బాలికల జీవితానికి భద్రత ఏది?

by Ravi |   ( Updated:2023-10-11 00:45:22.0  )
బాలికల జీవితానికి భద్రత ఏది?
X

ఆదిశక్తి, అపరకాళి కొలువైన ఉజ్జయినిలో ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటన మానవత్వానికి మాయని మచ్చ. మానవ మృగాలు తన మానాన్ని హరించి, రక్తం వచ్చేలా హింసించి వదిలిపెడితే, అంతకంటే దారుణంగా బాలికకు సహాయం చేయకుండా సమాజం వ్యవహరించిన తీరు మనిషి అనే ప్రతివారిని సిగ్గుతో తలదించుకునేలా చేసింది. మనుషులు తనపట్ల చూపించిన అవమానీయతను ఆ బాలిక ఎప్పటికీ మరిచిపోదేమో! అయితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు గుర్తు చేసుకోవడం తరువాత మరిచిపోవడం మనకు అలవాటుగా మారిందనేది కింద గణాంకాలను చూస్తే అర్థమవుతోంది.ఎన్‌సీఆర్‌బీ-2021 ప్రకారం దేశంలోని మొత్తం పిల్లలపై జరిగిన నేరాల సంఖ్య 1,49,404. దీనిలో అరవై శాతం వరకు బాలికలపై అఘాయిత్యాలకు సంబంధించి నమోదైన కేసులే ఉన్నాయి.

వాటి ఫలితమే.. వ్యత్యాసానికి కారణం!

మనిషి పుట్టుకకే కారణమైన అమ్మలాంటి ఆడపిల్లల పుట్టుక ఇప్పుడు దేశంలో ప్రశ్నార్థకంగా మారింది. పుట్టబోయే బిడ్డకు లింగ నిర్ధారణ చేసి, ఆ శిశువు ఆడపిల్ల అని తెలిస్తే భారంగా భావిస్తుంది సమాజం. తల్లి గర్భం నుంచే కనికరం లేకుండా కాటికి పంపే ప్రబుద్ధులు ఎందరో.. ప్రభుత్వం ఎంతో పటిష్టంగా చట్టాలు చేసినా, లింగనిర్థారణను నేరంగా ప్రకటించినా, దేశం మొత్తం 152 లింగ నిర్ధారణ కేసులు నమోదు అయ్యాయి. ఈ సంఖ్య తక్కువగా కనిపించినా, అసలు కేసుల వరకు రాకుండా నిర్ధారించుకొని చంపివేయబడిన ఆడ శిశువుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. గర్భస్త కష్టాలు దాటుకుని లోకంలోకి అడుగు పెట్టిన ఆడశిశువుని హత్యలు చేస్తున్న వైనాలు కోకొల్లలు. దేశంలో ఇలాంటి కేసుల సంఖ్య 80గా నమోదైనాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే కాలయములు కావడమే ఇక్కడ కొసమెరుపు. పై వాటి ఫలితమే నేడు దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్న స్త్రీ పురుష నిష్పత్తి వ్యత్యాసాలు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి స్త్రీ పురుష నిష్పత్తులలో ఇంత తేడాలు నమోదు కావడం ఇప్పుడే ప్రథమం.

‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అని గర్వంగా ప్రకటించుకున్న చోట నేడు బాలికలపై, మహిళలపై దుశ్చర్యలు నిత్యకృత్యమై పోయాయి. దేశంలో రోజుకు సగటున డెబ్భై ఏడు అత్యాచారాలు జరుగుతున్నాయి. అంటే గంటకు మూడు, ప్రతి ఇరవై నిమిషాలకు ఒకరు ఈ రాక్షస క్రీడకు బలైపోతున్నారు. గత ఏడాది దేశం మొత్తంగా 31,878 అత్యాచార కేసులు నమోదుకాగా వాటిలో 6 సంవత్సరాలలోపు వారిపై 53, 12 సంవత్సరాలలోపు వారిపై 183, 16 సంవత్సరాలలోపు వారిపై 1030, 18 సంవత్సరాలలోపు వారిపై 1772 అత్యాచారాలు జరిగినట్లు వివిధ రాష్ట్రాలలో కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 3,038 మంది బాలికలపైన అత్యాచారాలు జరిగాయి. ఇందులో 140 వరకు అత్యాచారం చేసిన తరువాత హత్య చేసినవి. ఇక దేశవ్యాప్తంగా ఫోక్సో చట్టం ప్రకారం బాలికలపై జరిగిన వివిధ సంఘటనలపై నమోదు అయిన కేసులు 33,186. దీనిలో 15,005 వరకు తెలిసిన వాళ్ళే ఈ నేరాలకు పాల్పడటం గమనార్హం. మైనర్ బాలికలకు మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేసిన కేసులు దేశంలో 58,058 అని రికార్డు అయ్యాయి. మొత్తం దేశవ్యాప్తంగా 59,544 మంది బాలికలు కనిపించకుండా పోయారు. 1,406 మంది బాలికలు వివిధ కారణాలచేత హత్య చేయబడ్డారు. 12,347 బలవంతపు బాల్య వివాహాపు కేసులు నమోదు అయ్యాయి. బాలికలపై రోజు రోజుకు పెరుగుతున్న హింస, అన్యాయాలకు అంతే లేదు.

సమాన అవకాశాల కల్పనకై..

