- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమృత్ కాల్ బడ్జెట్.. అమృతమేనా?
స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలైన సందర్భాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమృత్ కాల్ అని ప్రచారం చేస్తోంది. దీనికి అనుగుణంగానే అమృత్ కాల్ తొలి బడ్జెట్‌ని బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 2021లో ప్రధాని నరేంద్రమోడీ ఈ పదాన్ని తొలిసారిగా వాడారు. అప్పటినుంచి దేశంలో ఏ విశేష కార్యక్రమం జరిగినా దాన్ని అమృత్ కాల్‌తో ముడిపెట్టడం కేంద్రానికి సహజంగా మారింది. సాంకేతికంగా, విజ్ఞాన పరంగా కేంద్రీకృతమవుతున్న ఆర్థిక వ్యవస్థ స్థాపనే అమృత్ కాల్ సందర్భంగా తమ దార్శనికతంగా ఉందని బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు. బలమైన ప్రభుత్వ ఫైనాన్స్, దూకుడు ప్రదర్శిస్తున్న ఆర్థిక రంగం తాజా బడ్జెట్‌కి పునాదిగా ఉందన్నారు. సమస్తరంగాల్లో ప్రజా భాగస్వామ్యాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని ఆమె నొక్కి చెప్పారు.
అమృత్ కాల్‌లో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత వరుసగా అయిదో బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు. బుధవారం ఆమె పార్లమెంటులో సమర్పించిన 2023 బడ్జెట్ మొత్తం మీద సమతూకంతో ఉందని ఆశ్చర్యపరిచే ప్రతికూల అంశాలు పెద్దగా లేవని విమర్శకుల ప్రాథమిక అంచనా. భారత సూక్ష్మ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చే దిశగా రూపొందిన తాజా బడ్జెట్ ఆర్థిక క్రమశిక్షణకు, వృద్ధికి మధ్య లంకె పెట్టింది. పైగా సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇది చివరి బడ్జెట్ కావడంతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర చర్యలు చేపట్టకుండా వీలైనంత సంయమనం పాటించిందని బడ్జెట్ గణాంకాలు సూచించాయి. మహిళలు, వృద్దులు, వేతన జీవులకు పెద్ద ఉపశమనం కలిగించిన బడ్జెట్‌గా ప్రశంసలు దక్కుతున్నాయి.
మహిళలకు, వృద్ధులకు మేలు చేసిన బడ్జెట్
2023 కేంద్ర బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేకంగా సమ్మాన్ సేవింగ్స్ సర్టిపికెట్ అనే కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి అందుబాటులో ఉండే ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలో పెట్టిన డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీని ఇస్తారు. గరిష్టంగా రెండు లక్షల వరకు ఈ పథకంలో డిపాజిట్ చేయవచ్చు. అలాగే సీనియర్ సిటిజన్లకు సేవింగ్ స్కీమ్ కింద ప్రస్తుతం గరిష్ట పరిమితి రూ. 15 లక్షల వరకు మాత్రమే ఉండగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి దాన్ని రూ. 30 లక్షలకు పెంచారు. అలాగే మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ పరిమితిని కూడా ప్రస్తుతం ఉన్న 4.5 లక్షల నుంచి 9 లక్షల రూపాయలకు పెంచారు. జాయింట్ అకౌంట్ కలిగిన వారికి ప్రస్తుతం ఉన్న 9 లక్షల నుంచి 15 లక్షల రూపాయలకు పెంచారు. ఈ పథకంపై ఇప్పుడు 7.10 శాతం వడ్డీ లభిస్తోంది.
ఆదాయ పన్నులో కీలకమార్పులు
వేతన జీవులపై కాస్త కరుణ చూపాలని గత నాలుగేళ్లుగా మొత్తుకుంటున్న పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారీ రాయితీని ప్రకటించింది. ఆదాయంలో 5 లక్షల వరకు పన్ను రాయితీ ఉండగా తాజాగా దాన్ని రూ.7 లక్షలకు పెంచారు. అంటే సంవత్సరాదాయంలో 7 లక్షల వరకు వేతన జీవులు పన్ను చెల్లించనవసరం లేదు. అలాగే పన్ను శ్లాబుల సంఖ్యను కూడా తగ్గించారు. గతంలో 6 శ్లాబులు ఉండగా వాటిని 5 కి కుదించారు. 6 నుంచి 9 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు గతంలో 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉండగా ఇప్పుడు దాన్ని పూర్తిగా ఎత్తేశారు.
శ్రీ అన్న కేంద్రంగా భారత్
చిరుధాన్యాలను తన ప్రసంగంలో శ్రీ అన్న అని పేర్కొన్న ఆర్థిక మంత్రి భారత్ ప్రపంచానికి శ్రీ అన్న కేంద్రంగా మారనుందని చెప్పారు. భారత్‌లో పండించే జొన్న,రాగి, బాజ్రా, సామలు సహా పలు రకాల చిరుధాన్యాల వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు. శతాబ్దాలుగా దేశ ఆహార పద్ధతుల్లో ఇవి భాగంగా ఉన్నాయన్నారు. భారత్‌ను ప్రపంచ శ్రీ అన్న కేంద్రంగా మార్చడంలో భాగంగా హైదరాబాద్‌లో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ మిల్లెట్ రీసెర్చ్ సంస్థను సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సుగా మార్చనున్నట్లు ప్రకటించారు. అలాగే వ్యవసాయ రుణ వితరణ లక్ష్యాన్ని రూ. 20 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు సీతారామన్ సాహస ప్రకటన చేశారు.
వృద్ధి రేటు క్షీణత మాటేంటి
2022 బడ్డెట్ ప్రసంగంలో 2023 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి 9.2 శాతానికి చేరుతుందని నిర్మల చెప్పారు. ఇది ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల్లోనే అత్యధిక వృద్ధి శాతం అన్నారు. కానీ ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇంధన ధరలు చుక్కలంటడం, ప్రపంచ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో గత డిసెంబర్ నాటికి భారత్ వృద్ధిరేటు 6.8 శాతానికి పడిపోయింది. వృద్ధిరేటు ఇంత భారీగా తగ్గిపోవడంతో సబ్సిడీ తో సహా సంక్షేమ చర్యలపై దెబ్బ పడింది. గృహ నిర్మాణ రంగం కూడా వెనుకంజ వేసింది. మొత్తం ఇళ్ల నిర్మాణ పథకంలో 42 లక్షల గృహాల నిర్మాణ ప్రాజెక్టు నిధుల్లేక ఆగిపోయాయి. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో 12 వేల కిలోమీటర్ల దూరం రహదారులను నిర్మించాలని కేంద్రం భావించినా నిధుల కొరత వల్ల 5,774 వేల కిలోమీటర్ల మేరకు మాత్రమే జాతీయ రహదారులను నిర్మించగలిగారు.
నిర్మలా సీతారామన్ తాజా బడ్డెట్ చాలా వర్గాలకు ఉపశమనంగా పైకి కనిపిస్తున్నప్పటికీ నిధుల కేటాయింపు అమలులో తీవ్ర వ్యత్యాసాల కారణంగా ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి కేంద్రం హామీలు ఏమేరకు అమలవుతాయన్నది కీలకంగా మారింది.
-ప్రత్యూష
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672
Also Read...
ఆత్మీయత పంచుతూ, ఆత్మస్థైర్యం నింపుతూ..లోకేష్ యువగళం