ప్రకృతిలో మానవుని పాత్రే కీలకం!

by Ravi |   ( Updated:2023-06-05 23:01:01.0  )
ప్రకృతిలో మానవుని పాత్రే కీలకం!
X

ప్రకృతి లేకుంటే మానవ మనుగడ లేదు. సమస్త జీవకోటి నివసించేది ఈ ప్రకృతి ఒడిలోనే. మానవులు జంతువులు సైతం ప్రకృతి ప్రేమికులే. ప్రకృతిని సంరక్షించాల్సిన బాధ్యత ముమ్మాటికి మానవునిదే. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాత్రులు కావాల్సిందే. పర్యావరణాన్ని కాపాడాలంటే మనం ఏదో టన్నుల బరువును మన ఒంటిపై మోయాల్సిన పనిలేదు. బాధ్యతగా మొక్కలను పెంచి వాటిని సంరక్షించడమే ప్రధాన కర్తవ్యం. ప్రతి మానవుడు తన వంతు బాధ్యతగా తాను నివసించే పరిసర ప్రాంతాలలో చెట్లను పెంచాలి. చెట్లను పెంచడం వలన వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయి, దీనివల్ల ఆహార కొరత ఉండదు.

ప్లాస్టిక్‌పై అవగాహన కరువు

పర్యావరణాన్ని అధికంగా కలుషితం చేస్తున్నది ప్లాస్టిక్ మాత్రమే. రోజురోజుకు ప్లాస్టిక్ వినియోగం పెరుగుతుందే కానీ తగ్గిన పరిస్థితి లేనే లేదు. మున్సిపాలిటీ ట్రాక్టర్లలో గ్రామపంచాయతీ ట్రాక్టర్లలో కొన్ని వేల కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను రోజువారీగా మన కళ్ళతో మనమే చూస్తున్నాం. ప్లాస్టిక్ వలన కలిగే అనర్ధాలు ప్రజలకు తెలియాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కళాకారుల ఆట పాటలతో గానీ, అవగాహన సమావేశాల ద్వారా గానీ నిర్వహించి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేలా చూడాలి.

వానరులు అందుకే ఇంట్లోకి..

చాలా చోట్ల వానరాలు గ్రామాల్లో సంచరిస్తున్నాయి. పంటలపై దాడి చేసి రైతులు ఆరుగాలం పండించిన పంటలను పూర్తిగా నష్టపరుస్తున్నాయి. అదేవిధంగా మానవులపై దాడులు చేసి గాయపరుస్తున్నాయి. కాబట్టి మొక్కలను పెంచి,పెద్దగా చెట్లను చేసి అడవి లాంటి వాతావరణాన్ని తలపిస్తే వానరాలు అడవిలోనే కాయో, ఫలమో తింటూ జీవితాన్ని ఆనందమయంగా గడుపుతాయి.

పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి

పర్యావరణాన్ని కాపాడటంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ముఖ్యపాత్ర. ముఖ్యంగా మురుగునీరు నిలువ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ నిల్వ ఉంటే దోమలు ఈగలు ప్రబలే అవకాశం ముమ్మాటికి ఉంది. దానివలన రోగాలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది. కావున ప్రతి ఒక్కరూ ఇంటి చుట్టూ ప్రక్కల చెట్లను పెంచి పిచ్చి మొక్కలను తొలగించి మురుగు నీరు నిల్వ లేకుండా సైడ్ ట్రైన్ లో ద్వారా ఊరు చివరకు పంపే ప్రయత్నం చేయాలి.

ఇంటికో ఇంకుడు గుంత తప్పనిసరి

పర్యావరణ పరిరక్షణలో మొక్కలు, మానవజాతి బ్రతకాలంటే ప్రధానమైన సహజ వనరు నీరు. నీరు లేనిది సమస్త ప్రాణికోటి కొట్టుమిట్టాడుతుంది. నీటి లభ్యత చాలా ప్రాంతాల్లో లేదు. నీటిని సంరక్షించాల్సిన బాధ్యత మానవునిదే కావున ప్రతి మానవుడు నీటిని పొదుపుగా వాడుకోవాలి. వృధా అయిన నీరు నీటి గుంతలోకి పోవడం వలన నీరు ఆదా అవుతుంది. ఇంకుడు గుంత కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇంకుడు గుంత నిర్మాణాన్ని మనం పొందవచ్చు. కావున ఈ విషయంపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలి. సహజ వనరులను కాపాడుకుంటూ చెట్లను పెంచుతూ పర్యావరణంలో పాలుపంచుకుంటూ ఆయుష్షును పెంచుకునే దిశగా మానవుడు అడుగులు వేయాలని కోరుకుందాం.

వెంగళ రణధీర్

తెలంగాణ సామాజిక రచయితల సంఘం

99494 93707

Advertisement

Next Story

Most Viewed