- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడ్జెట్ల రూపకల్పనలో మనిషి ప్రాధాన్యత అవసరం!
ఆధునిక సాంకేతిక అభివృద్ధి అందరికీ ఉపాధి చూపకపోగా ఉన్న ఉపాధిని లేకుండా చేయడంవల్ల ప్రభుత్వ సబ్సిడీలు అవసరమయ్యాయి. కానీ ప్రస్తుత బడ్జెటును ఇలా మనిషి అవసరాల ప్రాతిపదికగా రూపొందించలేదు. ప్రతి మనిషి, ప్రతి కుటుంబం ప్రాతిపదికన జీవన ప్రమాణాల, నైపుణ్యాల మెరుగుదల బడ్జెట్ దృష్టిలో ఉండాలి. మనిషికి ప్రాధాన్యత ఇస్తే సగం జనాభా ఇప్పటికీ పేదరికంలో ఎందుకున్నారు? మన ప్రణాళికలు ప్రజాప్రయోజనాలను నెరవేర్చే మౌలిక దృష్టితో సాగుతున్నాయా అని మనకు మనం ప్రశ్నించుకోవాలి. ఈనాటి బడ్జెట్ పేదల, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలను, జాతీయీకరణను, గ్రామీణ ఉపాధి కల్పనను విస్మరించింది.
బడ్జెట్ల రూపకల్పనలో కేటాయింపుల్లో మనిషికి ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. ప్రతి మనిషి, ప్రతి కుటుంబం ప్రాతిపదికన జీవన ప్రమాణాల, నైపుణ్యాల మెరుగుదల దృష్టిలో ఉండడం అవసరం. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు. కారాదు. విద్య ఉద్యోగ ఉపాధి రంగాలు, ఆరోగ్యం, వైద్యం గృహ వసతి ప్రాథమిక అవసరాలు. 76 ఏళ్ల స్వాతంత్రం అనంతరం మనం వాటిని అందరికీ అందించగలిగామా లేక కొందరి ఆధునిక సౌకర్యాల కల్పనకే ప్రాధాన్యత నిస్తున్నామా పరిశీలించుకోవాలి. మనిషికి ప్రాధాన్యత ఇస్తే సగం జనాభా ఇప్పటికీ పేదరికంలో ఎందుకున్నారు?
పద్మభూషణ్ సికె ప్రహల్లాద్ ప్రపంచ మల్టీ బిలియనీర్స్ మేనేజ్మెంట్ గురు. 'ఫార్చూన్స్ ఎట్ ది బాటం ఆఫ్ పిరమిడ్' పుస్తకంలో అంటారు. 'ప్రపంచంలో గత 200 సంవత్సరాలుగా సాగుతున్న అభివృద్ధి మూడింట ఒక వంతు ప్రజలకు మాత్రమే అందుతున్నది. ఇంకెంత అభివృద్ధి సాధించినా ఇంతే. 200 కోట్లమందికి అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. 400 కోట్ల మంది పేదరికంలోనే వుండిపోతారు. అట్టడుగున ఉన్న ప్రజలకు చేరేవిధంగా, సరకులను కొనుక్కునే విధంగా ఉత్పత్తి ప్రమాణాలు తమ మార్కెటింగ్ విధానాలను మార్చుకోవాలి.'
మనిషి ప్రాతిపదికగా లేని బడ్జెట్..
మన దేశంలో తలా అర లీటరు పాలు, రోజుకొక గుడ్డు, అర కిలో బియ్యం లేక గోధుమలు చొప్పున 140 కోట్ల మందికి 365 రోజులూ అవసరం. ఈ లెక్కన ఎన్ని కోట్ల లీటర్ల పాలు, గుడ్లు, ధాన్యం అవసరమో లెక్కించుకోవచ్చు. 140 కోట్ల మంది ఆహార అవసరాలను తీర్చేది వ్యవసాయమే. అందరికీ ఆహార భద్రత ప్రభుత్వ బాధ్యత. సబ్సిడీపై బియ్యం ఇవ్వడం, అందరికి ఉపాధి కల్పన వంటి సౌకర్యాలు దేశ ప్రజల జీవన ప్రమాణాల కోసం అనివార్యమయ్యాయి. ఆధునిక సాంకేతిక అభివృద్ధి అందరికి ఉపాధి చూపకపోగా ఉన్న ఉపాధి లేకుండా చేయడం వల్ల ప్రభుత్వ సబ్సిడీలు అవసరమయ్యాయి. కానీ ప్రస్తుత బడ్జెటును ఇలా మనిషి ప్రాతిపదికగా రూపొందించలేదు.
మానవులకు పని కల్పించే సాంకేతికత, యంత్రాలు, మార్కెటింగ్ విధానాలు అవసరం. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ దాన్ని సృష్టించిన వారినే ఉపాధి నుంచి తొలగించివేస్తున్నాయి. ఉద్యోగుల జీత భత్యాలు, ఆఫీస్ కిరాయిల భారం తొలగించుకుంటున్న కంపెనీల యజమానులు అదంతా లాభాలుగా జమ చేసుకుంటారు. పదిమంది ఉద్యోగుల శ్రమ ఫలం ఒకే ఒక్క యంత్రం ద్వారా సమకూరుతూ యజమాని లాభాలుగా జమ అవుతున్నది. ఇది శ్రమశక్తి వల్ల కలిగిన అదనపు ఉత్పత్తి, లాభం కాదు. ఇవి మానవులను యంత్రాల ద్వారా పని నుండి తొలగించడం వల్ల పొందుతున్న లాభాలు. మరోవైపు పబ్లిక్ సెక్టార్‌ను ప్రైవేటుపరం చేస్తున్నారు. తద్వారా సగం మంది ఉద్యోగాల నుంచి తొలగించబడుతున్నారు. కార్మిక సంఘాలు దెబ్బతిన్నాయి. సహకార రంగం మూలబడింది. ప్రయివేటు కార్పోరేషన్లకు 20 లక్షల కోట్లను రాని బాకీగా మాఫీ చేశారు. ఆ సొమ్ము కోసం పన్నులు పెంచారు. ఇరుగుపొరుగు దేశాలు కుప్పకూలుతుంటే చూస్తూ కూడా అనవసరంగా లక్షల కోట్ల ఆయుధాలు కొనడం దేనికి?
