నివేదన: ఆ త్యాగాలను స్మరించుకుందాం

by Ravi |   ( Updated:2022-09-03 13:47:09.0  )
నివేదన: ఆ త్యాగాలను స్మరించుకుందాం
X

'ఆజాదీకా అమృత్ మహోత్సవ్' దేశవ్యాప్తంగా ఒక పండుగలా, ఒక ఉద్యమంలా ఉత్సాహంగా కొనసాగుతుండటం ముదావహం. వందల సంవత్సరాల బానిస సంకెళ్ల నుంచి విడివడి 75 సంవత్సరాల కిందట మొదటిసారి మువ్వన్నెల జెండాను ఎగరేసిన మన తాతల, తండ్రుల ఘనతను స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. మూడు రంగుల జెండా మన అస్తిత్వానికి ప్రతీక. 'ఆజాదీకా అమృత్ మహోత్సవ్' అంటే మూడు రంగుల జెండాను ఎగురేయడం, సంబరాలు చేసుకోవడం ఎంతమాత్రం కాదు. ఆ జెండా రెపరెపల వెనుక దాగున్న లక్షలాది గుండెల తపన. వేలాది జీవితాల త్యాగాలను గుర్తు చేసుకోవడం. మన స్వాతంత్ర్యం ఎంత విలువైనదో, దాని కోసం రక్తతర్పణలు చేసిన నాటి త్యాగధనుల దేశభక్తి ఎంతగొప్పదో స్మరించడం, ఆలోచించడం, వారి స్పూర్తిని ముందుకు తీసుకెళ్లడమే త్రివర్ణ పతాకానికి మనమిచ్చే నిజమైన గౌరవం. మనం గొప్పగా చెప్పుకుంటున్న ఈ 22వ శతాబ్దంలోనూ, విస్తృత ప్రజాస్వామ్యంతో వర్ధిల్లుతున్న నేటికాలంలోనూ మనం ఒంటరిగా పోలీసుస్టేషన్‌కు వెళ్లడానికి జంకుతున్నాం. వ్యవస్థకు వ్యతిరేకంగా గళమెత్తడానికి భయపడుతున్నాం. సామాజిక మాధ్యమాలలోనూ స్వేచ్చగా అభిప్రాయాలను వ్యక్తం చేసే సాహసం చేయలేకపోతున్నాం. అటువంటిది వందల సంవత్సరాల బానిస పాలనలో, ప్రజాస్వామ్యం పోలీసుల కబంధ హస్తాలలో విలవిలలాడుతున్న నాటి కాలంలో దేశ స్వాతంత్ర్యం కోసం ఎలుగెత్తడమే కాదు, తమ ధన మాన ప్రాణాలను తృణప్రాయంగా భారతమాత పాదాలముందు నిండు భక్తితో సమర్పించిన నాటి యోధుల ఘనతను, వారి నిష్కళంక దేశభక్తిని ఎంత స్మరించినా అది 'ఈశ్వరునికి నూలు పోగు' వంటిదే.

అది సమంజసం కాదు

ప్రపంచచరిత్రలో అత్యంత పాశవిక ఘటనగా నిలిచిపోయిన 'జలియన్ వాలాబాగ్' సంఘటన ప్రపంచానికి తెలియడానికి నెల రోజులకుపైగా పట్టిందంటే నాటి నిర్భంధాన్ని ఏమని వర్ణించాలి! అంత తీవ్ర నిర్బంధంలోనూ జాతికి విముక్తి కల్పించడానికి ఉద్యమించి, లక్షలాది యువతను 'క్విట్ ఇండియా' అంటూ నడిపించి, నరనరాలలో భారతీయతను రంగరించిన మహనీయులను ఎంత కీర్తించినా అది తక్కువే అవుతుంది. సువిశాల భారతదేశం కండ్లముందు సుస్పష్టంగా కదలాడుతున్నా, భారతీయులమని గర్వంగా ఎలుగెత్తిచెప్పడానికి మొహమాటపడుతున్న, ఎవరో పిలుపిస్తే తప్ప చెప్పడానికి తటపటాయిస్తున్న మనుషుల మధ్య జీవిస్తున్నాం మనం. అటువంటిది వంద సంవత్సరాల కిందట, 500 సంస్థానాల రూపంలో చిన్నాభిన్నంగా ఉన్న ప్రాంతాన్ని భారతదేశంగా ఉహించుకుని, మాతృదేశ విముక్తి కోసం ఎలుగెత్తిన నాటి తరాలను భక్తితో కన్నీటితో పూజించాల్సింది పోయి మనలో కొందరు వారి చిత్తశుద్దిని ప్రశ్నించడం, వికృత ఉద్దేశాలను ఆపాదించడం విడ్డూరం, దురదృష్టకరం.

అదే వారికి నిజ నివాళి

సర్వసత్తాక గణతంత్ర దేశంలో ఉండి కూడా నేడు కొందరు స్వేచ్చానుభూతి చెందకుండా విదేశాల వైపు చూస్తున్నారు. నిర్బంధంలో కూడా రాజీ పడకుండా గుండె ధైర్యాన్ని ప్రదర్శించిన, జీవితాలను తృణప్రాయంగా త్యాగం చేసిన నాటి స్వాతంత్ర యోధుల నిజాయితీని, నిష్కళంక దేశభక్తిని, ఔన్నత్యాన్ని ప్రశ్నించడం ఆకాశం మీద ఉమ్మేయడం కాకుండా మరేమౌతుంది. మువ్వన్నెల జెండా వెనుక దాగున్న మన పూర్వుల ఉద్దేశాలను, శాంతి, సహనం, సామరస్యాల ఔన్నత్యాన్ని, ఆ జెండా రెపరెపల కోసం ఆ త్యాగధనులు చేసిన ఆత్మార్పణలను స్మరించడంలోనే మన దేశభక్తి దాగున్నదనేది అక్షర సత్యం. ఏడున్నర దశాబ్దాల కిందట ఆ స్ఫూర్తిదాతలు మనకందించిన ఆ జయకేతాన్ని నిజంగా ఎగురేయాల్సింది మనింటి గోడల మీదనో, సందు చివర జెండా గద్దెల మీదనో కాదు, 140 కోట్ల భారతీయుల హృదయాకాశంలో, అదే ఆ మహనీయులకు మనమర్పించే నిజమైన నివాళి. జైహింద్.

చందుపట్ల రమణకుమార్ రెడ్డి

న్యాయవాది, మంథని

94404 49392

Advertisement

Next Story