హిట్లర్‌ను మరిపిస్తున్న దాష్టీకం

by Ravi |   ( Updated:2023-11-17 01:01:06.0  )
హిట్లర్‌ను మరిపిస్తున్న దాష్టీకం
X

గాజా మీద జరుగుతున్న ఇజ్రాయెల్ అమానుష దాడులకు ప్రపంచం విస్తుపోయింది. యూదులను కాన్‌సంట్రేషన్ క్యాంపులలో పెట్టి, హిట్లర్ మారణహోమం చేసినప్పుడు ప్రపంచమంతా యూదులకు సానుభూతి చూపించింది. ఈనాడు అదే సానుభూతిని పాలస్తీనీయుల మీద చూపిస్తున్నారు. నిజానికి యూదు మేధావులలో ప్రపంచాన్ని విజ్ఞానపరంగా మార్చినవారున్నారు. ప్రపంచం మొత్తం యూదుల మేథో ప్రభావానికి అనేక సందర్భాలలో గురైంది. కానీ ఇప్పుడు పాలస్తీనా ఆందోళనకారులు యూదుల రాజ్యం వద్దని కోరుకుంటున్నారు. బందీలను విడిపించాలని భారీ ఆందోళనను నిర్వహించారు. ఇంకోవైపు గాజాలో మానవతా సాయానికి ఇజ్రాయెల్ ఆటంకాలను కలిగించడాన్నీ తీవ్రంగా పరిగణించింది అంతర్జాతీయ నేర న్యాయ స్థానం.

నిజానికి, ఇజ్రాయెల్ అంతరాత్మ కూడా ఈ భయానక స్థితిని చూసి చలించింది. అందుకే నెమ్మదిగా, స్థిరంగా మాటలను కూడబలుక్కుంటోంది. ‘హారెడ్జ్’ అనే ఇజ్రాయెల్‌లో పేరున్న వార్త పత్రిక ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరిగిన మరుసటి రోజు అక్టోబర్ 8న తన సంపాదకీయ వ్యాసంలో... ‘దాడి వల్ల ఇజ్రాయెల్‌కు సంభవించిన విపత్తుకు బాధ్యత వహించవలసిన ఒకే ఒక వ్యక్తి ‘బెంజమిన్‌ నెతన్యాహూ’ అని రాసింది. పాలస్తీనా ఉనికిని, హక్కులను నెతన్యాహూ విస్మరించారని ఆరోపించింది. 9వ తేదీన ఆ పత్రిక ప్రతీకార ఉద్యమాలకు, యుద్ధనేరాలకు ఆస్కారం ఉండొచ్చని హెచ్చరించింది. ఆ పత్రిక వ్యాసకర్తగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన గిడియన్ లేవీ 19వ తేదీన ‘ఎనఫ్’ (చాలు) అనే శీర్షికతో సంపాదకీయం పేజీలో రాసిన వ్యాసంలో ‘ఈ రక్తపాతాన్ని తక్షణం ఆపి తీరాలి... వినాశానికి హద్దులు ఉంటాయి’ అని పేర్కొన్నారు.

అతిపెద్ద మానవ విషాదం..

కాల్పుల విరమణకు పలు దేశాలు చేస్తున్న విజ్ఞప్తులను బేఖాతరు చేస్తూ గాజాపై ఇజ్రాయెల్ బీకర దాడులను కొనసాగిస్తూనే వుంది. గత నెల రోజులకు పైగా గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న బాంబు దాడుల్లో, వైమానిక దాడుల్లో వేలాదిమంది పిల్లలు, స్త్రీలు మృతి చెందారు. ఇప్పటి దాకా జరిగిన ఘర్షణలో 12,000 మంది పాలస్తీనీయులు మరణించారు. గాజాలో ఇళ్ల నుంచి 15 లక్షల మంది వలస వెళ్లారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఇది మొత్తం ప్రజల్లో 70 శాతమని పేర్కొంది. వేల మంది ఇజ్రాయెల్ ఆందోళనకారులు గత శనివారం జెరూసలెంలోని ప్రధాని నెతన్యాహు ఇంటి ఎదుట నిరసనకు దిగి,ప్రధాని రాజీనామా చేయాలని, బందీలను విడిపించాలని డిమాండ్ చేశారు.

