ఇతరుల మాట వింటేనే..

by Ravi |   ( Updated:2024-10-24 00:45:17.0  )
ఇతరుల మాట వింటేనే..
X

ఏ ఒక్కరి అభిప్రాయం వేరొకరి అభిప్రాయంతో అచ్చంగా కలవదు. ఎవరి ఆశయాలు వారివి. ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి అభిరుచులు వారివి. ఎవరి అలవాట్లు వారివి. చర్చల ద్వారా గాని, పరిస్థితుల ప్రభావంగా గాని, మరే ఇతర కారణాల వలన గాని మనుషుల్లో సమభావన సాధ్యమయ్యే అవకాశాలుంటాయి. అందుకేనేమో “పుట్టెకొక బుద్ధి జిహ్వకొకరుచి” అన్నారు పెద్దలు. మాటల విషయంలోనూ అంతే మరి! ఇతరుల తప్పులను వెతికి చూపించు వారొకరైతే, అస్తమానం పొగడ్తల్లో ముంచెత్తి ఆనంద పరవశులయ్యే వారింకొందరు, పురాణేతిహాసాలను వల్లెవేయు ప్రవచన కర్తలు మరికొందరు.

ఎంచుకున్న వృత్తిలో పైకెదగాలని అభిషించడం ప్రతి మనిషికి గల సహజ గుణం. కాకపోతే, ఇతరుల మాట నేనెందుకు వినాలి అని భావించే వ్యక్తి అక్కడే నిలబడి పోవాల్సి వస్తుంది. పరిణతిని ప్రదర్శించగలిగినవాడు మాత్రం అభ్యున్నతి మెట్లెక్కుతూ పైకెదుగుతూ వెళుతుంటాడు. అందరి మాటలను విని విశ్లేషించుకొనుటలోనున్న కిటుకు అంత గొప్పదైనప్పుడు దాని గురించి మరింత తెలుసుకోవడం ఎంతైనా అవసరం. సామాజిక జీవన గమనంలో ఎదుటివారి అభిప్రాయాలు వినడం లేదా మన అభిప్రాయాలను వినిపించడం అనునది ఒక అనివార్యమైన మరియు కళాత్మక ప్రక్రియ. ప్రధానంగా వినడం, శ్రద్ధగా వినడం లేదా చెవి ఒగ్గి వినడంలో వ్యక్తి యొక్క శ్రద్ధాసక్తులను బట్టి క్రియాశూన్యత శ్రవణం, ఐచ్ఛిక శ్రవణం, శ్రద్ధాళువుగా శ్రవణం, చింతనా శీలతగల శ్రవణం అను నాలుగు విభజనలుగా అర్థం చేసుకొనవచ్చును.

శ్రద్ధగా వినడం వలన..

శ్రద్ధతో వినడం, ఏకాగ్రతను ప్రదర్శించడం వలన వ్యక్తిత్వ వికాసానికి దోహదపడగలదు. అందువలన స్వీయ శ్రవణ క్రియకు అలవాటు పడిన వారికి అదొక భగవదనుగ్రహ గుణంగా ఎంచబడుతుంది. అటువంటి సద్గుణాన్ని నిజ ప్రవర్తనగా ప్రదర్శించగలిగిన వారు ఎదుటి వారిని తమ చర్యల పట్ల ఆకర్షింపజేయుటలో సూదంటు రాయిలాగా మారతారు. ప్రజానీకానికి ప్రీతి పాత్రులవడం మూలంగా ప్రతి సమస్యకు ప్రభావపూరిత పరిష్కారాన్ని అందించడంతో పరిపాలనా వ్యవస్థ సరళీకృత మవుతుంది. ఆ విషయంలో పోలీసు పర్యవేక్షణాధికారుల వ్యవహారశైలి కడు ప్రశంసనీయం. క్షేత్రస్థాయి పోలీసు అధికారులు శ్రవణ శైలి అప్పుడప్పుడు వివిధ కారణాల మూలంగా వివాదాస్పదంగా మారుతుంది. అందువల్లనే పోలీసు శాఖ శిక్షణా కార్యక్రమాల్లో శిక్షణార్థులను శ్రద్ధగా వినుటకు ప్రోత్సహించడం జరుగుతుంది. శ్రద్ధగా విన్నవ్యక్తి లోతుగా ఆలోచిస్తాడు. సందేహ నివృత్తికై ప్రశ్నలు వేయనారంభిస్తాడు. తద్వారా విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని కార్యదక్షతపై పట్టును సాధించుకొనగలుగుతాడు.

