- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎస్సీ, ఎస్టీలకు పథకాల కోత తగునా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న 27 ఎస్సీ, ఎస్టీ సంక్షేమ అభివృద్ధి పథకాలను రద్దు చేసి, వారి రక్షణ కవచాల్ని తొలగించేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో రాజ్యాంగానికి అనుగుణంగా అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రక్షణ చట్టాలు, సంక్షేమ, అభివృద్ధి పథకాలను రూపొందించుకుంటూ వచ్చాయి. అవి వారి జీవితాలకు రక్షణ కవచాలు ఏర్పరిచాయి. ఈ నేపథ్యంలో వెనుకబడిన వర్గాల అవసరాలు చూడాల్సిన బాధ్యతను వైసీపీ ప్రభుత్వం స్వార్థపూరితంగా గాలికొదిలేయడం దారుణం. గత మూడేన్నరేళ్లుగా ఏపీలో అమలు చేస్తున్న ఏ నవరత్నం పథకం తీసుకున్నా... తాత్కాలిక అవసరం తీర్చడానికి కొన్ని డబ్బుల్ని ఇస్తున్నాయి తప్ప, వారు సొంతంగా ఎదగడానికో, ఉన్నత చదువులు చదువుకోవడానికో అవసరమైన ఆర్థిక సహాయం మాత్రం అందివ్వడం లేదు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ని మాల, మాదిగ, రెల్లి కుల కార్పోరేషన్లుగా విడగొట్టి పాలకవర్గాలను ప్రకటించింది. కానీ, వాటికి బడ్జెట్ కేటాయింపులు మాత్రం జరగలేదు. ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్ల ద్వారా ఈ మూడున్నరేళ్లలో ఎవరికీ ఒక్క రూపాయి రుణం అందించిన దాఖలాలు లేవు. నవరత్నాల వల్ల వచ్చే డబ్బులతో మూడు పూటల అన్నం తినవచ్చేమోగానీ, రాజ్యాంగంలో చెప్పినట్టుగా సామాజిక, ఆర్థిక న్యాయం జరగడం మాత్రం కలే అవుతుంది.
సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం సాధించాలనీ, స్థితిగతులలోనూ, అవకాశాలలోనూ ఉన్న అంతరాలను తొలగించాలని బలహీనవర్గాలైన ఎస్సీ, ఎస్టీల విద్యా, ఆర్థిక అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మన రాజ్యాంగం స్పష్టంగా చెప్తోంది. తరతరాలుగా అంటరానితనానికి, వెనుకబాటుతనానికి, పెత్తందారీ శక్తుల దోపిడికి గురైన ఎస్సీ, ఎస్టీల సాధికారత కోసం 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో రాజ్యాంగానికి అనుగుణంగా అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రక్షణ చట్టాలు, సంక్షేమ, అభివృద్ధి పథకాలను రూపొందించుకుంటూ వచ్చాయి. అవి వారి జీవితాలకు రక్షణ కవచాలు ఏర్పరిచాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వెనుకబడిన వర్గాల అవసరాలు చూడాల్సిన బాధ్యతను వైసీపీ ప్రభుత్వం స్వార్థపూరితంగా గాలికొదిలేసింది. రాష్ట్రంలో అమలవుతున్న 27 ఎస్సీ, ఎస్టీ సంక్షేమ అభివృద్ధి పథకాలను రద్దు చేసి, వారి రక్షణ కవచాల్ని తొలగించే కుట్ర చేస్తోంది.
నగదు పంపిణీకే నవరత్నాలా?
