నియంతృత్వం వైపు భారతం!

by Ravi |   ( Updated:2023-08-23 00:30:03.0  )
నియంతృత్వం వైపు భారతం!
X

పీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకువచ్చింది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యగా పేర్లు పెట్టి లోక్‌సభలో ప్రవేశపెట్టింది. వాటిని పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలనకు పంపుతామని, ఆ తర్వాత పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తామని ప్రకటించింది. ఈ బిల్లులు పార్లమెంటరీ ప్రక్రియల అనంతరం త్వరలోనే చట్టరూపం దాల్చే అవకాశముంది. ‘బ్రిటీష్‌ కాలం నాటి కాలం చెల్లిన చట్టాలను ప్రక్షాళన చేస్తున్నాం. రాజద్రోహం వంటి చట్టాలను తొలగిస్తున్నాం.’ అని పార్లమెంట్ సాక్షిగా ప్రభుత్వం వెల్లడించింది. కాగా, బిల్లుల్లోని అంశాలపై ప్రజలతో సంప్రదింపులు, సిఫార్సుల కోసం 2020 మేలో నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేశామని సర్కారు చెబుతున్నది. అయితే సంప్రదింపుల ప్రక్రియ విధి విధానాలు, అభ్యర్థనల పరిశీలన, విశ్లేషణపై నిపుణుల సంఘం అనుసరించిన పద్ధతులపై ఇప్పటికీ స్పష్టత లేదు. అంతేకాకుండా నిపుణుల సంఘం ప్రభుత్వానికి చేసిన సిఫార్సులను సైతం బయటపెట్టలేదు. దీంతో సరైన సంప్రదింపులు జరపకుండా, న్యాయ నిపుణుల సలహాలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా కొత్త చట్టాలను తీసుకొస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసమే వీటిని తీసుకువచ్చారని, ప్రభుత్వాన్ని విమర్శించే వారిని టార్గెట్‌గా చేస్తూ... ఎవరూ నోరెత్తకుండా చేయడానికి వీటిని దుర్వినియోగం చేసే ప్రమాదముందని చెబుతున్నాయి. మరోవైపు పోలీసులకు కల్పిస్తున్న అధికారాలతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవని పేర్కొంటున్నాయి.

పోలీసు రాజ్యం ఏర్పడే ప్రమాదం!

వలసవాద చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకువస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నది. ముఖ్యంగా ఐపీసీలోని 124 (ఏ) దేశద్రోహ చట్టాన్ని తొలగిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అయితే ఇదే స్థానంలో ‘భారతీయ న్యాయ సంహిత’లో 150 సెక్షన్‌‌ను మరింత కఠినంగా తయారు చేసినట్లు స్పష్టమవుతున్నది. అంతేకాకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)లోనీ అంశాలన్నీ కూడా కొత్త బిల్లులో ఉంచారు. కానీ కొత్త బిల్లులో ఉన్న వేర్పాటువాదం అన్న మాటకు నిర్వచనం ఎక్కడా చెప్పలేదు. కొత్త బిల్లుల్లో చేసిందల్లా దేశద్రోహం లేదా రాజద్రోహం అన్న మాటను తొలగించడమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో సీఆర్పీసీ కింద అరెస్టయిన వ్యక్తిని గరిష్ఠంగా 15 రోజులే పోలీస్‌ కస్టడీలో ఉంచుకునే అవకాశముండేది. కానీ కొత్త చట్టాల్లో చేసిన నేరాన్ని బట్టి 60 నుంచి 90 రోజుల దాకా కస్టడీని పొడిగించవచ్చు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నేరం చేసి సంపాదించిన సొమ్ముతో కూడగట్టిన ఆస్తిగా విచారణాధికారి భావిస్తే వాటిని అటాచ్‌ చేసే అధికారం కూడా వారికి ఇచ్చారు. విచారణలో భాగంగా డిజిటల్‌ ఆధారాలైన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను సీజ్‌ చేయవచ్చు. అంతేకాకుండా అండర్‌ ట్రయల్స్‌‌లో ఉండి సగం శిక్షను అనుభవించిన వారికి మాత్రమే తప్పనిసరి బెయిల్‌ పొందే వీలుంది. ఇలాంటివి దుర్వినియోగమయ్యే ముప్పు ఎక్కువగా ఉంది. దీంతో అధికారంలో ఉన్న వారు తమను వ్యతిరేకించే వారిని ఏదోలా శిక్షించే వెసులుబాటు లభించే అవకాశముంది. ఈ చట్టం పోలీసులకు క్రూరమైన అధికారాలను కట్టబెడుతున్నది. వీటిని అధికార పార్టీలు రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుంటాయని, అలాగే ‘ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులు ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ప్రమాదకరంగా మారి పోలీసు రాజ్యం ఏర్పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ చట్టాల్లో సానుకూల అంశాలు..

