- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఓటు హక్కుకి.. గరిష్ట వయోపరిమితి వద్దా?
పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయునికి ఓటు హక్కు కల్పించింది మన రాజ్యాంగం. భారత రాజ్యాంగం ప్రకారం కుల, మతాలకు అతీతంగా అందరికీ సమానంగా ఓటు హక్కు ఉంది. నిరక్షరాస్యులకు, వయో వృద్ధులకు, వికలాంగులకు, మానసిక రోగులకు, చెవిటి, మూగ, గుడ్డి వాళ్ళకి కూడా సమాన ఓటు హక్కు కల్పించడం భారత రాజ్యాంగం యొక్క ప్రత్యేకత. కానీ ఓటు హక్కుకి ఒక గరిష్ట వయోపరిమితి లేకపోవడం ఆలోచించాల్సిన విషయం. తాజాగా వికలాంగులు, వయోవృద్ధుల కోసం పోలింగ్ బూతుల్లో వీల్ చైర్లు ఏర్పాటు చేయడంతో పాటు, ముందస్తు దరఖాస్తుతో ఇంటి నుండే ఓటు వేసే సౌకర్యాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. సాధారణంగా మన దేశంలో 60 సంవత్సరాలు నిండిన వారికి ఉద్యోగపరంగా కాకుండా అన్ని రకాలుగా కూడా విరమణ ప్రకటిస్తుంటాం. అరవై ఏళ్లు నిండిన వారికి ప్రభుత్వాలు కూడా పెన్షన్ మంజూరు చేస్తున్నాయి. లైవ్ సర్టిఫికెట్లు, ఫిట్ నెస్ సర్టిఫికెట్లు, మెడికల్ సర్టిఫికెట్లు ప్రతి సంవత్సరం విధిగా సమర్పించాలని వయో వృద్ధులకు, వికలాంగులకు ఎన్నో రకాల నిబంధనలు ఉన్నాయి. ఎల్‌ఐసీ, ఇతర ఇన్సూరెన్సు సంస్థలు కూడా వృద్ధులకు ఎలాంటి పాలసీలు ఇవ్వడం లేదు. కానీ, వందేళ్లు నిండిన వయోవృద్ధులు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం మన దేశంలోని ప్రత్యేకత.
అయితే వయసు నిండి, మానసికంగా పరిపక్వత లేని వీరంతా తమకి నచ్చిన వారికే ఓటు వేస్తున్నారా? నిజంగా ఎవరి సహాయం లేకుండా వీరే స్వంతంగా ఓటు వేస్తున్నారా? అని ఆలోచించాల్సిన విషయం. ఏ అభ్యర్థికి ఓటు వేస్తున్నాం, ఏ పార్టీకి ఓటు వేస్తున్నాం.. అసలు పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరు.. ఆ గుర్తు ఎవరిది అన్న విషయం కూడా వయోవృద్ధులకు తెలుసా..? కంటి చూపు లేని వారి ఓటు ఎవరేస్తున్నారు, ఏ గుర్తుకు వేస్తున్నారో ఎప్పుడైనా ఎన్నికల సంఘం ఆలోచన చేసిందా? ఇలాంటి వారికి చెందిన దాదాపు 5 నుంచి 10 శాతం ఓట్లను, పోలింగ్ బూత్ అధికారులే తమకు నచ్చిన నాయకునికే గుద్దుతున్నారు అన్న విషయాన్ని ఎన్నికల సంఘం ఎప్పుడైన గుర్తించిందా? ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికి వారి పేరు మీద బ్యాలెట్‌లో లేని చేతి గుర్తుకు, సైకిల్ గుర్తుకు కూడా ఓటు వేసేందుకు పోలింగ్ బూతుకి వచ్చే వృద్ధులు కూడా వున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి వయోవృద్ధుల ఓటు హక్కు దుర్వినియోగం అవడమే కాకుండా నాయకుల గెలుపు, ఓటములు తారుమారు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దేశానికి ఉపయోగపడే నాయకులు ఎవరు? దేశ భవిష్యత్తుకి ఉపయోగపడే పార్టీలు ఏవో కూడా వారికి పూర్తిగా తెలిసే అవకాశం లేదు. కావున వయోవృద్ధులకు, చూపు లేని వారికి, మానసిక వికలాంగులకు ఓటు హక్కు కల్పించడంపై ఎన్నికల సంఘం ఒక ఆలోచన చేయాలి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు సైతం లోతుగా విచారణ చేసి కొన్ని విధి, విధానాల్ని రూపొందించాల్సిన అవసరం కూడా వుంది.
- పసునూరి శ్రీనివాస్
అడ్వకేట్, మెట్‌పల్లి
88018 00222