మన అమ్ములపొదిలో ఓ కలికితురాయి

by Ravi |   ( Updated:2024-11-27 01:00:08.0  )
మన అమ్ములపొదిలో ఓ కలికితురాయి
X

మన రక్షణ రంగ దిగ్గజం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ (డీఆర్‌డీఎల్)హైపర్ సొనిక్ క్షిపణిని నూతనంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది. దానికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించింది. అది విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించటం అపూర్వం. శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయం. ఈ క్షిపణి ధ్వని వేగం కంటే ఐదింతల వేగంతో దూసుకెళ్లి శత్రు శిబిరాల లక్ష్యాలను ఛేదిస్తుంది. ఈ క్షిపణి అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. దీని పరిధి. 1,500 కిలోమీటర్లు. ఒకటి కంటే ఎక్కువ బాంబులను ఒకేసారి తీసుకువెళ్తుంది. ఈ అధునాతన సాంకేతికతను సంతరించుకున్న దేశాలు చైనా, రష్యా, అమెరికా తర్వాత నాలుగో స్థానంలో భారత్ నిలవడం భారతీయులందరికీ గర్వకారణం. దీనితో మన రక్షణ వ్యవస్థ బలోపేతం అయింది.

ఆధునిక యుద్ధ తంత్రంలో మిసైళ్ల ప్రాముఖ్యత ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలోనూ, అటు అమెరికా ఉక్రేయిన్‌కు ఇచ్చిన ఇతర ఆయుధాలలో క్షిపణులు కీలకమైనవి. అలాగే రష్యా కూడా వీటిని ధీటుగా వాడుతుంది. అలాగే ఇజ్రాయిల్ కూడా గాజా, లెబనాన్, ఇరాన్ లపై ఈ క్షిపణులను విరివిగా ప్రయోగిస్తుంది. ప్రతిగా ఇరాన్, లెబనాన్ తమ హామాస్, హెజొబుల్లా తీవ్రవాదులతో కలసి ఇజ్రాయిల్ పై క్షిపణుల వర్షం కురిపిసున్నాయి. ఈ సన్నివేశాల నేపథ్యంలో హైపర్ సోనిక్ మన ఆయుధాల అమ్ములపొదిలో చేరడంలో మన సైనిక శక్తి కూడా మరింత బలోపేతం అయింది. ఈ హైపర్ సోనిక్ క్షిపణి మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఏపీజే అబ్దుల్ కలాం క్షిపణి కేంద్రంలో అభివృద్ధి చేయడం మన తెలంగాణ వారికి కూడా గర్వకారణం.

అన్ని అడ్డంకులు దాటి తయారీ..

ఆధునిక సైనిక సంసిద్ధతలో హైపర్ సొనిక్ క్షిపణులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో సైనిక నష్టాన్ని తగ్గించుకునేందుకు రష్యా హైపర్ సోనిక్ క్షిపణులపైనే ఎక్కువ ఆధారపడుతున్నది. అటు అమెరికా కూడా ఈ క్షిపణుల తయారీకి పెద్ద ఎత్తున నిధులను సమకూరుస్తున్నది. దూరం నుంచి శత్రు లక్ష్యాలను సంప్రదాయేతర మార్గాల్లో ధ్వంసం చేయడంలో ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయనే ఉద్దేశంతోనే అన్ని దేశాలు వీటి కోసం ప్రయత్నిస్తుంటాయి. బాలిస్టిక్ తరహాలో నిర్ణీత కక్ష్యలో ప్రయాణించకుండా వంకరటింకరగా ప్రయాణించే సామర్థ్యం వీటికి ఉంటుంది. ఈ క్షిపణులు శత్రుదేశం గగనతల రక్షణ వ్యవస్థలను కన్నుగప్పి తమను తాము రక్షించుకోగలుగుతాయి. ముఖ్యంగా అణ్వాయుధాలను సంధించడంలో వీటి ఉపయోగం తప్పనిసరిగా అవసరం అవుతుంది. వీటి తయారీ అంత సులభం కాదు. అనేక సాంకేతిక సంక్లిష్టతలతో పాటు, వీటి తయారీకి అధిక మొత్తంలో నిధుల అవసరం ఉంటుంది. ఇది చాలా వ్యయంతో కూడిన వ్యవహారం కనుక జర్మనీ, ఇటలీ, కెనడా, ఇంగ్లాండ్ లాంటి పారిశ్రామిక సంపన్న దేశాలు సైతం ముందుకు రాలేదు. కానీ భారత్ వంటి వర్ధమాన దేశం అన్ని రకాల అడ్డంకులు దాటి శక్తివంతమైన క్షిపణులను తయారుచేసే వ్యవస్థను సమకూర్చుకోవడం మామూలు విషయం కాదు.

విదేశాలపై ఆధారపడటం క్షేమం కాదు!

యుద్ధ సమయంలో అన్ని రకాల ఆయుధాలు మన సైన్యానికి సత్వర సరఫరా చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇతర దేశాలపై ఆధారపడితే సకాలంలో వివిధ కారణాలతో వారు స్పందించలేకపోవచ్చు. మొన్నటి వరకు మన దేశం రక్షణ రంగంలో విదేశీ దిగుమతులపై ఆధారపడింది. ముఖ్యంగా అమెరి కా, రష్యా, ఫ్రాన్స్ పై ఎక్కువగా ఆధారపడటంపై రక్షణ రంగ నిపుణులు, పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. రక్షణ ఉత్పత్తుల విషయంలో విదేశాలపై ఆధార పడటం ఏ దేశానికైనా అంత క్షేమకరం కాదు. అలా ఆధారపడితే కీలక సమయాల్లో ఆ దేశాలు ఏదో కారణం చెప్పి సప్లై ఆపవచ్చు.. లేదా జాప్యం చేయవచ్చు. అప్పుడు యుద్ధాన్ని మధ్యలో ఆపలేం. కొన్ని ఆయుధ పరికరాలకు సకాలంలో విడిభాగాలు(స్పేర్ పార్ట్స్) దొరకవు. కొన్నిసార్లు సప్లైలో తీవ్ర జాప్యం జరగవచ్చు. ఈ నేపథ్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో మనదేశం అవసరమైన ఆయుధాలు సమకూర్చుకోవటం అవసరం కూడా. అందుకే మన దేశం వ్యూహాత్మకంగా కీలకమైన క్షిపణుల తయారీలో ముందుకు సాగటం హర్షనీయం. ఈ స్వయం కృషి, స్వావలంబన డిఫెన్స్ రంగంలో సాధించటం శుభ సంకేతంగా భావించాలి.

డా. కోలాహలం రామ్ కిశోర్

98493 28496

Advertisement

Next Story

Most Viewed