అలాగే ఇప్పటివరకూ ఐపీసీ, సీఆర్పీసీ వంటి ఇంగ్లీష్ పేర్ల స్థానంలో సంస్కృతంతో కూడిన హిందీతో కొత్త చట్టాల పేర్లు ఉండటంతో ఇప్పటికే డీఎంకే తన వ్యతిరేకతను తెలియజేసింది. న్యాయ ప్రక్రియ అంతా ఇంగ్లీషులో సాగుతున్నప్పుడు చట్టాలకు హిందీ పేర్లు పెట్టడం వల్ల లాభమేమిటనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే దేశం మీద హిందీని బలవంతంగా రుద్దాలనే ప్రక్రియలో భాగంగానే హిందీలో పేర్లు పెడుతున్నారనే విమర్శలు సైతం వస్తున్నాయి. అయితే కొత్త చట్టాల్లో మహిళలు, బాలలకు అత్యంత ప్రాధాన్యం దక్కింది. మైనర్‌పై లైంగిక దాడి కేసుల్లో ఉరిశిక్ష, గ్యాంగ్ రేప్ కేసుల్లో ఇరవై ఏళ్ల జైలు, అలాగే మూక హత్యలకు సైతం శిక్షలు ఇందులో పొందుపరిచారు. ఏడేళ్లకుపైగా విధించిన శిక్షలను ఏ ప్రభుత్వమూ వెనక్కు తీసుకోకూడదనేది ఈ బిల్లులో నిర్దేశించారు. అంతేకాకుండా చిన్నచిన్న నేరాలకు సామాజిక సేవ వంటి శిక్షలు విధించేలా నిబంధనలు విధించారు.

చట్టాల లక్ష్యం నెరవేరాలంటే...

నేరాలు జరగకుండా నియంత్రించడానికి శిక్ష అనేది అవసరం. అయితే నేరస్తుల్లో పరివర్తన తీసుకురావడమే ఆ శిక్ష లక్ష్యం కావాలి. ఎంత పకడ్బందీ, కఠినంగా చట్టాలను రూపొందించినా... వాటిని అమలు చేస్తున్న వారి ఉద్దేశ్యమే చట్టాల లక్ష్యాలను నిర్దేశిస్తుంది. నిందితుల్లోనే కాదు.. చట్టాలను అమలు చేసే వారిలో కూడా పరివర్తన వస్తేనే చట్టాల అసలు లక్ష్యం నెరవేరుతుంది. ‘వందమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు గానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు’ అనేది న్యాయ వ్యవస్థ ప్రాథమిక సూత్రంగా చెబుతుంటారు. అలాంటి పద్ధతిలో చట్టవ్యవస్థ నిర్మాణమైతేనే ప్రజలకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం, విశ్వాసం ఏర్పడుతుంది. అయితే కొత్త చట్టాలు రూపొందించడంతో, కేసుల పరిష్కారంలో టైమ్ లిమిట్ పెట్టడంతోనే సత్వర న్యాయం అనేది సాధ్యం కాదు. కేసుల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలంటే ముందుగా కోర్టుల్లో న్యాయమూర్తులు, సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలి. కొత్త బిల్లుల రూపకల్పన అనేది పకడ్బందీగా జరగాలి. అందుకోసం సర్కారు మరింత కసరత్తు చేయాలి. పార్లమెంట్‌లో క్షుణ్ణంగా చర్చించాలి. విపక్షాలు, ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలి. ఆ తర్వాతే ముందడుగు వేయాలి.

-ఫిరోజ్ ఖాన్,

ఫ్రీలాన్స్ జర్నలిస్ట్,

96404 66464

Advertisement

Next Story

Most Viewed