సాంఘిక సంక్షేమానికి మొండిచెయ్యి
బడ్జెట్‌లో సాంఘిక సంక్షేమం అనే పదమే లేకుండా పోయింది. ముప్పై వేల కేట్లు కేటాయించాల్సిన చేనేత బడ్జెటుకు కేవలం మూడు వందల కోట్లు కేటాయిస్తారా? ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్దంగా 15+6 శాతం కేటాయించాలి. ఓబీసీలు సగం జనాభా. వీరి కోసం కేటాయించిన బడ్జెట్లు ఏ పత్రికలో కనపడవు. బడ్జెట్‌లో 24 శాతం అంటే 11 లక్షల కోట్లు వడ్డీల చెల్లింపులకే పోతున్నది. బీసీ ఎస్సీ ఎస్టీలకు కేటాయించాల్సిన పది లక్షల రూపాయల కోట్లు ఏ పద్దులోనూ కానరాదు. విద్య వైద్య గ్రామీణ రంగానికి కేటాయింపులు తక్కువ. ఓడలు, రైల్వే బడ్జెటు, ఆయుధాల కొనుగోలు, లోటు బడ్జెటు తీసేస్తే, రాష్ట్రాలకు చెందే జీఎస్టీ పద్దు తీసేస్తే కేంద్ర బడ్జెటు రూ. 20 లక్షల కోట్లు కూడా లేదు. పైకి 46 లక్షల కోట్లు అని చూపారు. జీఎస్టీ విధానం తొలగిస్తే రాష్ట్రాలు బాగుపడుతాయి. కార్పొరేట్ పన్ను 30 శాతం నుండి 20 శాతానికి తగ్గించి 10 లక్షల కోట్ల ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం కోల్పోయింది. సంపన్నుల సంపద ఎంతో అంత మేరకు పన్ను కట్టాల్సి వుండగా వారి పద్దు మూడో వంతుకు తగ్గింది. ప్రజలపై ఆ మేరకు పన్నులు పెరిగాయి.
గ్రామీణ నిరుద్యోగం
మరోవైపు గ్రామీణ స్వయం పోషక ఆర్థిక వ్యవస్థలో ఆధునిక సరుకులు, సేవలు ప్రవేశించి మార్కెట్ పొందడంద్వారా ఆ మేరకు ప్రజలు ఉపాధి నుండి తొలగిపోతున్నారు. నేటి గ్రామీణ వ్యవస్థలో ఇపుడు వెయ్యి మందిలో 450 మంది పాత ఉత్పత్తి సేవా రంగాలలో, వందమంది కొత్త సాంకేతికత, సేవారంగాలలో ఉపాధి పొందుతున్నారు. మిగతా 450 మందికి ఉపాధి లేకుండా పోయింది. దాంతో ఊరు విడిచి, ఇతర ప్రాంతాలకు, నగరాలకు భవన నిర్మాణ కార్మికులుగా మురికి వాడలుగా చేరుతున్నారు. గల్ఫ్, తదితర దేశాలకు వలస వెళ్లుతున్నారు. స్వదేశంలో కాందిశీకులుగా బతుకుతున్నారు. భారీ నీటి ప్రాజెక్టుల వల్ల, గనులు, ఖనిజాల వెలికితీత వల్ల ప్రజలు కోట్లాది మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు బాగా వెనుకబడిన ఉత్పత్తి విధానాలతో ఆదివాసులు పేదరికంతో కునారిల్లుతున్నారు. అటవీ చట్టాలతో, సిమెంటు, బొగ్గు, యురేనియం, భారీ నీటి ప్రాజెక్టులతో, అడవుల నరికివేతతో వారికున్న ఆసరా పై హక్కు లేకుండా చేశారు. నిర్వాసితుల్ని చేశారు. వారికి చేయూత కనపడదు.
ఈ వాస్తవిక మౌలిక ప్రాతిపదికలను గుర్తించి మానవ వనరులకు పూర్తి స్థాయి నైపుణ్యం గల ఉపాధి కల్పించే విధి విధానాలు రూపొందించుకోవడం అవసరం. సాంకేతిక అభివృద్ధి అందుకనుగుణంగా నడవాలి. అప్పుడే మూడింట రెండు వంతులు అభివృద్ధి వెలుపలికి నెట్టివేయడుతున్న ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. 250 పని రోజుల కల్పన వంటి పథకాలతో నైపుణ్యాలు పెంచే విధంగా సాగాలి. ఎక్కడివారక్కడ కనీసం జిల్లా దాటి వెళ్లకుండా ఉండేలా మూడింట రెండు వంతుల ప్రజానీకానికి పని కల్పన జరిగితే జాతి సంపద రెండు రెట్లు పెరుగుతుంది. మన ప్రణాళికలు ఈ మౌలిక దృష్టితో సాగుతున్నాయా అని మనకు మనం ప్రశ్నించుకోవాలి. ఈనాటి బడ్జెట్ పేదల, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలను, జాతీయీకరణను, గ్రామీణ ఉపాధి కల్పనను విస్మరించింది. ఆ దృష్టి లేకపోవడం విచారకరం.
-బి ఎస్ రాములు
83319 66987
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672