటం చేసిన క్రమంలోనే మానవుడు ప్రస్తుత ఈ రూపానికి పరిణామం చెందాడని ప్రముఖ జీవ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ సిద్ధాంతం మనకు చెబుతుంది. ఏకకణ జీవుల నుంచి బహుకణ జీవులు, జలచరాల నుంచి ఉభయచరాలు, భూచరాలు ఉద్భవించాయని, ఈ పరిణామ క్రమంలోనే డైనోసార్లు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఉనికిలోకి వచ్చాయని, కోతి నుంచి చివరకు మానవుడు రూపుదిద్దుకున్నాడని ఆయన రెండు వందల ఏళ్ల క్రితమే ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతాన్ని ప్రపంచమంతా ఆమోదించింది కూడా. ఈ పరిణామ దశలన్నింటిలోనూ శ్రమ కీలక పాత్రను పోషించిందని ఆయన నొక్కి చెప్పారు. ఆహారం కోసం వేటలో భాగంగానే నాలుగు కాళ్ల జీవి కాస్తా పైకి లేచి నిలబడిందని, చేతులలోకి పనిముట్లు వచ్చాయని చెప్పారు. రెండు కాళ్లపై నిలబడిన మానవుడు నిత్యం బతుకు పోరాటం చేస్తూ ప్రస్తుత నాగరిక దశకు చేరుకున్నాడని వెల్లడించారు. మనుగడ కోసం పోరాటం, శ్రమ ఈ రెండూ లేని ప్రపంచాన్ని ఊహించలేమని సిద్ధాంతీకరించారు. కమ్యూనిస్టు సిద్ధాంతకర్తలు మార్క్స్-ఎంగెల్స్ కూడా మానవ శ్రమ మూలంగానే సమాజం పురాతన యుగం నుంచి ఆధునిక యుగానికి పరిణామం చెందిందని, ఈ క్రమంలోనే ఉత్పత్తి సాధనాలు అభివృద్ధి చెంది పారిశ్రామిక విప్లవానికి నాంది పడిందని ప్రవచించారు.
ఇంగిత జ్ఞానాన్ని మరిచి
ఇదంతా చెప్పడంలో నా ఉద్దేశం ప్రస్తుతం మనం ఉన్న ఈ డిజిటల్ యుగపు మూలాలు మానవ శ్రమలోనే దాగివున్నాయని. మనుగడ కోసం చేసిన పోరాటం నుంచే ఆధునిక సాంకేతికత పుట్టిందని. ఆ శ్రమే లేకపోతే ఈ ఫోన్లూ, కంప్యూటర్లూ, ఇంటర్‌నెట్లూ, ఆన్‌లైన్ లైఫ్, వర్చువల్ వరల్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వగైరా ఉండేవి కావని. ఇక్కడిదాకా వచ్చేవాళ్లం కాదని. ఏ చింపాంజీలుగానో, ఎక్కువలో ఎక్కువ ఆదిమ మానవులుగానో మిగిలిపోయేవాళ్లమని. అయితే, ఇంత గొప్ప ప్రాధాన్యం ఉన్న శ్రమ పాత్రను ప్రస్తుత డిజిటల్ మానవుడు తెలిసో తెలియకో నిర్లక్ష్యం చేస్తున్నాడు. కష్టం నుంచి సుఖం వైపు పరుగులు తీస్తున్నాడు. కష్టపడకుండా సుఖపడడం ఎలాగో దారులు వెతుక్కుంటున్నాడు. తోటి మానవులన్న ఇంగితం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. స్వార్థమే పరమార్థంగా జీవనం సాగిస్తున్నాడు. బంధాలను, అనుబంధాలను, సామాజిక సంబంధాలను, వావి వరసలను మరచి తను మాత్రం బాగుంటే చాలని నమ్ముతున్నాడు. ఎదుటోడిని ముంచినా, మోసం చేసినా, వాడు బాధలతో చస్తున్నా, లంచం ఇచ్చినా, పుచ్చుకున్నా.. తప్పులేదని, తను మాత్రం సుఖంగా ఉంటే చాలనే ఫిలాసఫీని పాటిస్తున్నాడు.
సంపద పోగుపడుతున్నా
ఒకప్పుడు వంద మంది కష్టపడితే ఒక్కరు సుఖంగా జీవించగలిగేంత సంపద సృష్టి జరిగేది. యాంత్రిక యుగంలో ఇప్పుడు ఒక్కరు కష్టపడితే చాలు వంద మంది సుఖంగా జీవించగలిగేంత సంపద పోగుపడుతోంది. అయినా సమాజంలో ఒకవైపు దారిద్ర్యం, పేదరికం పెరిగిపోతోంది. ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నారు. విద్య, వైద్యం, నివాసం వంటి కనీస సౌకర్యాలు లేకుండానే బతుకుతున్నారు. మరోవైపు, లక్షలున్నోళ్లు కోట్లకు.. కోట్లున్నోళ్లు వేల కోట్లకు పడగలెత్తుతున్నారు. బిలియనీర్ల సంపద వేగంగా వృద్ధి చెందుతోంది. అనగా కష్టం చేసే నిష్పత్తిలో సంపద పంపకం జరగడం లేదు. శారీరక శ్రమ, మానసిక శ్రమ మధ్యలో తేడా ఉండదా? పెట్టుబడి పెట్టిన వాళ్లకు లాభాలు రావడంలో తప్పేముంది? అని కొందరు వాదించవచ్చు. అలాంటి తేడాలున్నంత మాత్రాన గొడ్డు కష్టం చేసేవాడు ఎంగిలి మెతుకులకు అర్రులు చాచాలని, ఆన్‌లైన్‌లో పనిచేసే వాడు కార్లల్లో తిరగాలని ఎక్కడా రాసిపెట్టిలేదు. పెట్టుబడి లేనివాడు గరీబుగానే ఉండాలని, తెలివిని పెట్టుబడి చేసుకుని దోపిడి చేయడం నేర్చుకున్నవాడు కుబేరుడు కావాలనీ కాదు. ఇవన్నీ సమాజ పరిణామ క్రమంలో కొన్ని స్వార్థపూరిత శక్తులు, వర్గాలు తయారుచేసిన వేదాంతాలు, సిద్ధాంతాల ప్రభావ ఫలితమే తప్ప మరొకటి కాదు.
వారిని ఆదర్శంగా తీసుకుని
ఈ వేదాంతాలు, సిద్ధాంతాల మూలంగానే ప్రస్తుతం మనం డిజిటల్ యుగం నుంచి క్షీణ యుగంలోకి ప్రవేశించబోతున్నామా? ఓ అంబానీని, మరో అదానీని ఆదర్శంగా తీసుకుని అందరూ రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోవాలని కలలు కంటున్నారు. వందలలో సంపాదనున్నోళ్లు వేలల్లోకి వెళ్లాలని, వేలల్లో సంపాదనున్నోళ్లు లక్షలకు వెళ్లాలని అర్రులు చాస్తున్నారు. త్రిశంకు జీవితం గడిపే మధ్యతరగతి సైతం ధనికవర్గంలో చేరిపోవాలని పరితపిస్తున్నది. అలా కోరుకోవడంలో తప్పేముందని మీరనవచ్చు. అక్కడే ఉంది అసలు కిటుకు. కష్టపడకుండానే డబ్బులు సంపాదించాలని, రిస్క్ లేకుండానే సుఖపడిపోవాలన్న భావం వీళ్లలో క్రమంగా నాటుకుపోతున్నది. పాలకవర్గాలు, ప్రభుత్వాలు కూడా కష్టపడే తత్వాన్ని అలవర్చడం కాకుండా 'ఉచిత' పథకాల పేరిట ప్రజలలో శ్రమకు దూరమయ్యే ధోరణిని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రోత్సహిస్తున్నాయి.
ఈజీ మనీకి అలవాటు పడి
ఫలితంగా పల్లెలలో, పట్టణాలలో శ్రమ సంస్కృతి స్థానంలో సుఖం కోరుకునే తత్వం పెరిగిపోతున్నది. ఓ రైతు ఉంటాడు. తను పొద్దంతా పొలంలో పనిచేస్తాడు. తన పిల్లలు చదువుకుని ఏ డాక్టరో, ఇంజనీరో అయి సుఖపడాలనుకుంటాడు. షాపులో పనిచేసే గుమాస్తా ఉంటాడు. తన వారసులు తనలా కష్టపడకుండా చదువుకుని గవర్నమెంట్ ఉద్యోగం పొంది కాలు మీద కాలు వేసుకుని కూర్చుని సంపాదించాలనుకుంటాడు. వాళ్ల ఉద్దేశంలో ఇక్కడ చదువుకోవడమంటే శ్రమ చేయకుండా డబ్బులు సంపాదించడం. అంతెందుకు? ఇప్పుడు కెనాల్ నీళ్ల పారకం వచ్చిన తర్వాత పల్లెలలో చాలా మార్పు వచ్చింది. భూములున్న ఆసాములు కష్టపడడం మానేశారు.సెల్లులతో కరెంటు మోటార్లు ఆన్-ఆఫ్ చేస్తూ రోజుకొకసారి వెళ్లి గట్ల వెంట తిరిగి వస్తున్నారు. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, నాటు వేసే యంత్రాలు వచ్చాక కొందరు మహిళలు, భూమిలేని వ్యవసాయ కూలీలు మాత్రమే పొలం పనులకు వెళ్తున్నారు. పట్టణాలలో సైతం ఇదే పరిణామ క్రమం కొనసాగుతున్నది. రోజురోజుకు మనుషులు శ్రమకు దూరమై ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు.
