'టెక్ 'కు ఊతం భారతీయులే..!

by Ravi |   ( Updated:2024-05-18 00:30:55.0  )
టెక్ కు ఊతం భారతీయులే..!
X

ఏటేటా అమెరికాకు భారతీయ విద్యార్థులు పోటెత్తుతున్నారు. విశ్వంలో ఏ దేశానికి లేని క్రేజ్ అమెరికా కే దక్కింది. ఎందుకంటే అక్కడ చదివి ఉద్యోగం పొందితే డాలర్ల పంటే. అయితే ప్రస్తుతం ఆ ఉద్యోగాలు కొంచెం కష్టంగానే ఉన్నాయి. అయినా సరే విద్యార్థులు వేచి చూస్తున్నారు. అమెరికా వాళ్ళు కూడా భారతీయులను, వారి పనితీరు విధానం, నడవడి చూసి ముగ్దలవుతున్నారు. అదే భారతీయులను కట్టిపడేస్తుంది.

అమెరికాలో అధికులు తెలుగు వాళ్ళే! అంతేందుకు ప్రపంచంలో పేరెన్నిక గల దిగ్గజ కంపెనీలలో భారతీయులదే హవా. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలకు భారతీయులే నాయకత్వం వహించడం గొప్ప విషయం. అమెరికా కంపెనీలలో కూడా చాలా వరకు మన భారతీయులే పనిచేస్తుండటం గర్వకారణం. ఈ విషయాన్ని సిలికాన్ వ్యాలీ సెంట్రల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ భాటియా చెప్పడం గమనార్హం.

అమెరికా వచ్చే వారే ఎక్కువ..!

ప్రపంచంలో ఏ దేశంలో కూడా భారతీయుల వంటి నిపుణులు లేరు. ఇక్కడకు వచ్చిన భారతీయులకు తొలుత కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ అంచెలంచెలుగా ఎదుగుతారు. కష్టపడే తత్వం వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఎన్నో భారతీయ కుటుంబాలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. గ్రీన్ కార్డు రావడం ఆలస్యం అయినా కొందరూ ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. కొంతమంది కొంతకాలం ఉండి తిరిగి భారత్ వస్తున్నారు. అయితే తిరిగి వెళ్ళే వాళ్ళు బహు స్వల్పం. అమెరికాలో ఉన్న వాళ్లకు ఉద్యోగం ఉంటే, వారి కుటుంబాలకు స్వర్గ దామమే.. తల్లిదండ్రులకు ఎంతో కొంత డబ్బు పంపుతున్న వాళ్ళు ఉన్నారు. అమెరికాలో ఉన్న భారతీయులు పంపిన డబ్బుతోనే చాలామంది భారత్‌లో పెద్ద, పెద్ద అపార్ట్మెంట్స్‌లో నివసించడానికి ఫ్లాట్స్ కొంటున్నారు. నెల, నెల డబ్బు రావాలి.. తల్లిదండ్రులకు ఏ కష్టం ఉండకూడదు అనుకునే పిల్లలు ఉన్నారు. ఇంతవరకు మా కోసం కష్టపడ్డారు. ఇక ఏ చిన్నపాటి ఉద్యోగం మీకు వద్దు సంతోషంగా ఉండండి అనే వాళ్ళు కోకొల్లలు. పిల్లలు బాగా ఉంటే చాలు అనుకునే కుటుంబాలు కూడా ఉన్నాయి. అయితే బంధాలు, అనురాగాలు దూరమవుతున్న తప్పడం లేదు. ఇక్కడ పరిస్థితులు అలా ఉంటాయి. శని, ఆదివారాలే వారికి ఆట విడుపు. మిగిలిన రోజులన్నీ ఊపిరి సలపనంత పని ఉంటుంది. దానికి తగ్గ డబ్బు వస్తుందనుకోండి. ఇదే భారతీయులను ఆకర్షణకు కారణం. డబ్బులు ఇబ్బడి ముబ్బడిగా రావడంతో భారతీయులు అమెరికాలోనే స్థిరపడుతున్నారు. పైగా పిల్లల చదువులు వారి భవిష్యత్తు కొరకు కూడా భారతీయులను ఇక్కడే ఉండేలా చేస్తున్నది. చాలా మంది వృద్ధులను భారత్‌లో వదిలి రావడం భాధాకరమే అయినా తప్పడం లేదు.

భవిష్యత్ అధ్యక్షులపై.. బెంగ

నేడు అమెరికా టెక్ కంపెనీలకు భారతీయులే ఊతం అనే మాట వినపడుతోంది. అందుకనే వలస దారులను ప్రోత్సహిస్తోంది. ఇదే విషయాన్ని బైడెన్ కూడా చెప్పడం జరిగింది. ప్రతిభ ఉన్న వాళ్ళే ఇక్కడ రాణిస్తారు అనేది నగ్న సత్యం. అమెరికా కంపెనీలలో భారత పౌరులు అమెరికన్స్‌తో పోటీ పడి మరీ అత్యుత్తమ స్థాయిలో ఉంటున్నారు. రెండు దేశాల మధ్య నాగరికత, సంస్కృతి పెంపొందుతున్నది. అమెరికా ప్రభుత్వాలు కూడా టెక్ కంపెనీలలో కొన్ని అనుకూల నిర్ణయాలు భారత పౌరుల పట్ల తీసుకోవాలి. ఇప్పుడు ఉన్న బైడెన్ మన దేశం పట్ల సానుకూల ధోరణితో ఉన్నా.. భవిష్యత్తులో రాబోయే అధ్యక్షులు ఎలా నిర్ణయాలు తీసుకుంటారో.. అనే బెంగ భారత్ టెక్ ఉద్యోగులలో కనపడుతోంది. ఎవరు అధికారంలోకి వచ్చినా అటు భారతీయులకు, ఇటు అమెరికా పౌరులకు ప్రభుత్వం అండగా ఉండాలి. అమెరికా అలా చేయబట్టే పూర్తిగా అభివృద్ధి చెందింది. నేడు ఎన్నో దేశాలకు ఆర్థిక సహాయం చేస్తున్నది. అమెరికాలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి కూడా అమెరికా ఔన్నత్యానికే కృషి చేస్తున్నాడు. భారతీయులు ఎక్కడ ఉన్నా ఆ దేశ సంపద పెంచడానికి కృషి చేస్తారు. భారత్‌లో వివిధ కారణాలతో చాలా మంది నిపుణులు వెలుగులోకి రాలేకపోచున్నారు. మేధా అంతా విదేశాలకు తరలిపోతోంది. అందుకే భారతీయులకు అమెరికా ఊతం అయింది.

- కనుమ ఎల్లారెడ్డి

ఆస్టిన్,అమెరికా

93915 23027

Advertisement

Next Story