పది మూల్యాంకనంకు ఇంకా పాత రేట్లేనా?

by Ravi |   ( Updated:18 April 2023 11:15 PM  )
పది మూల్యాంకనంకు ఇంకా పాత రేట్లేనా?
X

సంవత్సరం పదో తరగతి పరీక్షలు ఉత్కంఠను సృష్టించినా, ప్రశాంతంగా ముగిశాయి. దీంతో ఈ నెల 13వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 18 సెంటర్లతో మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమై ఈ నెల 21 వరకు కొనసాగనుంది. ఇందులో సుమారు 25 వేల మంది ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. అయితే పదవ తరగతి మూల్యాంకనంపై ఉపాధ్యాయులు ఎంతో నిరాసక్తతలో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం గత ఐదు సంవత్సరాలుగా మూల్యాంకనంలో చెల్లిస్తున్న రెమ్యునరేషన్, 8 ఏళ్లుగా డీఏ పెంచకపోవడమే. నిజానికి ఈ మూల్యాంకనం విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ప్రక్రియ కాబట్టి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పూర్తి శ్రద్ధతో మూల్యాంకనంలో నిమగ్నం కావాలి. కానీ రెమ్యూనరేషన్ ప్రోత్సహకరంగా లేనందువల్ల ఉపాధ్యాయులు నిరాసక్తతలో ఉన్నారు. ప్రస్తుతం చెల్లిస్తున్న రెమ్యునరేషన్ రేట్లు ఐదు సంవత్సరాల క్రితం నాటివి, ఇంకా వాటినే ఉపాధ్యాయులకు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం క్యాంప్ ఆఫీసర్‌కు రూ.578, డిప్యూటీ క్యాంపు ఆఫీసర్‌కు రూ.495, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్‌కు రూ.429, చీఫ్ ఎగ్జామినర్‌కు రూ.396, అసిస్టెంట్ ఎగ్జామినర్‌కు పేపర్‌కు రూ.10 చెల్లిస్తున్నారు. అలాగే స్పెషల్ అసిస్టెంట్‌కు రోజుకు రూ.250 చెల్లిస్తున్నారు వారికీ టీఏ, డీఏ ఇవ్వడం లేదు.

ఇంత వ్యత్యాసమా?

మార్కెట్లో రోజు రోజుకు అన్ని రేట్లు పెరుగుతున్నప్పటికీ గత ఐదు సంవత్సరాలుగా మూల్యాంకన రేటు పెంచకపోవడంతో ఉపాధ్యాయులు దీనిపై ఆసక్తి కనబరచడం లేదు. అలాగే ఎనిమిది సంవత్సరాల క్రితం నిర్ధారించిన టీఏ, డీఏలు ఇప్పటికీ చెల్లిస్తున్నారు. 202 కొత్త పీఆర్సీ వచ్చి కొత్త డీఏ రేట్లు సిఫార్సు చేసినప్పటికి పాత రేట్లే అమలు చేయడం గమనార్హం. అయితే గతంలో పదిపరీక్షలు 11 పేపర్లు‌గా జరిగేవి. దీనికి ఒక పేపర్‌ మూల్యాంకానికి రూ.40 చెల్లించేవారు. కానీ కరోనా తరువాత ఈ పేపర్లను 11 నుంచి 6 కి తగ్గించారు. అయినా కూడా రెమ్యూనరేషన్ రూ.10 మాత్రమే చెల్లిస్తున్నారు. అయితే మరోపక్క ఇంటర్మీడియట్ పేపర్ వాల్యుయేషన్ రేట్లకు, పదో తరగతి పేపర్ వాల్యుయేషన్ రేట్లకు భారీ వ్యత్యాసం ఉంది. ఇంటర్‌లో ఒక పేపర్‌కి రూ. 23.66 చెల్లిస్తున్నారు. కానీ ఇక్కడ రూ. 10లు మాత్రమే. అలాగే డీఏ లో కూడా వ్యత్యాసం ఉంది. నిజానికి లక్షల సంఖ్యలో విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ప్రక్రియ ఈ మూల్యాంకనం. ఇది గుణాత్మకంగా సాగాలంటే అందులో పాల్గొనే ఉపాధ్యాయులు ఉత్సాహవంతం‌గా ఉండాలి. అందుకే వారికి చెల్లించే రెమ్యునరేషన్ సైతం ప్రోత్సాహకరంగా ఉండాలి. అందుకే ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయులను ప్రోత్సహించే విధంగా పదవ తరగతి మూల్యాంకన రెమ్యునరేషన్ రేట్లు, డిఏ రేట్లు పెంచాలని, స్పెషల్ అసిస్టెంట్లకు టిఏ, డిఏ‌లు చెల్లించాలని ఉపాధ్యాయలోకం కోరుతుంది.

జుర్రు నారాయణ యాదవ్

9494019270

Next Story

Most Viewed