- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరల్డ్ వాక్: మారుతున్న విదేశీ విధానం
ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచ దేశాల ఆలోచనలు మారిపోయాయి. ఏ ఒక్క దేశం, ఏ ఇతర ఒకటి రెండు దేశాలపై ఆధారపడే ఒరవడికి స్వస్తి పలుకుతున్నారు. అందుచేతనే మన దేశం కూడా ప్రపంచంలో చిన్న దేశం నుంచి అతి పెద్ద దేశంతో కూడా మంచి సంబంధాలు మెరుగుపరచడానికి, మన దౌత్య సంబంధాలు, విదేశీ విధానాలు పరిస్థితులు బట్టి మనకు లాభంగా అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మన భారత్, రాజ్యాంగ స్ఫూర్తితో దేశంలో ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద భావనలు మరింతగా బలపడేందుకు పునాది వేయాలి. విద్య ఉపాధి వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలి. ప్రభుత్వరంగ బలోపేతానికి ముందుకు సాగాలి. అప్పుడే నిరుద్యోగం తగ్గి, స్వయం సమృద్ధి సాధించగలం.
ప్రపంచంలోని వివిధ దేశాలు రెండు కూటములుగా ఉన్నాయి. అమెరికా ఆధ్వర్యంలోని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో కొన్ని దేశాలుంటే, రష్యా ఆధ్వర్యంలోని సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో మరికొన్ని దేశాలు కొనసాగుతున్నాయి . 1947లో మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత సందర్భంలో మనతో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు, అప్పుడే స్వాతంత్ర్యం పొందిన దేశాలు ఈ రెండు కూటములలో చేరకుండా, కొత్త కూటమి (అలీన విధానం-నామ్) ఏర్పాటు చేసుకున్నాయి. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన విదేశాంగ విధానం 'నామ్' నుంచి దూరం జరుగుతూ, అమెరికా వైపు మొగ్గు చూపడం మొదలు పెట్టింది.
గత రెండు సంవత్సరాలుగా కొవిడ్ కారణంగా మార్పు చెందుతున్న ప్రపంచ పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనా- తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రతీ దేశం తమ తమ విదేశాంగ విధానాన్ని సమీక్షించుకుంటున్నది. ఆర్థిక సామాజిక రాజకీయ అంశాలను దృష్టిలో ఉంచుకుని వివిధ దేశాలతో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి మార్పులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నది. దీనిలో భాగంగా మన భారతదేశం కూడా 2016 నుంచి విదేశాంగ విధానంలో మార్పులు చేసుకుంటూ 'నాన్ అలైన్‌మెంట్ నుంచి మల్టీ అలైన్‌మెంట్' వైపు అడుగులు వేస్తోంది. మోడీ-జైశంకర్ ఆలోచనలతో సరికొత్త విదేశాంగ విధానం వైపు పయనిస్తోంది. విడివిడిగా ఉన్న దేశాలతో సంబంధాలను మెరుగు పరచడానికి 'బ్రిడ్జిలు' కట్టుకుంటూ ముందుకు సాగిపోవటమే మా విధానం అని భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఉద్ఘాటించారు.
అవసరాలకు అనుగుణంగా
ముఖ్యంగా మన చుట్టుపక్కల దేశాలతో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు, చొరబాటులు, ఉగ్రవాదం సమస్యలు మనలను వెంటాడుతూ ఉన్నాయి. దీనిలో భాగంగా మనం పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్ కూడా చేసాం. గాల్వాన్ వద్ద ఉద్రిక్తతలను చూస్తూనే ఉన్నాం. సైనిక శక్తి నిమిత్తం రష్యాతో మన వ్యాపారం ప్రస్తుతం కూడా 400 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఈ రోజు కూడా ఉంది. ఈ సందర్భంలో మనపై యూరప్ దేశాల ఒత్తిడి అధికంగా ఉంటుంది. వందే భారత్, ఆపరేషన్ గంగా వంటి కార్యక్రమాలు చేపట్టి వివిధ పనులు పూర్తి చేసుకుంటున్నాం. అదే సమయంలో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు అనేక రకాల సహాయసహకారాలు అందిస్తున్నాం.