దళిత గిరిజన ఓట్లతో అధికారాన్ని చేజిక్కించుకున్న వాళ్లు పథకం ప్రకారం ఎస్సీ, ఎస్టీల రక్షణ చట్టాలను, సంక్షేమ అభివృద్ధి, పథకాలను నిర్వీర్యం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 27 పథకాల్ని రద్దు చేయడాన్ని ప్రశ్నిస్తే వారి దూతలు ఆ పథకాలు దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఉందని, అందువల్లే రద్దు చేస్తున్నాం అని సమర్థించుకుంటున్నారు. ఇక, వారు అమలు చేస్తోన్న నవరత్నాల్లో అత్యధిక లబ్దిదారులు ఎస్సీ, ఎస్టీలేనని, కాబట్టి, ఈ ప్రత్యేక పథకాలు అవసరం ఇప్పుడు లేదని చెప్తున్నారు. గత మూడేన్నరేళ్లుగా వారు అమలు చేస్తున్న ఏ నవరత్న పథకం తీసుకున్నా... తాత్కాలిక అవసరం తీర్చడానికి కొన్ని డబ్బుల్ని ఇస్తున్నాయి తప్ప, వారు సొంతంగా ఎదగడానికో, ఉన్నత చదువులు చదువుకోవడానికో అవసరమైన ఆర్థిక సహాయం మాత్రం అందివ్వడం లేదు.
ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ని మాల, మాదిగ, రెల్లి కుల కార్పోరేషన్లుగా విడగొట్టి పాలకవర్గాలను ప్రకటించింది. కానీ, వాటికి బడ్జెట్ కేటాయింపులు మాత్రం జరగలేదు. గత మూడున్నరేళ్లుగా ఎలాంటి ప్రణాళికలు, నిధులు విడుదల చేయలేదు. కులాల వారీగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసే క్రమంలో కూడా ఈ కుల కార్పోరేషన్ల భాగస్వామ్యం కనిపించడంలేదు. ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్ల ద్వారా ఈ మూడున్నరేళ్లలో ఎవరికీ ఒక్క రూపాయి రుణం అందించిన దాఖలాలు లేవు. ఓసీ, బీసీలు తీసుకున్నట్టుగానే ఎస్సీ, ఎస్టీలు బ్యాంకుల నుంచి తీసుకునే సాధారణ రుణాలనే కార్పోరేషన్ రుణాలుగా చిత్రిస్తూ ఏలినవారిని మోసే మీడియా తప్పుడు ప్రచారం చేయడం శోచనీయం.
సామాజిక న్యాయం మాటేమిటి?
గతంలో సంక్షేమ కార్పోరేషన్ల ద్వారా ప్రభుత్వ పథకాలు అమలు చేసేవారు. రాయితీపై వృత్తిదారులకు ఆయా పథకాల ద్వారా సామాగ్రి అందించేవారు. సబ్సిడీల ద్వారా రుణసదుపాయం అందించేవారు. కానీ, గడిచిన మూడేళ్లుగా అలాంటివేం జరగడం లేదు. కార్పోరేషన్లకు నిధులు కేటాయించకుండా, ఎస్సీ ఎస్టీ యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నాలకు గండికొడుతున్నారు. స్వయం ఉపాధి పథకాలను నిలిపేసి, వారిని వ్యాపార రంగంలోకి రాకుండా కట్టడి చేస్తున్నారు. అదే సమయంలో గతంలో అమలు చేసిన విదేశీ విద్యా సహాయం కూడా పేద విద్యార్థులకు అందడం లేదు. నవరత్నాల వల్ల వచ్చే డబ్బులతో మూడు పూటల అన్నం తినవచ్చేమోగానీ, రాజ్యాంగంలో చెప్పినట్టుగా సామాజిక, ఆర్థిక న్యాయం జరగడం మాత్రం కలే అవుతుంది. మన రాజ్యాంగ స్ఫూర్తి నెరవేరాలంటే, నవరత్నాలకు తోడుగా గత 75 ఏళ్లలో రూపొందించుకుంటూ వచ్చిన పథకాలను అమలు చేస్తూనే కొత్త పథకాల్ని, చట్టాల్ని తీసుకురావాలి. కానీ, ఉన్న పథకాలని, చట్టాల్నే ప్రభుత్వం రద్దు చేయడమే పనిగా పెట్టుకుంది. ఇలాంటి ప్రభుత్వం నుంచి బలహీనవర్గాలకు ఇంకేం న్యాయం జరుగుతుంది?
