- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం!

నవ భారత నిర్మాత డా.బి.ఆర్ అంబేడ్కర్ చెప్పినట్లు ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడు. భారత దేశ ప్రజలందరి ఆశయాల కూర్పే మన రాజ్యాంగం. మన రాజ్యాంగం సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత భారతీయులుగా మన అందరిది. గణతంత్రం అంటే ప్రజలే పాలకులు, పాలకులే ప్రజలు. అంటే మనకు మనమే పరిపాలించుకోవడం అన్నమాట. రాజ్యాంగ నిర్మాతలు మన దేశానికి పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యాన్ని అందించి ప్రజలే ప్రభువులుగా ఉంటే ప్రజాస్వామ్యం బాగుపడుతుందని భావించారు. ఇందులో రాజకీయ పార్టీలు కీలకమైన పాత్ర పోషిస్తాయి. దురదృష్టవశాత్తు ఆ రాజకీయ పార్టీల నుంచే రాజ్యాంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది.
భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్దిం చాక, ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని నాటి రాజకీయ పెద్ద లు భావించి, రాజ్యాంగ రచనకై నవ భారత నిర్మాత డా.బి. ఆర్. అంబేడ్కర్ నేతృత్వంలో డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఎంతో శ్రమించి 60 దేశాల రాజ్యాంగాలను తులనాత్మక అధ్యయనం చేసి 2 ఏండ్ల 11 నెలల 18 రోజులకు రాజ్యాంగాన్ని రూపొందించింది. రాజ్యాంగం అసలు ప్రతిని ప్రేమ్ బిహారి నారాయణ్ రైజాదా తన చేతి రాతతో హిందీ, ఇంగ్లిష్‌లలో రాశారు. రాజ్యాంగాన్ని ఆయన రాయడానికి ఆరు నెలల సమయం పట్టింది.
జనవరి 26 చారిత్రక ప్రాధాన్యత
1930 జనవరి 26న లాహోర్‌లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో తొలిసారిగా సంపూర్ణ స్వరాజ్య (పూర్ణ స్వరాజ్) తీర్మానం చేశారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న జనవరి 26కి చిరస్థాయి కల్పించాలనే ఉద్దేశంతో 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావాలని రాజ్యాంగ పరిషత్ నిర్ణయించింది. అందుకే జనవరి 26న మనమందరం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం.
హక్కులు బాధ్యతల సమాహారం
భారతదేశ ప్రజలందరూ ఇష్ట పూర్వకంగా ఒప్పుకొని ఆమోదించుకున్న నియమాలు, ప్రతిజ్ఞలు, హక్కులు బాధ్యతల సమాహారమే భారత రాజ్యాంగం. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. భారత రాజ్యాంగ పీఠికలోనే రాజ్యాంగ లక్ష్యాలను, ఆశయాలను వివరించారు. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో సమాఖ్య విధానం, లౌకికవాదం, పార్లమెంటరీ ప్రజాస్వా మ్యం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు ఉంటాయని దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. భారతదేశంలో రాజ్యాంగం సర్వోన్నతమైనది. దేశంలోని సర్వ వ్యవస్థలు, సంస్థలు భారత రాజ్యాంగ పరిధికి లోబడే పని చేయాలి. గత దశాబ్ద కాలంలో భారత రాజ్యాంగ మౌలిక స్వరూపమే మార్చే విధంగా రాజ్యాంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ సవాళ్ల నుండి బయటపడాలంటే ప్రజా చైతన్యమే కీలకం. పౌర సమాజం ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది.
ప్రజా శ్రేయస్సు మరిచి
భారత రాజ్యాంగం అత్యున్నత విలువలతో కూడుకున్నది. ప్రజలు, కుల,మత, భాష లింగ, ప్రాంత, జాతి మొదలైన తారతమ్యాలు లేకుండా అందరూ సమానమేనని రాజ్యాంగం పునరుద్ఘాటించింది. స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం, సమ న్యాయం, లౌకికవాదం, సమగ్రత మొదలైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఆచరించేలా రాజ్యాంగాన్ని రూపొందించారు. భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలతో దేశ ప్రజలందరూ ఒక్కటే అని చాటి చెప్పింది. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కార్పొరేట్ రాజకీయాలు, క్రోనీ క్యాపిటలిజం రాజ్యాంగ మౌలిక లక్ష్యాలకు పూర్తిగా విరుద్ధం. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను బడా కార్పొరేట్ శక్తులకి దాసోహం చేస్తున్నారు. కార్పొరేట్లు రాజకీయ రంగాన్ని నియంత్రిస్తూ వారి వ్యాపా ర(స్వ) ప్రయోజనాలను కాపాడుకుంటున్నారు. అలాగే పాలకులు ప్రశ్నించే గొంతులను నొక్కేస్తూ, చరిత్రను, చారిత్రక చిహ్నాలను ధ్వంసం చేస్తూ, ప్రజా శ్రేయస్సు మరిచి వారి సైద్ధాంతిక భావజాలాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దుతూ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారు.
అవకాశాలను అందించడమే స్ఫూర్తి
దేశంలో జమిలి ఎన్నికల పేరిట ప్రజాస్వామ్య, సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా పాలకులు చర్యలు తీసుకుంటున్నారు. పరోక్షంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అధ్యక్ష తరహా పాలనగా రూపొందించాలని భావిస్తున్నారు. తద్వారా ప్రాంతీయ పార్టీల ఆధిపత్య పాలనకు అడ్డుకట్ట వేయాలని పాలకులు భావిస్తున్నారు. దీనిని వ్యతిరేకించాలి. ఇదే కాదు ఇలాంటి కుట్రలు నుండి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటామని ఈ గణతంత్ర దినోత్సవం సంద ర్భంగా ప్రతీ భారతీయుడు ప్రతిజ్ఞ తీసు కొని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సి ఉంది. రాజ్యాంగం మన జాతికి ఆత్మ వంటిది, దాని స్ఫూర్తిని గౌరవించి భారతదేశం గర్వపడేలా మనం కృషి చేద్దాం. ప్రతి పౌరునికి సమాన హోదా, అవకాశాలను అందించడమే రాజ్యాంగ స్ఫూర్తి అని సర్దార్ వల్లభాయ్ పటేల్ మాటలను ఈ సందర్భంగా మనం గమనంలోకి తీసుకోవాలి. ఎంతో విశిష్టత కలిగిన భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత భారతీయులందరిది.
(నేడు గణతంత్ర దినోత్సవ సందర్భంగా)
- పాకాల శంకర్ గౌడ్
రాజకీయ విశ్లేషకులు.
98483 77734