సమస్యల సుడిగుండంలో.. ఓల్డ్ ఏజ్ బతుకులు

by Ravi |   ( Updated:2023-10-01 00:45:28.0  )
సమస్యల సుడిగుండంలో.. ఓల్డ్ ఏజ్ బతుకులు
X

మాజ అభివృద్ధి ప్రస్థానంలో వృద్ధుల పాత్ర అత్యంత ముఖ్యమైంది. కని పెంచిన బిడ్డలు ఉన్నత స్థానాలను చేరుకోవడానికి ఆరుగాలం కష్టపడే తల్లిదండ్రులు తమ జీవిత చరమాంకంలో ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం, ఆరోగ్యంపై అవగాహన పెరగడం వల్ల ప్రజల ఆయురారోగ్య కాలం పెరుగుతోంది. మరోవైపు భారీగా పెరిగిపోతున్న జీవన ఖర్చులు, ఉద్యోగం లేనిదే పెళ్లి వద్దనే యువత నేడు 30-35 వయస్సు వరకు వివాహం చేసుకోకపోవడం, ఒక సంతానంతో సంతృప్తి పొందడం, మరికొన్ని దేశాల్లో శిశు జననాల రేటు కూడా తగ్గిపోవడం, ఫలితంగా పలు దేశాల్లో వయోధికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతోంది.

వయస్సు మళ్లిన పెద్దల పట్ల నేటి యువతరం చూపిస్తున్న ప్రేమలు, వ్యవహారశైలిని పరిగణనలోకి తీసుకొని, ప్రతి సంవత్సరం వృద్ధ జనాభాకు అందుతున్న అవకాశాలు, సవాళ్ల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, వృద్ధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడానికి అంతర్జాతీయ స్థాయిలో వియన్నాలో 1984లో మొట్టమొదటిసారిగా వయో వృద్ధుల గురించి అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఆ తర్వాత 1990 డిసెంబర్‌ 14న ఐక్యరాజ్య సమితి వృద్ధుల కోసం ఒక నిర్దిష్ట ప్రణాళికను తయారు చేసి, ప్రపంచ దేశాలన్నీ వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని కోరింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ, ప్రతి ఏడాది అక్టోబర్ 1వ తేదీని అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంగా నిర్ణయించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న ప్రపంచ వృద్ధుల దినోత్సవం నిర్వహించబడుతుంది.

పెరుగుతున్న వృద్ధులు

ప్రపంచవ్యాప్తంగా 2019లో 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులు 703 మిలియన్ల మందికి పైగా (73 కోట్ల మంది) ఉన్నారు. తూర్పు, ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో వృద్ధులు 261 మిలియన్లు, యూరప్ మరియు ఉత్తర అమెరికా 200 మిలియన్లకు పైగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వచ్చే మూడు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటుందని, 2050లో 1.5 బిలియన్ల కంటే ఎక్కువకి చేరుకుంటుందని అంచనా. 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులు 2050 నాటికి ప్రపంచ జనాభాలో ప్రతి ఆరుగురిలో ఒకరు 65 ఏళ్లకు పైబడిన వారు ఉంటారని పరిశీలనలు చెబుతున్నాయి. 80 ఏళ్లు లేదా అంతకు పైబడిన వారి జనాభా 2019లో దాదాపు 14.30 కోట్లు 2050 నాటికి వారి సంఖ్య 3-4 రేట్లు పెరగవచ్చని అంచనా. మన భారత్‌లో 2021లో వృద్ధుల జనాభా దాదాపు 14 కోట్లు కాగా 2031 నాటికి సుమారు 20 కోట్లకు చేరే అవకాశం ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

ఆరోగ్యకరమైన వృద్ధాప్యం సాధ్యమే!

కుటుంబ సంక్షేమానికి సర్వ శక్తులూ ధారపోసే వయోధికులు ప్రపంచవ్యాప్తంగా తుది దశలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వృద్ధుల హత్యలు, పిల్లలు తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపడం, తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, వారి ఇళ్ల నుండి వెళ్లగొట్టడం, కొన్ని సందర్భాల్లో హత్యలు చేయటం లాంటి హృదయ విదారక సంఘటనలను మనం ప్రతిరోజూ చూస్తున్నాం. విశ్వవ్యాప్తంగా ప్రతి అయిదుగురు వయోధికుల్లో ఒకరు శారీరక, మానసిక, లైంగిక, ఆర్థికపరమైన వేధింపులకు గురవుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. జాతీయ నేర గణాంక సంస్థ ఎన్ సీఆర్‌బీ లెక్కల ప్రకారం భారత్‌లో 2021లో వృద్ధులపై నేరాలకు సంబంధించి ఇరవై ఆరు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.1200 మందికి పైగా వయోధికుల విషయంలో కన్నబిడ్డలు, సమీప బంధువులే హత్యలకు పాల్పడటం మహా ఘోరం. వృద్ధాప్యం అనివార్యం, కానీ .... ఆరోగ్యకరమైన వృద్ధాప్యం సాధ్యమే! వృద్ధులలో సాధారణ ఆరోగ్య సమస్యలు చాలా వరకు నివారించవచ్చు.. అయితే వయస్సు పెరిగే కొద్దీ శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పరిశోధనలు సైతం నిరూపించాయి. వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యలను చూసుకోవడం సుదీర్ఘమైన సంతోషకరమైన జీవితాన్ని నిర్ధారించడంలో సహాయపడుతుంది. వినికిడి లోపం, కంటిశుక్లం, వక్రీభవన లోపాలు, వెన్ను, మెడ నొప్పి, ఆస్టియో ఆర్థరైటిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, డయాబెటిస్, హైపర్ టెన్షన్, గుండె జబ్బులు.డిప్రెషన్. దంత సమస్యలు, జీర్ణకోశం, డిమెన్షియా వంటివి వృద్ధులలో కనిపించే అతి సాధారణ రుగ్మతలు. వృద్ధులను ప్రభావితం చేసే ఆరోగ్య సమస్యల జాబితా నిరుత్సాహంగా ఉండవచ్చు, కానీ ఆరోగ్యకరమైన జీవనశైలి పరిస్థితులను నివారించడంలో కచ్చితంగా సహాయపడుతుంది.