ఎస్సీలు, ఎస్టీలను కేవలం ఓటర్లుగానే భావిస్తూ ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేస్తూ అధికారం చేజిక్కించుకుంటున్నారు. ఇష్టానుసారంగా స్వప్రయోజనాల కోసం పని చేస్తూ... ఉపాధి అవకాశాల నుంచి ఎస్సీ, ఎస్టీలను దూరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. రాజకీయ లక్ష్యాల సాధన కోసం తప్ప, ఎస్సీల ఉద్దరణ ఆచరణలో కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ (పీ.ఓ.ఏ) యాక్ట్‌ని నిర్వీర్యం చేయడంతో దళిత గిరిజనులకు రక్షణ లేకుండా పోయాయి. ఇన్ని జరుగుతున్నా కిమ్మనకుండా ఉండటానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాల మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎలాంటి స్వేచ్ఛా, అధికారాలు లేకుండా చేశారు. తమ వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేని నిస్సహాయ స్థితికి వారిని దిగజార్చడం దారుణం.
ఎస్సీ, ఎస్టీలను ముంచేశారు
1977లో వచ్చిన అసైన్డ్ భూముల (బదలాయింపు నిషేధ) చట్టం కింద, పేదలకు అసైన్ చేసిన భూమిని వేరే ఎవరికైనా అమ్మినా...ఇతర కారణాలతో అది అన్యాక్రాంతమైనా దానిని తిరిగి లబ్దిదారులకే ఇవ్వాలి. కానీ, ఒకసారి అన్యక్రాంతం కానిస్తే, అది ప్రభుత్వానికే చెందుతుంది. ప్రభుత్వానికి బుద్ధిపుడితే తిరిగి వారికే అసైన్ చేయవచ్చు. కానీ, కచ్చితంగా చేయాలనే నియమం లేదు. దీంతో అసైన్ చేసిన భూముల్ని కూడా వారికి దక్కకుండా చేసి, తమకు కావాల్సినవారికి సమర్పించుకుంటోంది. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సుల ప్రకారం ఎస్సీ, ఎస్టీలలో భూమిలేని కుటుంబాలకు కనీసం ఒక ఎకరం భూమి కేటాయించాలి. కానీ, ఈ సిఫార్సులను జగన్ ప్రభుత్వం తుంగలోకి తొక్కింది. ఇలా నవరత్నాల ముసుగులో ఎస్సీ, ఎస్టీలను అనేకరకాలుగా ఈ ప్రభుత్వం మోసం చేస్తోంది.
రాష్ట్ర స్థాయిలో దళిత గిరిజన జేఏసీ దీని గురించి పోరాటం చేస్తున్నా, ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. తమను ఎన్నికల్లో ఒడ్డుదాటిచ్చిన ఎస్సీ, ఎస్టీలను ముంచడం వీరికి చెల్లింది. దళిత, గిరిజనుల పథకాలు, చట్టాలకు ప్రమాదం ఏర్పడిన ఈ సంక్షోభ సమయంలో, ఆయా వర్గాలు చేస్తున్న ప్రధాన డిమాండ్స్‌ని ప్రభుత్వం వెంటనే పరిగణనలోకి తీసుకోవాలి. ఈ ఏడాది జనవరిలో ముగిసిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పొడిగిస్తూ ఆంధ్ర ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకురావడం గుడ్డిలో మెల్లలాగా ప్రభుత్వం చేసిన మంచి పనే అయినా, దానిని ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధి నిధి చట్టంగా మార్పు చేసి, కాలానుగుణంగా నిధులు కేటాయిస్తేనే ఫలితం ఉంటుంది. మరోవైపు ప్రభుత్వం రద్దు చేసిన 27 ఎస్సీ, ఎస్టీల సంక్షేమ అభివృద్ధి పథకాలను సత్వరం పునరుద్ధరించాలి. ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక హక్కులు, చట్టాలను రాజ్యాంగ బద్ధంగా సక్రమంగా అమలు చేయాలి. 177 అసైన్డ్ చట్టంలో అన్ని సవరణలు రద్దు చేయాలి.
