విశ్వ నైరూప్య చిత్రకారుడు ఎస్వీ

by Ravi |   ( Updated:2023-10-31 23:45:29.0  )
విశ్వ నైరూప్య చిత్రకారుడు ఎస్వీ
X

లితోగ్రఫీ ఆర్ట్‌లో, నైరూప్య చిత్రకళలో ప్రొఫెసర్ డాక్టర్ ఎస్వీ రామారావు ఉన్నత శిఖరాలకు ఎదిగి, ఆధునిక చిత్రకళలో ఎన్నో సంచలనాలు సృష్టించాడు. తన కళతో పద్మశ్రీ అవార్డు పొందిన ఎస్వీ, తైలవర్ణంలో అద్వితీయమైన చిత్రాలు రూపొందించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఎస్వీ తెలుగువారి కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు. చిన్ననాటి నుంచి తను చూసిన పరిసరాలు, ప్రపంచంలోని వివిధ సంస్కృతులు, సామాజిక అంశాలు, తత్వశాస్త్ర అధ్యయనం వల్ల తాను తెలుసుకున్న అంశాలే ఆయన నైరూప్య చిత్రకళలో ప్రతిబింబిస్తాయి. రంగుల భాష తెలిసిన కవి, రచయిత, మేధావి ఎస్వీ. చదువుకునే రోజుల నుంచే ఆ నాటి పత్రికలు భారతి, ఆంధ్రపత్రిక వంటి వాటికి పలు అంశాలపై వ్యాసాలు రాసేవారు. కవిత్వంలో కూడా చేయితిరిగిన దిట్ట ఎస్వీ. ఆయన రాసిన వ్యాస, కవితా సంకలనాలు పది వరకు వచ్చాయి.

చిత్రకళే వృత్తిగా..

ఎస్వీ రామారావు చిన్న వయసు నుంచే చిత్రాలు గీసేవారు. 12 ఏళ్ల వయసులోనే ఆయనకు గుడివాడలోని పాఠశాలలో ప్రముఖ చిత్రకారుడు కె. వేణుగోపాల్ గురువుగా దొరికారు. ఆయన ప్రోత్సాహంతో చిత్రకళ పట్ల ఆసక్తి పెరిగింది. ఎప్పుడూ బొమ్మలు గీస్తూ కనిపించే ఎస్వీని చూసి కలప వ్యాపారి అయిన తండ్రి తొలుత ఆందోళన చెందేవారు. కలకత్తాలోని శాంతినికేతన్‌లో శిక్షణ పొందాలన్న కోరిక ఆయనకు ఉండేది. అయితే, తండ్రికి ఇష్టం లేకపోవడంతో అది సాధ్యం కాలేదు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాతే ఏ చిత్రకళైనా తండ్రి గట్టిగా చెప్పడంతో 1955లో బీకాం పూర్తి చేశారు. ఆ తర్వాత బి ఏ ఎకనామిక్స్ కూడా ప్రైవేటుగా పూర్తిచేశారు. 1955 నాటికి చిత్రకళలో ఆయన నాలుగు డిప్లొమాలు పూర్తి చేశారు.

