ప్రమాణాలు కోల్పోతున్న సంస్థలు...!

by Ravi |   ( Updated:2023-04-04 00:00:56.0  )
ప్రమాణాలు కోల్పోతున్న సంస్థలు...!
X

క్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, యూ.ఎన్.సి.సి.సి, యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థలు అభివృద్ధి చెందిన దేశాల అదుపు ఆజ్ఞలతో నడుస్తూ, ఇతర దేశాలకు అన్యాయం చేస్తున్నట్లు తీవ్ర ఆరోపణలకు గురవుతున్నాయి. దశాబ్దాలుగా ఉనికిలో ఉన్న ఈ ప్రఖ్యాత సంస్థలు కూడా సరైన సమయంలో సరైన న్యాయం చేయడంలో విఫలమవుతూ విమర్శలు పాలవుతున్న వేళ, ఇకనైనా తమ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని కోరుకుందాం...

గాలిలో దీపంలా లక్ష్యాలు

ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రపంచాన్ని వణికించిన, వణికిస్తున్న కరోనా వైరస్ ఎలా, ఎక్కడ ఉద్భవించిందనే విషయం డబ్ల్యూహెచ్ఓ నేటికీ తేల్చలేకపోవడం తాజా ఉదాహరణ. నేటికీ అందరినీ వేధిస్తున్న ప్రశ్న... ఇదే అదనుగా భావించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ సంస్థకు నిధులు తగ్గించడంతో, అనేక దేశాల్లో చేపట్టాల్సిన ఆరోగ్య కార్యక్రమాలు, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా పేద దేశాలు, ఆఫ్రికా దేశాల ప్రజలకు ఎంత నష్టం వాటిల్లిందో చెప్పలేని స్థితి...మన భారతదేశమే గుడ్డిలో మెల్లలా అనేక దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించింది.. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక సహకారంతో నడిచే ఇటువంటి అంతర్జాతీయ సంస్థలు నేడు దిక్కుతోచని స్థితిలో ఉంటున్నాయి.‌ దీంతో వీటి లక్ష్యాలు గాలిలొ దీపంలా ఉంటున్నాయి.

కర్బన ఉద్గారాల మాటేంటి?

ఇక ప్రపంచ పర్యావరణాన్ని చూచే సంస్థ యు.ఎన్.సి.సి.సి ప్రతీ సంవత్సరం కాప్ సదస్సు నిర్వహిస్తూ ఆయా సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను నేటికీ ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు అమలు చేయడం లేదు.‌ 2012లో కార్బన్ ఉద్గారాలు తగ్గించాలి అని తీసుకున్న క్యోటో ప్రోటోకాల్ నిర్ణయం నేటికీ అమలు జరగడం లేదు. గతంలో ఇరాక్, వియత్నాం, క్యూబా, లిబియా, ఆఫ్గనిస్తాన్, ఇతర కొన్ని గల్ఫ్ దేశాలపై అమెరికా దాడులు, పెత్తందారీ విధానాన్ని ఐక్యరాజ్యసమితి కట్టడి చేయలేకపోయింది. ఇక తాజాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని అరికట్టడంలో కూడా నేటికీ ఐక్యరాజ్యసమితి సరైన చర్యలు చేపట్టలేకపోయింది. దీంతో ఈ సంస్థ పైనా ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుంది.‌