జైళ్లను తలపించే వృద్ధాశ్రమాలు..

తల్లిదండ్రుల పట్ల గౌరవం భారతీయ కుటుంబాల డీఏన్‌ఏలోనే లోతుగా ఉందనే భావన అనాదిగా వస్తోంది. పిల్లలు తమ వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం తమ నైతిక బాధ్యతగా భావిస్తారు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా మన సమాజ నైతికత, కుటుంబ నిర్మాణ పరంగా భారీ పరివర్తనకు గురైంది. సామాజిక పరివర్తన, జీవనశైలి పర్యవసానంగా చాలా మంది వృద్ధ తల్లిదండ్రులు బలవంతంగా వృద్ధాశ్రమాల్లోకి నెట్టి వేయబడుతున్నారు. మన భారతదేశంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన న్యూక్లియర్ కుటుంబాల పుణ్యమాని వృద్ధాశ్రమాల సంఖ్య కూడా క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. తల్లిదండ్రులను భారంగా భావించిన సందర్భాల్లో కొందరు, మరికొన్ని సార్లు వృద్ధులే స్వచ్ఛందంగా వీటిలో చేరుతున్నారు. కానీ వారి ఆహారం, ఆరోగ్యం, కదలికలు, కాలక్షేపం లాంటి విషయంలో జాగ్రత్తల గూర్చి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కొన్ని ఆశ్రమాలు వాణిజ్య దృక్పథంతో పని చేస్తున్నాయి. కొన్ని ఆశ్రమాల్లో తగినంత గాలి, వెలుతురు. సేద తీరడానికి కనీస స్థలం కూడా లేకుండా జైళ్లను తలపిస్తున్నాయి. ఉపాధి, విద్య, వైద్యం లాంటి అవసరాల విషయంలో ఆదుకునేందుకు ముందుకు వచ్చే దిగ్గజ సంస్థలు… వృద్ధుల సమస్యల మీద కూడా దృష్టిపెడితే మెరుగైన వసతులు కల్పించవచ్చు. వృద్ధాశ్రమాలకు అనుమతులు ఇచ్చే విషయంలో ప్రభుత్వాలు సైతం.. కఠినమైన నిబంధనలు పాటిస్తూ, చట్టాలను కచ్చితంగా అమలు అయ్యేలా చూడాల్సిన అవసరం కూడా ఉందనే విషయం మరవద్దు..

వృద్దులకు అవగాహన కలిగించాలి..

సాధారణంగా సంపాదించే యువత తగ్గి, వృద్ధులు పెరిగేకొద్దీ ప్రభుత్వాలపై ఆర్థిక భారం అధికమవుతుంది. దేశాభివృద్ధి సైతం కుంటుపడుతుంది. ఈ క్రమంలో ఆయా దేశాలు జననాల సంఖ్యను పెంచుకోవడంపై దృష్టి సారిస్తూనే, వృద్ధుల సంక్షేమం, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకోసం ప్రత్యేక కార్యక్రమాలు, చట్టాలు రూపొందించి సమర్థంగా అమలు చేయాలి. వయోవృద్ధుల సంరక్షణకు నార్వే, స్వీడన్, స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా, అమెరికా తదితర దేశాలు, ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇతర దేశాలూ వాటి విధానాలు ఆదర్శంగా ముందుకు సాగాలి. భారత్ సైతం వృద్ధుల సంక్షేమానికి పలు పథకాలు అమలు చేస్తోంది. వారికి సామాజిక పింఛన్లు అందిస్తోంది. అయితే అర్హులైన చాలా మందికి పింఛన్లు అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు సంతానం నుంచి తిరస్కారం, వేధింపులు ఎదుర్కొంటున్న వయోధికుల కోసం తెచ్చిన వయో వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టంపై సరైన అవగాహన కొరవడటంతో ఎంతోమంది మౌనంగానే రోదిస్తున్నారు. ఒక సర్వే ప్రకారం భారతదేశంలో ఒంటరిగా జీవిస్తున్న వయోధికుల్లో అధికశాతం మహిళలు, ఒంటరితనం కారణంగా తీవ్ర మానసిక సమస్యలతో పాటు సాంక్రమిక వ్యాధులకు సైతం గురవుతున్నారు. వీరందరికీ సరైన సమయంలో సరైన వైద్య చికిత్సలు, కౌన్సిలింగ్ అందించడంపై పాలకులు ప్రత్యేక దృష్టి సారించాలి. అలాగే వృద్ధుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించి ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలి.

(నేడు ప్రపంచ వృద్ధుల దినోత్సవం)

డా. బి. కేశవులు నేత. ఎండి.

చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం.

85010 61659

Advertisement

Next Story