ఆయన వ్యక్తిత్వం.. ఒక రాజనీతి పాఠశాల

by Ravi |   ( Updated:2025-01-05 01:00:10.0  )
ఆయన వ్యక్తిత్వం.. ఒక రాజనీతి పాఠశాల
X

భారత మాజీ ప్రధానమంత్రి డా. మన్మోహన్‌ సింగ్‌ జీవితం ఈనాటి రాజకీయవేత్తలకు ఒక రాజనీతి పాఠశాల అని చెప్పవచ్చు. నిజానికి పాకిస్తాన్‌ నుంచి భారతదేశానికి విభజన తర్వాత వచ్చిన రాజకీయ యోధుల్లో చాలా గొప్పవారు ఉన్నారు. అద్వానీ గానీ, రాజకీయ న్యాయ కోవిదుడు కపిల్‌ సిబాల్‌ కానీ, గొప్ప పాత్రికేయులు కులదీప్‌ నయర్‌ గానీ, ఇంకా ఎందరో ఇక్కడకు వచ్చి స్థిరపడి భారతదేశానికి సేవలందించారు. వారిలో మన్మోహన్‌ సింగ్‌ భారత ప్రధానిగా ప్రసిద్ధి చెందారు. భారత పరిపాలనాదక్షునిగా ఆర్థిక రంగాల్లో సరళీకరణను పరివ్యాప్తి చేసిన వారిగా, ఉపాధి హామీ పథకం రూపొందించి గ్రామీణ కూలీలకు జీవనోపాధి రూపొందించిన వారిగా, రైటు టు ఇన్‌ఫర్‌మేషన్‌ యాక్ట్‌ ద్వారా, సమాచార హక్కును సాధించిన ఘనత ఆయనకే దక్కుతుంది. నిజానికి ఆయన ప్రతిపాదించిన సమాచార హక్కు చట్టం వల్ల కాంగ్రెస్‌ ప్రభుత్వమే చిక్కుల్లో పడినా ఆయన లెక్కించలేదు.

ఆయన తీసుకువచ్చిన ఆర్థిక సరళీకరణ వల్ల నెహ్రూ రూపొందించిన ఆర్థిక పారిశ్రామిక విధానాలకు ప్రత్యామ్నాయం ఏర్పడింది. తెలుగు వాడైన మేధావి పి.వి.నరసింహరావు ఆయన సామర్థ్యాన్ని గుర్తించి మన్మోహన్‌‌కి అప్పగించిన ఆర్థిక సరళీకరణను ఎంతో అంకిత భావంతో ఆయన అమలు జరిపారు. భారతదేశం ఉత్పత్తి రంగంలో బలహీనపడి, ఎగుమతుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఒక ఆర్థికవేత్తగా భారతదేశ ఆర్థిక పునరుజ్జీవనానికి నూతన ఆర్థిక సామాజిక, సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. అందుకే భారతదేశం ప్రపంచ వ్యాపితమైన గుర్తింపు సంతరించుకుంది. ఆయన ఆర్థిక మంత్రిగా చేసినా, ప్రధానమంత్రిగా చేసినా, ఆయనకు ఆర్థిక సామాజిక శాస్త్ర సమన్వయం మీదున్న అవగాహన మన జీవన వ్యవస్థల్ని సుసంపన్నం చేసింది. ముఖ్యంగా ఆయన కాలంలో ఉద్యోగ హామీ పథకం (1993- 94), నేషనల్‌ ఓల్డ్‌ ఏజ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (2006-07), నేషనల్‌ ఫ్యామిలీ బెనిఫిట్‌ స్కీమ్‌, నేషనల్‌ మెటర్నిటీ బెన్‌ఫిట్‌ స్కీమ్‌ వంటి ప్రజా ప్రయోజనకర పథకాలు ప్రారంభించారు.

ఆర్థికాన్ని గట్టెక్కించిన మాంత్రికుడు..

1991లో దేశ ఆర్థిక పరిస్థితి విపరీతంగా కుంగిపోయి, విదేశీ మారక ద్రవ్య నిల్వలు కొద్ది వారాలపాటు దిగుమతులకు మాత్రమే సరిపడేలా ఉంటున్న విపత్కర పరిస్థితి నుంచి ఆర్థిక వ్యవస్థను పరిరక్షించిన మాంత్రికుడు నాటి ఆర్థికమంత్రి మన్మోహన్‌ సింగ్‌. కునారిల్లిపోయిన ఆర్థిక పరిస్థితిని పునరుజ్జీవింప చేయడం కోసం ఆయన చేసిన మొట్టమొదటి పని రూపాయి విలువ తగ్గించడం. ఆర్థికమంత్రి కాగానే జూలై ఒకటిన, జూలై మూడున వెంటవెంటనే రూపాయి విలువ తగ్గించారు. ఇది ఎగుమతి చేసే వారికి ఉపకరించే చర్య. అలాగే ఎగుమతులపై సబ్సిడీలు రద్దు చేయడం. ప్రభుత్వ ఆధీనంలోని వాణిజ్య కంపెనీలపై ప్రభుత్వ గుత్తాధిపత్యం సడలించడం, లైసెన్స్‌-పర్మిట్‌ రాజ్‌ను అంతం చేసి పారిశ్రామిక విధానాలలో వెసులుబాటు కలిగించడం, 34 రంగాలలో 51 శాతం పైగా విదేశీ పెట్టుబడులను అనుమతించడం, మార్కెట్లపై ప్రభుత్వ నియంత్రణకు తెర దించ డం, పన్నుల విధానాన్ని ‘హేతు’ బద్ధం చేయ డం, కార్పొరేట్‌ సంస్థలపై విధించే పన్నులు తగ్గించడం, కస్టమ్‌ సుంకాలలో కోత పెట్టడం లాంటి వాటి ఆధారంగా ఆయన ఆర్థిక వ్యవ స్థను గట్టెక్కించారంటారు.

