భయపెడుతోన్న మంటలు!

by Ravi |   ( Updated:2023-03-25 00:00:30.0  )
భయపెడుతోన్న మంటలు!
X

వేసవి వచ్చిందంటే చాలు...ఎక్కడ ఏ అగ్ని ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయపడుతుంటారు. షార్ట్‌ సర్క్యూట్ అనేకచోట్ల అగ్ని ప్రమాదాలకు కారణమవుతోంది. నగరాల్లో ఇబ్బడిముబ్బడిగా అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే భవనాల నిర్మాణాల్లో అనేక అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అగ్ని ప్రమాదాలకు చెక్ పెట్టే భద్రతాపరమైన జాగ్రత్తలను బిల్డర్లు ఎవరూ పట్టించుకోవడం లేదు. కొన్నిచోట్ల ప్రమాదం జరిగితే కనీసం అగ్నిమాపక శకటం వెళ్లడానికి కూడా దారి వదలడం లేదు. భవనాల నిర్మాణాలకు ముందే సంబంధిత కార్పొరేషన్ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను బిల్డర్లు పాటించడం లేదు. అనుమతులు రాకుండానే అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు ప్రారంభిస్తున్నారు. నిర్మాణాలు పూర్తయ్యేనాటికి ఇక తప్పదన్నట్టు అనుమతులు తెచ్చుకుని మమ అనిపిస్తున్నారు బిల్డర్లు.

బల్దియా అనుమతులకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. కార్పొరేషన్‌కు సమర్పించిన బిల్డింగ్ నమూనాను కాదని అంతస్తుల మీద అంతస్తులు కట్టుకుంటూ పోతున్నారు అపార్ట్‌మెంట్ యజమానులు. దీనిని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. లంచాలకు ఆశపడి సైలెంట్ అయిపోతున్నారు. కొన్నిసార్లు కార్పొరేషన్‌కు సొమ్ము చెల్లించి అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయించుకుంటున్నారు బిల్డర్లు. కార్పొరేషన్‌ ఖజానాకు ఆదాయం వస్తుంది కదా అని బల్దియా అధికారులు కూడా కిమ్మనడం లేదు. ఇవన్నీ చివరకు అగ్ని ప్రమాదాలకు దారితీస్తున్నాయి. దీంతో పాటు అనేక అపార్ట్‌మెంట్లలో పెద్ద ఎత్తున గ్యాస్ సిలిండర్లు, రసాయన పదార్థాలను నిల్వ చేస్తున్నారు. మండే స్వభావం ఉన్నవాటిని ఇలా అనుమతులు లేకుండా ఒకచోట పోగుచేయడం చట్టరీత్యా నేరం. అయితే ఈ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో ముఖ్యంగా నగరాల్లో ఎడాపెడా ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.

వరుసగా అగ్ని ప్రమాదాలు

సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో అగ్నిప్రమాదాలు పెరిగాయి. గత ఏడాది కాలంలో సికింద్రాబాద్ పరిధిలో నాలుగు అగ్నిప్రమాదాలు జరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కిందటేడాది మార్చి 23న బోయగూడలోని ఓ టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయారు. బోయగూడా ఫైర్ యాక్సిడెంట్‌కు షార్ట్ సర్క్యూటే కారణమని తేల్చి చెప్పారు అగ్నిమాపక శాఖ అధికారులు. టింబర్ డిపోలో చెక్కలు తగలబడటంతో మంటలు ఎగిసిపడ్డాయి. బోయగూడా సంఘటన మరువకముందే రూబీ హోటల్‌ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. కిందటేడాది సెప్టెంబరు 12న రూబీ హోటల్‌ సెల్లార్‌లో మంటలు చెలరేగాయి. సెల్లార్ నుంచి హోటల్ రూముల వరకు దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ పొగలో చిక్కుకుని ఎనిమిది మంది చనిపోయారు. ఈ ఏడాది జనవరిలో సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట్‌లో డెక్కన్‌మాల్‌ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మంటలు అంటుకుని డెక్కన్‌మాల్‌ బిల్డింగ్ పూర్తిగా తగలబడింది. ప్రమాదం ఫలితంగా ఎగసిపడిన ఈ మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక శాఖ తీవ్రంగా శ్రమించింది. దాదాపు 24 గంటలపాటు 200 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది శ్రమిస్తేనే కానీ, మంటలు అదుపులోకి రాలేదు. అగ్నిప్రమాదానికి గురైన డెక్కన్‌మాల్ బిల్డింగ్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు, నిపుణులు పరిశీలించారు. ప్రమాద తీవ్రతను అంచనా వేశారు. చివరకు డెక్కన్‌మాల్ బిల్డింగ్ మొత్తాన్ని కూల్చివేశారు.