అలాగే, గాజాలో వెంటనే కాల్పుల విరమణ పాటించాలని డిమాండ్ చేస్తూ అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని శ్వేతసౌధం ఎదుట శనివారం వేల మంది పాలస్తీనా అనుకూలురు ఆందోళనకు దిగారు. ఇజ్రాయెల్‌కు అమెరికా చేస్తున్న సాయాన్ని ఆపాలని కోరారు. గాజా రక్తసిక్తమవుతున్న తీరుకు నిరసనగా శ్వేతసౌధం గేటుకు ఎరుపు రంగు వేశారు. ఈ ఆందోళనలో దాదాపు 10 వేల మంది పాల్గొన్నారని అంచనా. ఇవే ఆందోళనలు జర్మనీలోని బెర్లిన్‌లోనూ జరిగాయి. ఇజ్రాయెల్ దాడులను లండన్‌లోని యూదులు, అమెరికాలోని యూదులు సైతం ఖండించారు. ఈ దాడుల విధ్వంసం అక్టోబర్ 19 నాటికే ఎంత దారుణంగా ఉందో ప్రముఖ విదేశాంగ మాజీ కార్యదర్శి శ్యామ్ చరణ్ వివరిస్తూ, మనం ఇప్పుడు 20 లక్షల మందికి పైగా పాలస్తీనియన్లు నివసించే గాజా స్ట్రిప్‌లో ఒక పెద్ద మానవ విషాదం అంచున ఉన్నామన్నారు.

హమాస్ ఎత్తుగడ ఫలించేనా?

ప్రపంచ స్థాయి నిఘా, సైనిక సామర్థ్యాలు ఉన్నప్పటికీ దాడిని నిరోధించలేకపోయిన బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వంపై ఇజ్రాయెలీలకు ఆగ్రహం ఉంది. అకస్మాత్తుగా, అనేకమంది ఊహించినట్లుగా ఇజ్రాయెల్ అభేద్యంగానూ, సురక్షితంగానూ కనిపించడం లేదు. ప్రణాళికబద్ధమైన దాడి నెతన్యాహు వైఫల్యాల నుండి దృష్టిని మళ్ళించి, ప్రజలు ద్వేషిస్తున్న శత్రువుకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేసే రాజకీయ ప్రయోజనానికి మాత్రం ఉపయోగపడుతుంది. గాయపడిన శత్రు జనాభాతో నిండివున్న గాజాను తాత్కాలికంగా తిరిగి ఆక్రమించడం కూడా ఇజ్రాయెల్ భద్రతను ఎలా మెరుగుపరుస్తుందో చెప్పడం కష్టం.

ఇజ్రాయెల్, కీలకమైన అరబ్ దేశాల మధ్య సంబంధాలను సాధారణీకరించే ధోరణి ఇప్పుడు సవాలును ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాల స్థాపన, రాయబార కార్యాలయాల మార్పిడికి దారి తీస్తుందని భావిస్తున్న కీలకమైన చర్చలను నిలిపివేస్తున్నట్లు సౌదీ అరేబియా ఇప్పటికే ప్రకటించింది. ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలు అమాయక పాలస్తీనియన్లను చంపడం, తీవ్రంగా గాయపర్చడం అనేది ఇప్పటికే అరబ్ వీధుల్లో ఆందోళన కలిగిస్తోందని ప్రకటించింది. అమెరికా, యూరప్‌లోని గణనీయమైన అరబ్ డయాస్పోరాలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం, ముస్లిమేతర ప్రజలలో కూడా ఆగ్రహావేశాలతో కూడిన ప్రదర్శనలు జరిగాయి. పాలస్తీనా సమస్యను అరబ్ రాజ్యాలతో సహా విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వాలు కూడా పక్కన పెట్టేశాయి. ఇప్పుడు ఇదే ప్రాంతీయ ప్రపంచ రాజకీయాలకు కేంద్రం అవుతుంది. సరిగ్గా హమాస్ సాధించాలనుకున్నది ఇదే. శాంతి, శ్రేయస్సుతో కూడిన యుగానికి దారితీస్తూ, ఇజ్రాయెల్‌ను పశ్చిమాసియా రాజకీయ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలనుకోడం అమెరికా మద్దతు కలిగిన ప్రాంతీయ ఒడంబడిక వైపు మొగ్గు చూపడం అనేది ఇప్పుడు సమాధి అయిపోయింది. చెప్పాలంటే పాలస్తీనా సమస్య ప్రస్తుతం స్తంభించిపోయింది. ఇది రివర్స్ కావచ్చు కూడా. ఇరాన్, లెబనాన్ కూడా ఘర్షణ కేంద్రాలుగా మారితే వివాదం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. విస్తృత స్థాయి యుద్ధంగా మారితే మహా విపత్తు అవుతుంది.