కార్మికుల హక్కులు హుళక్కి

అంతర్జాతీయ కార్మిక సంస్థ కూడా, వివిధ దేశాల్లో కార్మికులకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలపై నోరు మెదపకుండా ఉంటోంది. పని ప్రదేశాల్లో సరైన సౌకర్యాలు లేకపోయినా, సరైన వేతనాలు ఇవ్వకపోయినా, మహిళలు, బాలికలపై దాడులు జరుగుతున్నా, పనిగంటలు పెంచుతూ యాజమాన్యం శ్రమదోపిడి చేస్తున్నా, నియమ నిబంధనలు పాటించకున్నా ఐ.ఎల్.ఓ తగు రీతిలో స్పందించకపోవడంతో ఈ సంస్థ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.‌ అభివృద్ధి చెందిన దేశాలు చెప్పినట్లు, ఐ.ఎమ్.ఎఫ్, వరల్డ్ బ్యాంక్... వారి చెప్పుచేతల్లో ఉన్న దేశాలకు ఆర్థిక సహకారం అందించేటట్లు చేస్తున్నారు. అధిక వడ్డీలు విధిస్తూ పేద, మధ్య తరగతి దేశాలకు రుణాలు అందిస్తున్నాయి. దీంతో ఆ‌ దేశాలు అన్నీ జీవితాంతం వారి కనుసన్నల్లో నడిచే పరిస్థితి. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, పాక్ దేశాలు తాజా ఉదాహరణ.‌ ప్రపంచ దేశాలు, ప్రజలు అందరూ సమానంగా అభివృద్ధి సాధించాలి అనే లక్ష్యం కోసం పనిచేసే ఈ అంతర్జాతీయ సంస్థల ఆశయాలన్నీ అడియాశలు అవుతున్నాయి. దీనంతటికీ ప్రధాన కారణం ఈ సంస్థలు నేటికీ ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఐదు లేదా ఆరు దేశాలు ఇచ్చే ఆర్థిక సహకారం మీదనే ఆధారపడి ఉండటమే.

భారత్‌పై పెను భారం!

ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా, వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న భారతదేశం ఈ ఏడాది జి-20 ప్రధాన బాధ్యతలు చేపట్టింది. సుమారు 85% శాతం ప్రపంచ జిడిపి కలిగిన ఇరువై దేశాలు, ప్రపంచంలో మూడవ వంతు జనాభా కలిగి 75% శాతం వ్యాపార సామర్థ్యం కలిగిన ఈ జీ-20 దేశాలకు నాయకత్వం వహిస్తున్న మన దేశం కొన్ని విషయాల్లో నిర్ణయాత్మక శక్తిగా మారుతుంది అని భావిద్ధాం. వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనే నినాదం చేపట్టిన భారత్ ప్రపంచ భవిష్యత్తును మార్చడంలో క్రియాశీలకంగా వ్యవహరించాలి. ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తున్న పేదరికం, పర్యావరణ సమస్యలు, ఆకలి కేకలు, ఉగ్రవాదం, ఆర్థిక అసమానతలు, ఆర్థిక మాంద్యం, సైనిక పోరు, ఆధిపత్య ధోరణి, నిరుద్యోగం, నీటి కొరత, అడవుల నరికివేత, ప్రకృతి వనరుల దోపిడీ, వివిధ కాలుష్యాలు, కుల, మత,జాతి, లింగ, భాషా, ప్రాంతీయ అసమానతల వంటి సమస్యలపై మంచి అవగాహనతో శాశ్వత ప్రాతిపదికన మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా తమ సామర్థ్యాన్ని, సారథ్యాన్ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచేటట్లు చేయాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనలో, ఫార్మా రంగంలో, సాఫ్ట్‌వేర్ రంగంలో భారత్ ముందుకు సాగుతున్నది. కొన్ని అంతర్గత లోపాలు, మతపరమైన అంశాలు, అణచివేత ధోరణులు సవరించుకుంటూ, ప్రపంచ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయటంలో జి-20 సారధ్యంలో మంచి నిర్ణయాలు తీసుకుని, అంతర్జాతీయ సంస్థలకు, దేశాలకు దీటుగా భారత్ నిలబడుతుందని ఆశిద్దాం... జి-20 సారధ్యం ద్వారా ప్రపంచ ప్రజలకు నూతన జవసత్వాలు ఇద్దాం.

ఐ. ప్రసాదరావు

63056 82733

Advertisement

Next Story