- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవినీతిపరులు నీతులు బోధించడమా!?
భారతదేశంలో అత్యంత అవినీతి చక్రవర్తిగా చరిత్రకెక్కిన ఘనత జగన్ రెడ్డిదే. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని జగన్ బొక్కిన ప్రజాధనం ఎంతో ఏ ఆర్థిక గణాంకుడు లెక్క తేల్చగలరు? న్యాయస్థానం జగన్‌కి బెయిల్ మాత్రమే ఇచ్చింది. కానీ తానూ కడిగిన ముత్యంలా, నిర్దోషిగా చెప్పుకొంటున్నారు. 2004 ముందు జగన్ ఆస్తులు ఎన్ని? 2009 తర్వాత ఆస్తులు ఎన్ని? ఇన్ని ఆస్తులు ఇంత తక్కువ సమయంలో సంపాదించడం ఎలా సాధ్యమైంది? 2003-2004లో జగన్ చెల్లించిన ఆదాయపు పన్ను రూ 3 లక్షల లోపు. 2010-2011 నాటికి వార్షిక ఆదాయం రూ. 500 కోట్లుగా లెక్కగట్టి ఆరు నెలలకు రూ 84 కోట్లు పన్ను చెల్లించేంతగా నడమంత్రపు సిరి పోగుపడటానికి ఏ ఐడియా కారణమో నేటి యువతకి చెప్పగలరా? అధికారాన్ని పెట్టుబడిగా మార్చి, రాష్ట్ర ప్రయోజనాలు నెలకూల్చి ఆ శిధిలాలమీదే వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించిన జగన్ రెడ్డి గత తెలుగుదేశం ప్రభుత్వం విధాన నిర్ణయాలపై సిట్ వేసి దర్యాప్తు చేస్తామనడం, అరెస్టులు ఉంటాయి అనడం సిగ్గుచేటు. రాష్ట్రాన్ని నిలువుదోపిడి చేసిన ఆర్థిక నేరస్థుడు చెప్పే నీతులు వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు. నిజంగా అంత సత్యవంతులు అయితే దోపిడి చేసిన ప్రజాధనం మొత్తాన్ని ప్రజలకు పంపిణీ చేసి నైతిక విలువలతో రాజకీయ జీవితం ప్రారంభిస్తే అప్పుడు అవినీతి అంటూ జగన్ చెప్పే నీతులు ప్రజలు వింటారు.
దెయ్యాలు వేదాలు వల్లించినట్లు..
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతి పేరుతో భారీ అవినీతి జరిగిందని, మొత్తం అవినీతిని బయటకు తీస్తామని, విధానపరమైన నిర్ణయాలతో రాష్ట్రానికి నష్టం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని, సిట్ దర్యాప్తుతో మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని, కచ్చితంగా అరెస్టులు ఉంటాయని, 16 నెలలు జైలులో ఉండి బెయిల్‌పై బయట ఉన్న ముఖ్యమంత్రి, ఆయన సలహాదారు సజ్జల చెబుతున్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు, అవినీతిపరులు, నేరచరితులు సమాజానికి శ్రీరంగ నీతులు బోధించడం అంటే మన ప్రజాస్వామ్య దౌర్భాగ్యం కాకపొతే మరేమిటి? అవినీతి మోతుబరులు, రాజకీయ అక్రమార్కులకు సంకెళ్లు వెయ్యడంలో సీబీఐ-ఈడీ అసమర్థత, అలసత్వం, రాజకీయ జోక్యంతో బెయిల్‌పై బయటికి వచ్చి తాము దిగమింగిన జనం సొమ్ముతో రాజకీయ పార్టీ పెట్టి ధర్మప్రభువుగా ప్రచారం చేసుకొని అధికార పీఠం ఎక్కి గిట్టనివారిని అందరిని అవినీతిపరులుగా చిత్రించాలని చూస్తుంది జగన్ ముఠా. తండ్రి వైఎస్ హయాంలో ఫైలు కదలాలి అంటే అందుకు జగన్ కి ముడుపులు ముట్టాల్సిందే అని సీబీఐ దాఖలు చేసిన నీకిది నాకది చార్జిషీట్లలో ఘోషించింది. తండ్రి, తనయుల ముడుపుల తతంగాన్ని కళ్ళకు కట్టే చిత్ర, విచిత్రమైన అంశాలను ఎన్నింటినో వెలికి తీసి 11 చార్జిషీట్లు వేసింది సీబీఐ, ఈడీ 6 చార్జిషీట్లు వేసింది. ప్రాథమిక విచారణలో రూ. 43 వేల కోట్లు ప్రజాధనం దోపిడి అయినట్లు నిగ్గు తేల్చింది సీబీఐ.
దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణం..
మొదట్లో జగన్ వంటి ఆర్థిక నేరగాళ్లకు బెయిల్ ఇస్తే దోపిడీకి లైసెన్సు ఇచ్చినట్లేనని సర్వోన్నత న్యాయస్థానికి చెప్పింది సీబీఐ, ఇన్ని కోణాలున్న కేసును నేను చూడటం నా సర్వీసులో మొదటిసారి అని మాజీ సీబీఐ డైరెక్టర్ ఏపీసింగ్, ఇంత తక్కువ సమయంలో ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారని అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రశ్నించారు. జనాన్ని కొట్టి జగన్ కి దోచి పెట్టడమే లక్ష్యంగా సాగిన వైఎస్ పరిపాలన నిలువెల్లా అవినీతిమయమని కాగ్ నివేదికలు తేల్చాయి.