అలాంటి చట్టాలు రూపొందాలి
ఇక్కడ నా ఉద్దేశం ఎవరినీ కించపర్చడం కాదు. యంత్రాలు రావాల్సిందే. వాటితో ఉత్పత్తి పెంచాల్సిందే. నిపుణులు, ఐటీ ఉద్యోగులు పనిచేయాల్సిందే. కొత్త కొత్త సాఫ్ట్‌వేర్లు, పరికరాలు కనిపెట్టాల్సిందే. అయితే, మనిషి శ్రమకు దూరం కాకూడదు. సృష్టించిన సంపద పంపిణీలో అసమానతలు ఉండకూడదు. అందరూ విద్యావంతులవ్వాలి. అందరూ కష్టపడాలి. అందరూ ఆరోగ్యకర జీవనం కొనసాగించాలి. పర్యావరణాన్ని కాపాడుకోవాలి. మానసిక శ్రమను శారీరక శ్రమతో మేళవించే పద్ధతులు రావాలి. రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయడమెందుకు? పొద్దున్నే లేచి జిమ్‌లకు వెళ్లి వర్క్ అవుట్ చేయడమెందుకు? కార్లలో, బైకులలో ఆఫీసులకు వెళ్లడమెందుకు? పొద్దున్నే వాకింగ్, జాగింగ్ చేయడమెందుకు? అవి చేయలేని లక్షలాది మంది బ్యాక్ పెయిన్, ఎసిడిటీ, షుగర్, బీపీ, పైల్స్, ఊబకాయం, డిప్రెషన్ వంటి లైఫ్ స్టైల్ రోగాలతో సతమతమవడమెందుకు? మానసిక శ్రమను శారీరక శ్రమతో అనుసంధానించే విధానాలను రూపొందించలేమా? మనిషి తలుచుకుంటే అది సాధ్యం కాదా? ప్రభుత్వాలు ఆ దిశగా ఎందుకు ఆలోచించవు? విద్యా విధానాన్ని, పని సంస్కృతిని, అసమ సంపద పంపిణీని మార్చే చట్టాలు ఎందుకు చేయవు? ఇవన్నీ ఆలోచించదగిన ప్రశ్నలే.
చివరగా ఒకమాట. హెచ్‌జీ వెల్స్ రాసిన 'టైం మెషీన్'ను, కొన్ని సైంటిఫిక్ ఫిక్షన్ సినిమాలను స్ఫూర్తిగా తీసుకున్న నా మిత్రుడొకరు ఒక విషయాన్ని కుండబద్దలు కొట్టాడు. భవిష్యత్తులో మానవుడి ఆకారం పెద్దసైజు కోడిగుడ్డు ఆకారంలోకి మారిపోతుందట. ఆ ఆకారానికి కాళ్లు, చేతులు ఏవీ ఉండవట. రక్తప్రసరణ, నాడీ, జీర్ణ వ్యవస్థలు కుంచించుకుపోయి శరీరమంతటినీ మెదడే ఆక్రమిస్తుందట. ఆ గుండ్రని ఆకారం కదలకుండా ఒకేచోట ఉండి మనసులో అనుకుంటే చాలు రోబోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారైన పరికరాలు అన్ని పనులూ చేసి పెడతాయట. చివరకు తినడం కూడా ఆన్లైన్‌లోనే జరుగుతుందట! వినడానికి నవ్వులాటగా అనిపించినా ఆలోచించాల్సిన విషయమే కదా!
అందుకే, సుఖజీవులు నశించాలి!
కష్టజీవులు వర్ధిల్లాలి!!
-డి మార్కండేయ
- Tags
- Marokonam