ఎస్సీ, ఎస్టీ స్కాలర్‌షిప్‌లు ఏవి
41 సీ.ఆర్.పీ.సీ నోటీస్ ద్వారా స్టేషన్ బెయిల్ ఇచ్చే ప్రక్రియను తక్షణమే నిలిపేసి, చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి. 2 లక్షల రూపాయిల ఆదాయపరిమితితో ఎస్సీ, ఎస్టీ స్కాలర్ షిప్ గతంలో లాగా కొనసాగించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విదేశీ ఉన్నత విద్య కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలి. ఎస్సీ, ఎస్టీల బ్యాగ్ లాగ్ ఖాళీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ప్రకటించి, నిర్దిష్ట కాల వ్యవధిలో భర్తీ చేయాలి. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయాలి. వారిని రెగ్యులరైజ్ చేయాలి. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సుల ప్రకారం ఎస్సీ, ఎస్టీలలో భూమిలేని కుటుంబాలకు కనీసం ఒక ఎకరం భూమి కేటాయించాలి. ఇంటి స్థలాల కోసం పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు కేటాయించాలి. మూడు ఎస్సీ కుల కార్పోరేషన్లకు నిధులు కేటాయించాలి. అలాగే, ఎస్టీ కార్పోరేషన్‌కు కూడా నిర్థిష్టమైన ప్రణాళికలు, నిధులు కేటాయింపులు జరపాలి. ఎన్.ఎస్.ఎఫ్.డి.సీ, ఎన్.ఎస్.కే.ఎఫ్.డీ.సీ, ఎన్.ఎస్.ఎఫ్.టీ.డీ.సీ పథకాలను పునరుద్ధరించాలి. 170 చట్టానికి వ్యతిరేకంగా ఏజెన్సీ ప్రాంతాలు గిరిజనేతరులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే జీవోను వెంటనే రద్దు చేయాలి. ఎఫ్.ఆర్.ఏ చట్టాన్ని పేసా చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి. జోగినీలు, సఫాయి కర్మచారీలు, బాండెడ్ లేబర్ల విముక్తికి గతంలో ఉన్న చట్టాలను, పథకాలను సమీక్షించి సరికొత్త చట్టాలు, ప్రణాళికలు రూపొందించాలి. సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఇతర కులాలను ఎస్సీ, ఎస్టీల్లో చేర్చకుండా శాశ్వతంగా చర్యలు తీసుకోవాలి.
ఎస్సీ, ఎస్టీలు చేస్తున్నఈ ప్రధాన డిమాండ్స్ అన్నీ పరిగణనలోకి తీసుకొని, నిర్దిష్ట సమయంలో చర్యలు చేపట్టాలి. లేదంటే, 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో వారిని 75 ఏళ్లు వెనక్కినెట్టిన అపఖ్యాతి మూటగట్టుకుంటారు. అలాగే, వారు తమ హక్కుల కోసం మళ్లీ ఉద్యమం మొదలుపెట్టేవరకూ చెలగాటమాడితే, కుర్చీ కిందకు నీళ్లు చేరడం ఖాయమని ప్రభుత్వం, దానికి బాధ్యత వహిస్తున్న పెద్దలు గ్రహించాలి.
- కొణతాల రామకృష్ణ,
మాజీ పార్లమెంట్‌సభ్యులు,
కన్వీనర్, ఉత్తరాంధ్ర చర్చావేదిక
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672
Also Read...
అమెరికాలో పరిశోధనా గ్రంథాలయాలు