శ్రద్ధతో వినడం వలన భూత కాల వర్తమాన కాలాల్లోగల సామాజిక పోకడలను, మేధావుల సందేశాలను ఆకళింపు జేసుకొని లోతుగా అధ్యయనం చేయడానికి వీలు పడుతుంది. అలా జరిగినప్పుడు వ్యక్తి వికాసం సాధ్యపడగలదు. అలాంటి పరిణతిని పెంపొందించుకున్న పోలీసు అధికారి సమాజంలో చోటు చేసుకున్న, చోటుచేసుకుంటున్న సంఘటనలను నిజరూపంలో దర్శించగలుగుతాడు. పోలీసు అధికారి చట్టపరంగా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి, రాగల అసాంఘిక లేదా నేరపూరితమైన పరిస్థితులను అంచనా వేసి నివారణోపాయాలను రచించి సామాజిక భద్రత బాధ్యతల నిర్వహణలో కలికితురాయిగా నిలువగలుగుతాడు. ఎన్నో ఉన్నతమైన స్థానాలను అధిరోహించగలగుతాడు.

ఇందుకు ఉదాహరణలు..

బోధనాంశాల రూపంలో తెలుసుకున్న పై విషయాలను క్రియారూపంలోనూ చూడవచ్చును. ఒక కోర్టును నడిపించే న్యాయాధీశుని శైలి నుండి నేర్చుకోవలసిన విషయాలెన్నో ఉంటాయి. కోర్టు వారి ముందున్న వివాదానికి సంబంధించిన కేసులో తీర్పును వినిపించుటకు ముందు వాది, ప్రతివాదులకు తమ తమ వాదనలన వినిపించుటకు అవకాశాన్ని ప్రసాదించి, వారు మాత్రం కడు ఓపికతో వింటుంటారు. వాదనల్లో చట్టబద్ధత ఏమేరకుందను విషయాన్ని తరచి చూచుకుంటారు. వారి కొలమానం చట్టబద్ధతతో ముడిపడి ఉంటుంది. ఇరుపక్షాల వాదనల్లోని యుక్తాయుక్తాలను పరిశీలించి, విశ్లేషించి తమ తీర్పును వినిపిస్తుంటారు. అలాగే న్యాయవాది తన క్లయింట్ తెలుపుతున్న కథనాన్ని శ్రద్ధగా వినకుండినచో, ఒక వైద్యుడి చెంతకు వచ్చిన రోగి శ్రవణానికి ప్రాధాన్యత నివ్వకుండినచో వారి వృత్తిలో ఎదగటం కస్టమగును.

పోలీసుకు ఉండవలసిన ప్రాథమిక లక్షణం!

అందరూ వింటూ కూర్చుంటే జాతి నిర్మాణం, మనుగడ సాధ్యపడదు. కొందరు మాట్లాడుతూనే ఉండాలి. విద్యాశాఖలో ఉపాధ్యాయుడు కేంద్ర బిందువు. అతను బోధించే పాఠశాలలో చేరిన విద్యార్థులు శ్రద్ధగా వినడం మూలంగా గుణవంతులు, శీలవంతులు, సత్యవాక్పాలకులు, విద్యావంతులు, భావి భారత నేతలుగా, పలు విషయాలలో నిష్ణాతులుగా, మేధావులుగా, మంచి పాలకులుగా ఎదిగి దేశ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయడం జరుగుతున్నది. అలాంటి గుంపు నుండి పోలీసు అధికారులుగా ఎదిగిన వారు అహర్నిశలు శ్రమిస్తూ పౌరుల ధన, మాన, ప్రాణ రక్షణకై అనిర్వచనీయమైన సేవలందిస్తున్నారు. ఆ విషయంలో వారు ప్రదర్శిస్తున్న అంకిత భావం కడు శ్లాఘనీయమైనవి. జన సామాన్యుల గుర్తింపును పొందాలన్నా, రాజ్యాంగభిలషణీయమైన బాధ్యతల నిర్వహణను ప్రదర్శించాలన్నా ప్రతి పోలీసు అధికారి కుండవలసిన ప్రాథమిక లక్షణం శ్రద్ధగా వినడం. ఆ తదుపరి అతని ఆలోచనలు, నిర్ణయాలు, చర్యల ద్వారా మాత్రమే బహిర్గతింపబడాలి. తద్వారా పోలీసు అధికారి వృత్తి నిపుణత, పోలీసు శాఖ సమర్థత ద్యోతక మవుతుంది. పోలీసు శాఖ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాభీష్టం మేరకు తన విశ్వసనీయతను ప్రదర్శించుకున్నట్లవుతుంది.

పెద్దిరెడ్డి తిరుపతిరెడ్డి

94400 11170

Advertisement

Next Story

Most Viewed