పాలస్తీనా హక్కులూ విలువైనవే!

గాజా స్ట్రిప్‌లో హమాస్‌పై జరిగిన దాడిలో పాలస్తీనా పౌరులకు జరిగిన తీవ్ర నష్టాన్ని కూడా అంగీకరించాలి. వారి హక్కులు ఇజ్రాయెల్ ప్రజలకు ఉన్నంత ముఖ్యమైనవి, బలమైనవి కూడా. నిజానికి అక్టోబర్ 17వ తారీఖు గాజా ఆస్పత్రిపై జరిగిన దాడి ప్రపంచాన్ని కదిలించింది. ఇజ్రాయెల్ అమానవీయ చర్యలకు ఇది పరాకాష్టని సామాజిక, పాత్రికేయ లోకం ఆక్రంధించింది. గాజాలోని ఆల్ అహ్లీ సిటీ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడులు చేసిందన్న పాలస్తీనా ఆరోపణలను ఇజ్రాయెల్ సైన్యం ఖండించింది. దాడి చేసింది తాము కాదని స్పష్టం చేసింది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ మిలిటరీ గ్రూప్ రాకెట్ మిస్‌ఫైర్ అయి ఆసుపత్రిపై పడిందని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా విడుదల చేసింది. గాజాలోని అనాగరిక ఉగ్ర మూకలే, అక్కడి ఆసుపత్రిపై దాడి చేశాయి. ఐడిఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) కాదు. మా పిల్లలను అతి దారుణంగా హత్య చేసిన ఆ ఉగ్రవాదులు ఇప్పుడు వారి పిల్లలను కూడా చంపేస్తున్నారు’ అని నెతన్యాహు ఆరోపించారు.

గాజా మీద జరుగుతున్న దాడులు ఇంకా కొనసాగడం ప్రపంచ శాంతికి భంగకరం. వీటన్నింటికి మతోన్మాద భావనలే మూలం. క్రైస్తవం పేరుతో, ఇస్లాం పేరుతో ప్రపంచానికి అణు యుద్ధ ప్రమాదం పొంచి వుంది. అణ్వాయుధాల సృష్టికర్తలు కూడా యూదులే. యూదుల, ఇస్లాం ఉగ్రవాదుల మతోన్మాద భావనను అమెరికా సామ్రాజ్యవాదం ఉపయుక్తం చేసుకుంటుంది. తెల్ల భవనం నెత్తుటి జల్లుకు మృదంగం వాయిస్తుంది. ప్రపంచంలోని మానవ హక్కుల పోరాట వాదులందరూ కలసి ఈ మతోన్మాద భావనలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రపంచానికి బౌద్ధ ధర్మ మార్గంలో శాంతి, సామరస్యం, సౌజన్యం, మానవత్వం రూపొందించాలి. ఆ మానవతా శాంతి చరిత్రలో భాగస్వాములవుదాం.

డా. కత్తి పద్మారావు

98497 41695

Advertisement

Next Story

Most Viewed