చిత్రకళపైనే మక్కువ పెంచుకున్న కొడుకుని తండ్రి గంగయ్య చివరకు మద్రాస్ లోని ఓ సినిమా సంస్థలో అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా చేర్పించారు. విజయా వాహినీ స్టూడియోలో పని చేస్తున్న ప్రఖ్యాత సినిమా ఆర్ట్ డైరెక్టర్ మాధవపెద్ది గోఖలే సలహాతో 6 ఏళ్ల గవర్నమెంట్ డిపార్ట్ మెంట్ ఫైన్ ఆర్ట్స్ కోర్సు ఎంట్రన్స్ రాశారు. ఆయన తండ్రి గంగయ్యకి కూడా గోఖలేనే నచ్చజెప్పి ఒప్పించారు. ఆ పరీక్షలో ఎస్వీ ప్రతిభను గుర్తించిన ఆ కళాశాల ప్రిన్సిపాల్ దేవి ప్రసాద్ రాయ్ చౌదరి అతనిని నేరుగా మూడవ సంవత్సరంలోకి ప్రవేశం కల్పించారు. అది ఎస్వీకి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. అక్కడ నుంచి ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. వివిధ రంగాల ప్రముఖులతో పరిచయాలు పెరిగాయి. మద్రాస్‌లో గురువుల వద్ద చిత్రకళలో మంచి తర్ఫీదు పొందారు. వాటర్, ఆయిల్, టెంపేరా కలర్స్‌లో చిత్రాలు గీసేవారు. చిత్రకళే వృత్తిగా కొనసాగే చిత్రకారులతో పోటీపడి బొమ్మలు గీసేవారు. జాతీయ స్థాయి పోటీలలో విజేతగా నిలిచారు. ఆయన చిత్రాలను చాలా మంది కొనుగోలు చేసేవారు. అయితే, ఎస్వీ దేశంలో ఉన్నంత కాలం తన పేరుతో కాకుండా పెన్ నేమ్ ‘ఆర్యదేవ’ పేరుతో చిత్రాలు గీసేవారు. మద్రాస్ మ్యూజియం, కేరళ మ్యూజియం, ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్, హైదరాబాద్ లోని సాలార్ జంగ్ మ్యూజియంలలో ఆర్యదేవ పేరుతోనే ఆయన చిత్రాలు ఉన్నాయి.

గాడ్ గివెన్ కలరిస్ట్

కామన్వెల్త్ దేశాల చిత్రకారులు 325 మందితో పోటీపడి కామన్వెల్త్ ఫెలోషిప్ సాధించారు. ఆధునిక చిత్రకళను అధ్యయనం చేయడానికి 1962లో ఎస్వీ రామారావు లండన్ వెళ్లారు. అక్కడ లండన్ యూనివర్సిటీకి చెందిన స్లేడ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో 1965లో కోర్సు పూర్తి చేశారు. అయితే, అక్కడ చిత్రకళ అధ్యయనం చేయడం అంత తేలిక కాదు. పాశ్చాత్య చిత్రకళను తెలుసుకోవడానికి చాలా కష్టపడ్డారు. లితోగ్రఫీ ఆర్ట్‌లో కొత్తపుంతలు తొక్కి, అందులో ఎస్వీ దిట్టయ్యారు. లితోగ్రఫీ ఆర్ట్‌లో మాస్టర్‌గా లండన్‌లో పేరుతెచ్చుకున్నారు. 1965లో లితోగ్రఫీ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచారు. కొత్త కొత్త రంగులు, రేఖలతో ఆయన ఎన్నో అద్భుతాలు సృష్టించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఎస్వీని ‘గాడ్ గివెన్ కలరిస్ట్’ అని విమర్శకులు కొనియాడారు. అప్పుడే ఆయన చిత్రకళను ప్రశంసిస్తూ లండన్ టైమ్స్ కూడా రాసింది. లండన్ వెళ్లినప్పటి నుంచి ఆయన తన పేరుతోనే చిత్రాలు గీయడం మొదలుపెట్టారు. విభిన్న సంస్కృతుల మేలుకలయికతో ఆయన గీసే చిత్రాలలో కృష్ణానది పరవళ్లు,నీటిలోని నిర్మలత్వం, రంగురంగుల పూలు, వినూత్న కాంతులు, సూర్యకిరణాల విన్యాసాలు, ఉల్లాసం, ఉత్తేజం, చైతన్యం, ఉద్రేకం, అమాయకత్వం, పసితనం,కోమలత్వం, సున్నితత్వం, ఒంపుసొంపులు, సోయగాలు, సౌందర్య.... ఒక్కటేమిటి వర్ణనకు అందని అనేక భావాలు స్పృశిస్తాయి. అది ఎస్వీ కి చెందిన ఓ మాయా జగత్తు.

ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులు పికాసో, డాలి వంటి వారి చిత్రాల సరసన ఎస్వీ రామారావు చిత్రాలకు స్థానం లభించింది. 1965లో కామన్ వెల్త్ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో ‘ఈ ఏడాది మేటి చిత్రకారుడు’ వంటి అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. ప్రపంచం మొత్తం ఎస్వీని గుర్తించింది. ఆ తర్వాత అనేక దేశాలలో పర్యటించారు. తన చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. లండన్‌లోనే ఆయనకు చిత్రకారుడిగా మంచి పేరు వచ్చింది. అందుకే లండన్ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఇప్పటి వరకు ఆయన వెయ్యికి పైగా చిత్రాలు గీశారు. భారత ప్రభుత్వం 2001లో జాతీయ అవార్డు పద్మశ్రీతో సత్కరించింది.

రూపానికంటే రంగే ప్రాధాన్యమంటూ..

మొదట అమెరికాలోని ఒహియో రాష్ట్రం సిన్సనాటిలో యూనివర్సిటీ ఆఫ్ సిన్స నాటిలో టీచింగ్ అసిస్టెంట్‌గా పని చేశారు. కెంటకీ రాష్ట్రం బౌలింగ్ గ్రీన్ లోని వెస్ట్రన్ కెంటకీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆఫ్ ఆర్ట్‌గా చేసి పదవీవిరమణ చేశారు. పుస్తకాలు చదవడానికి అలవాటుపడిన ఆయన చిత్రకారుడైనా లైబ్రరీ సైన్స్ పై మక్కువతో టెన్నెసీ రాష్ట్రం నేషవిల్ సిటీలోని వేండర్ బిల్ట్ యూనివర్సిటీలో లైబ్రరీ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆయనకు పుస్తకాలు కొని చదవడం బాగా అలవాటు. 1980 నుంచి చికాగోలోనే ఉంటున్నారు. ఆయన రాసిన తెలుగు కవితలు మూడు సంకలనాలుగా, ఇంగ్లీషు కవితలు ఒక సంకలనంగా వెలువడ్డాయి. ప్రస్తుతం ఆయన రచనలను పబ్లిషర్లు ఇంగ్లీషు, హిందీ భాషలలోకి అనువాదం చేస్తున్నారు.

అన్ని శాస్త్రాలకంటే సాహిత్యం ద్వారానే మనిషి సంపూర్ణుడవుతాడని ఎస్వీ రామారావు చెప్పారు. తెలియనిది తెలుసుకుంటూ, తనకు ఇష్టమైన రీతిలో రంగులను ఉపయోగిస్తానన్నారు. నవ్య చిత్రకళ విశ్వజనీనం అని, ఈ చిత్రకళలో రూపానికంటే రంగుకే ప్రాధాన్యం అని వివరించారు. చిత్ర విచిత్రమైన రంగుల ఇంద్రజాలం ద్వారా విశిష్ట కాంతులను సృష్టించటం అందులోని విలక్షణత. నవ్య చిత్రకళ వాస్తవ వాదానికి చెందదని, సహజ రూపాన్ని బద్దలుకొట్టి అందులోని ప్రాథమిక రూపాన్ని విశ్లేషణ పద్దతిలో చిత్రించడమే ఇందులోని ప్రధాన లక్షణం అని ఎస్వీ రామారావు చెబుతారు. చిత్రకళ ద్వారా తెలుగు ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన ఎస్వీ రామారావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం-2023 కు ఎంపిక చేసింది.

(నేడు రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో,ఎస్వీ రామారావుకు వైయస్సార్ జీవిత సాఫల్య పురస్కారం-2023 అందజేస్తున్న సందర్భంగా)

శిరందాసు నాగార్జున

సీనియర్ జర్నలిస్ట్

94402 22914

Advertisement

Next Story

Most Viewed