- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీసీ మంత్రం ఎన్నికల వరకేనా!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు వెనుకబడిన తరగతుల (బీసీ) మద్దతు కూడగట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర జనాభాలో 56 శాతంగా ఉన్న బీసీ సామాజికవర్గం మద్దతుపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ బీసీ ఓట్లను ప్రభావితం చేసి వారి ఓటు బ్యాంకుని సాధిద్దామని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీసీలని ప్రసన్నం చేసుకుందామని అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. కానీ ఎన్నికల సమయంలోనే అన్ని పార్టీలు హడావిడి చేస్తూ ఎన్నికల తర్వాత బీసీలని పట్టించుకోవడం లేదనే విమర్శ అన్ని పార్టీలలో ఉంది.
బీఆర్ఎస్
మొదటి నుండి, సంక్షేమం, అభివృద్ధి పథకాల కారణంగా పాలక బీఆర్ఎస్ బీసీ వర్గాల్లో బలమైన పునాదిని కలిగి ఉందని పార్టీ వర్గాల వాదన. అయితే, కాంగ్రెస్, బీజేపీ రెండు బీసీ సామాజిక వర్గం మద్దతు పొందేందుకు బలమైన వ్యూహాలు, ప్రణాళికలు వేస్తున్నాయి. వీరి ఎత్తులకు పైఎత్తుగా బీఆర్ఎస్ పార్టీ వారి ఓట్లను దక్కించుకునేందుకు లక్ష ఆర్థిక సహాయం, బీసీ ఆధారిత సమావేశాలకు ప్రణాళికలు, వారి కోసం సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం చేయడం, బీసీలకు బీఆర్ఎస్ ఇస్తున్న మద్దతును చాటి చెప్పేందుకు బీసీ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించాలని, అలాగే కేంద్రాల్లో ఆత్మగౌరవ సభలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆర్థిక సాయం, గొర్రెల పంపిణీ, కళ్యాణలక్ష్మి, ఆసరా, బీసీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరు ఇలా పలు పథకాల గురించి వివరించి ఎన్నికల దృష్ట్యా బీసీ ఓటర్లుని తమ వైపుకి తిప్పుకోవాలని చూస్తున్నారు.
బీఆర్ఎస్ బీసీలను ఆకర్షించడంలో మొదటి స్థానంలో ఉంది. అందుకే బీసీ సాంప్రదాయ వృత్తులకు అవసరమైన సాధనాల కొనుగోలు కోసం వారికీ రూ.1 లక్ష నగదు ప్రయోజనాన్ని, 5.28 లక్షల మందికి పైగా బీసీలు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటికే రూ.400 కోట్లు కేటాయించారని ప్రభుత్వ లెక్కల సమాచారం. ఈ పథకం నుండి ఎక్కువ మంది లబ్ధిదారులు రజకులు, నాయీ బ్రాహ్మణులు, కుమ్మరి, కంసాలి వంటి వర్గాలతో సహా అత్యంత వెనుకబడిన తరగతుల నుండి వస్తారని పేర్కొంది. కానీ కేవలం నియోజకవర్గం నుండి మూడు వందల మందికే ఇస్తే మిగతా వారి పరిస్థితి ఏమిటి? ఏదైనా ఒక సంక్షేమ పథకం అమలు చేస్తే అందరికీ చేయాలి. కొంతమందికే అమలు చేస్తే ఆ లక్ష్యాన్ని చేరలేము.
కాంగ్రెస్
మరోవైపు బీసీ ఓటర్లను తమ వైపునకు ఆకర్షించేందుకు కాంగ్రెస్ రకరకాల వాగ్దానాలు చేస్తూ, కార్యక్రమాలను అన్వేషిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు 50 శాతం టిక్కెట్లు కేటాయించాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా బీసీలకు రిజర్వేషన్లను 40 శాతానికి పెంచాలని కూడా పార్టీ యోచిస్తోంది. ప్రతి పార్లమెంట్ స్థానం పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలకి బీసీ అభ్యర్థులకు ఇవ్వాలని యోచిస్తుంది. అలాగే వారితో సమావేశాలు నిర్వహించి, సామాజిక వర్గ సంక్షేమానికి పార్టీ నిబద్ధతను ఎత్తి చూపేందుకు యోచిస్తోంది. మన రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ముఖ్యమంత్రిగా ఒక్క బీసీ వ్యక్తికి అవకాశం ఇవ్వలేదు. వేరే రాష్ట్రాలలో బీసీలను ముఖ్యమంత్రుల్ని చేసామని చెప్పుకుంటూ, ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా దాటేసే ప్రయత్నం చేస్తోంది.
బీజేపీ
ఇటీవల తెలంగాణ బీజేపీ సైతం బీసీల కోసం డిక్లరేషన్ ప్రకటించబోతుందని అంటున్నారు. అందులో భాగంగా పలు అంశాలను ప్రతిపాదించింది. అలాగే ఇందులో సబ్ ప్లాన్ ప్రకారం వెనుకబడిన తరగతుల (బీసీ) జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని, 40 సంఘాలను కేంద్ర బీసీ జాబితాలో చేర్చుతామని, రాష్ట్ర బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పిస్తామని, నామినేటెడ్ పోస్టులకు ప్రాధాన్యం ఇస్తామని, వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే విదేశాల్లో చదువుకోవాలనుకునే బీసీ విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తామని, అలాగే బీసీ ముఖ్యమంత్రి ప్రతిపాదన కూడా చర్చల్లో ఉందని తెలుస్తుంది. ఇలా అన్ని పార్టీలు తమ హామీలు, డిక్లరేషన్ల పేరిట పలు వాగ్దానాలని ఇస్తున్నాయి కానీ బీసీలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇవి సరిపోవు. బీసీల అభివృద్ధికై రాజకీయ సాధికారత మరింత అవసరమని బీసీ నాయకులు తేల్చి చెబుతున్నారు. ఆ దిశగా వచ్చే ఎన్నికల్లో బీసీలకు అన్ని పార్టీలు సగం సీట్లని కేటాయించాలని, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు, విధానాలు రూపొందించాలని, ఆ దిశగా అన్ని పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలని బీసీ వర్గాల వాదన. ఏది ఏమైనా ఈ సారి బీసీ ఓటు బ్యాంకు అన్ని పార్టీలకు విజయం కోసం ఒక ఆయుధంగా పనిచేస్తుందని తెలుస్తోంది.
డా. కందగట్ల శ్రవణ్ కుమార్
86393 74879