- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజాస్వామ్యమా! పైసలస్వామ్యమా?
ఎన్నికల్లో నిబంధనల పరిమితికి మించి ఖర్చు పెట్టరాదని, ప్రధానంగా డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభ పెట్టరాదని స్పష్టంగా రాజకీయ నేతలతో పాటు ప్రజలకు కూడా తెలుసు. కానీ అవి లేకుండా ఎన్నికల్లో విజయం సాధించలేమనే వాస్తవం కూడా నేతలకు తెలియంది కాదు. అందుకే ఎన్ని అక్రమాలకు పాల్పడి అయినా మరెన్ని అడ్డదారులు తొక్కి అయినా విజయాన్ని సాధించాలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో ఈ పార్టీ, ఆ పార్టీ అనికాదు. ఎవరి శక్తిమేరకు ఎక్కడ అవకాశాలుంటే అక్కడ నిబంధనలను తుంగలో తొక్కి డబ్బును మంచినీరులా ఖర్చుపెడుతున్నారు. మద్యాన్ని ఏరులా పారిస్తున్నారు.
ఎన్ని హెచ్చరికలు చేసినా..
ప్రస్తుతం దేశంలో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, మిజోరం శాసనసభలకు జరుగుతున్న ఎన్నికల్లో ఇప్పటికే పెడుతున్న ఖర్చు ఊహలకు అందడం లేదు. ఇప్పటివరకు తెలంగాణలోనే దాదాపు రూ. 500 కోట్లకు పైగా విలువ కలిగిన మద్యం, చీరలు, బంగారం, డబ్బు పట్టుబడింది. ఇవి పోలీసుల తనిఖీల్లో పట్టుబడినవి మాత్రమే! అయితే, పట్టుబడింది సరఫరా అవుతున్న దాంట్లో పదోవంతు కూడా ఉండకపోవచ్చునని అంటున్నారు. నిజానికి శాసనసభ నియోజకవర్గంలో ఒక్కొక్క అభ్యర్థి పెట్టే ఖర్చుపై నలభై లక్షల పరిమితి ఉంది. అంతకుమించి వెచ్చించడానికి చట్టం అంగీకరించదు. కానీ అభ్యర్థులు పెడుతున్న వ్యయం ప్రజాస్వామ్య వాదుల్లో విస్మయం కలిగిస్తున్నది. దాదాపు ప్రతి నియోజకవర్గంలో కనిష్టంగా పదికోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అసలు ఇది ప్రజాస్వామ్యమా? పైసలస్వామ్యమా? ఒకపక్క కోట్లాది రూపాయలు పట్టుబడుతున్నప్పటికీ, మరొకపక్క జంకు బొంకు లేకుండా నిరాటంకంగా పంపిణీ కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. బుజ్జగింపుల పర్వంలో కూడా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల సంఘం ఎన్ని హెచ్చరికలు చేసినా, మరొకపక్క ఆకస్మిక దాడులు నిర్వహించి మద్యం, డబ్బు స్వాధీనం చేసుకొని కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నా ఇవేమీ ఆగడం లేదు. అసలు పోలీసులన్నా, చట్టాలన్నా భయం లేకుండా పోతుంది. అందుకు చట్టాల్లోని లొసుగులు, కొందరు అవినీతి అధికారుల చేతి వాటమే కారణం కావచ్చు. ఎన్ని కోట్ల రూపాయలు పట్టుబడుతున్నా, కేసులు నమోదవుతున్నా శిక్షలు వేయించడంలో దర్యాప్తు అధికారులు విఫలమవుతున్నారని చెప్పొచ్చు.
మిథ్యగా ఎన్నికల ప్రక్రియ!
2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 1649 కేసులు నమోదుకాగా అందులో శిక్ష పడింది వందలోపు కేసులకు మాత్రమే. న్యాయ విచారణలో ఎన్నో వందలాది కేసులు నేటికీ పెండింగ్‌లో ఉండగా, మరికొన్ని దర్యాప్తు దశలోనే కొనసాగుతున్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టాలనుకున్నా, రెచ్చగొట్టేలా ప్రచారం చేసినా వాటికి చట్టంలో శిక్షలు ఉన్నాయి. కానీ వాటిని ఏమాత్రం పాటించరు! రాజకీయ సభలు నిర్వహించాలంటే కోట్లల్లో ఖర్చు పెట్టాల్సిందే. ఇది అందరికి తెలిసిన బహిరంగ రహస్యం. కానీ వారిపై తీసుకున్న చర్యలను పరిశీలిస్తే, ఎలక్షన్ కమిషన్ సామర్థ్యం ఏమిటో చెప్పకనే చెబుతున్నది. అందుకే ఈ డబ్బు, మద్యం పంపిణీ ఏడాదికేడాది పెరిగిపోతున్నది. ఇది ఒక్క తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అన్నిపార్టీలు కలిసి దాదాపు రూ.35 వేలకోట్లకు పైగా ఖర్చు చేసినట్లు అధికార అంచనాలే చెబుతున్నాయి. 2019 ఎన్నికలు వచ్చేసరికి అది రూ. 50 వేల కోట్లకుపైగా చేరుకున్నదని అంచనా. ఈ లెక్కన వచ్చే ఎన్నికలకు ఖర్చు లక్ష కోట్లకు చేరినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో ఇలా ఖర్చు పెట్టడం, తిరిగి సంపాదించుకోవడంలో కూడా నేతలు పోటీ పడుతున్నారు. అందుకే కొందరు రాజకీయ నాయకుల ఆస్తులు అంచనాలకు మించి వందల రెట్లు పెరుగుతున్నాయి. ఫలితంగా ఎన్నికల ప్రక్రియ ఒక మిథ్యగా మారిపోతున్నదని ప్రజాస్వామ్య వాదుల ఆందోళన. ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికలు ప్రాణం వంటివి. కానీ అవి వ్యాపారంగా మారి ఖరీదైపోయాయి. ఓట్లకు వెల కట్టే దురదృష్టపు పరిస్థితులు దాపురించాయి. ఈ ఎన్నికలకు ఎన్నికల కమిషనే ఊపిరి. అందుకే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాజకీయ ఒత్తిడులకు లొంగకుండా రాగద్వేషాలకు అతీతంగా స్వతంత్ర ప్రతిపత్తి హోదాతో ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా పని చేయగలిగితే కొంతవరకైనా ప్రజాస్వామ్యం పరిరక్షింపబడుతుంది. ఇలాగే కొనసాగితే పైసలస్వామ్యంగా మారిపోక తప్పదు.
సభావట్ కళ్యాణ్
ఏబీవీపీ రాష్ట్ర నాయకులు
90143 22572