ఉచిత వాగ్దానాలకు ఆమడదూరం..

డా.మన్మోహన్‌ సింగ్‌ నిజానికి డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ తర్వాత గొప్ప ఆర్థికశాస్త్ర పండితుడే కాక ప్రపంచ రాజకీయాల మీద స్పష్టమైన అవగాహన ఉన్నవాడు. భాషలు, జాతులు, దేశాలు, ఖండాలు వేరైనా మానవుల శ్రమ ఉత్పత్తి క్రమం దేశాల ఆర్థిక వ్యవస్థల పునరుజ్జీవనానికి మార్గం వేస్తుందని నమ్మిన ఆర్థిక ప్రణాళిక కర్త ఆయన. నిరంతర వాగ్దానాలకు మోసపూరితమైన మాట లకు, మాట తప్పడానికి, అవినీతికి భిన్నంగా నిష్కలంగా రాజకీయ, ఆర్థిక ప్రజాస్వామ్యానికి అంకితమైన రాజకీయ మేధావి మన్మోహన్‌ సింగ్‌. అందుకే ఆయనను ఒక ప్రపంచ దేశాల సమన్వయకర్తగా కూడా విశ్లేషకులు కొనియాడుతున్నారు. అమెరికా, రష్యా, చైనాల చుట్టూనే తిరిగే అంతర్జాతీయ రాజకీయాలకు భిన్నంగా బహుళపక్ష సహకారం కోసం మన్మోహన్‌ శ్రమించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం సాధించడానికి ఆయన హయాంలో గట్టి ప్రయత్నాలు జరిగా యి. అలీనోద్యమ ఆదర్శాలకు కట్టుబడుతూనే అగ్రరాజ్యాలతో స్నేహం చేశారు.

ఆర్థిక వృద్ధికి సంస్కరణలు..

1970వ దశకంలో అతను భారత ప్రభుత్వంలో ఆర్థిక సలహాదారు పదవుల శ్రేణికి ఎంపికయ్యాడు. ప్రధాన మంత్రులకు తరచుగా సలహాదారుగా పనిచేశారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌గా (1976-80), గవర్నర్‌‌గా (1982-85) పని చేశారు. 1991లో ఆయన ఆర్థికమంత్రిగా నియమితులైనప్పుడు, దేశం ఆర్థిక పతనం అంచున ఉంది. సింగ్‌ రూపాయి విలువను తగ్గించారు. పన్నులను తగ్గించారు, ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరించారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారు. దేశ ఆర్థిక వ్యవస్థను మార్చడానికి, ఆర్థిక వృద్ధికి సంస్కరణలు దోహదపడ్డాయి. ఆయన విస్తృతమైన అంతర్జాతీయ సంబంధాలు కలిగిన వ్యక్తి. భారతదేశానికి అంతర్జాతీయమైన కీర్తిని తెచ్చినవాడు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు భారత విద్యార్థులు, యువకులు వలసలు వెళ్లే క్రమానికి మన్మోహన్‌సింగ్‌ పాలన విధానాలు విస్తృతమైన అవకాశాలు కల్పించగలిగాయి. 2005లో సంతకాలు జరిగిన భారత్‌ అమెరికా అణు సహకార ఒప్పందం మన్మోహన్‌ ప్రధాన మంత్రిత్వంలో ఓ కలికితురాయి. ఇది అణుశక్తిని పౌర ప్రయోజనాలకు వినియోగించడానికి ఉద్దేశించినది. దీనివల్ల అణురంగంలో భారత్‌ ఏకాకితనం తొలగిపోయింది. భారత ఇంధన భద్రతకు, ఆర్థిక వృద్ధికి అవకాశాలు విప్పారాయి. ఇండియా - అమెరికా సంబం ధాలు పటిష్టం కావడానికి తోడ్పడిన ఈ ఒప్పం దం కుదరడం వెనుక మన్మోహన్‌ సింగ్‌ విశేష కృషి ఉంది. ప్రధానమంత్రుల మాటకు విలువ ఉంటుంది కాబట్టి మన్మోహన్‌సింగ్‌ లాగా తక్కువ మాట్లాడడం, ప్రధానమంత్రులకు, ప్రతిపక్షనాయకులకు అవసరం. ఎందుకంటే తక్కువ మాట్లాడితే అవి సూత్రబద్ధంగా ఉంటా యి. ఎక్కువ మాట్లాడడం వల్ల నిందా పూరితమైన మాటలు వచ్చే అవకాశం ఉంది. అవే వివాదాలుగా చెలరేగి విధానపరమైన అంశాలు తగ్గిపోతాయి. అవసరమైతేనే మాట్లాడడం వల్ల మన్మోహన్‌సింగ్‌ ఒక ఆదర్శప్రాయమైన రాజకీయవేత్తగా నిలబడగలిగారు. అందుకే ఆయన ఒక రాజకీయ ఆర్థిక పాఠశాల వంటివాడని మనం అర్థం చేసుకోవాలి.

- డాక్టర్‌ కత్తి పద్మారావు

98497 41695

Advertisement

Next Story