ఇవి ఇలా ఉంటే దేశంలో ఎప్పుడో బాలికల రక్షణ, సంరక్షణల కొరకు, వారి సాంఘిక-సాంస్కృతిక అభ్యున్నతికై, సమాన అవకాశాల కల్పనలకై అనేక చట్టాలు రూపొందించబడినవి. అలాంటి వాటిలో ముఖ్యమైనవి బాల్య వివాహ నిషేధ చట్టం-1929, 2006. మానవ అనైతిక వ్యాపార నివారణ చట్టం-1956. జాతీయ బాలల పథకం-1974. బాలకార్మిక నిషేధ చట్టం-1986. పాల సీసాలు, శిశు పౌష్టికాహార (ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, క్రమబద్ధీకరణ) చట్టం-1992. జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఆక్ట్-2000, 2015. పిసిపిఎన్డిటి యాక్ట్-2003. జాతీయ బాలల కార్యాచరణ పథకం-2005. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం-2009. ప్రాథమిక విద్యా హక్కు చట్టం-2010. లైంగిక నేరాల నుండి బాలల రక్షణ చట్టం(పోక్సో)-2012. లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం, సంస్కరణం) సంరక్షణ చట్టం-2013, నిర్భయ చట్టం-2013, దిశ చట్టం-2014. బేటీ బచావో, బేటీ పడావో పథకం -2015, జాతీయ విద్యా విధానం-2020. ఇవి కాకుండా భారత రాజ్యాంగంలోను బాలికల హక్కుల కోసం ప్రత్యేకంగా పొందుపరిచిన నిబంధనలు సైతం ఉన్నాయి.

‘మనలో సగం మందిని వెనక్కినెట్టినప్పుడు మనమందరం విజయం సాధించలేము’ అన్న నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ మాటలు అక్షర సత్యాలు. మహిళ ఆకాశంలో సగం, అవనిలో సగమని కీర్తించడమే తప్ప, అన్నింటిలో సగమైన వారికి తగిన స్థానాన్ని కల్పించడం లేదనేది వాస్తవం. అది సమానత్వంలోనైనా, చట్టాలు కల్పించిన హక్కులలోనైనా, విద్య, వైద్యం, ఉద్యోగం, చివరకు పోషణ, పెంపంకంలోనూ వారికి దక్కాల్సిన వాటా దక్కనివ్వడం లేదు. ఇక్కడ వారు తమ వాటాను పొందడం లేదు అనేకంటే మనం ఇవ్వడం లేదు అనేది సబబుగా ఉంటుంది.

ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడంతో..

ఇలాంటి వివక్షను, హింసను ఆడపిల్లలు చిన్ననాటి నుంచే నిత్యజీవితంలో తెలిసో తెలియకో అనుభవిస్తున్నారు. బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సమాజానికి అవగాహన కల్పించడానికి గానూ 2012 నుండి ఐక్యరాజ్య సమితి, యూనిసెఫ్ ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని’ ప్రతి ఏటా అక్టోబర్ 11న నిర్వహిస్తూ వస్తోంది. నేటి బాలికలే రేపటి మహిళలు. కాబట్టి బాలికలుగా ఉన్నప్పుడే వారికి సంబంధించిన సమస్యలపై పూర్తి అవగాహనను కల్పించడం. భవిష్యత్తులో వాటిని ఎలా అధిగమించాలి, ఎదుర్కోవాలి అనే విషయాలపై వారిలో చైతన్యాన్ని పెంపొందించడం. తద్వారా మహిళా సాధికారతకు మార్గం సుగమం చేయడమే దీని ప్రధాన ఆశయం. ఐక్యరాజ్య సమితి బాలికల కోసం వివిధ చట్టాలు చేసి అమలు చేసేలా ఆయా దేశాలను ఆదేశిస్తుంది. దీనిని అనుసరిస్తూ అనేక దేశాలు, ప్రభుత్వాలు, సంస్థలు పలు రకాల చట్టాలను, కార్యక్రమాలను, పథకాలను రూపొందిస్తున్నాయి.

అయినను దశాబ్దాలుగా బాలికలలో వెనుకబాటుతనం, వారి పట్ల సమాజం అనుసరించే లింగ వివక్షత ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా కొత్త సమస్యలు పుట్టుకు వస్తున్నాయి. ఎన్ని చట్టాలు చేసినా వాటి అమలులో ప్రభుత్వాలకు, అధికారులకు చిత్తశుద్ధి లేకపోతే ఆచరణలో అవి విఫలమౌతూనే ఉంటాయి. అవి ఎప్పటికీ సరైన ఫలితాలను ఇవ్వలేవు. తమకు జరుగుతున్న అన్యాయం, హింస, అకృత్యాల గురించి నోరు విప్పి చెప్పలేని బంగారు తల్లులకు దిక్కెవరు? బాలికల భావి జీవితానికి భరోసా ఇంకెన్నటికి? దానిని కల్పించేదెవరు? కావున బాలికల చట్టాల రూపకల్పన కోసమే కాదు, వాటి అమలు కోసం కూడా పౌర సమాజం పోరాడాలి. ఉద్యమించాలి. అప్పుడే బాలికల హక్కులలో కొన్నింటినైనా వారు పొందగలుగుతారు.

(నేడు అంతర్జాతీయ బాలికల దినోత్సవం)

డాక్టర్. సందెవేని తిరుపతి

చరిత్ర అధ్యాపకులు

98496 18116

Advertisement

Next Story

Most Viewed