- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్రెండ్లీ సర్కార్ ఉండేది ఇలాగేనా?
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, విశ్రాంత ఉద్యోగ సంఘాలు గతంలోని తమ వైభవాన్ని క్రమంగా కోల్పోతున్నాయి. ప్రభుత్వంతో చర్చలు జరిపి, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చుకోలేక పోతున్నాయి. 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తమది ‘ఫ్రెండ్లీ సర్కార్’ అని గొప్పగా చెప్పుకుంది. కానీ ఆచరణలో తాను చేసిన వాగ్దానాలు నెరవేర్చడం లేదు. ప్రభుత్వం ఉద్యోగస్తుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఉద్యోగ ఎన్‌జీఓ లీడర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెలు, ధర్నాలు చేసే స్థితిలో లేరు. ఎందుకంటే గతంలో వారు లీడర్లుగా ఉండి అక్రమంగా ప్రమోషన్లు, అక్రమ ఆస్తులు సంపాదించుకున్నారని అందుకే ప్రభుత్వం వారి ఫైల్స్ అడ్డం పెట్టుకుని వారిని ఆడిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో నిజం ఎంతో తెలియదు. కానీ పరిస్థితులు చూస్తే అలాగే అనిపిస్తుంది. గతంలో ఆర్‌టీసీ ఉద్యోగుల సమ్మె విఫలం కావడానికి ఈ ఫైల్స్‌ని అడ్డం పెట్టుకొని యూనియన్ నాయకుల నోరు మూయించారని వార్తలు వెలువడ్డాయి.
జీతాలు వస్తే చాలనే పరిస్థితి..
ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల, రిటైర్డ్ ఎంప్లాయిస్ పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వం నుంచి జీతాలు, పెన్షన్ ఎలాంటి కోతలు లేకుండా విడతలుగా వస్తే చాలనుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్రంలో ఇదేమి ఖర్మో అర్థం కావటంలేదు. గతంలో ఉద్యోగస్తులకు నెలఖరుకు ఠంచన్‌గా జీతం, పెన్షన్ వచ్చేది. తరువాత కాలంలో నెల మొదటి రోజే వచ్చేది. ఇప్పుడు ఏ జిల్లాకు ఏ తేదీన వస్తాయో ఎవరూ చెప్పలేని విచిత్ర పరిస్థితి నెలకొంది. అప్పుడు పీఆర్‌సీ పెంచమని, పాత డీఏ బకాయిలు, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు సకాలంలో విడుదల చేయమని డిమాండ్ చేసే పరిస్థితి లేదు ప్రభుత్వమే ఆ పని చేసేది. కానీ ప్రస్తుతం ప్రభుత్వాల పరిస్థితి అలా లేదు. ప్రభుత్వాలు ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన వెసలుబాట్లను డిమాండ్ చేసి ఇప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజాగా కరోనా కాలంలో ఉద్యోగస్తులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు దానికోసం ప్రైవేటు ఆసుపత్రులలో ఎంప్లాయిస్ హెల్త్ కార్డులు చెల్లుబాటు అయ్యేలా చూడమని వేడుకున్న ప్రభుత్వం ముందుకు రాలేదు. దానికోసం అవసరం అయితే తమ బేసిక్ పే నుంచి కొంత మొత్తం మినహాయించుకోండని ఉద్యోగ సంఘాలు స్వచ్ఛందంగా ప్రకటించినా ప్రభుత్వాలు కనికరించలేదు. రేపు, మాపు అనుకుంటూ కాలం వెల్లదీస్తూనే ఉంది. ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళే సూచన ఉందని వార్తలు వస్తుండటంతో ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పడేంత వరకు ఈ డిమాండ్ అటకెక్కవలసిందే.
ఆరోగ్య కార్డులు ఉత్తివేనా?
రాష్ట్రంలో ఉద్యోగస్తులు కార్పొరేట్ వైద్య ఖర్చులు భరించలేక, ప్రైవేటు ఆసుపత్రులలో 'ఎంప్లాయీస్ హెల్త్ కార్డులు' చెల్లుబాటు కాకపోవటంతో గత ఎనిమిది సంవత్సరాలలో మన ఉద్యోగ, ఉపాధ్యాయ మిత్రులు, విశ్రాంత ఉద్యోగులు ఎంతోమంది అకాల మరణం చెందారు. అలాగే కరోనా కాలంలో ఈ చావులు పతాక స్థాయికి చేరాయి. ఆపద సమయంలో ఉద్యోగుల హెల్త్ కార్డులు ఎక్కడా పని చేయలేదు. కొన్నిచోట్ల పనిచేసినా, లక్షల్లో వైద్య బిల్లులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం అతి కష్టం మీద ‘ మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్స్’ను లక్ష రూపాయలకు కుదించి చెల్లించేలా జీఓ తెచ్చి, దానికి ఆంక్షలు సైతం విధించింది.
కోవిడ్ రోగులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం కోసం వెళితే బెడ్స్ దొరకలేదు. కార్పొరేట్ ఆస్పత్రులలో కూడా లక్షల్లో బిల్లులు చెల్లించలేక విశ్రాంత ఉద్యోగులు చాలామంది తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎక్కడో మారుమూల ఆస్పత్రుల్లో వైద్య సహాయం పొంది ప్రాణాలు దక్కించుకంటే, ఆ ఆసుపత్రులకు ప్రభుత్వ గుర్తింపు లేదని మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను చెల్లించలేమని ట్రెజరీ శాఖ కొర్రీలు వేసి తిరస్కరించింది. దీంతో మరణించిన ఉద్యోగ కుటుంబాలు తమ ఆర్థిక పరిస్థితులు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు దాపురించాయి.
ఉద్యోగ సంఘ నేత మంత్రి అయినా...
ఉద్యోగస్తుల బాధలు ప్రభుత్వానికి తెలిసేలా యూనియన్లు ఎన్ని విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేదు. అప్పటి ఉద్యోగ సంఘ నాయకుడు ప్రస్తుత మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇక్కడి నుంచి మంత్రి స్థాయికి వెళ్లినా ఉద్యోగస్తులకు మేలు జరగడం లేదు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, కార్మిక వ్యతిరేక చట్టాలు చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను వేగంగా ప్రయివేటీకరణ చేస్తున్నాయి. ఉద్యోగ, కార్మిక ఐక్యతను దెబ్బతీస్తున్నాయి. కలిసి ఉద్యమాలు చేసే పరిస్థితులు లేకుండా కోరలు పీకుతున్నారు. అయితే ఉద్యోగ, విశ్రాంతి సంఘాలు, సిస్టర్ ఆర్గనైజేషన్‌తో, కార్మిక సంఘాలతో చర్చించి స్పష్టమైన ఉద్యమ ఐక్య కార్యాచరణ చేపట్టాలి. ప్రభుత్వ పథకాలు అమలు చేయటంలో ప్రభుత్వానికి సహకరిస్తూనే న్యాయమైన ఉద్యోగుల హక్కుల సాధనకు అనువైన పద్ధతిని అనుసరించాలి. ప్రభుత్వానికి కూడా తన ఉద్యోగుల సంక్షేమం చూడాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని గట్టి హెచ్చరిక ద్వారా తెలియపరచడం అవసరం.
డా.కోలాహలం రామ్ కిషోర్
98493 28496