యుద్ధంతో సర్వం కోల్పోతున్న ఉక్రెయిన్ వాసులకు మానవతా దృక్పథంతో సేవలు అందించాం. ఇటువంటి పరిస్థితులలో మన విదేశాంగ విధానంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. భారతదేశ జాతీయ సమగ్రత, ఆర్థిక అభివృద్ధి, అన్ని రంగాలలో అభివృద్ధి సాధించుటకు మన విదేశాంగ విధానం పెద్ద పీట వేస్తుంది. దేశ ముఖచిత్రాన్ని మార్చే విధంగా అనగా త్వరితగతిన అభివృద్ధి సాధించేందుకు, అన్ని దేశాలతో సంబంధాలు మెరుగుపరచడానికి, ప్రపంచంలో ఉన్న పెద్ద సమస్యలు పరిష్కారానికి మనం పెద్దరికం తీసుకునే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దౌత్య సంబంధాలు మెరుగుపడేలా, మన సంస్కృతి సంప్రదాయాలు ఇతర దేశాలకు నమూనాగా (ఉదాహరణకు యోగా డే) ఉండేలా ముందుకు సాగుతున్నారు.
వివిధ దేశాలతో సంబంధాలు
సౌత్ ఈస్ట్ ఆసియా, వెస్ట్ ఆసియా, సెంట్రల్ ఆసియా, హిందూ సముద్ర ప్రాంతంలో, అలాగే బిగ్ పవర్స్ అమెరికా రష్యా చైనా జపాన్ వంటి దేశాలతో, యూఏఈ, ఇజ్రాయెల్, ఇరాన్, ఆఫ్రికా దేశాలతో మరింత సంబంధాలు మెరుగుపరిచే విధంగా ముందుకు సాగుతున్నారు. జి-7, జి-20, ఐ-2 యు-2, బిమ్ స్టెక్, బ్రిక్స్ వంటి దేశాలతో భారత్ కీలక పోషిస్తున్నది. అందుచేతనే ఇటీవల భారత్ ఇంటర్నేషనల్ సోలార్ అమ్యునిట్స్, సమ్మిట్ విత్ సెంట్రల్ ఆసియన్ నేషన్స్, సమ్మిట్ విత్ పసిఫిక్ ఐలాండ్ నేషన్స్, ఇండో-నార్డిక్ సమ్మిట్ వంటివి నిర్వహించారు.
కొవిడ్ కాలంలో మనదేశం ఇతర దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసింది. మందులను అందించింది. 'ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్' 'రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు' సప్లయి చైన్ జపాన్, ఆస్ట్రేలియా, వంటి దేశాలతో సంబంధాలు, ఫిలిప్పైన్స్, వియత్నాం వంటి దేశాలతో సైనిక సహకారం, యూఏఈతో ఎఫ్‌టీఏ ఒప్పందాలు, ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా ఫ్రాన్స్‌తో సైనిక సహకారం, ఇజ్రాయెల్, ఇరాన్, ఆఫ్రికా దేశాలతో మరెన్నో ఒప్పందాలు చేసుకుంటూ భారత్ ముందుకు సాగుతోంది. చైనాతో, రష్యాతో వ్యాపారాలు కూడా మాములుగానే కొనసాగిస్తున్నారు.
లౌకిక భావనలు బలపడాలి
ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో భారత్ కీలక పాత్ర పోషించే పరిస్థితి ఏర్పడింది. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు ప్రపంచంలో వివిధ దేశాలు భారత ఆర్థిక, రాజకీయ విధానాల పట్ల ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. అదే సమయంలో భారత్ కూడా భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తన విదేశాంగ విధానంలో పెను మార్పులు చేర్పులు చేసుకుంటున్నది. ఇందులో భాగంగానే 2023 జి-20 సమావేశం భారత్‌లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచ దేశాల ఆలోచనలు మారిపోయాయి.
ఏ ఒక్క దేశం, ఏ ఇతర ఒకటి రెండు దేశాలపై ఆధారపడే ఒరవడికి స్వస్తి పలుకుతున్నారు. అందుచేతనే మన దేశం కూడా ప్రపంచంలో చిన్న దేశం నుంచి అతి పెద్ద దేశంతో కూడా మంచి సంబంధాలు మెరుగుపరచడానికి, మన దౌత్య సంబంధాలు, విదేశీ విధానాలు పరిస్థితులు బట్టి మనకు లాభంగా అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మన భారత్, రాజ్యాంగ స్ఫూర్తితో దేశంలో ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద భావనలు మరింతగా బలపడేందుకు పునాది వేయాలి. విద్య ఉపాధి వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలి. ప్రభుత్వరంగ బలోపేతానికి ముందుకు సాగాలి. అప్పుడే నిరుద్యోగం తగ్గి, స్వయం సమృద్ధి సాధించగలం
ఐ.ప్రసాదరావు
63056 82733