డెక్కన్‌మాల్ దుర్ఘటన మరవక ముందే సికింద్రాబాద్‌లో మరో అగ్నిప్రమాదం సంభవించింది. ప్యాట్నీ సమీపానగల స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అనేక సంస్థల కార్యాలయాలతో పాటు పలు వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు చనిపోయారు. స్వప్నలోక్‌ కాంప్లెక్స్ అగ్నిప్రమాదంపై పోలీసులు తొలిసారిగా ఐపీసీ సెక్షన్‌ 420తో పాటు పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేశారు. అగ్నిప్రమాద సంఘటనల్లో పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేయడం ఇదే తొలిసారి. స్వప్నలోక్‌ కాంప్లెక్స్ సంఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. అగ్నిమాపక శాఖ, జీహెచ్‌ఎంసీతో పాటు క్లూస్ టీమ్‌ ఇచ్చే నివేదిక ఆధారంగా ఈ కేసుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ సీరియస్‌నెస్‌ను అందరూ అర్థం చేసుకోవాలి. ఆకాశాన్ని తాకే అపార్ట్‌మెంట్లు నిర్మించే బిల్డర్లు ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించేలా సర్కార్ చూడాలి. ప్రజలు కూడా అప్రమత్తతతో మెలగాలి. ఇళ్లల్లో మండే వస్తువులను దూరంగా ఉంచాలి. విద్యుత్ పరికరాలపై నిరంతరం నిఘా పెట్టాలి. షార్ట్ సర్క్యూట్ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే అగ్నిప్రమాదాలను నివారించడం సాధ్యమవుతుంది. లేదంటే అగ్ని ప్రమాదాల రూపంలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగడం ఖాయం.

ఉపహార్ ఓ విషాద జ్ఞాపకం

మనదేశంలో అగ్నిప్రమాదం అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది ఉపహార్ సంఘటన. పాతికేళ్ల కిందట ఉపహార్ అగ్నిప్రమాదాన్ని సీనియర్ సిటిజన్లు ఎవరూ మరవలేరు. ఉపహార్, ఢిల్లీలోని ఓ సినిమా థియేటర్‌. 1997 జూన్ 13న ఉపహార్‌ థియేటర్‌లో హిందీ సినిమా 'బోర్డర్' ప్రదర్శన నడుస్తోంది. థియేటర్లో అందరూ సినిమా చూడటంలో నిమగ్నమయ్యారు. అయితే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో పొగలు థియేటర్ అంతా వ్యాపించాయి. ఒక్కసారిగా సినిమా చూస్తున్న జనం పరుగులు తీశారు. అంతా గందరగోళం. జనం హాహాకారాలు. పెద్ద ఎత్తున తొక్కిసలాట. చివరకు లెక్కలు తీస్తే ఉపహార్‌ అగ్నిప్రమాదంలో మొత్తం 59 మంది చనిపోయారు. తొక్కిసలాటలో వంద మందికి పైగా గాయపడ్డారు. అగ్నిప్రమాదంలో చనిపోయినవారి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని ఉపహార్ థియేటర్ యాజమాన్యాన్ని కోరారు. తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారు కూడా వీరితో కలిశారు. అయితే బాధిత కుటుంబసభ్యుల అభ్యర్థనను థియేటర్ యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో అందరూ కలిసి, అసోసియేషన్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ ఉపహార్ ట్రాజెడీ ...ఏవీయూటీ పేరుతో ఒక సంఘం పెట్టుకున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ న్యాయస్థానం మెట్లెక్కారు. నీలం కృష్ణమూర్తి అనే పెద్దాయన ఈ సంఘం తరఫున కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ఆధారంగా ఢిల్లీ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. సుదీర్ఘ విచారణ తరువాత 2007 నవంబరు 20న న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఉపహార్‌ థియేటర్ యజమానులు అన్సల్ సోదరులతో పాటు మొత్తం 12 మందికి శిక్షలు ఖరారు చేసింది.

ఎస్‌.అబ్దుల్ ఖాలిక్

63001 74320

Advertisement

Next Story

Most Viewed