దేశంలో వున్న 30 మంది ముఖ్యమంత్రులలో ఏపీ సియం జగన్ రెడ్డి రూ. 510 కోట్లతో మహా శ్రీమంత ముఖ్యమంత్రిగా నిలిచినట్లు ప్రముఖ సంస్థ ఏడీఆర్ వెల్లడించింది. అత్యంత ధనవంతుడిగా ఖ్యాతికెక్కిన జగన్ సంపద అంతా జనాన్ని దోచిందే. ఆర్ధిక ఎదుగుదల వెనుక గల చరిత్ర అంతా మోసాలే. తండ్రి అధికార పునాదులపై అచిర కాలంలోనే మహా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన జగన్, తన తండ్రి ముఖ్యమంత్రి కాకముందు అప్పులు కారణంగా ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేది. కేవలం కర్ణాటకలో 22.5 మెగావాట్ల చిన్న సెకండ్ హ్యాండ్ విద్యుత్తు ప్లాంట్ నడుపుకొంటున్న జగన్ రెడ్డికి ఐదేళ్లలో ఇన్ని వేల కోట్ల ఆస్తులు, ఇన్ని కంపెనీలు స్థాపించడం ఎలా సాధ్యమైందో ప్రజలకు చెప్పగలరా? నీకిది, నాకది ఫార్ములా ప్రయోగించి డొల్ల కంపెనీలు సృష్టించి నిధులు సమీకరణలో మనీలాండరింగ్ జగన్ పాల్పడిన ఆర్ధిక నేరాలకు సంబంధించి ఫెమా నిబంధనల ఉల్లంఘన, మనీలాండరింగ్ వంటివి తీవ్ర నేరాలే. జగన్ చేసిన ఆర్ధిక నేరాలు అసాధారణమైనవని ఆయన అఫిడవిట్ ద్వారా తెలుస్తుంది. సీబీఐ, ఈడీ వేసిన 17 చార్జి షీట్లలో 31 కేసులు జగన్ నేరచరిత్రే. 47 పేజీల అఫిడవిట్ లో 18 పేజీలు ఆర్ధిక నేరాల చిట్టానే. 108 మంది వ్యక్తులు, 100 కు పైగా కంపెనీలు, 4 గురు మంత్రులు,10 మంది ఐఏఎస్ అధికారులు, 5 గురు ఉన్నతాధికారులు గూడు పుఠానితో జరిగిన దేశంలో అతిపెద్ద ఆర్ధిక కుంభకోణం ఇది.
ఇది ప్రజాస్వామ్య దౌర్భాగ్యం కాదా?
జగన్ అవినీతిపై దేశ, విదేశాల్లో చర్చోపచర్చలు జరిగాయి. స్వతంత్ర భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు చెయ్యనంత దోపిడీ చేసి, ఏ నాయకుడు ఎదుర్కోనన్ని అవినీతి కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి జగన్. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనతికాలంలోనే వేల కోట్లు సంపద వెనకేసుకొన్నట్లు వచ్చిన ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చడానికి ఎంత తతంగం అవసరం అయిందో దేశమంతా చూశారు. దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాలలో ఏక కాలంలో వందల మంది అధికారులను రంగంలోకి దించి సోదాలు నిర్వహించడం దేశ చరిత్రలోనే తొలిసారి. అధికారాన్ని పెట్టుబడిగా మార్చుకొని సరికొత్త అవినీతికి అద్దం పట్టిన విస్మయకర గాథ. రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి దోహద పడాల్సిన వనరులతో హవాలా నడిపి, లెక్క లేనన్ని బినామీ కంపెనీలతో చట్టం కళ్ళు కప్పి నేరపూరిత కుట్రకు పాల్పడిన విధానంపై దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది..
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని నాడు లక్షకోట్ల రూపాయల ప్రజాధనాన్ని దిగమింగిన జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఒక్క చాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి ఏడాదికి లక్షకోట్ల రూపాయల ప్రజాధనం దోపిడీ చేశారు. గత నాలుగేళ్లుగా నాలుగు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. యథేచ్ఛగా ల్యాండ్-శాండ్-వైన్-మైన్-డ్రగ్స్ మాఫియాలు ఇష్టానుసారం కొల్లగొట్టారు. ల్యాండ్, మైనింగ్, మద్యం, గంజాయి , ప్రాజెక్టులు, రేషన్ బియ్యం, ఎర్ర చందనం, సిమెంట్, పేదల ఇళ్ల పట్టాలకు, పనికిరాని భూములు సేకరణ, భూమి చదును, విశాఖ భూ కుంభకోణం, సంకల్ప సిద్ది చిట్స్, లేపాక్షి భూములు స్కాం, రేషన్ వాహనాలు, అంబులెన్సులు కుంభకోణం, గుడివాడలో క్యాసినో కుంభకోణం, విశాఖలో బాక్సయిట్ కుంభకోణం, డెయిరీలను అమూల్‌కు కట్టబెట్టడం, నాడు -నేడు పథకంలో ఇలా ఒకటేమిటి అన్నింట్లో మొత్తం నాలుగేళ్లలో నాలుగు లక్షలకోట్ల ప్రజాధనాన్నిదిగమింగిన జగన్ రెడ్డి గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది అంటూ ఆరోపణలు చెయ్యడం సిగ్గుచేటు. దేశంలో వున్న 30 మంది ముఖ్యమంత్రులలో శ్రీమంత ముఖ్యమంత్రిగా నిలిచిన జగన్ దెయ్యాలు వేదాలు వల్లించినట్లు, అవినీతి పరులు, నేరచరితులు సమాజానికి శ్రీరంగ నీతులు బోధించడం అంటే మన ప్రజాస్వామ్య దౌర్భాగ్యం కాకపొతే మరేమిటి?
నీరుకొండ ప్రసాద్
98496 25610
ఇవి కూడా చదవండి: